వైసీపీ సీన్ రివ‌ర్స్‌… టీడీపీలోకి బిగ్ షాట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌క్తిక‌ట్టిస్తున్నాయి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాలు మ‌లుపుల మీద ములుపులు తిరుగుతున్నాయి. ఊహించ‌ని ప‌రిణామాలు ఏపీ పాలిటిక్స్‌లో చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమల్లోకి రావ‌డం, 2019 సాధార‌ణ ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే నెల మొద‌టి వారంలో రానుండటం ఖ‌యంగా క‌నిపిస్తున్న త‌రుణంలో  ఏపీలో ఎన్నిక‌ల వేడి తారాస్దాయికి చేరుకుంది.
అభ్య‌ర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తును మ‌రింత వేగ‌వంతం చేసిన పార్టీలు…సామాజిక‌, అంగ‌,అర్ద బ‌లాల‌ను బేరీజు వేసుకుని టికెట్లు కేటాయిస్తున్నాయి. దీంతో టికెట్లు ద‌క్కని నేత‌లు ఇత‌ర పార్టీల్లో చేరిపోతుండ‌టంతో ఏపీ రాజ‌కీయాల్లో జంపింగ్ జపాంగ్‌ల ప‌ర్వం ఎక్కువైపోయింది. ప్ర‌ధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీల మ‌ధ్య వ‌ల‌స‌లు మ‌రింత జోరందుకున్నాయి. నేత‌లు వ‌ల‌స పెట్టి కండువాలు మార్చేస్తున్నారు.
టీడీపీలో టికెట్ ద‌క్క‌ని ఎమ్మెల్యేలు, ఎంపీలు గ‌త కొద్ది రోజులుగా వైసీపీ గూటికి చేరిపోతున్న విష‌యం తెలిసిందే. టీడీపీలో ఎప్ప‌టి నుంచో అసంతృప్తిగా ఉన్న  గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావెల  కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పి జ‌న‌సేన‌లో చేర‌గా, క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి,చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌, అమ‌లాపురం ఎంపీ ర‌వీంద్ర బాబు ఫ్యాన్ చెంత‌కు చేరిపోయారు.
టీడీపీలో సీటు ద‌క్క‌ని మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వైసీపీలో చేర‌తార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది.అయితే గ‌త కొద్ది రోజులుగా టీడీపీలో సీటు ద‌క్క‌ని ఎమ్మెల్యేలు,ఎంపీలు వ‌రుస పెట్టి వైసీపీలో చేరిపోతున్న వేళ సీన్ రివ‌ర్స్ అయింది.
వైసీపీ సీనియ‌ర్ నేత చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు.ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌న మంచి గుర్తింపు పొందారు. గ‌త ఎన్నిక‌ల్లో కాకినాడ నుంచి వైసీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసి ఓట‌మి చెందిన ఆయ‌న‌, తూర్పుగోదావ‌రి జిల్లాలో వైసీపీ ముఖ్య నేత‌గా ఉన్నారు.
గ‌త కొద్ది రోజుల క్రిత‌మే వైసీపీకి రాజీనామా చేసిన ఆయ‌న‌, టీడీపీలో చేర‌తార‌నే వార్త‌లు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం రావ‌డంతో ఈ నెల 28న సైకిలెక్కేందుకు చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ ముహుర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాకినాడ టీడీపీ ఎంపీ టికెట్‌ను ఆయ‌న‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *