Home Breaking కారు సారు 16 సరే… మరి ఈ డౌటనుమానాల సంగతేంటి?

కారు సారు 16 సరే… మరి ఈ డౌటనుమానాల సంగతేంటి?

779
1
SHARE

ముందస్తు ఎన్నికల్లో 88 సీట్లు కొల్లగొట్టింది టిఆర్ఎస్ పార్టీ. అనతికాలంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్షాలను కకావికలం చేసింది. అసెంబ్లీలో బలం 100 క్రాస్ చేసింది. ఇదంతా చూస్తే టిఆర్ఎస్ పార్టీకి కనీసం పోటీ ఇచ్చే ప్రతిపక్షమే తెలంగాణలో లేదన్న భావన ఎవరికైనా కలగక మానదు. కానీ శకునాలు మాత్రం కొద్దిగా తేడాగా కొడుతున్నాయి. ముందస్తు ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అంటే గట్టిగా అవును అని గులాబీ శ్రేణులు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. మరి టిఆర్ఎస్ పార్టీని కలవర పెడుతున్న ఐదు అంశాలేంటో మనం ఒకసారి పరిశీలిద్దాం.

1 ముందస్తు ఊపు, ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో 16కు 16 ఎంపీ సీట్లు గెలిచి తీరుతామని గులాబీ బాస్ కేసిఆర్ నుంచి చిన్న బాస్ కేటిఆర్ వరకు చెబుతున్నమాట. కేంద్రంలో చక్రం తిప్పుతామని, అవసరమైతే కేసిఆర్ ప్రధాని అవుతారని కూడా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. మరి అన్ని వర్గాల్లో కాకపోయినా కొన్ని వర్గాల్లో మాత్రం టిఆర్ఎస్ సర్కారు పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు జనాలు. దానికి నిదర్శనమే మొన్నటి శాసనమండలి ఎన్నికల్లో ఆ పార్టీ పరోక్ష మద్దతుతో బరిలో నిలబడ్డ వారు తుక్కు తుక్కుగా ఓడిపోయారు. మూడో స్థానం, నాలుగో స్థానానికి పడిపోయారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, వామపక్ష యూటిఎఫ్ నాయకుడు గెలిచారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అయితే బంపర్ మెజార్టీతో గెలిచారు. దీన్నిబట్టి చూస్తే తెలంగాణలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చదువుకున్నవారు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని తేలింది. ఈ వర్గాలు రేపు పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటర్లను ఎంతవరకు మలుస్తారనేది తేలాల్సి ఉంది.

2 ఇక శుక్రవారం కేసిఆర్ మలి విడత ప్రచారం షురూ చేశారు. మిర్యాలగూడ సభలో మాట్లాడిన తర్వాత నేరుగా ఆయన హెలిక్యాప్టర్ లో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం సభలో మాట్లాడాల్సి ఉండే. కానీ ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ఉన్నందుకా? మరేదైనా కారణముందా తెలియదు కానీ… ఎల్బీ స్టేడియం జనాలు రాక వెలవెలబోయింది. పట్టుమని 5 వేల మంది కూడా రాలేదని టాక్ ఉంది. మంది రాలేదని తెలియడంతో సభకు రాకుండా ఇంటికి వెళ్లిపోయారు కేసిఆర్. మంత్రి తలసాని మాత్రమే మాట్లాడి సభ ముగించేశారు. హైదరాబాద్ లో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్ కు జనాలు ఎందుకు రాలేదబ్బా అని ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. అందులో హైదరాబాద్ పక్కన పెట్టినా, మల్కాజ్ గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ నుంచి జనాలను టిఆర్ఎస్ నేతలు తరలించలేకపోయారు. ఇది మరో అపశకునంగా భావిస్తున్నారు.

3 టిఆర్ఎస్ ను కలవరపెడుతున్న మరో కీలక అంశం ఉంది. అదే హరీష్ ట్రాజెడీ ఎపిసోడ్. హరీష్ రావు ఒకప్పుడు టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్. కానీ నేడు సామాన్య ఎమ్మెల్యే స్థాయికి పడిపోయాడు. దానికి కారణాలేంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. హరీష్ రావును కేసిఆరే పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ఎందుకు, ఏమిటి అన్నది ఇప్పట్లో తేలేలా లేదు. ముందస్తు ఎన్నికల వేళ హరీష్ రావును పక్కనపెట్టారు. సొంత మీడియాగా చెప్పబడుతున్న నమస్తే తెలంగాణ, టిన్యూస్ లలో ఆయన ప్రసారాలపై నిషేధం విధించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో మళ్లీ కొద్దికొద్దిగా ప్రసారాలు ఇచ్చారు. తర్వాత అందరూ అనుమానించినట్లుగానే… పార్టీలో ట్రబుల్ షూటర్, ప్రభుత్వంలో అందరికంటే సమర్థుడైన మంత్రిగా పేరొందినప్పటికీ మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. సరే కొడుకు కేటిఆర్ కు కూడా ఇవ్వలేదు కదా అనొచ్చు… కానీ కేటిఆర్ కు పార్టీలో నెంబర్ 2 పదవి కట్టబెట్టి హరీష్ ను మాత్రం సిద్ధిపేటకే పరిమితం చేశారు. ఇదంతా గతమైతే… తాజా పరిణామాలు కూడా ఆందోళన కలిగించేవే.

మొన్న టిఆర్ఎస్ పార్టీ 20 మందితో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆ జాబితాలో కేసిఆర్, కేటిఆర్ సహా చోటామోటా లీడర్లకు కూడా చోటు దక్కింది కానీ హరీష్ రావుకు దక్కలేదు. కానీ ఈ వ్యవహారంపై బయట విమర్శలు రావడంతో మరో లేఖ రాసి హరీష్ కు కూడా స్టార్ క్యాంపెయినర్ వెసులుబాటు ఇవ్వాలని ఈసిని కోరింది టిఆర్ఎస్. హరీష్ విషయంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది.

4 ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పరోక్ష మద్దతుదారులైన అభ్యర్థుల ఘోర ఓటమి నుంచి డైవర్ట్ చేసేందుకా? మరేదైనా కారణముందా అన్నది పక్కనపెడితే మంచిర్యాల జిల్లా రైతు శరత్ కు ఫోన్ చేసి మాట్లాడడం… దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. అయితే శరత్ చెప్పిన మాటలు పట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే శరత్ పాలోళ్లు రంగంలోకి రావడం… ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని సోషల్ మీడియాకు ఎక్కడంతో ఇక్కడ రావాల్సిన మైలేజీ రాకపోగా కథ అడ్డం తిరిగిందన్న విమర్శలు ఉన్నాయి. లక్షల మంది రైతులు ఇదే సమస్యతో బాధపడుతున్నారని, వారందరి సమస్యలు కూడా పరిష్కరించాలని విపక్షాలు అంటున్నాయి. మరోవైపు ఎంటైర్ ఉద్యోగ వర్గాలన్నీ కేసిఆర్ పై గుర్రుగా ఉన్నాయి. ఇది రేపటి పార్లమెంటు ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందో మరి.

 

5 ఇక నిజామాబాద్ సీటుకు అన్నదాతలు పోటీలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి ఎంత వత్తిళ్లు చేసినా 178 మంది రైతులు ఎన్నికల బరిలో ఉన్నారు. 185 మంది పోటీ చేయబోతున్నారు. ఆ సీటులో కేసిఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. పసుపు, ఎర్ర జొన్న రైతులు గిట్టుబాటు ధర కోసం ఈ సాహసానికి ఒడిగట్టారు. రేపు అంత మంది రైతులు ఓడిపోవచ్చు కానీ… కవిత సొంత నియోజకవర్గంలో రైతులంతా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న విషయం రాష్ట్రమంతా ప్రభావం చూపొచ్చు అంటున్నారు. కొమ్ములు తిరిగిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కనుసైగ చేస్తే వచ్చి గులాబీ కండువాలు కప్పుకున్నవేళ సాధారణ రైతులను ఒప్పించి వారి నామినేషన్ ను ఉపసంహరింపజేయలేకపోవడం టిఆర్ఎస్ కు మైనస్ గా చెబుతున్నారు.

ఈ అంశాలు రేపటి ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతాయోనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి…

బిజెపి దత్తన్న, అంజన్ కుమార్ యాదవ్ లపై వైరల్ పోస్ట్

Comments are closed.