Home Features తొలివయసు రొమాంటిక్ ఙ్ఞాపకంగా మిగిలిపోయిన రిషికపూర్

తొలివయసు రొమాంటిక్ ఙ్ఞాపకంగా మిగిలిపోయిన రిషికపూర్

224
0
Rishi Kapoor (Wikimedia commons)
(త్రిభువన్)
ప్రముఖనటుడు రిషికపూర్ ఏప్రిల్ ముప్పైన కన్నుమూసిన వార్త మొదటగా డెబ్భైలనాటి యువతను ఉర్రూతలూపుతూ ప్రారంభమైన ఒక శకాన్ని మళ్లీ గుర్తుచేసింది. ఒక పరిణితిచెందిన మంచినటుడుగా ఎదిగి ఎంతగుర్తింపు తెచ్చుకున్నా నిన్నటి తరానికి అతను బాబి సినిమాలో నటించిన ఆమాయక టీనేజ్ హీరోగానే గుర్తుంటాడు.
అప్పటివరకు రొమాంటిక్ హీరోలుగా వెలుగొందిన దేవానంద్, షమ్మికపూర్, శశికపూర్ మొదలైన హీరోలు కొంత తగ్గుముఖం పట్టారు. ఒకవైపు రాజేష్ ఖన్నా యుగం అంతకుముందే మొదలై గొప్పగా నడుస్తోంది. సరిగ్గా అదేసమయంలో బాబీ సినిమా విడుదలై పూర్తిగా కొత్త రొమాంటిక్ ధోరణులను తీసుకొచ్చింది.
రాజేష్ ఖన్నా నటిస్తున్న సినిమాలుకూడా రొమాంటిక్ సినిమాలేగాని అవి పరిణితి పొందిన యువతకు నచ్చే క్లాస్ సినిమాలు. కాని ‘బాబి’ అప్పుడప్పుడే యవ్వనంలోకి ప్రవేస్తున్న టీనేజ్ యువతకు చెందిన సినిమా. టీనేజ్ యువతలో అది సృష్టించిన ప్రభంజనం ఇప్పటివరకు మరో సినిమా చెయ్యగలిగిందని గట్టిగా చెప్పలేం.
రాజ్ కపూర్ స్వయంగా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో తొలి యవ్వనానికొచ్చే యువతీయువకుల్లో కలిగే అర్థంకాని శారీరక, మానసిక పరిణామాలు, దానికి స్పందనగా కనపడే బాడి లాంగ్వేజ్, అనుభూతుల ప్రకంపనలు చక్కగా ప్రతిబింబించాయి. అవి ఆనాటి యువహృదయాలను గొప్పగా ఆకట్టుకున్నాయి.
ఆ సినిమాలో టీనేజ్ హీరోగా పరిచయమైన రిషి కపూర్ తరువాత చాలా సంవత్సరాలు అదే టీనేజ్ ఇమేజ్ లో ఉండిపోవడమే దీనికి నిదర్శనం. అసలు ఆ సినిమాకు హీరోగా రాజేష్ ఖన్నాను అనుకున్నారని, ‘మేరా నామ్ జోకర్’ లో తీవ్రమైన నష్టాలు రావడంవల్ల రాజేష్ ని పెట్టుకునే స్థోమతలేక కొడుకు రిషికపూర్ నే హీరోగా రాజ్ కపూర్ ప్రవేశపెట్టాడని అంటారు. రాజేష్ ఖన్నా హీరోగా చేసివుంటే అది హిట్టైవుందేదేమోగాని, ఇలా సెన్సేషన్ అయ్యుండదని చెప్పచ్చు.
తను తన పాతధోరణిని వదిలేసి పూర్తిగా కొత్త యువతరానికి కావాల్సిన విధంగా ఈ సినిమాను తీసానని విడుదలయ్యాక రాజ్ కపూర్ చెప్పుకున్నాడు. అతనన్నట్టే ఇందులో కథ, పాత్రలు, నటీనటులు, గాయకులు, పాటలతో సహా అన్నీ కొత్తగానూ, అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువతకి సరిగ్గా సరిపోయేట్టు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ డింపుల్ కపాడియా రిషికపూర్తో పాటు ఈ కొత్తదనానికి, తాజాదనానికి జీవం పోసింది.
ఈ సినిమాలో రిషికపూర్ వయసు, రూపం, గొంతు, మొహంలోని పసితనం, నటించిన విధానం అన్నీ సినిమా ధోరణికి అతికినట్టు సరిపోయాయి. అతనికింకా నటనలో సరైన అనుభవం లేకపోవడంకూడా పాత్రకు కలిసొచ్చింది. ఈ ఇమేజే రిషికపూర్ జీవితాంతం ఉండిపోయి ఒకరకంగా అతని పెరుగుదలకు ఆటంకమైందంటే ఆశ్చర్యంగా ఉంటుంది.
బాబి సినిమా ప్రభావం తరువాత వచ్చిన యూత్ సినిమాలమీద చాలావుంది. తొలివయసులోని ప్రేమను చూపించే సినిమాలు చాలావచ్చాయి. కాని అవి అంత ప్రమాణాలతో తీసినవికాదు. పైగా తొందర్లోనే ట్రెండ్ కూడా మారింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ బాబికి ఒక ప్రత్యేక స్థానముంది. అందులోని పాటలేకాక ఆ సినిమాకూడా ఇప్పటికీ తాజాగా ఉంటుంది.
ఆతరువాత రిషికపూర్ చాలా సంవత్సరాలు ‘రఫూ చక్కర్’, ‘ఖేల్ ఖేల్ మే’, ‘అమర్ అక్బర్ ఆంథొని’ లాంటి రొమాంటికి కామెడి సినిమాలే ఎక్కువచేసాడు. ఆ తరువాతిరోజుల్లో అతను నటుడుగా పేరు తెచ్చుకున్నా ఈలోపలే అమితాబ్ బచ్చన్ ఆంగ్రి యంగ్ మ్యాన్ రకం సినిమాలు పెరగడంతో అధికభాగం మల్టి స్టారర్ సినిమాల్లో నటించాడు.
అమితాబ్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలు వేసే పాత్రలకు అతను సరిపోకపోవడంవల్ల, సంజీవ్ కుమార్ కు లభించిన చాలెంజింగ్ పాత్రలు లభించకపోవడంవల్ల అతనికి మంచి నటుడుగా పేరు తెచ్చుకుని స్థిరపడ్డానికి వీలుకాలేదు. అతని రూపలక్షణాలు అందుకు తగినట్టుగా లేకపోవడంకూడా ఒకకారణం కావచ్చు. దానికితోడు రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్ లలాగే ఇతనుకూడా మంచి అలవాట్లతో తన శరీర దృఢత్వాన్ని, రూపాన్ని పదిలపరుచుకునే యత్నం చేసినట్టు కనపడదు.
ఎనభయ్యవ దశకంలో ‘సర్గం’, ‘సాగర్’, ‘చాందిని’లాంటి సినిమాల్లో కొన్ని మంచి లీడ్ పాత్రలు వచ్చినా హీరోగా అతనికి అది చివరి దశ.
తొంభైల్లో అంతగా కనపడని రిషికపూర్ 2000 తరువాత తిరిగి మంచిపాత్రల్లో కనపడ్దం మొదలుపెట్టాడు. ఇదతనికి రెండోదశ అని చెప్పచ్చు. అప్పట్నుంచి మొన్న మరణించేదాకా నటిస్తూనేవున్నాడు. వీటిల్లో ‘లవ్ ఆజ్ కల్’, ‘అగ్నిపథ్’, ‘దో దూని చార్’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘నమస్తే లండన్’, ‘హమ్ తుమ్’, ‘ఫనా’ సినిమాల్లో అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి.
రిషికపూర్ కి హీరో అవకాశం వారసత్వంగా వచ్చింది. దాన్నతడు మొదట్లో ఉపయోగించుకున్నా తరువాత స్వంతంగా నిలదొక్కుకుని నటుడుగా కొనసాగాడు. కానీ అతను పెద్దహీరోలు లేక గొప్పనటుల జాబితాలోకి చేరలేకపోయాడని చెప్పచ్చు. అలా అవడానికి ప్రతిభతోపాటు అనేక కారణాలుకూడా తోడ్పడాలి. అవికూడా కలిసొచ్చివుంటే అయ్యేవాడా అంటేకూడా అది జరిగేదాకా చెప్పలేం. ఐతే వారసత్వంతో వచ్చి సూపర్ హిట్ తో రిషిలాగ గొప్పగా కెరీర్ మొదలుపెట్టి తరువాత కనపడకుండా పోయిన నటీనటులెందరోవున్న హింది చిత్రసీమలో ఒక మంచినటుడుగా చివర్లోనైనా రిషి మిగిలిపోవడం తక్కువ విజయం కాదు.
అతనికి తన మొదటి సినిమా ‘మేరా నామ్ జోకర్’ లోనే ఉత్తమ బాలనటుడుగా, ‘బాబి’లో ఉత్తన నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ‘దో దూని చార్’ లో ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు లభించాయి. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2008 లో వచ్చింది.
రిషి కపూర్ తనతో మొదట్లో చాలాసినిమాల్లో హీరోయిన్ గా నటించిన నీతూ సింగ్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. రిషి కొడుకు రన్ బీర్ కపూర్ ప్రముఖ హిందినటుడుగా ఎదగడంతో పృధ్విరాజ్ కపూర్ కుటుంబవారసత్వం కొనసాగుతూనేవుంది.
రిషి కపూర్ కన్నుమూసేముందు ‘ది బాడి’ సినిమాలో నటించాడు, అదే అతని ఆఖరు సినిమా.
రిషికపూర్ మరణానికి ముందు కొన్నినెలలు ల్యుకేమియా వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నాడు. అతనికి ఆ ప్రాణాంతక వ్యాధిరాకపోయివుంటే ఒక మంచి క్యారెక్టర్ నటుడుగా ఇంకా కొన్నేళ్లు తప్పక కొనసాగివుండేవాడు.

(Feature Image Source)