కర్నాటక కంగారు: ఈసారేమవుతుందో జనతాదళపతి చాణక్యలెక్క

(బి వి మూర్తి, యనమల నాగిరెడ్డి)

 బెంగుళూరు: కాంగ్రెస్ నాయకులు గొప్ప త్యాగ బుద్ధితో ఆఫర్ చేసిన బెంగుళూరు ఉత్తర  స్థానం కాదని తుమకూరు ఎంచుకున్నప్పుడే జనతా దళపతి దేవెగౌడ నిర్ణయంలో ఏదో మతలబు ఉన్నదని అంతా అనుకున్నారు.

తుమకూరు ప్రస్తుత కాంగ్రెస్ ఎంపి ముద్దహనుమే గౌడ, మోదీ ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచి కేవలం వక్కళిగ కులస్థుల బలంతోనే 2014 ఎన్నికల్లో విజయం సాధించాడని దేవెగౌడ అంచనా.

బెంగుళూరు ఉత్తర లోక్ సభ పరిధిలో అయిదు సెగ్మెంట్ లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక జెడిఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. అదే తుమకూరులో అయితే ముగ్గురు జెడిఎస్ ఎమ్మెల్యేలు, ఒక్క కాంగ్రెస్ శాసన సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే మన వాళ్లు ముగ్గురే ఉన్నా తుమకూరే క్షేమమనుకుని దేవెగౌడ అక్కడే రంగంలోకి దిగారు.

కంచుకోట వంటి హాసన్ ను రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ కోసం త్యాగం చేయడం పెద్దాయన నెత్తిన ఆయన కుటుంబం రుద్దిన బలవంతపు నిర్ణయమని జెడిఎస్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. 1991 నుంచి 2014 దాకా మొత్తం అయిదుసార్లు, తాజాగా వరసగా మూడు సార్లు హాసన్ నుంచి దేవెగౌడ లోక్ సభకు ఎన్నికయ్యారు.

తుమకూరును జెడిఎస్ కు కట్టబెట్టినందుకు ముద్దహనుమే గౌడతో పాటు మరెందరో స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆగ్రహించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం వీళ్లందరికీ నచ్చజెప్పి బుజ్జగించింది. దేవెగౌడ తుమకూరుకు ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్లంతా కలిసి సిద్ధరామయ్యతో గ్రూప్ ఫోటోకు పోజిచ్చేసరికి చివరకు శుభం కార్డు పడ్డట్టు అన్ని వర్గాలూ గొప్ప రిలీఫ్ గా ఫీలయ్యాయి.

కానీ లోపల్లోపల జెడిఎస్ పెద్దాయనకు, కాంగ్రెస్ గురించి, ముఖ్యంగా సిద్ధరామయ్య గురించి ఏదో అనుమానం తొలుస్తూనే ఉంది. ఒకప్పుడు జెడిఎస్ లో దేవెగౌడ తర్వాత అంతటి నాయకుడు తానే అయిన సిద్ధరామయ్యకు `కుమారోదయాని’కి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో పార్టీలో ఊపిరాడకుండా పొగబెట్టి కాంగ్రెస్ పంచన చేరేలా చేసింది ఈ పెద్దాయనే. మొన్నటికి మొన్న 2018 శాసనసభ ఎన్నికల్లో మైసూరు జిల్లా చాముండేశ్వరిలో సిద్ధరామయ్యను కక్షగట్టి ఓడించింది ఈ పెద్దాయన, ఆయన కుమారుడు కుమారస్వామే.

తుమకూరులో ఈ ఎన్నికల్లో దేవెగౌడ ప్రత్యర్థి జిఎస్ బసవరాజు. 1985, 89, 99 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున లోక్ సభకు ఎన్నికైన బసవరాజు, 2009 బిజెపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి ముద్దహనుమేగౌడ పై గెలిచి నాలుగోసారి ఎంపి అయ్యారు. 2014లో బసవరాజుపై ముద్దహనుమేగౌడ గెలిచారు. బసవరాజుతో యుద్ధానికి ఇప్పుడు ఇంకో గౌడ వచ్చి పడ్డారు.

తుమకూరులో విజయం కోసం దేవెగౌడ వక్కళిగుల పైనా, బసవరాజు లింగాయతులపైన ఆధారపడ్డారు. సంప్రదాయికంగా కాంగ్రెస్ వోటు బ్యాంకు అయిన మైనారిటీ వర్గాలు, ఇక్కడ బిజెపి ప్రత్యర్థి జెడిఎస్ కనుక గౌడకే వోటు వేయక తప్పదు. కాంగ్రెస్ ఖాతాలోని దళిత, వెనుకబడిన వర్గాల వోట్లలో కాస్త పైచేయి సాధించినా విజయానికి ధోకా ఉండదని దళాధిపతి అంచనా.

మా విలేఖర్ల బృందం సంభాషించిన వోటర్లలో బసవరాజు పట్ల లింగాయతుల్లోనే ఒకవర్గంలో విముఖత వ్యక్తమయింది. లింగాయతుల్లోని నిమ్నవర్గాల వారిని (ఉండోవ్రున హత్తిర బర్లీసల్ల …..) అంటే మద్యమాంసాలు తినేవారిని బసవరాజు ఇంటి ఆవరణలోనికి కూడా రానివ్వరని కొందరు వోటర్లు మాతో చెప్పారు. ఇలాంటి వర్గాల వోట్లను తాను సమీకరించుకోగలిగితే దేవెగౌడకు లాభిస్తుంది.

జిల్లా లోని కొందరు జెడిఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఉదాహరణకు 2004 నుంచి ఇప్పటి దాకా వరసగా నాలుగు ఎన్నికల్లో విజయం సాధించిన గుబ్బి ఎమ్మెల్యే ఎస్ ఆర్ శ్రీనివాస్ పట్ల వోటర్లలో తిరుగులేని నిబద్ధత ఉంది. ఇలాంటి స్థానిక నాయకులు అంకిత భావంతో పని చేయడం దళాధిపతికి కలిసి వచ్చే అంశం.

అయితే హేమావతి జలాల సమస్య మృత్యు పాశమై మెడకు చుట్టుకుంటే అపర చాణక్యుడిననుకునే దేవెగౌడ సైతం అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. గొరూరులో నిర్మించిన హేమావతి జలాశయం హాసన్ కు అతి చేరువలో ఉన్న మాట నిజమే గానీ దేవెగౌడ కేవలం హాసన్ జిల్లా ప్రయోజనాల కోసం పోరాడుతూ, తుమకూరు, మండ్య జిల్లాల చట్టబద్ధమైన నీటివాటాను అడ్డుకుంటూ తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. మా విలేఖర్ల బృందం తుమకూరు నగరం, గుబ్బి తాలూకాలోని కొన్ని పల్లెలను సందర్శించినప్పుడు, మాకు నీళ్లు రాకుండా అడ్డుపడిన దేవెగౌడ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వోట్లడుగుతాడని కొందరు ప్రశ్నించారు.

2009 లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలు గెల్చుకున్న జెడిఎస్ 2014 ఎన్నికల్లో రెండు స్థానాలకు పడిపోయింది. గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో జెడిఎస్ హఠాత్తుగా 37 సీట్లు గెలవగానే ఈ విజయం వాపా లేక బలుపా అని చూసుకోకుండా కాంగ్రెస్ అప్పనంగా ఎనిమిది లోక్ సభ సీట్లను అపాత్ర దానం చేసింది. దీనిపై కాంగ్రెస్ లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు చల్లార్చేందుకు అధిష్టానం శతవిధాలా యత్నించింది కానీ ఆ యత్నాలు ఎంత మాత్రం ఫలించాయో చెప్పలేని అసందిగ్ధత నెలకొన్నది.

కన్నడ చిత్రరంగంలో రాజ్ కుమార్, విష్ణువర్ధన్ ల తర్వాత అభిమానులంతా అంబరీష్ పేరునే చెప్పుకొంటారు. అయితే ఈ ముగ్గురిలోనూ రాజకీయాల్లోకి వచ్చి రాణించిన ఘనత కేవలం అంబరీష్ కే దక్కుతుంది. చిత్ర పరిశ్రమలో నిర్మాత మొదలు చిన్నాచితక నటులు, సాంకేతిక నిపుణుల దాకా ఎవరికి ఏం కష్టమొచ్చినా నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి ఆదుకునే పెద్దన్న క్యారెక్టర్ ఆయనది. అంతటి అంబరీష్ కు స్వయానా జీవిత భాగస్వామి అయిన సుమలతను, ఆమె మండ్యలో పోటీకి దిగిన పాపానికి, ఆడదని కూడా చూడకుండా దేవెగౌడ కుటుంబం నోటికొచ్చినట్టు తూలనాడిన తీరు, రాజకీయ వర్గాలకే కాదు, సామాన్య ప్రజలకు సైతం రోత పుట్టించింది. మండ్యలో చెలరేగిన ఈ ఆగ్రహాగ్ని రాష్ట్రమంతటా కూడా వ్యాపించి ఉంటే ఇద్దరు మనవళ్లతో పాటు పెద్దాయన కూడా ఈ ఎన్నికల్లో గల్లంతవక తప్పదు.

పోటీ చేస్తున్న ఏడు సీట్లలో ముగ్గురు అభ్యర్థులు అధినేత కుటుంబంలోని తాతామనవళ్లే కావడం బహశ ఆలిండియా రికార్డు కావచ్చు. ఈ వింతరికార్డు ఇటు జెడిఎస్ లోనే రోత పుట్టించిందంటే ఇక సామాన్య ప్రజల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే.

వక్కళిగుల కులాభిమానం, ప్రత్యర్థి బసవరాజుపై లింగాయత్ నిమ్నవర్గాల్లో ఉన్న విముఖత వంటి అనుకూలాంశాలు మరో సారి దరి చేర్చుతాయో లేక అపనమ్మకాల పొత్తు, సుమలత ఫ్యాక్టర్, హేమావతి జలాల పంపిణీ వంటి ప్రతికూలాంశాలు దేవెగౌడ కొంప ముంచుతాయో ఈ నెల 23న మధ్యాహ్నానికల్లా తేలిపోతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *