భవనాల అప్పగింత మీద ఇఫ్తార్ లో ఒప్పందం కుదిరిందా?

(టి లక్ష్మినారాయణ*)

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నిరుపయోగంగా హైదరాబాదులో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పంగించడం పట్ల ఎలాంటి అభ్యంతరం ఉండాల్సి అవసరం లేదు. కానీ, విభజన చట్టంలోని అంశాల అమలు నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే పక్షపాతంతో వ్యవహరించినట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవుతుంది.

2. గవర్నర్ తనకున్న విస్తృతాధికారాలను వినియోగించుకొని ఉత్తర్వులు జారీ చేసినట్లు, ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛీప్ సెక్రటరీతో మాట్లాడినట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. అదే నిజమైతే ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ర ముఖ్యమంత్రితో ఎందుకు సంప్రదించలేదన్న ప్రశ్న ఉద్భవిస్తుంది.

3. గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ ప్రత్యేకంగా గంట పాటు సమావేశమైనారన్న వార్తలు వచ్చాయి. భవనాల అప్పగింతకు సంబంధించి ఆ సమావేశంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులపై ఉన్నది.

4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన భవనాలకు సంబంధించి విలువ కట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన వాటాను అడగబోతున్నట్లు ప్రసారమాధ్యమాల్లో అనధికారిక వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత కల్పించాల్సి ఉన్నది.

5. రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. విభజన చట్టంలో పొందుపరచిన మేరకు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిథులను సమకూర్చాలి. ఇప్పటి వరకు కేవలం రు.1500 కోట్లు మాత్రమే మంజూరు చేసి, మరో వెయ్యి కోట్లు ఇస్తామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నది.

6. ఈ నేపథ్యాన్ని గమనంలో ఉంచుకొని విజ్ఞతతో సహజ న్యాయ సూత్రాలను పరిగణలోకి తీసుకొని, రాజకీయాలకు అతీతంగా, గవర్నర్ ఉత్తర్వులపై ఆలోచించాలి.

7. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షెడ్యూల్ – 9 పద్దు క్రింద ఉన్న 89 సంస్థల ఆస్తుల విలువ రు.1,58,508 కోట్లు, షెడ్యూల్ -10 పద్దు క్రింద పేర్కొనబడిన 142 సంస్థల ఆస్తుల విలువ రు. 38,773 కోట్లు, మొత్తం దాదాపు రెండు లక్షల కోట్ల విలువ చేసే ఉమ్మడి ఆస్తుల పంపకం సుప్రీం కోర్టు ఉన్నత విద్యా మండలికి సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సి ఉన్నది.

8. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన రు.33,478 కోట్ల అప్పు సమస్య రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగానే ఉన్నదని, వడ్డీల భారం ఆంధ్రప్రదేశ్ పై పడుతున్నదని గత ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అదే నిజమైతే తక్షణం పరిష్కారం కావాలి.

9.డిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనం విభజన అంశం ఒక కొలిక్కి రాలేదు.

10. విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

11. విభజన చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాల్సి ఉన్నా ఇంకా హైదరాబాదు కేంద్రంగానే పని చేస్తున్నది.

12. గవర్నర్ ఉమ్మడి రాజధాని నుండే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

13. నదీ జలాల సమస్య మరింత సంక్లిష్టంగా మారింది.

14. పోలవరంపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసు పెండింగ్ లోనే ఉన్నది.

15. ఈ పూర్వరంగంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమగ్రంగా చర్చలు జరిపి, ఒక అంగీకారానికి వచ్చిన మీదట ఈ తరహా నిర్ణయాల అమలుకు పూనుకొని ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య మరింత సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పడానికి, మైత్రి భావంతో కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి దోహదపడేది.

 

(*టి.లక్ష్మీనారాయణ, పేరున్న సామాజిక, రాజకీయ విశ్లేషకుడు. హైదరాబాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *