Home Features రాహులే ఎందుకు ప్ర‌ధాని కావాలి.. ?

రాహులే ఎందుకు ప్ర‌ధాని కావాలి.. ?

275
0

(చర్చ)

రాహుల్ గాంధీ ఎవ‌రు.. ఈ దేశ‌మంతా ఆయ‌న వైపే ఎందుకు చూస్తుంది. ఇంత చిన్న వ‌య‌స్సులో 130 కోట్ల జ‌నాభా ఉన్న ఒక అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ఆయ‌న ప్ర‌ధాని కావాల‌ని ప్ర‌జ‌లు ఎంద‌కు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీలో ఇంత పెద్ద దేశాన్ని న‌డ‌ప‌గ‌ల పాల‌నా స‌త్తా ఉంటుందా..?  సామాచార విప్ల‌వం వెల్లువెత్తిన నేప‌థ్యంతో ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో పోటీ ప‌డి పాల‌న చేయ‌గ‌ల సామ‌ర్థ్యం రాహుల్‌లో ఉందా.. ? ఇవ‌న్నీ నేడు సాధార‌ణ ఎన్నిక‌ల ముందు పెద్ద చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఇంత‌కీ రాహుల్ ఎవ‌రు.. ?  ముత్తాత మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు, తాత దేశానికి మొద‌టి ప్ర‌ధాని, నాన‌మ్మ దేశానికి మొద‌టి మ‌హిళా ప్ర‌ధాని, తండ్రి దేశంలోనే మొద‌టి పిన్న వ‌యస్కుడు అయిన ప్ర‌ధాని, త‌ల్లి ప‌దేళ్ల పాటు యుపిఎ చైర్ ప‌ర్స‌న్‌గా ఉండి దేశాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా పాలన జ‌రిగేలా చూసిన మ‌హిళా నేత‌, రాహుల్ కుటుంబంలో ముగ్గురు ప్ర‌ధాన‌మంత్ర‌లున్నారు. ఆ కుటుంబానికి అధికారం కొత్త కాదు, దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ కుటుంబం అన్ని త్యాగం చేసి పోరాటాలు చేసింది. మోతీలాల్ నెహ్రూ దేశంలో అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన వ్య‌క్తి  అయినా కూడా ఈ దేశం కోసం స్వాతంత్ర స‌మ‌ర పోరాటం చేశారు.

బ్రిటీష్ వారు దేశాన్ని ప‌ట్టి పీడిస్తుంటే ప్ర‌జ‌ల‌కు మాన‌వ హక్కులు లేకుండా బ్రిటీష్ పాల‌కులు నియంత పాల‌న చేస్తుంటే మోతీలాల్ నెహ్రూ ఈ దేశం కోసం బ్రిటీష్ వ్య‌తిరేకంగా పోరాటాలు చేశారు. ఆయ‌న కొడుకు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ మంచి విద్యాధికులు, అప్ప‌టికే వృత్తిలో మంచి నైపుణ్యం పొందినా కూడా మ‌హాత్మ గాంధీతో క‌లిసి దేశం కోసం పోరాటాలు చేశారు. శాంతి, అహింస ఆయుధాలుగా వారు చేసిన పోరాటాలు ఫ‌లించే 1947లో దేశానికి స్వాతంత్రం వ‌చ్చింది. అప్ప‌టి నుంచి దాదాపు 17 ఏళ్ళ పాటు దేశాన్ని పాలించిన మ‌హానీయులు, ఇందిరాగాంధీ దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ప‌నిచేశారు. 1984లో ఉగ్ర‌వాదుల చేతిలో హ‌త‌మ‌య్యారు. ఆ త‌రువాత దేశ ప్ర‌జ‌ల కోరిక మేర‌కు ఆమె పెద్ద కొడుకు రాజీవ్ గాంధీ త‌న పైల‌ట్ వృత్తి ని వ‌దిలిపెట్టి రాజ‌కీయాల‌ల‌కి వ‌చ్చి దేశంలో అత్యంత చిన్న వ‌య‌స్సులో పెద్ద మెజారిటీతో ప్ర‌ధాన‌మంత్రిగా పాల‌న సాగించారు. 1991లో ఆయ‌న కూడా ఎల్‌.టి.టి.ఇ ఉగ్ర‌వాదుల చేతిలో హ‌త్య‌మ‌య్యారు. 1984, 1991ల‌లో రాహుల్ గాంధీ కుటుంబంలో అతిపెద్ద విషాద సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఇద్ద‌రు దేశ ప్ర‌ధానులు, త‌ల్లి కొడుకులు ఈ దేశం కోసం దేహాల‌ను ముక్క‌లు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఈ దేశ ప్ర‌జ‌ల‌నే కాకుండా ప్ర‌పంచాన్నే ఉలిక్కి ప‌డేలా చేసింది.

ఇంత పెద్ద విషాద సంఘ‌ట‌న‌ల‌నుంచి ఆకుటుంబం కోలుకోవ‌డానికి కొంత‌కాలం ప‌ట్టింది. మొద‌ట్లో కొన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న రాజీవ్ స‌తీమ‌ణి సోనియాగాంధీ 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరి

1998 నుంచి వ‌ర‌స‌గా 2017 వ‌ర‌కు ఎఐసిసి అధ్య‌క్షురాలిగా కొన‌సాగారు. 2004 నుంచి యుపిఎ చైర్‌ప‌ర్స‌న్‌గా ఇటు పాల‌నా వ్య‌వ‌హారాల‌లో, ఇటు పార్టీ వ్య‌వ‌హ‌రాల‌లో ఎక్కువ కాలం ప‌నిచేసిన మ‌హిళ‌గా, ప్ర‌పంచంలో మంచి గుర్తింపు పొందిన నాయ‌కురాలిగా సోనియ‌గాంధీ గుర్తింపు పొంద‌గ‌లిగారు. ఇంత‌టి గొప్ప రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన రాహుల్ గాంధీ నేడు దేశంలోనే ఒక ఆద‌ర్శ రాజ‌కీయాలు చేస్తున్న గొప్ప నేత‌గా ఎదిగారు, 48 ఏళ్ళ వ‌య‌స్సులో ఆయ‌న నేడు దేశ‌మంతా తిరిగారు. రాజ‌కీయాలంటే కేవ‌లం వార‌స‌త్వంగా వ‌చ్చిన ప‌దువులు కావు, ఆయ‌న ఎన్‌.ఎస్‌.యు.ఐ జాతీయ నాయ‌కులుగా ప‌నిచేశారు. యూత్ కాంగ్రెస్‌లో ప‌నిచేశారు. 2004 నుంచి వ‌ర‌స‌గా అమెథీ నియోజ‌కవ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 2004, 2009 ఎన్నిక‌ల‌లో ఆయ‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశాలున్నా ప‌ద‌వులపైన అంత ఆతృత లేని వ్య‌క్తిత్వం ఆయ‌న‌ది. రాజ‌కీయ అనుభ‌వం కోసం ఆయ‌న 2007 నుంచి ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఎఐసిసి ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌గా దేశంలో ప్ర‌చార బాధ్య‌త‌ను పూర్తిగా త‌న‌పైన వేసుకున్నారు. అప్ప‌ట్లో పార్టీ ఘోర ప‌రాజయం పాల‌య్యి తీవ్ర‌మైన ఒత్తిడిలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న మొక్క‌వోనీ దీక్ష‌తో పార్టీ అభివృద్ది కోసం ప‌నిచేశారు.

2017, డిసెంబ‌ర్ 16న  అన్ని ర‌కాలుగా ఆలోచించిన పార్టీ నాయ‌క‌త్వం ఆయ‌న‌కు ఎఐసిసి బాద్య‌త‌లు అప్ప‌గించింది. దేశంలో చిన్న వ‌య‌సులో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వ్యక్తుల‌లో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలే ముందు వ‌ర‌స‌లో ఉంటారు. మూడు సార్లు పార్లెమంట్ సభ్యులుగా, ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, పార్టీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌గా, యూత్ కాంగ్రెస్‌, ఎన్‌.ఎస్‌.యు.ఐ ల‌లో ప‌నిచేసిన రాహుల్ గాంధీకి పార్టీలో సిద్దాంత మూల‌ల‌పైన మంచి అవ‌గాహ‌న ఉండ‌డ‌మే కాకుండా, ప్ర‌భుత్వ ప‌ని విధానంలో కూడా మంచి ప‌ట్టు ఉంది. దీంతో ఆయ‌న ఎఐసిసి అధ్య‌క్షులుగా ఎన్నిక‌య్యాక జ‌రిగిన నాలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల‌ల‌ను ఆయ‌న అత్యంత స‌మ‌ర్థ వంతంగా నిర్వ‌హించ‌గ‌లిగారు. ఎంతోకాలంగా మ‌ధ్య ప్ర‌దేశ్‌లో బిజెపి పాగాలో ఉన్న రాష్ట్రాన్ని గ‌ద్దె దింప‌డంలోను, రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డంలోను, కర్ఱాట‌క‌లో బిజెపి అధికారంలోకి రాకుండా చూడ‌డంలోను చ‌త్తీస్ గ‌డ్‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డంలోను ఆయ‌న పాత్ర అత్యంత కీల‌కంగా ఉంది.

దేశం మొత్తం క‌లియ‌తిర‌డం, కాశ్మీర్ నుంచి క‌న్యా కుమారి వ‌ర‌కు అన్ని రాష్ట్రాల‌లో , అన్ని ప్రాంతాల‌లో తిరిగి అక్కడి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై, అన్ని వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకొని వారి స‌మ‌స్య‌ల‌ను పూర్తిగా విని, అర్థం చేసుకొని వాటిని ప‌రిష్క‌రించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఆయ‌న నిఖార్స‌న రాజ‌కీయ విధానాల‌కు అద్దం ప‌డుతుంది. ప్ర‌ధానంగా కులాలు, పేరిట మ‌తాల పేరిట రాజ‌కీయాలు చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ని చూడ‌డం, కార్పోరేట్ రంగాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయ‌లు దోపిడీ చేసి ఆ దోపిడీ సొమ్ముతో రాజ‌కీయాల‌ను శాసించాల‌ని చూడ‌డం లాంటి అనేక ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పి కొట్ట‌డం రాహుల్ రాటు తేలిపోయారు. మొద‌ట్లో రాహుల్ గాంధీ వైఫ‌ల్యాల‌ను చూసిన బిజెపి నాయ‌కులు ఆయ‌న‌ను చాల ఎగ‌తాళి చేశారు, అవ‌మానాలను అభ‌ర‌ణాలుగా భావించి ఎలాంటి నిరుత్స‌హా ప‌డకుండా ఆయ‌న చేసిన రాజ‌కీయ పోరాటం నేడు ఆయ‌నే దేశ ప్ర‌ధానిగా ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. త‌నను పప్పు అన్నార‌ని త‌న‌ను అవ‌మానించినా ప‌ర‌వా లేదు, దేశ ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న ఇవ్వండి అంటు అయ‌న బిజెపికి చుర‌క‌లు వేశారు. అప్పుడు ప‌ప్పు అన్న వాల్లే ఇప్ప‌డు నిప్పు అంటున్నార‌ని ఆయ‌నే తిరిగి త‌న ఆత్మ విశ్వ‌సాన్ని ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ నాయ‌కులు నేర్చుకోవాల్సిన ప్ర‌ధాన అంశం,

ప్ర‌ధానంగా నోట్‌బందీ కార్య‌క్ర‌మాన్ని, జి.ఎస్‌.టి ప‌న్ను విధానాన్ని, మోడీ చౌకీదార్, రాఫేల్ యుద్ద విమానాల కొనుగోలు

అంశాల‌లో రాహుల్ దేశ వ్యాప్తంగా తిరిగి బిజెపిపైన చేసిన ప్ర‌సంగాలు దేశ ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ర్షించాయి. 2014 ఎన్నిక‌ల ముందు న‌రేంద్ర‌మోడి విదేశాల నుంచి న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకువ‌చ్చి ప్ర‌తి పౌరుని ఖాతాలో 15 ల‌క్ష‌ల రూపాయ‌లు జ‌మ చేస్తాన‌ని, రేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని, వంద రోజుల‌లో నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు త‌గ్గిస్తాన‌ని అనే హామీల‌పైన రాహుల్ త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించి దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ వైఫ‌ల్యాల‌ను పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పడిపోయిన కూడా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గక పోగా, దాదాపు 50 శాతం పెరిగాయి. అలాగే నరేంద్ర మోడీ గుజరాత్ లో సీఎం గా ఉన్న సమయంలో పెట్రోల్ కార్పొరేషన్ 19 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇవన్నీ రాహుల్ బట్టబయలు చేసి జనాన్ని ఆలోచింపజేశారు.  ప్ర‌ధానంగా చౌకీదార్ చోర్ బ‌న్ గ‌యే ( కాపాలాదారుడే దొంగ‌లా మారిపోయాడు అంటు) రాహుల్ చేసిన ప్ర‌సంగాలు జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. మోడీ చౌకీదార్ ఎవ‌రికి చౌకీదార్ ప్ర‌జ‌ల‌కు కాదు, పెద్ద వ్యాపారుల‌కు చౌకీదార్ అంటు పెద్ద పెద్ద వ్యాపార వేత్త‌లు దేశాన్ని దోచుకుని విదేశాల‌కు పారిపోతుంటే మోడీ వారికి కాప‌లాకాస్తున్నార‌ని, దొంగ‌ల పేరు వెన‌కాల కూడా మోడీ అని ఉంద‌ని ఆయ‌న వ్యంగాస్త్రాలు విసురుతుంటే బిజెపి విల‌విలాడుతుంది. అంబానీ, అధానిల‌కు దేశాన్ని దోచిపెడుతున్నార‌ని, ప్ర‌జ‌లు సౌక‌ర్యాలు లేకుండా అష్ట‌ష్టాలు ప‌డుతుంటే వేల కోట్ల రూపాయ‌లు త‌న స‌న్నిహిత వ్యాపార‌వేత్త‌ల‌కు దోచిపెట్టార‌ని ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు మోడీ అండ్ బ్యాచ్ జ‌వాబు చెప్ప‌లేని దుస్తితిలో ప‌డిపోయారు.

పాకిస్తాన్‌పైన స‌ర్జిక‌ల్ స్ట్ర‌క్ అంటు బిజెపి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దేశ‌భక్తి ముసుగులో యుద్ద వాతావ‌ర‌ణం సృష్టించి చేసిన రాజ‌కీయాల‌ను కూడా రాహుల్ అత్యంత చాక‌చ‌క్యంగా తిప్పి కొట్ట‌గ‌లిగారు. పుల్వామాలో భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల‌పై పాకిస్తాన్ దాడులు జ‌ర‌గ‌గానే రాహుల్ మోడీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా మీ వెనుక మేముంటామ‌ని ప్ర‌క‌టించారు.  దేశ ర‌క్ష‌ణ కంటే ఏది ముఖ్యం కాద‌ని ప్ర‌క‌టించారు. త‌రువాత బిజెపి చేస్తున్న రాజ‌కీయాల‌ను ఒక్క‌టిగా తిప్పి కొడుతూ దేశ భ‌క్తి అంటే 15 మంది వ్యాపారుల‌కు కాపాలా కాయ‌డ‌మా, 130 కోట్ల జ‌నాభాను దోచి పెట్ట‌డ‌మా, దేశ ద్రోహులు పారిపోతుంటే వారికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డ‌మా, అవినీతి కి పాల్ప‌డి వేల కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్న వారి వెంట విదేశాల‌లో తిర‌గ‌డ‌మా అంటు ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు దేశ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేశాయి, అలాగే న‌రేంద్ర‌మోడీ, అనిల్ అంభానీల అవినీతి బంధాన్ని, రాఫెల్ కుంభ‌కోణంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో ఆయ‌న పెద్ద ఎత్తున విజ‌యం సాధించారు. నేడు రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అది మోడి మెడ‌కు చుట్ట‌కుంద‌ని వ‌స్తున్న ప్ర‌చారంలో రాహుల్ ప్ర‌యోగాలే కీల‌కం.

మ‌త రాజ‌కీయాలు, కుల రాజ‌కీయాలు, మాట‌ల గారెడీల‌ను తిప్పి కొట్ట‌డంతోపాటు త‌న‌కు ప‌ద‌వుల క‌న్నా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు ముఖ్య‌మ‌ని బిజెపి పాల‌న‌లో దేశం అటు మ‌త‌ప‌రంగా కులాల ప‌రంగా చీలిపోతుంద‌ని భావించిన రాహుల్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో తిరిగి బిజెపి వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌న్న పాత్ర పోషిస్తూ అంద‌రికంటే వ‌య‌స్సులో రాజ‌కీయ అనుభ‌వంలో చిన్న‌వాడైనా నేడు దేశంలో ప‌శ్చిమ‌బెంగాల్ నుంచి ఆంద్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు వ‌ర‌కున్న అనేక రాజ‌కీయ శ‌క్తుల‌ను ఏకం చేయ‌డంలోనే ఆయ‌న విజ‌యం సాధించారు. మోడీకి, రాహుల్ కు రాజ‌కీయ అంచనాల‌లో స‌రితూగే అవ‌కాశాలు లేవ‌ని మొద‌ట్లో వాధించిన అనేక రాజ‌కీయ విశ్లేష‌కులు ఇప్ప‌డు మోడీకంటే దీటైన రాజ‌కీయ దిగ్గ‌జంగా రాహుల్‌ను కొనియాడుతున్నారు. నేడు దేశానికి రాహుల్ లాంటి ఒక దిక్సూచి కావాల‌ని చెబుతున్నారు. ప‌ద‌వుల‌పైన ఆశ లేదు, అక్ర‌మాస్తుల మీద వ్యామోహం లేదు. పాల‌కునికి ఉండాల్సిన అన్ని ల‌క్ష‌ణాలు రాహుల్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. దేశం కోసం ఏదో చేయాల‌నే తప‌న‌, ప్ర‌జ‌ల‌ను గొప్ప‌వాళ్ళుగా చూడాల‌న్న తాప‌త్ర‌యం రాహుల్ లో క‌నిపిస్తున్నాయి.

చిన్న హోట‌ల్ కు వెళ్ళి చాయ్ తాగుతారు, ఎక్క‌డో మిర్చి బండి ద‌గ్గ‌ర బ‌జ్జీలు తింటారు, పేద‌ల ఇళ్ళ‌కు వెళ్ళి ఆప్యాయంగా బోజ‌నం చేస్తారు, బాలిక‌ల‌తో హుందా ఒక అన్న‌గా మాట్లాడుతారు, మేధావుల‌తో మ‌మేకం అవుతారు, వ్యాపార‌వేత్త‌ల‌తో దేశ భ‌విష్య‌త్తు గురించి చ‌ర్చిస్తారు, స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌ను త‌ట్టి చూస్తారు, ప్ర‌తి స‌మ‌స్య‌ను లోతుగా ప‌రిశీలిస్తారు, ప‌రిష్కారం కోసం అన్వేషిస్తారు, అద్బుత‌మైన ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టిస్తారు, అదే రాహుల్ స్టైల్‌, ముందుగా దేశంలో వ్య‌వ‌సాయం సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేయాలి, యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వాలి, అప్ప‌టి వ‌ర‌కు వారికి ఆదుకోవాలి, అందుకే దేశంలో వ్య‌వ‌సాయ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారానికి ప్ర‌ధానంగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రుణ మాఫీ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన రాష్ట్రాల‌లో అమ‌లు చేసిన ఘ‌న‌త రాహుల్ గాంధీ గారిది..

తాను ఎవ‌రికి త‌ల వంచ‌న‌ని, డ‌బ్బుకు, అధికారాన్ని త‌ల‌దించి ప్ర‌జ‌ల‌ను తాక‌ట్టు పెట్ట‌న‌ని ఆయ‌న చేస్తున్న ప్ర‌సంగాలు మోడీకి నేరుగా త‌గులుతున్నాయి. తాను వ్యాపార వేత్త‌ల‌న కాప‌ల కాయ‌న‌ని, తాను ప్ర‌జ‌ల‌కు  మాత్ర‌మే త‌ల వంచుతాన‌ని ఎవ‌రి వ‌ద్ద త‌ల దిం చుకునే త‌త్వం మాకు లేద‌ని ఆయ‌న మోడీపై విసుర్లు విసురుతుంటే దేశంలో అదో పెద్ద చ‌ర్చ‌గా మారింది. నేడు దేశానికి ఆయ‌నే బావి ప్ర‌ధానిగా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

దేశంలో నేడు మోడీ రాహుల్ మ‌ధ్య‌నే పోటీ ప్ర‌ధానంగా జ‌రుగుతుంది. సీనియ‌ర్ నాయ‌కులు చాల మంది ఉన్న ప్ప‌టి వారంతా ప్రాంతీయ పార్టీల‌కు మాత్ర‌మే అధినేత‌లుగా ఉన్నారు. వారికి దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి సానుకూలత ఉండ‌దు. ప‌శ్చిమ‌బెంగాల్ లో త్రుణ‌ముల్ అధినేత మ‌మ‌త బెన‌ర్జీ కానీ, ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబునాయుడు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో మాయ‌వ‌తి, అఖిలేష్ యాద‌వ్‌, బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్,  తెలంగాణ‌లో కేసిఆర్‌, మ‌హారాష్ట్ర‌లో శ‌ర‌త్ ప‌వార్‌, ఒరిస్సాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్, ఇలా చాల మంది రాజ‌కీయ నాయ‌కులున్నా కూడా వారంతా వారి రాష్ట్రానికి ప‌రిమిత‌మైన నాయ‌కులే వారు ప్రాంతీయ పార్టీల‌కు నేత‌లుగా ఎదిగిన వారే, వారికి దేశ వ్యాప్తంగా తిరిగే అవ‌కాశం కానీ, అవ‌స‌రం కానీ లేదు, ఇలాంటి ప‌రిస్తితిలో దేశంలో నేడు రాహుల్ ఒక్క‌రే కాబోయే, రాబోయే ప్ర‌ధానిగా మ‌న‌కు క‌నిపిస్తున్నారు.(ఇందులో వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)


పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, మాజీ తెలంగాణ పిసిసి అధ్యక్షులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here