టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన రంగారెడ్డి మహిళా జెడ్పీటిసి

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మరో సంఘటన ఇది. యావత్ రాజకీయ వ్యవస్థను కలవరపాటుకు గురిచేసిన పరిణామం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సొంత ఆస్తిని అమ్మకానికి పెట్టిన వైనం. బంగారు తెలంగాణ నిర్మాణంలో కిందిస్థాయి ప్రజా ప్రతినిధులు ఎంతగా నలిగిపోతున్నారో చెబుతున్న కఠోర సత్యం ఇది. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సొంత ఆస్తినే అమ్మకానికి పెట్టిన మహిళా జెడ్పీటిసి కథ.. రంగారెడ్డి జిల్లాలో జరిగింది. చదవండి.

నిన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సామల పావని మంత్రి కేటిఆర్ మీద సంచలన ఆరోపణలు చేసి వివాదంలో ఇరుక్కుపోయారు. తెలిసో తెలియకో మంత్రి కేటిఆర్ ను వివాదంలోకి గుంజడంతో ఆమె గంటల తేడాతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలో కలవరం రేపుతుండగా తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల జెడ్పీటిసి చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అధికార టిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటిసిగా గెలిచి నాలుగేళ్లు గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ వస్తే పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తాయని ఆమె భావించారు. కానీ తెలంగాణ సర్కారు గ్రామాలకు నిధుల విడుదల చేయకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు లబోదిబోమంటున్నారు. చింపుల శైలజ పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. ఎన్నికల సమయంలో చేవెళ్ల మండలంలోని గ్రామాల్లో చేస్తానన్న అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో ఆమె తన సొంత ప్లాట్ అమ్మి అయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవే పక్కన ఉన్న తన భూమిని అమ్మకానికి పెట్టారు. అంతేకాదు.. ఈ భూమి అమ్మకం కోసం పెట్టిన ఫ్లెక్సీలో కీలకమైన కామెంట్స్ రాశారు. తెలంగాణ సర్కారు గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నమని.. అందుకే తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం తన ప్లాట్ అమ్మకానికి పెట్టినట్లు ఫ్లెక్సీలో రాశారు. ఈ ప్లాట్ ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తన ఆశయానికి మద్దతు పలకాలని ఆమె కోరుతున్నారు. ఆమె బీజాపూర్ హైవే పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రంగారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

2014 లో జరిగిన జెడ్పీ ఎన్నికల్లో శైలజా సత్యనారాయణరెడ్డి టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి చేవెళ్ల జెడ్పీటిసి గా గెలుపొందారు. అప్పటినుంచి అధికార పార్టీలో ఉంటూనే స్థానిక సంస్థలకు నిధుల కోసం ఫైట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు సీనరేజి నిధులు ఇవ్వడంలో సర్కారు నిర్లక్ష్య వైఖరిపై గట్టిగానే పోరాటం చేశారు. అయితే సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టులో సీనరేజీ నిధులు ఇప్పించాలని కేసు వేసి సర్కారుపై గెలిచారు. జిల్లాకు 540 కోట్ల నిధులు రెండు నెలల్లోనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఏడాది గడుస్తున్నా.. సర్కారు నిధుల విడుదల చేయలేదు. ఆ నిధులు విడుదలైతే.. గ్రామానికి 60, 70 లక్షలు మంజూరయ్యే అవకాశం ఉందని ఆమె అంటున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నారు. మరో ఏడాది కాలంలోనే తాను ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు హైవే పక్కన తనకున్న ప్లాట్ అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. ఆ స్థలం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో రైతులు పొలాలకు వెళ్లే రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెబుతున్నారు.

భర్త ప్రోత్సాహంతోనే.. రంగంలోకి

చింపుల శైలజ భర్త చింపుల సత్యనారాయణరెడ్డి 2006 నుంచి 2011 వరకు చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవల్లి సర్పంచ్ గా పనిచేశారు. ఆ సమయంలో గ్రామంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణ సర్కారు ఇప్పుడు ప్రవేశపెట్టిన సన్నబియ్యం భోజనం తాను అప్పట్లోనే తన గ్రామంలో పిల్లలకు పెట్టించానని చెప్పారు. సర్పంచ్ గా ఉంటూనే ఉమ్మడి రాష్ట్రంలో ఎపి సంచాయతీరాజ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినట్లు చెప్పారు. ప్రస్తతం తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సిఎం కేసిఆర్ ఎర్రవల్లి లో చేస్తున్న అభివృద్ధికి తాను సర్పంచ్ గా ఉన్న కాలంలో దేవుని ఎర్రవల్లిలో చేసిన అభివృద్ధే మోడల్ గా ఉందన్నారు. అప్పట్లోనే ఇంటింటికీ చెట్లు, మరుగుదొడ్డి కట్టించానని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే.. గ్రామాలు బాగుపడతాయనుకుంటే.. టిఆర్ఎస్ సర్కారు మాత్రం నిధులు ఇవ్వకుండా స్థానిక ప్రజా ప్రతినిధులను హింస పెడతున్నదని సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయడం కోసమే తాను, తన సతీమణి ప్లాట్ అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

మొత్తానికి ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *