Home Features ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో జనం తగ్గుతున్నారెందుకు?

ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో జనం తగ్గుతున్నారెందుకు?

193
0

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి))

గత టూర్ లో సింఘు, టెక్రి, ఘజీపూర్ బోర్డర్ల వద్ద రైతాంగ ముట్టడి దృశ్యాల్ని చూసాను. తిరిగి డెబ్భై రోజుల వ్యవధిలో ఈ మూడింటితో పాటు కొత్తగా షాజహనాపూర్ బోర్డర్ వద్ద ముట్టడిని కూడా చూసాను. (ఈ ఆఖరిది ఢిల్లీకి వంద కిలో మీటర్లకు పైగా దూరంలో హర్యానా-రాజస్థాన్ రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉంటుంది).

డెబ్భై రోజుల వ్యవధిలో రెండు సార్లు చూసిన మూడు ముట్టడి స్థలాలమధ్య సాపేక్షిక పరిశీలన కి నాకు అవకాశం ఉంది. వాటి మధ్య నాటికీ, నేటికీ మధ్య నా దృష్టికి వచ్చిన తేడాల వరకు చెప్పగలను. ముఖ్యంగా వాటి మధ్య కొట్టొచ్చినట్లు కనిపించే ఒకతేడా ఉంది. అదే వాటిలో పాల్గొంటున్న ఉద్యమకారుల సంఖ్యకు సంబంధించినది. ఈ తేడాను ప్రత్యేకంగా చెప్పాలి.


ఢిల్లీ ముట్టడి నాడు – నేడు


నాడు – నేడు మధ్య పోల్చితే వాటిలో పాల్గొనే జనసంఖ్య చాలా తగ్గింది. ఇదో చేదు నిజం. మా తొలి పర్యటన బృందం సింఘు బోర్డర్ ను డిసెంబర్ 16 న సందర్శించింది. (ఈసారి మా బృందం ఫిబ్రవరి 26న) ఆనాటితో పోల్చితే నేడు వాటిలో ఉద్యమకారుల సంఖ్య దాదాపు సగం తగ్గింది. నాడు టెక్రీ బోర్డర్ ను మా బృందం డిసెంబర్ 17న సందర్శించింది. (ఈసారి ఫిబ్రవరి 23న) నాటి కంటే నేడు మూడో వంతుకు పైగానే జనసంఖ్య తగ్గింది. (నాడు ప్రతివంద మందిలో నేడు 35 మంది చొప్పున తగ్గి 65 మంది చొప్పున మిగిలారని అర్ధం) ఘజీపూర్ బోర్డర్ ను నాటి మా బృందం డిసెంబర్ 18న సందర్శించింది. (ఈసారి ఫిబ్రవరి 25న) ఆనాటి కంటే నేడు సుమారు నాలుగో వంతు తగ్గారు. (ప్రతివంద మందిలో 75 మంది మిగిలినట్లు అర్ధం) ఈ అంకెలు “ఇంచుమించు” అనే అర్థంలో వాడినవి. అంతే తప్ప, అవి శిలాశాసనాల వంటి అంకెలు కాదు. ఈ తగ్గుదల ఏఏ రూపాలలో చోటు చేసుకున్నదో కూడా మిత్రుల దృష్టికి తేవాలి.

A -యువత బాగా తగ్గింది. నాడు సింఘు, టెక్రీ బోర్డర్ల వద్ద పాల్గొనే జనంలో నలభై నుండి యాబై శాతం మధ్య యువత ఉంది. నేడు అది పది నుండి ఇరవై శాతం మాత్రమే ఉంది. ఘజీపూర్ బోర్డర్ వద్ద ఆనాడు దాదాపు నాలుగోవంతు (25%) యువత ఉండేది. అక్కడ నేడు దాదాపు 10-15 శాతం మధ్యే ఉంది.

B -సింఘు, టెక్రీ బోర్డర్లలో స్త్రీల భాగస్వామ్యం నాడు పగటి వేళలలో 10 నుండి 15 శాతం మధ్య ఉండేది. నేడు ఐదు శాతం కంటే మించి లేదు. ఘజీపూర్ బోర్డర్ వద్ద స్త్రీల శాతం నాడు ఐదు శాతం కంటే తక్కువే. ఇంచుమించు నేడు కూడా అలాగే ఉంది. లేదా మరి కొంత కూడా తగ్గి ఉండవచ్చు.

C -ట్రాక్టర్లు, ట్రక్కుల వంటి వాహనాలు, వాటి ఆధారంగా రైతులు నిర్మించుకున్న నివాస టెంట్ల సంఖ్య అప్పటి కంటే ఏ ఒక్క చోట తగ్గలేదు. పైగా టెక్రీ, ఘజీపూర్ బోర్డర్ల లో పెరిగాయి. ఈ పెరుగుదల టెక్రీ కంటే కూడా ఘజీపూర్ బోర్డర్ లో మరింత ఎక్కువగా ఉంది.

D -టెంట్ల సంఖ్యకూ, జన సంఖ్యకూ మధ్య అనులోమానుపాత అనుబంధం ఉంది. టెంట్లు పెరిగితే జనం కూడా పెరగాలి. టెంట్లు తగ్గితే జనం తగ్గాలి. ఈ అనులోమాన గణాంక సూత్రం (direct proportion) ఇక్కడ అమలు కావడం లేదు. దానికి భిన్నంగా విలోమాన సూత్రం (indirect proportion) అమలవుతోంది. అంటే టెంట్ల సంఖ్య పెరిగింది. కానీ వాటిలో నివాసం వుండే జనసంఖ్య తగ్గింది. కారణం ఉంది. నాడు ఒక ట్రాక్టర్ పై కట్టిన టెంట్ లో ఐదారుగురు నివాసం ఉంటే, అది నేడు ఒకరిద్దరికి తగ్గింది. వాహనాల పై కాకుండా నేల మీద వేసిన భారీ టెంట్లలో నాడు ఒక ఊరికి చెందిన ఇరవై లేదా ముప్పై మంది చొప్పున నివాసం వుండే వారు. నేడు ఆ సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, హైవేలపై ముట్టడి ప్రాంతాల విస్తీర్ణం నాటి కంటే నేడు బాగా పెరిగింది. వాటిలో పాల్గొనే జన సాంద్రత మాత్రం బాగా తగ్గింది.

E -నాడు ధర్నా శిబిరాలలో నిలకడగా వుండే జనం కాక, ప్రతిరోజూ పరిసర గ్రామాల నుండి వచ్చివెళ్లే సందర్శకుల సంఖ్య జాతరను తలపించేది. నేడు ఆ పరిస్థితి లేదు. అసలే లేదని కాదు. అది అప్పటి వలె మాత్రం లేదు.

F -నాడు తమ టెంట్ల వద్ద తమలో తాము ముచ్చటిస్తూ, చర్చా గోష్టులు చేస్తూ వుండే వారి కంటే, ముట్టడి స్థలాలలో ముఖద్వారం వద్ద గల సభా వేదిక వద్దకు వచ్చి రైతు నేతల ప్రసంగాలు ఆలకించే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. నేడు ఆ సంఖ్య & వారి శాతం చాలా వరకు తగ్గింది.

G -నాడు గడ్డకట్టే చలిలో సైతం ఉదయం సుమారు 10 గంటల నుండి సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు సభా వేదికలపై రైతు ఉద్యమ నేతల ప్రసంగాలు సాగేవి. నాటి కంటే వాతావరణం సభా నిర్వాహణ కు నేడు అనుకూలంగా ఉంది. (నాటి గడ్డకట్టే చలి నేడు లేదు) అయితే సభల నిర్వహణా కాలం మాత్రం తగ్గింది.

H -నాడు కూడా దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడ్డ మానసిక భావం ఉద్యమకారుల్లో ఉంది. అది కొత్తదేమీకాదు. ఐతే మోడీ ప్రభుత్వం చర్చల ద్వారా ఏదేని పరిష్కారం చేయొచ్చనే చిన్న ఆశ కూడా మనస్సులలో దాగి ఉండేది. నేడు అట్టి ఆశ లేదు. దీర్ఘకాలిక పోరాటం తప్ప మరో స్వల్పకాలిక పరిష్కారానికి అవకాశం లేదనే భావం వారి మనస్సులలో స్థిరపడింది.

I -నాటి మా నలుగురి బృంద పర్యటనకీ నేటి సౌత్ ఇండియా భారీబృంద పర్యటన కీ మధ్య రిపబ్లిక్ డే సరిహద్దుని గీసింది. అది కేవలం క్యాలెండర్ లో తేదీ మార్పు కాదు. రైతాంగ ఉద్యమ గమనంలో అదో పెద్ద మలుపు. అది రైతాంగ ఉద్యమ శక్తులలో మానసిక, రాజకీయ మార్పులకి గీసిన సరిహద్దు రాయి కూడా! ముట్టడికారుల మనసుల్ని లోతుగా తరచి చూస్తే, జనవరి 26 తర్వాత అతడి మనస్సు గుణాత్మకంగా మారింది. నేటి ముట్టడికారుడు నాటివలెనే లేడు. నేడు నూతన రైతాంగ ఉద్యమ కారుడుగా అతడు రూపొందాడు.

నాటికీ, నేటికీ మధ్య నేను స్థూలంగా గమనించిన కొన్ని తేడాల్ని పేర్కొన్నాను. వీటిలో A నుండి G వరకు వస్తుగత, భౌతిక (objective) తేడాలు కాగా, H & I అనే చివరి రెండూ స్వీయాత్మక లేదా మానసిక (subjective) తేడాలుగా భావించవచ్చు.

నా వ్యక్తిగత పరిశీలనకి పలు పరిమితులు ఉంటాయి. ఈ నా పరిశీలనలో ఎన్ని పరిమితులు ఉంటే, నా నిర్ధారణలలో కూడా అదే స్థాయి కొరతలు ఉండటం సహజమే. ఈ పరిమితులకు లోబడ్డ విశ్లేషణగా మిత్రులు భావించాల్సి ఉంటుంది. నాది సంపూర్ణ లేదా సమగ్ర పరిశీలన గా భావించవద్దని మిత్రులకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా.

నాటికీ, నేటికీ మధ్య పైన పేర్కొన్న బోర్డర్లలో నా దృష్టికి వచ్చిన లేదా నేను మధించి, శోధించి, గ్రహించిన తేడాలను పైన పేర్కొన్నా. మా బృందంలో అప్పుడూ ఇప్పుడూ పాల్గొన్నది రాయల చంద్రశేఖర్ (తెలంగాణ AIKMS నేత), నేను ఇద్దరం మాత్రమే. మా ఇద్దరికీ తప్ప మిగిలిన మా బృందంలోని తెలుగు కామ్రేడ్స్ కి ఈ తేడాలు చెవులతో వినడం ద్వారా తప్ప కళ్ళతో చూడటం ద్వారా తెలిసే అవకాశంలేదు. స్వయంగా కళ్ళ తో చూసి, ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉండటం వల్ల నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా.

రైతాంగ ఉద్యమం పట్ల రాజకీయ నిబద్ధత లేదా ప్రేమ లేదా సానుభూతితో పై బోర్డర్లని సందర్శించే సంఘీభావ లేదా సందర్శక బృందాలు, వ్యక్తుల్లో ఎవరైనా ఇలాగే రెండుసార్లు చూస్తే, సహజంగా ఉద్యమ ఉధృతి మొదటి కంటే నేడు కొంత తగ్గిందనే నిర్ధారణకి వచ్చి నిరుత్సాహానికి గురికావచ్చు. పై ముట్టడి ప్రాంతాల్ని తమదైన శైలిలో పరిశీలించే “కార్పొరేట్ మీడియా” మాత్రం ఉత్సాహం పొందే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వ నిఘా వర్గాలకి కూడా ఉద్యమ ఉధృతిలో తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఆ రహస్య నివేదికల్ని జరూరుగా పంపే వీలుంది. ఐతే ఇవి క్షేత్ర స్థాయి నిజాన్ని ప్రతిబింబించే నిర్ధారణలు కాజాలవు.

డిసెంబర్ లో కనిపించిన అలజడి ఫిబ్రవరిలో అక్కడ కనబడడం లేదు. అది నిజమే. కానీ లావా ఎగిసిపడే ముందు అగ్నిపర్వతం ఉలికి పడదు. అది “మౌనం” దాల్చుతుంది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడే ముందు భూమిమీద చెట్ల కొమ్మలు టపటప లాడవు. వాయు పవనాలు వీయవు. తుఫాను ముందు ప్రశాంతత ఓ ప్రకృతి నియమం. అది రేపటి నిజమో, కాదో భవిష్యత్తుకు వదిలేద్దాం. చరిత్రకి వదిలేసే విషయాలపై మనం జోస్యం చెప్పడం సముచితం కాదు. కానీ, నా కళ్ళకు (ముఖ్యంగా నా మనసుకు) మాత్రం అక్కడ రేపటి రైతాంగఉప్పెనకి ముందు పరిస్థితి కనిపించింది. అక్కడ జనభాగస్వామ్యం, కదలిక, సభల తీవ్రత వంటివి గతం కంటే తగ్గాయంటే, రేపటి రైతాంగ ఉద్యమ తీవ్రత, సాంద్రత, ద్రృఢత్వం మరింత పెరుగుతున్నాయనే భావన నాకు కలిగింది. నాకు కలిగిన ఈ భావనల్ని తరువాయి భాగంలో వివరిస్తాను..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here