టిఆర్ఎస్ కు కోదండరాం తొలి దెబ్బ

తెలంగాణలో రెండు రోజుల కిందటే ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. ఆ పార్టీ పేరు తెలంగాణ జన సమితిగా నిర్ణయించారు. ఇంకా ఆ పార్టీ మంచి చెడ్డలు కూడా మాట్లాడుకోలేదు. జెండా, ఎజెండా రూపకల్పనలో కోదండరాం అండ్ టీం బిజీగా ఉన్నరు.

ఇంతలోనే తెలంగాణలో అధికార పార్టీకి తొలి షాక్ తగిలింది. అది కూడా టిఆర్ఎస్ కు బలమైన కంచుకోటగా ఉన్న మంచిర్యాల జిల్లాలో ఆ షాక్ తగలడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కోదండరాం పార్టీ అనౌన్స్ చేయగానే మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి దుర్గం గోపాల్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన అతి త్వరలోనే కోదండరాం నెలకొల్పిన తెలంగాణ జన సమితిలో చేరే అవకాశాలున్నట్లు మంచిర్యాలలో టాక్ నడుస్తోంది.

దుర్గం గోపాల్ 2003 నుంచి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గోపాల్ మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకుడు. 2003 నుంచి టిఆర్ఎస్ లో పనిచేస్తూనే తెలంగాణ జెఎసి ఏర్పాటైన నాటినుంచి జెఎసి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో యాక్టీవ్ గా పాల్గొన్నారు. గత కొంతకాలంగా గోపాల్ టిఆర్ఎస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. బంగారు తెలంగాణ పేరుతో బిటి తెలంగాణ వ్యతిరేకులకు, ఉద్యమ ద్రోహులకు టిఆర్ఎస్ సర్కారు భుజాన మోస్తోందని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయేవారని చెబుతున్నారు.

ఇక కోదండరాం పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడిన తర్వాత పెద్ద మొత్తంలో ఆ పార్టీలోకి వలసలు వస్తాయని జెఎసి అంచనాల్లో ఉంది. అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు, ఉద్యమకారులు జన సమితిలో చేరతారన్న ప్రచారం కూడా సాగింది. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా కోదండరాం పార్టీలో జాయిన్ అవుతారని, పార్టీ బహిరంగ సభలో చాలా మంది అధికార పార్టీ నేతలు చేరుతారని ఒక ప్రచారం అయితే మొదలైంది. టిఆర్ఎస్ లో ఉన్న నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కోదండరాం గూటికి చేరవచ్చని చెబుతున్నారు.

అయితే ఊహాగానాలెన్ని ఉన్నా.. కోదండరాం పార్టీ అనౌన్స్ చేయగానే అధికార పార్టీ కి గుడ్ బై చెప్పిన తొలి లీడర్ గా దుర్గం గోపాల్ నిలిచిపోయారని చెప్పవచ్చు.

One thought on “టిఆర్ఎస్ కు కోదండరాం తొలి దెబ్బ

  1. అతను మంచిర్యాల జిల్లా TRS కార్యదర్శి కాదు..
    అసలు అతనికి TRS పార్టీలో ఎటువంటి పదవి లేదు..
    ఇన్ని రోజులూ రెండు పడవల పైన ప్రయాణం చేసిన అతను ఇప్పుడు మూడో పడవ ఎక్కాడు.. ఎక్కించుకున్న వాళ్ళు జాగ్రత్త …..
    రేపటి రోజున నాల్గో పడవ కూడా ఎక్కగలడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *