ఇంట్లోనే సులభంగా మలై కేక్ తయారీ విధానం

(Sai Sravanthi)
క్రీమ్ తో పని పనిలేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకునే ఎంతో రుచికరమైన మలై కేక్ తయారీ తెలుసుకుందాం. దీనికి ఓవెన్ తో కూడా పని లేదు.
మలై కి కావలసిన పదార్థాలు:
పాలు – 1 లీటర్
పంచదార – 100గ్రా
యాలుకలు – 6
బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు – కావాల్సినన్ని తీసుకోవచ్చు
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో పాలు పోసి అవి సగం అయ్యేదాక ( అంటే లీటరు పాలు అరలీటరు అయ్యేదాక) అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వేయాలి. యాలుకలు, పంచదార కూడా వేసేసి దించేసి పక్కన పెట్టుకోవాలి.
కేక్ కి కావాల్సిన పదార్ధాలు:
మైదా పిండి – 1 కప్
పెరుగు – 1/2 కప్
వంట నూనె – 1/4 కప్
పంచదార – 1/2 కప్
బేకింగ్ సోడా – 1/2 స్పూన్
బేకింగ్ పౌడర్ – 1 స్పూన్
మనం ముందుగా తయారు చేసుకున్న మలై – 2 స్పూన్ల
తయారీ విధానం:
ఒక గిన్నెలో మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. దాంట్లో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, పంచదార వేసి అన్నింటిని ఒకసారి కలిపాక దాంట్లో పెరుగు, నూనె వేసి ఒకే వైపుకి గారిటెను తిప్పుతూ కలపాలి. దాంట్లోనే మలై కూడా వేసి కలిపి మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో సగానికి తీసుకోవాలి. గిన్నె నిండుగా తీసుకుంటే కేక్ బేక్ అయ్యేటపుడు పొంగుతుంది కాబట్టి గిన్నె నుండి బయటకు వచ్చేస్తుంది అని గుర్తుంచుకోవాలి.
స్టవ్ మీద ఒక మందపాటి బాండీని కానీ గిన్నెను కానీ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. తరువాత మనం తరు చేసుకున్న కేక్ మిశ్రమం ఉన్న గిన్నెను దాంట్లో పెట్టి బాండీ పై మూత పెట్టి 30 నిమిషాల పాటు ఉంచాలి. (కేక్ మిశ్రమం ఉన్న గిన్నె కు మూత పెట్టకూడదు)
30 నిమిషాల తరువాత ఫోర్క్ తో గుచ్చి చూస్తే దానికి పిండి ఏమి అంటుకోకూడదు. అలా ఉంటే కేక్ ఉడికిపోయినట్టే. ఒకవేళా ఫోర్క్ కి పిండి అంటుకుంటే ఇంకో మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తరువాత మళ్ళీ ఫోర్క్ తో చూసుకోవాలి.
కేక్ ఉన్న గిన్నెను వెంటనే బయటకు తీసి చల్లారాక గిన్నె నుండి కేక్ ను వేరు చేసి కేక్ పై భాగం అంతా ఫోర్క్ తో వీలైనన్ని సార్లు గుచ్చాలి.
ఇప్పుడు ఆ కేక్ పయిన మనం తయారు చేసుకున్న మలైని పోసేసి తినడమే. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది.