అత్తారింటికి దారే కనిపించడం లేదే?!

(లక్ష్మణ్ విజయ్)
ఎన్నికల్లో ఓటమి చాలా భయంకరమయింది. అది మనస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆలోచలను కకావికలం చేస్తుంది. భవిష్యత్తును అంధకారం చేస్తుంది. ఏవో దురాలోచనలు పుట్టిస్తుంది. ఓటమిలో బతకలేం, ఏదో ఒక బతికే మార్గం వెదకమని పుర్రెలో బీజాలు నాటుతుంది. గెలవలేక పోయినా గెలిచినోడిపక్కన నిలబడి సెల్ఫీ తీయించుకో అని పురమాయిస్తుంది. అందుకే ఓడిన పార్టీ, ఓడిన అభ్యర్థులు హుందాగా ఉండాలేరు. నిలబడలేరు, కూర్చోలేరు,  ధైర్యంగా బజార్లో తిరగలేరు.
ఓడింది పార్టీలయితే గెలిచిన పార్టీలో విలీనమవుతాయి. అభ్యర్థులయితే గెలిచ్చిన పార్టీ పంచన చేరతారు. ఇది ఇపుడునడుస్తున్న రాజకీయ దశ.
ఓటమిని హుందాగా స్వీకరించే పొలిటీషన్లు మనకు బాగా తక్కువ. అందుకే ఓడిపోయాక, ప్రజారాజ్యం పార్టీని 2010లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, గెల్చిన పార్టీ పంచన చేరి కేంద్రమంత్రి అయ్యాడు.
ఇలా వ్యక్తుల విషయానికి వస్తే 2010కి ముందు తర్వాత 2019 దాకా ఉమ్మడి ఆంధ్రలో, విడిపోయిన రాష్ట్రాలలో ఓడిన పార్టీల అభ్యర్థులు గెలిచిన పార్టీల్లోకి జంప్ చేసి పవర్ దగ్గరవుతున్నారు. తామున్న పార్టీ ఓడిపోతే ఫిరాయించడమనేది తెలుగు రాజకీయాల్లో ఈ మధ్య సోకిన  వింత జబ్బు.
తెలంగాణలోనయితే, కాంగ్రెస్, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీలను  ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయ పరిణామాలు.
ఎపుడో ఒక సారి ప్రతిపార్టీ ఈ పరిణామానానికి లోనయింది. ఓటమి భరించలేక నోముల నర్సయ్య లాంటి మార్క్సిస్టు నేతలు కూడా అధికార పార్టీ వైపు మైగ్రేట్ అయిపోయారు.
ఇపుడు ఆంధ్రలో పవన్ కల్యాణ్ ఇదే దారి పట్టారు. మొన్న ఎన్నికల్లో  ఓడిపోయి  ‘పవర్’ వైపు మైగ్రేట్ అవుతున్నారు. కాకపోతే, రాష్ట్రంలో ఉన్న విచిత్ర పరిస్థితి వల్ల ఆయన కేంద్రంలో ఉన్న  పెద్ద పవర్ వైపు మైగ్రేట్ అవుతున్నారు.
ఓటమితో ఆయన తన  అన్న చిరంజీవిలాగే క్రుంగిపోతున్నట్లుంది. పైకి అది కనిపించకుండా జాగ్రత్తపడుతున్నా, ఢిల్లీ కి వెళ్లి, బిజెపి నేతలను కలసి, ఫోటోలు దిగి, వాళ్లతో కలసి పనిచేయాలన్న ఆకాంక్ష వెలిబుచ్చడం చూస్తే ఆయనను ఓటమి ఎంత గా క్రుంగదీస్తున్నదో అర్థమవుతుంది.
ఓటమి అంత ప్రమాదకరమయిన దుష్ట శక్తి కాదు. జీవితంలో లేదా రాజకీయాల్లో ఎదరయ్యే ఒక చన్నిఅపశ్రుతి మాత్రమే. దీనిని తట్టుకుని నిలబడినపుడే నాయకుడవుతాడు.
తమిళనాడులో పిఎంకె (పత్తాలి మక్కల్ కచ్చి)అనే చిన్న రాజకీయ పార్టీ ఉంది.ఉత్తర తమిళనాడులో ఒన్నియార్ అనే ఒబిసి కులం అక్కడ బలమయింది. వాళ్ల ప్రయోజనాల కోసం డాక్టర్ రామ్ దాస్ అనే పెద్దాయన 1989లో ఈ పార్టీని స్థాపించాడు. రాష్ట్రమంతాగెలిచి, అఖండ అధిక్యత సంపాదించి ముఖ్యమంత్రి కావాలనే ఆశయం ఆ పార్టీకి లేదు. వన్నియార్ కుల ప్రయోజనాలకోసం, కులం బలం చూపించాలనే ధ్యేయంతో ఆయన పార్టీ పెట్టారు.  అయితే, సంకీర్ణ ప్రభుత్వాల యుగం  కాబట్టి అన్ని బాగుంటే ఆ ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని మాత్రమే పిఎంకె భావించింది.  తప్పు లేదు.
ఈ చిన్న పార్టీ తమిళ రాజకీయాలను చాలా ప్రభావితం చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంది. దాదాపు 30 యేళ్లు ఆ పార్టీ ఒక శక్తిగా అవతరించింది. వూరికే గోలచేయకుండా నిశబ్దంగా రాజకీయాలు నడిపాడు ఆ పార్టీనేత డా. రామ్ దాస్. డాక్టర్ రామదాస్ కుమారుడు డాక్టర్ అన్బుమణి రామ్ దాస్ ఒకపుడు కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు.మంచి వక్త.
జాగ్రత్తగా రాజకీయ వ్యూహాలు పన్ని ఎపుడూ రాష్ట్రంలో పలుకుబడితోనే కొనసాగారు. అతిగా ఎవరితోను కొట్లాడే వాళ్లు కాదు, అలాగని ఎవరికీ దాసోహనే వాళ్లూ కాదు. ద్రవిడియన్ పార్టీల ఉడుంపట్టులో తమిళనాడు ఉన్నపుడు కూడా కొత్త పార్టీ స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు విజయవంతంగా నడిపారు.ఇది అంత సులువైన విషయం కాదు.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తొలిసారి దెబ్బతగిలింది.అసెంబ్లీలో, లోక్ సభలో పార్టీ అభ్యర్థులెవరూ కాలుమోపలేకపోయారు. అయితే, ఆ పార్టీ తలకిందులు కాలేదు. చిన్న పార్టీ వన్నియార్లు పార్టీ అని ఎవరూ తనని విస్మరించ వీలు లేని విధంగా 30 సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చింది.
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ఇలా ముందుకు ఎందుకు సాగలేకపోతున్నదో అర్థం కాదు. అసలు ఆపార్టీ పుట్టుకతోనే ఏదో సమస్యతో పుట్టినట్లు అర్థమవుతుంది.ఒక తెలుగు రాష్ట్రం తెలంగాణలో కాలుమోపే పరిస్థితే లేదు. కాలుమోపే అవకాశమున్న రాష్ట్రంలో వైసిపికి, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యామ్నయంగా ఎదగాలనుకునే పార్టీలా జనసేన ప్రవర్తన ఉండటం లేదు.
2014 ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ప్రచారం చేసింది. సొంతంగా పోటీ చేయలేదు. అయితే, పార్టీ నేత పవన్ కల్యాణ్ ఎక్కడికిపోయినా, సిఎం, సిఎం అని అరిచేవాళ్లు అభిమానులు.
ఎన్నికలైన తర్వాత ఏమైందో ఏమో అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో ఆయన ప్రతిపక్ష పార్టీ పాత్ర తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు.  ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. కేంద్రంలో మోదీని వదిలేశారు. ఈ రెండు పార్టీలను విపరీతంగా విమర్శించారు. అమరావతిని కుంభకోణమన్నారు. అమరావతికి అంతభూమెందుకున్నారు. భూములు లాగేసుకున్నరన్నారు. భూముల ఇచ్చేది లేదని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నరైతుల పక్షాన నిలబడ్డారు. అక్కడ పర్యటించారు. వాళ్లందించిన లంచ్ చేశారు.ఆయన సొంత నాయకుడిగా ఎదుగుతున్నారని ఆయన అభిమానులు ఆశించారు. ఇక మోదీ విధానాలను, మోదీని తీవ్రపదజాలంతో విమర్శించారు.మోదీ దక్షిణ భారత దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని, అవమానిస్తున్నదని, లెక్కచేయడం లేదని నిప్పులు చిమ్మారు.

తీరా 2019 ఎన్నికల ముందు ఆయన ధోరణి కొద్దిగా టిడిపికి అనుకూలంగా మారినట్లు జనం గుర్తించారు. దీనితో ఆయనకు టిడిపి ‘బి’ టీమ్ అనే అపవాదు వచ్చింది. దీనికి కారణం ఆయన సొంత భాషలో కాకుండా వైసిపిని తెలుగుదేశం పరిభాషలో విమర్శించడమే.
పవన్ కల్యాణ్ కు స్పష్టమయిన అజండా లేదని స్పష్టమయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నదని, కేవలంసినిమా ఇమేజే దిక్కనుకుంటే జనసేన ముందుకు సాగ లేదని Economic and Political Weekly లో ఒక విశ్లేషణ కూడా వచ్చింది.
2019 ఎన్నికల్లో జనసేన తో ఆయనకూడా ఘోరంగా ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోయారు. ఓడిపోవడాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఓటమిని హుందాగానే స్వీకరించాలి. అయితే, ఇపుడు ప్రశ్నించాల్సింది, ఆయన రాజకీయ ధోరణిని మాత్రమే. ఆయనకు ఒక ధోరణి ఉందా, ధోరణి లేకపోవడమే దోరణియా…అర్థమే కాదు.
ఒకపుడు తెలుగు రాజకీయాల్లో షే గువేరా అనుకున్నారు. అనంతపురం వెళ్లి తరిమెల నాగిరెడ్ది పేరు తీసుకున్నారు. ఇలా ఎక్కడ బడితె తాను రెబెల్ అనేలా టామ్ టామ్ చేసుకున్నారు. ఆయన రాజకీయాలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటున్నాయి.
ఆయన స్వతంత్రంగా నిలబడి పోరాడటం కంటే, ఏదో ఒక పెద్ద పార్టీ అండలోనే హాయి అనుకుంటున్నట్లున్నారు. దీనికి కారణం ఆయన సొంత దారి, సొంత రాజకీయాలు, సొంత బాణీ ఏర్పాటు చేసుకోవడం విఫలం కావడమే. సినిమాల్లో ఆయన తనదైన శైలిని విజయవంతంగా ఆవిష్కరించారు.రాజకీయాల్లో విఫలమయ్యారు.
అంటే ఆయన టిడిపికి, వైసిపికి, తాను ప్రత్యామ్నయం అనే ఐడియాలజీని సృష్టించలేకపోయారు. ఆయన చంద్రబాబు ను విమర్శించినపడు వైసిపిలో కలుస్తాడనిఅనుకున్నారు. వైసిపిని విమర్శిస్తున్నపుడు ఆయనిక మళ్లీ టిడిపితో జట్టుకడతారునుకుంటున్నారు. విపరీతమయిన జనాకర్షణ ఉన్నా, అది ఆయనకు మాత్రం ఉపయోగపడటం లేదు.
అంటే, తనదైన ఒక దారిని, తమిళనాడులో పిఎంకె లాగా ఒక స్పష్టమయిన దారిని ఏర్పాటుచేసుకోలేకపోతున్నారు. ఇక ముందు కూడా కష్టమే. ఎందుకంటే ఆయన బిజెపి కి దగ్గరయ్యారు.
కేంద్రంలోబిజపి నానా ఆగచాట్లలో ఉంది. మోదీ హాయంలో ఎకానమీ భ్రస్టు పట్టిందని ప్రతిపక్షాలే కాదు మేధావులంతా ఆరుస్తున్నారు. దేశంలో ఉద్యోగాలు సృష్టించలేకపోయారు. ఉన్న ఉద్యోగాలు వూడే పరిస్థితులొచ్చాయి. ద్రవ్యోల్బణం 40 నెలలకిందికి జరజర జారిపోయింది. పారిశ్రామిక ప్రగతి పడిపోయింది. మార్కెట్లో డిమాండ్ లేదు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశమంతా అశాంతి. ఇలాంటపుడు ఆయన తాను తిట్టిపోసిన బిజెపిని కౌగిలించుకుంటున్నారు. దీనితో ఆయన ఇస్తున్న సందేశమేమిటి?
ఉజ్వల భవిష్యత్తు ఉన్న పార్టీ గా జనసేనని ఆయన తీర్చిదిద్దే స్థితిలో లేరనే అనుకోవాలా?  సొంతంగా ప్రకాశించడం కష్టం మనే నిర్ణయానికి వచ్చారనుకోవాలా?. పవర్ లో ఉన్న వాళ్లతో దగ్గిర గా ఉన్నపుడు కొంత ప్రకాశించవచ్చు. రాష్ట్రంలో ఇది జరగదు కాబట్టి, కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీకి దగ్గరగా జరుగుతున్నారని అనుకోవాలా?.
 ఒకపుడు విపరీతంగా ప్రచారం చేసుకున్న  ‘ఇజం’ (పుస్తకాలు కూడా రాశారు)మర్చిపోయారు.షే గువేరాను మర్చిపోయారు. తరిమెల నాగిరెడ్డిని మర్చిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వవిధానాలను విమర్శించింది మర్చిపోయారు. ప్రధాని మోదీ ఎంతగా దూషించారో మర్చిపోయారు. చూశారా?
ఒటమి ఒక మనిషి లో ఎంత మానసిక సంక్షోభం,గందరగోళాన్ని తీసుకువచ్చిందో…
ఇలా తయారవడానికి కారణం, పూర్తిగా ఆయనకున్న సినిమా ఇమేజ్ మీదే ఆధారపడటం. పార్టీ పెట్టి ఆరేళ్లవుతున్నా ఈ భ్రమ తొలగకపోవడం. ఈ ఆరేళ్లు ఆయన ప్రజలకు చెప్పడమే ఉంది తప్ప, ప్రజల లేద ఓటర్ల నుంచి, ఓటింగ్ శైలి నుంచి నేర్చుకున్నదేమీ లేదు.ప్రజలనుంచి నేర్చుకోకుండా ఆయన బిజెపికి దగ్గరవుతున్నారు.  బిజెపి బలంనుంచి, మోదీ ప్రకాశం నుంచి ముందుకు పోవాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకూడా ఇదే వైపు చూస్తున్నారు. ఈ ధోరణి జనసేన ఎంత దూరం నడిపిస్తుందో చూడాలి.
మంచి మనిషిగా పేరుంది, మంచి భావ వ్యక్తీకరణ ఉంది,మంచి భాష ఉంది. ఓడిపోయినా తగ్గని జనాకర్షణ దండిగా ఉంది. చాాలా శక్తి ఉంది. వయసు అనుకూలంగా ఉంది. అయినా సరే, ఆయన తను వెళ్లాళ్లిన దారిని కనుక్కో లేక పోతున్నారు.