హైదరాబాద్ లో 8 కోట్ల బిజేపి డబ్బు పట్టివేత

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి డబ్బు భారీగా పట్టుపడింది. నోట్ల కట్టలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో 8 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సొమ్మంతా బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు గుర్తించారు పోలీసులు.

ఈ డబ్బును తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ లోని నారాయణగూడ వై జంక్షన్ వద్ద ఈ డబ్బు పట్టుపడింది. తొలుత తోటిరెడ్డి ప్రదీప్ రెడ్డి, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో 2కోట్ల నగదు తరలిస్తుండగా పోలీసులు కారును తనిఖీ చేసి ఆ సొమ్మును పట్టుకున్నారు. వారిని విచారించడంతో వారిచ్చిన సమాచారం మేరకు నారాయణగూడలోని యూనియన్ బ్యాంకు వద్ద మరికొందరి వద్ద తనిఖీలు చేసి మరో ఆరు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన డబ్బంతా బిజేపి ఫండ్ గా చెబుతున్నారు.

పట్టుబడిన వారిలో వీరిద్దరితోపాటు గార్లపాటి సుకుమార్ రెడ్డి, సమ్మట చలపతిరాజు, జూలూరి హిందూశేఖర్ రావు, రాచకట్ల బ్రహ్మంలు ఉన్నారు. వారివద్ద నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

భారీ మొత్తంలో నగదు పట్టుపడడంతో ఎన్నికల అబ్జర్వేషన్ అధికారులు, ఐటి అధికారులు నారాయణగూడ పోలీసు స్టేషన్ కు వచ్చి ఆరా తీశారు. పట్టుబడిన సొమ్మును, తరలిస్తున్న వ్యక్తులను ఐటి అధికారులకు అప్పగించారు నారాయణగూడ పోలీసులు.

హైదరాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్ : బిజేపి

8 కోట్ల నగదు పట్టుబడిన నేపథ్యంలో బిజెపి ఎదురుదాడికి దిగింది. బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మీడియాకు వివరణ ఇచ్చారు. హైదరాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్ తప్ప ఇందులో బిజెపి ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదన్నారు. పోలీసులు కారు అద్దాలు పగలగొట్టి దొంగతనం చేసిన రీతిలో డబ్బు పట్టుకుపోయారని ఆరోపించారు. జనవరి నెల నుంచి ప్రచార ఖర్చుల నిమిత్తం ఆ డబ్బును బ్యాంకులోనే డ్రా చేశామని వివరణ ఇచ్చారు.

లీగల్ గానే తమ డబ్బును తాము బ్యాంకు నుంచి డ్రా చేసుకున్నట్లు చెప్పారు. తమ పార్టీకి సేవలందించిన చిన్న చిన్న వ్యాపారులకు ఈ డబ్బును చెల్లించేందుకు డ్రా చేశామన్నారు. దానికే ఇంత రాద్దాంతం చేయడంలో అర్థం లేదన్నారు. దీనివెనుక ఎవరున్నారో ముందు ముందు తెలుస్తుందన్నారు.

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/hyderabad-cartoonist-serves-delicious-traditional-teugu-meals/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *