కేంద్ర వ్యవసాయ బిల్లుల్లో ఏముంది? రైతుల్లో అనుమానాలెందుకు?:బొజ్జా దశరథ్ వివరణ

(బొజ్జా దశరథ రామి రెడ్డి)
ఉపోద్గాతం 
వ్యవసాయ ఉత్పాదనల అమ్మకములో అనారోగ్యకరమైన, కపటపూరితమైన పద్దతులకు అవకాశం లేకుండ ఉండాలన్న లక్ష్యంతో భారత దేశంలో నియంత్రిత మార్కెట్ల ఏర్పాటుకు దేశ స్వాతంత్రానికి పూర్వమే చట్టాలు చేసారు. వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ లో ఖర్చులు తగ్గించడానికి, ఉత్పత్తి దారులకు, వ్యాపారస్థులకు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ నియంత్రిత మార్కెట్ల ఏర్పాటుకు చట్టాలు చెయ్యడం జరిగింది. తూకాలలో మోసాలు, అధిక మార్కెట్ చార్జీలు, కల్తీలు తదితర సమస్యలకు పరిష్కరాలు, ఉత్పత్తి దారునికి అమ్మిన సరుకుకు తక్షణ సొమ్ము చెల్లింపు మరియు ఉత్పత్తి దారునికి వ్యాపారస్తుల మధ్య వివాదాల పరిష్కారించే అనేక నిబ్బందనలను పొందపరుస్తూ ఈ మార్కెట్ల చట్టాలను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం వ్యవసాయ ఉత్పాదనలను నియంత్రిత మార్కెట్లలో మాత్రమే అమ్మాలి. అత్యధిక మంది రైతు సభ్యులతో చట్టప్రకారం ఏర్పడిన మార్కెట్ కమిటీలు పై లక్ష్యాలను సాధించడంలో విపలమయ్యాయి. రాజకీయ పార్టీల సంకుచిత స్వార్థంతో, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల సంకల్ప లేమితో విధానపరంగా మంచి చట్టం కింద రూపొందిన నియంత్రిత మార్కెట్లు, నిర్దేశించిన ఆశయాల సాధనలో విపులం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో రైతులకు లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో APMC Act (వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ కమిటి చట్టం) చట్టంలో సంస్కరణలకై APLM Act 2017 (వ్యవసాయ ఉత్పాదన మరియు పశువుల మార్కెటింగ్ చట్టం 2017) ను కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది.
ఈ చట్టం ద్వారా రాష్ట్రాన్నంతా ఒకే మార్కెట్ పరిధిలోనికి తీసుకొని రావడం, వ్యాపారస్తులకు రాష్ట్రమంత ఒకే లైసెన్సు, రాష్ట్రమంతటికీ ఒకే మార్కెట్ రుసుం, ఆహార గిడ్డంగులను, కోల్డ్ స్టోరేజ్ లను మార్కెట్ యార్డులకు అనుబంధంగా గుర్తించడం, పండ్లను కూరగాయలను నియంత్రిత మార్కెట్ పరిది నుండి తొలగించడం, ప్రైవేటు మార్కెట్లు, ఎలక్ట్రానిక్ వాణిజ్యం, ప్రత్యక్ష మార్కెటింగ్, అడ్హాక్ హోల్సేల్ కొనుగోళ్ళు తదితర అంశాలతో. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.
వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. APMC Act (వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ కమిటి చట్టం) చట్టంలో సంస్కరణలకై కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన APLM Act 2017 (వ్యవసాయ ఉత్పాదన మరియు పశువుల మార్కెటింగ్ చట్టం 2017) ను చట్టం చేసి అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలది.
కేంద్రం తీసికొని వచ్చిన APLM Act 2017 ను కొన్ని రాష్ట్రాలు కొన్ని సవరణలతో అమలు చేసాయి. కాని చాల రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కారణాలతో వీటిని అమలు పరచ లేదు.
ఈ చట్టంలోని సంస్కరణలు 
ఈ నేపధ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయానికి సంభంధించి 3 ఆర్దినెన్సులను కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ నెల 5 వ తేదిన తీసుకొని వచ్చింది.
రైతుల సంక్షేమం కోసం ఈ చట్టాలను చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవి 1.నిత్యావసర వస్తువుల సవరణ ఆర్దినెన్సు (Essential Commodities Amendment Ordinance), 2.రైతు ఉత్పాదనల వ్యాపార మరియు వాణిజ్య ఆర్దినెన్సు (The Farmer’s Produce and Commerce (Promotion and Facilitation) Ordinance 2020), 3.ధరలపై రైతుల ఒప్పందం మరియు వ్యవసాయ సేవా ఆర్దినెన్సు (The Farmer’s (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm service Ordinance 2020).
నిత్యావసర వస్తువుల సవరణ ఆర్దినెన్సు(Essential Commodities Amendment Ordinance)
ఆహార ఉత్పాదనల నిలువపై ఉన్న ఆంక్షల వలన రైతులు పండించిన పంటలను అమ్మకంలో ఉన్న ఇబ్బందులను తొలగించి, రైతుల ఉత్పాదనలకు ధరలు లభించే లక్ష్యంతో ఈ ఆర్దినెన్సు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ ఆర్దినెన్సు ద్వార నిత్యావసర వస్తువుల చట్టం 1955 (Essential Commodities Act 1955) కింద ఆహార ఉత్పాదనల నిలువపై ఉన్న ఆంక్షలను కింద వివరించిన పరిమితులతో రద్దు చేసింది.
అసాధారణ పరిస్థితులలో (యుద్ధం, కరువు, అసాధారణ ధరల పెరుగుదల, ప్రకృతి ద్వారా సహజ విపత్తు) మినహయించి మిగిలిన సందర్భాలలో నిత్యావసర ఆహార ఉత్పాదనల నిలువపై ఉన్న ఆంక్షల రద్దు ఉద్యానవన పంటల ధరలు 100 శాతం పెరిగిన సందర్బాలలో నిలువలపై ఆంక్షల కొన సాగింపు
ఇతర నిలువ చేయకలిగిన ఆహార పంటల ధరలు 50 శాతం పెరిగిన సందర్భంలో నిలువలపై ఆంక్షల కొనసాగింపు.
రైతు ఉత్పాదనల వ్యాపార మరియు వాణిజ్య ఆర్దినెన్సు (The Farmer’s Produce and Commerce (Promotion and Facilitation) Ordinance 2020) 
రైతుల వ్యవసాయ ఉత్పాదనలకు సరైన ధరలు లభించాలన్న లక్ష్యంతో ఈ ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ ఆర్డినెన్సు లోని కీలకమైన అంశాలు కింద పేర్కొనడం జరిగింది
రైతులు వ్యవసాయ ఉత్పాదనలను నియిత్రింత మార్కెట్ పరిధిలోనే కాకుండా దేశంలో ఎక్కడైన అమ్ముకునే స్వేచ్చ.
ఎలక్ట్రానిక్ వాణిజ్యం ద్వారా వ్యవసాయ ఉత్పాదనల వ్యాపారాలకు అనుమతి.
రిజిస్టర్డ్ సంస్థలు, బాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంస్థలు, రైతు ఉత్పాదక సంస్థలు ఎలక్ట్రానిక్ వ్యాపారం చేయడానికి నిర్దేశించిన వేదికలను ఏర్పాటు చేయడానికి అనుమతులు.
నిర్దేశిత మార్కెట్లు మినహా మిగిలిన మార్కెట్లలో మార్కెట్ ఫీజుకు మినహాయింపు
ధరలపై రైతుల ఒప్పందం, వ్యవసాయ సేవా ఆర్దినెన్సు (The Farmer’s (Empowerment and Protection) Agreement on Price Assurance & Farm Service Ordinance 2020) 
రైతులు వ్యవసాయోత్పత్తికి ముందరనే కొనుగోలు దారులతో ఒప్పందం చేసుకొనే సాధికారత రైతులకు కలుగ చెయ్యడం ,ఉత్పాదన సేవలను కల్పించడం వలన రైతు సంక్షేమ సాధన లక్ష్యంతో ఈ ఆర్దినెన్సు ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్సు లోని కీలకమైన అంశాలు కింద పేర్కొనడం జరిగింది
రైతులు వ్యవసాయ ఉత్పాదనలకు మరియు పసువుల ఉత్పాదనకు ముందుగానే రైతులు కొనుగోలు దారులతో ఒప్పందాలు చేసుకునే సౌలభ్యం.
కనీసం ఒక పంట కాలానికి, గరిష్టంగా ఐదు సంత్సరాలకు ఒప్పందం చేసుకొనే సౌలభ్యం. పశువులకు సంభంధించి ఉత్పాదన జీవన కాలం ఐదు సంత్సరాలకు మించినట్లైతే ఒప్పంద గరిష్ట కాలంలో మినహాయింపు.
హామీ కొనుగోలు ధరను ఒప్పంద పత్రంలో పొందపర్చడం తప్పనిసరి. ప్రత్యేకంగా ఇచ్చే అదనపు ధరను స్పష్టంగా పొందపర్చడం తప్పనిసరి.
ఒప్పందంలో వచ్చే వివాదాల పరిష్కారానికి రైతు కొనుగోలు దారుల సమప్రాతినిత్యం ఉన్నసఖ్యత బోర్డ్ (Conciliation Board) లో పరిష్కరించుకోవడం.
సఖ్యత బోర్డ్ లో వివాదాలు 30 రోజులలో పరిష్కారం కాని పక్షంలో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ వద్దకు వివాద పరిష్కారానికి వెళ్లి పరిష్కరించుకోవడం.
సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ తీర్పుపై జిల్లా మెజిస్ట్రేట్ అధ్యక్షతన వుండే అప్పిలేట్ అథారిటీ వద్ద వివాద పరిష్కారం కోసం వెళ్ళడం.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన పైన పేర్కొన్న ఆర్దినెన్సులలో రెండవ, మూడవ ఆర్దినెన్సులను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2020 న పార్లమెంటులో చట్టంగా కూడా చేసింది. వ్యవసాయ ఉత్పాదనల అమ్మకంలో సౌలభ్యం కోసం వ్యవసాయ ఉత్పాదన మార్కెటింగ్ చట్టంలో ఈ చట్టాల ద్వారా సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
రైతులు ఎందుకు ఈ సంస్కరణల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?
APMC చట్టం కింద ఏర్పాటైన నియంత్రిత మార్కెట్ లు రైతులకు అనేక రక్షణలు కలుగచేసే విధానాలతో ఏర్పరచడం అయ్యింది.
రైతులు తమ వ్యవసాయ ఉత్పాధనలకు పారదర్శకంగా వేలం వేసే విధానాలతో ధర నిర్ణయంలో పారదర్శకత, రైతులు అమ్మిన ఉత్పాధనలకు డబ్బులు పొందడంలో రక్షణ, వ్యవసాయ ఉత్పాధనల అమ్మకానికి మార్కెట్ యార్డు మౌళిక వసతులను ఉచితంగా వాడుకునే వెసలు బాటు ఉండాలి.
కొనుగాలుదారుల నుండి వసూలు చేసే మార్కెట్ సెస్ నుండి గ్రామీణ పొలాలకు రోడ్డు సౌకర్యం కలుగ చేయడం, రైతులకు అల్పాహార, విశ్రాంతి గదులు తదిథర సంక్షేమ, రక్షణలు ఈ చట్టంలో పొందపర్చారు. కాని చట్టాలన్ని అమలు పరచడంలో ప్రభుత్వాలు విపులమయ్యాయి.
మార్కెట్ యార్డ్ లలో మౌలిక వసతుల ఏర్పాట్లలో విపులం, అధికార రాజకీయ పార్టీల సంకుచిత ప్రయోజనాలకు పెద్దపీట వెయ్యడం, రైతు ప్రయోజనాలు కాపాడటం కోసం ఉన్న చట్టబద్ధ రక్షణలు అమలు పర్చక పోవడం వలన ఈ చట్టం, ఆశించిన పలితాలు పొందలేక పోయింది.
దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాధనలు అమ్ముకునే స్వేచ్చ, ప్రాససింగ్ పరిశ్రమలకు నేరుగా ఉత్పాధనలు అమ్ముకునే సౌలభ్యం APMC చట్టాంలో సంస్కరణలు ద్వారా చేపట్టిన నూతన వ్యవసాయ చట్టాలు కలుగచేస్తాయన్న ప్రచారాన్ని కేంద్రప్రభుత్వం చేస్తున్నది.

 

 రైతులు అనేక సంవత్సరాలుగా తమ ఉత్పాదనలను ప్రాసెసింగ్ పరిశ్రమలకు అమ్మినపుడు ఎదురయిన గత చేదు అనుభావాల నేపధ్యంలో నూతన చట్టాలను విశ్వసించడం లేదు.

మార్కెట్ యార్డ్ లోని ధరలను ప్రామాణికంగా తీసుకుని కొనుగోలు దారులు రైతు ఉత్పాధనలను మార్కెట్ యార్డ్ కు వెలపల గోడౌన్ల దగ్గర, రైతులు పొలాల దగ్గర వాణిజ్యం జరుగుతున్నది. నూతన చట్టం ప్రకారం నియంత్రిత మార్కెట్ యార్డుల వెలపల జరిగే వాణిజ్యానికి కొనుగోలు దారులు మార్కెట్ సెస్ కట్టవలసిన అవసరం లేదు.
అందువలన కొనుగోలు దారులు మార్కెట్ యార్డ్ వెలపలే వాణిజ్యం చేయడంతో, ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్ వ్యవస్థ నిర్విర్యం అవుతుందన్న భావనలో రైతులు ఉన్నారు.
దీనితో అంతో ఇంతో పారదర్శకంగా జరుగుతున్న వ్యవసాయ ఉత్పాధనల ధరల నిర్ణయం ఆగిపోతుందన్న అభిప్రాయంలో రైతులున్నారు.
ఈ చట్టాలన్నీ పెద్ద పారిశ్రామిక వేత్తలకు సానుకూలంగా ఉండేలాగా రూపొందిన్చారనే భావనకు రైతులు గురైతున్నారు. రైతుల వ్యవసాయ ఉత్పాదనలు కొనుగోలు ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వం రైతు ఉత్పాదనలను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడం నుండి దూరం అవుతుందన్న అభిప్రాయానికి రైతులు వచ్చారు.
ఈ వ్యవసాయ సంబంధిత చట్టాలలో రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించే కీలకమైన అంశాలను పొందపర్చక పోవడం రైతులను నిరాశకు గురిచేసింది.
రైతుల సంక్షేమానికి అత్యంత కీలకమైన ఈ చట్టాలను రూపొందించే ముందు రైతు సంఘాల అభిప్రాయాలను తీసుకోక పోవడం, వారికి ప్రభుత్వంతో చర్చలకు అవకాశం కల్గించక పోవడం రైతులకు ప్రభుత్వ కార్యాచరణ పట్ల అనుమానాలకు తావిచ్చింది.
ఈ వ్యవసాయ బిల్లులపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగకుండా చట్టం చేసిన రీతి రైతుల అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది.
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కీలకమైన అంశాలు 
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కీలకమైన కింద వివరించిన కీలకమైన అంశాలను రైతుల సంక్షేమం కోసమే చేపట్టామంటున్న వ్యవసాయ సంభందిత చట్టాలలో పొందపర్చేలాగా సవరణలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
APMC చట్టం లో రైతులకు ప్రయోజనకరంగా ఉన్న అంశాలను సమగ్రంగా అమలుపరచడానికి ప్రజాస్వామ్యబద్దంగా కమిటిని ఎన్నుకునే చట్టాలను రూపొందించడం.
పంటల వారిగా క్షేత్ర స్థాయి నుండి దేశస్థాయి వరకు పంటల వారి కమిటీలను ఏర్పాటు చేయడం. ఈ కమీటీలకు ప్రజాస్వామ్యబద్దంగా రైతుప్రతినదులను ఎన్నుకునే చట్టాలను రూపొందించడం.
స్వామినాధన్ కమీషన్ రిపోర్టులో సూచించినట్లు ప్రతి 5 కి.మీటర్ల రేడియస్ లో గ్రామీణ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం. వ్వసాయ ఉత్పత్తుల నిలువ చేయడానికి గోడౌన్ల, ఎరువుల, విత్తనాల లభ్యతను కూడా ఈ గ్రామీణ మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేయడం.
ధరల నిర్ణయ కమిటిని (CACP) స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ద సంస్థగా ఏర్పాటు చెయ్యడం. దీని చైర్మెన్, సభ్యలకు ఎన్నికల కమీషనర్ తరహాగా నిర్ధిష్ట కాలవ్యవదితో, గౌరవ వేతనాలతో నియామకం చెయ్యడం.
వ్యవసాయ ఉత్పాదనలకు నిర్ణయించే కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కలిగించడం.
రైతులు, కొనుగాలు దారులు చేసుకునే ఒప్పందపత్రంలో వ్యవసాయ ఉత్పాదనల ధరలు కనీస మద్దతు ధరలకు తక్కువ ఉండరాదన్న నిబ్బందనను చట్టంలో చేర్చడం.
వ్యవసాయ ఉత్పాదనలకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించని నేపధ్యంలో, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వానికి గ్రామ సచివాలయం ద్వారా తెలిపిన 7 రోజులలో కొనుగోలు జరిపే విధానాన్ని చట్టంలో పొందపర్చడం.
ఒప్పంద పత్రం ద్వార చేసుకున్న వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్ లో వివాదాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం. వివాదాలను నిర్దిష్ట 45 రోజులలో పరిష్కరించేలాగా చట్టంలో పొందపర్చడం.
వ్యవసాయ ఉత్పాదనల అమ్మకం డబ్బు రైతులు పొందడంలో చట్టబద్దమైన రక్షణను నూతన వ్యవసాయ చట్టంలో చేర్చడం.
సమగ్ర ఎగుమతి, దిగుమతి విధానాన్ని ప్రకటించడం.

 

(బొజ్జా దశరథ రామి రెడ్డి, సెక్రెటరీ జనరల్, అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య, 9848040991)