Home Features కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ రద్దు కోసం ఉద్యమించరా?

కార్పొరేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ రద్దు కోసం ఉద్యమించరా?

261
0
తేట తేట తెలుగులా అమ్మ మాట తీయనా…తెలుగు భాష అంటే తెలుగు వారందరికీ ఇష్టమే..ఇది నిజమా…ప్రతీ ఒక్కరూ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. ఏం‌ డౌటా…పిచ్చి పిచ్చి క్వశ్చన్లూ నువ్వూను అనిపిస్తుంది కదూ?. కాదా! మరి..మన‌తెలుగు వాళ్లకు తెలుగు భాష అంటే చచ్చేంత ప్రేమాయే. పొద్దున లేచింది మొదలు మనం తెలుగులోనే మాట్లాడుతున్నామాయే.‌ఉదయం నిద్ర లేవగానే కాఫీ..టీ…మిల్క్…అంటూ ఇంట్లో వాళ్లమీద అరుస్తామాయె.‌‌టీ..కాఫీలకు ముందో తరువాతో బ్రష్ చేసుకొవడమూ మనకు అలవాటే…ఇక టాయిలెట్ సంగతి సరాసరే. మన ఆడాళ్లయితే లేచిన దగ్గరి నుండి కిచెన్ లోనే గడిపేస్తుంటారాయె. ఆ తరువాత స్నానం..లెదా షవర్..బాత్..చేసుకోవడం రెడీ అయ్యి బైకో..బస్..కారులోనో…క్యాబ్ లోనో‌ పెద్దాళ్లు ఆఫీస్..పిల్లలు స్కూళ్లకు వెళ్లడం వర్క్ కంప్లిట్ చెయ్యడం..మధ్యాహ్నం లంచ్..ఈవెనింగ్ స్నాక్స్..నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి గుడ్ నైట్ తో డే పూర్తి చేస్తాం. అంటే గుడ్ మార్నింగ్ తో మొదలై గుడ్ నైట్ వరకు‌మన వ్యవహారిక భాషంతా నూటికి అరవై శాతానికి పైగా ఆంగ్లంలోనే సాగిపోతుందన్న మాట. మరి తెలుగుభాష పట్ల మనకున్న అభిమానం ఇదేనా.‌ఇంగ్లీష్..ఉర్దూ పదాలనూ తెలుగీకరించి వాడుతూ తెలుగుభాష క్షీణతకు నేనుసైతం అంటూ కృషి చేస్తున్నాం. ఇంగ్లీష్ లో ఫుడ్ ను ఫుడ్డుగా..బెడ్ ను బెడ్డుగా….ఉర్దూలో షోక్ పదాన్ని సొగ్గాడుగా మార్చేశాం.‌ఏపీలో వాడే తెలుగు పదాల్లో రెండువేల ఉర్దూ పదాలను తెలుగులా వాడుతున్నారని తెలంగాణ ఉద్యమ పిత ప్రొఫెసర్ జయ శంకర్ అక్షరీకరించారు.
చదువుకున్న వాళ్లే కాదు నిరక్షరాస్యులూ నిత్యం ఆంగ్ల పదాలను వాడుక భాషగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ నెంబర్ చెప్పండి అనగానే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అంటూ చెప్పేస్తారు. అంతే కానీ తొమ్మిది ఎనిమిది అని ఏ పేద కూలీ కూడా చెప్పడు. ప్రముఖ సినీ మాటల రచయిత..తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులైన పరుచూరి గోపాల కృష్ణకు తెలుగు భాష అంటే విపరీతమైన అభిమానం. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా తెలుగు భాషను రక్షిస్తూ.. ఈ భాష వినియోగాన్ని ప్రజల్లో పెంచాలని ప్రయత్నం చేశారు. అయితే తెలుగు ప్రజల్లో ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారు అనే అనుమానం ఆయనకు కలిగింది. ‌కనీసం ఒక అయిదు నిమిషాల పాటు ఆంగ్ల పదాలు లేకుండా తెలుగులో ఎంత మంది మాట్లాడుతారో తెలుసుకోవాలని ఓ పోటీ అయితే పెట్టారు కానీ ఆయన ఆశ నిరాశే అయింది. ఈ ఉపోద్ఘాతాన్ని బట్టి ఏం అర్థం అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటున్న మహానుభావులు ముందుగా తేటతేట తెలుగు పదాలతో మాట్లాడం నేర్చుకోవలసిన అవసరం ఉంది. కొందరంటారు కర్నాటక లో దుకాణాల బోర్డులపైన కన్నడ పేర్లు ఉంటాయని. మనవద్దా మాతృభాషలో ఉంటాయి.. కాకపోతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సెటిలైన వారికి.. విదేశీ టూరీస్టులకు అర్ధం కావాలంటే ఆంగ్లంలో కూడా బోర్డుపై రాతలు ఉండక తప్పదు. కర్ణాటకలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ కన్నడ భాషలోనె సాగుతాయంటారు కానీ అది పూర్తిగా కానేకాదు. అసెంబ్లిలో స్పికర్ సైతం ఆంగ్ల భాషనే వాడుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారు తమ సంతానాన్ని..వారసులను ప్రైవేట్ కాన్వెంట్ల లో ఆంగ్ల మాధ్యమం లో చదివిస్తున్నారా?.. లేక తెలుగు మీడియం లోనా. అంటే తమ పిల్లలు ఆంగ్ల మీడియంలో చదివి డాక్టర్లు..ఇంజనీర్లు ఐఏఎస్లు కావాలి .. కానీ పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల‌ పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదువు నేర్వకూడదా… దీన్ని బట్టి చూస్తుంటే వీరంతా తెలుగు భాష పట్ల అభిమానంతో కాదు బహుజనులు ఉన్నత విద్యా వంతులు కాకూడదనే కుట్రతో పాటు… తమకు కోట్లల్లో ఆదాయం తెచ్చిపెడుతున్న కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వ ఆంగ్ల భాషా పాఠశాలల కారణంగా ముప్పు వాటిల్లుతుందనే భయంతోనే దుర్మార్గమైన కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టి బహుజన జాతుల పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు జగన్ నేతృత్వంలో ని ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. వీరికి తెలుగు భాష పట్ల నిజమైన అభిమానం ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం ను కూడా కొనసాగించాలని డిమాండ్ చేయాలి?.. లేదంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేయాలని కదం తొక్కాలి. ఇవేవీ కాకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను వ్యతిరేకించడం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు బహుజనుల ఎదుగుదలను ఓర్వలేక అయి ఉండాలి..లేదా.. కార్పొరేట్ స్కూల్స్ యజమానులు సృష్టిస్తున్న కృత్రిమ ఆందోళనలు అయినా కావాలి.‌ఇంకొందరు అంటారు చైనా..ఇరాక్..ఇరాన్..మాంగోలియా..భూటాన్..జపాన్‌ వంటి దేశాల్లో అక్కడి ప్రజలు స్థానిక భాషల్లోనే మాట్లాడుకుంటారని.. కానీ ఆటోమొబైల్… ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు.. మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసే ఆయా దేశాలు తమ ఉత్పత్తుల ను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి. అట్లాగే అరబ్ దేశాలు కూడా పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయడం.. ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవాలన్నా ఆంగ్లం తప్పనిసరి. అనేక దేశాల్లో ఏక భాష ఉంటుంది. కానీ మనదేశంలో అనేక భాషలతో కూడిన రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. కాబట్టే హిందీని ఏకభాషగా బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలు.. దేశాలతో వ్యవహారాలు..ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార..ఉద్యోగాల కోసం ఆంగ్లం వాడటం తప్పనిసరి అయింది. ఈ రకంగా ప్రపంచం తో పోటీపడి నెగ్గాలంటే ఆంగ్లం తప్పనిసరి. ‌ అంతెందుకు తెలంగాణ.. ఆంధ్ర విలీనం తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే ఎంపికయ్యారు. కారణం బ్రిటిష్ పాలకులు ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందుబాటులోకి రావడంతో అక్కడి ప్రజలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోగలిగారు. కానీ నిజాం పాలన లో ఉర్దూ భాష రాజ్యమేలడంతో అప్పట్లో తెలంగాణ ప్రజలు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. దీంతో ఆంగ్ల భాషలో ప్రావీణ్యం లేక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాలేక వెనుకబడిపోయారు. నేటికీ ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ఏపీకి చెందిన విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో చదివే వారితో పోటీ పడలేక పోతున్నారు . కారణం ఇంగ్లీష్ భాష రాకపోవడమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని వందల పేజీలు రాసినా సరిపోదు. కొంత మంది భాషోద్దారకులు మాతృభాషలో చదువుకోవడం వల్ల చిన్నారులకు పాఠాలు తేలికగా అర్ధం అవుతాయంటున్నారు. నిజమే..మరి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మాతృభాషలో విద్యా బోధన కోసం ఎందుకు ఉద్యమించడం లేదు. పేదల పిల్లలకు మాత్రమే ఇది వర్తిస్యుందా?.. సంపన్నుల పిల్లలకు మాతృభాషలో విద్యా బోధన అవసరం లేదా?. దీని అర్ధం ఏమిటి. దీన్ని బట్టి పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల సంతానం ఇంగ్లీష్ మీడియం కు దూరంగా ఉండాలనే కుట్ర కనిపిస్తుంది. ఇప్పటికే రిజర్వెషన్లను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు…ఆంగ్ల భాషా పరిజ్ఞానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసిలు తమతో సరిసమానంగా ఎదగడమే కాదు..భవిష్యత్తులో తమను మించిపోతారనే భయంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అడ్డుకోవాలని చూస్తున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టి, బీసీల ఎదుగుదల పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేనట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను స్వాగతించాలి. లేదు..నిజంగా మాతృభాష పట్ల ప్రేమే ఉన్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదువులను రద్దు చేయాలని కోరుతూ ఉద్యమాలు చేపట్టి తమ నిజాయితీని చాటుకోవాలి. అంతే కానీ.. కేవలం ప్రభుత్వ పాఠశాలల విషయంలోనే ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడాన్ని ఖచ్చితంగా బహుజనలు వ్యతిరేకించాల్సిందే. ఓ పక్క వందల ఏళ్లపాటు విద్యకు దూరంగా ఉంచడం వల్ల సామాజిక, ఆర్ధిక, విద్యా, రాజకీయ రంగాల్లో తీవ్ర వివక్షకు గురై..ఇప్పుడిప్పుడే విద్యారంగంలో రాణిస్తున్న ఎస్సీ, ఎస్సీ, బీసీలను తిరిగి వర్ణవ్యవస్థలో భాగంగా మెరుగైన విద్యకు దూరంగా ఉంచడానికే ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయని భావించాల్సి వస్తుంది.
కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ తో పాటు తెలుగునూ బోధించాలని డిమాండ్ చేస్తే అన్ని వర్గాల వారూ మద్దతు ఇస్తారు. లేదంటే చివరకు కార్పొరేట్ స్కూళ్ల కుట్రలకు వ్యతిరేకంగా మరో ఉద్యమమూ మొదలవుతుంది తస్మాత్ జాగ్రత్త.
– జంగిటి వెంకటేష్, సీనియర్ జర్నలిస్ట్. 9052889696