Home Features కృష్ణా వరద నీరు కరువు సీమకు అందకుండా అడ్డుకోవచ్చా?: మాకిరెడ్డి

కృష్ణా వరద నీరు కరువు సీమకు అందకుండా అడ్డుకోవచ్చా?: మాకిరెడ్డి

292
0
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను కరువు సీమకు అందించే ఉద్దేశ్యంతో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అక్కడ పార్టీలు ఒక్కటై ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నాయి. ఏపీలోని రాజకీయ పార్టీలు తగిన రీతిలో స్పందించడం లేదు. ఎప్పటిలాగే రాయలసీమ ప్రజలు మౌనంగా ఉన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేపద్యం….
ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం రాయలసీమ ప్రాంతంలో పుడుతున్న ప్రతి 100 మంది పిల్లలలో 50 మంది నీటి కారణంగా బలహీనంగా పుడుతున్నారు. సీమలో ఉపాధి లేక లక్షల మంది వలస కూలీలుగా మారిన స్థితి కరోన మనముందు ఉంచింది. పోనీ రాయలసీమలో నీటి లభ్యత లేదా అంటే ప్రతి ఏటా 1100 టీఎంసీల నీరు సీమ ముఖద్వారం నుంచి వెళుతుంది. నీరు ఉండి ఉపయోగించుకోలేక నీటి సమస్య గురించి ఆందోళన చెందే ప్రాంతం రాయలసీమ మాత్రమే. సమస్య నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు లేకపోవడం. ఉన్న కొద్దీ పాటి ప్రాజెక్టులకు సత్వరం సరఫరా చేసేందుకు సరిపడ కాల్వల నిర్మాణం లేకపోవడం. ఈ నేపద్యంలో వచ్చిన ఆలోచనే రాయలసీమ ఎత్తిపోతల పథకం.

కృష్ణా నది మీద ఆంధ్ర ‘లిఫ్ట్’ చెల్లదు, ఆడ్డుకుంటాం: కెసిఆర్ శపథం

రాయలసీమ ఎత్తిపోతల పథకం…
రాయలసీమ జిల్లాలకు నీరు అందించే కీలక ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలంటే పోతిరెడ్డిపాడు ద్వారానే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉంటుంది. నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఎత్తులో నీటి లభ్యత ఉండాలి. జీఓ 69 ప్రకారం నీటి మట్టం 834 కి కుదించారు. మరో వైపు వరదలు వచ్చినపుడు కూడా రోజుకు నాలుగు టీఎంసీల నీరు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. వాటిని ప్రాజెక్టులకు తరలించే కాల్వల నిర్మాణం సరిపడరీతిలో లేవు. ఫలితం 2 నెలల వరద 1500 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి కిందకు విడుదల చేసినా 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న సీమలో నింపింది 60 , 70 టీఎంసీల నీరు మాత్రమే. రాయలసీమ ఉద్యమం చాలా కాలం నుండి చెపుతుంది పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం తదనుగుణంగా నిర్మాణం చేయాలని. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
వాస్తవానికి రాయలసీమకు అన్నీ కలిపి131 టీఎంసీల నీటి హక్కు ఉంది. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచినా కూడా వరదల సమయంలో పూర్తి హక్కును వాడుకోలేము. ప్రత్యేకించి సముద్రం పాలు అవుతున్న నీటిని వాడుకునే అవకాశం లేదు. అలాంటి సమయంలో సిద్దేశ్వరం సమీపంలో శ్రీశైలంలో 800 – 854 అడుగుల మధ్య రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు కు డైవర్షన్ స్కీమ్ తో బనకచర్ల కు వెళ్లే దారిలో 6వ కిలోమీటరు వద్ద కలుపుతారు. శ్రీశైలంలో 800 – 854 అడుగులు మధ్య ఉండే నీటి విలువ 60 – 80 టీఎంసీలు మాత్రమే ఈ మొత్తం కూడా నూతనంగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలింపు సాధ్యమేనా ? కాదు ఎందుకంటే ఎత్తిపోతల ఉద్దేశ్యం 3 టీఎంసీలు కానీ ఇది 854 అడుగులు ఉన్నపుడు లిఫ్ట్ చేసినట్లుగా అంతకన్నా దిగువ ఉన్నపుడు సాద్యం కాదు. మరీ ముఖ్యంగా శ్రీశైలం నుంచి కుడి , ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూనే ఉన్నారు. మొత్తం నీరు రాయలసీమ కు తరలిస్తారు అన్న విమర్శ సరికాదు. వరదలు ఉండి సముద్రంలోకి విడుదల చేసే సమయంలో ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ చర్య వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం జరగదు.
అనుమతులు లేవు – నీటి దోపిడి
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు అంటున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అర్థం లేని ఆరోపణలు
రాయలసీమలో నీటి దోపిడీ జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం , నేతలు తరచూ చేస్తున్నారు. రాయలసీమకి 131 టీఎంసీల నీరు హక్కు ఉన్నప్పటికి తీసుకుంటున్న నీరు సగం మాత్రమే ఇక నీటి దోపిడీకి అవకాశం ఎక్కడ ఉన్నది. అనుమతులు గురించి మాట్లాడుతున్న తెలంగాణ నేతలు పాలమూరు , దిండికి అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తున్నారు. ఏ అపెక్స్ కమిటీ తీర్మానం మేరకు కాళేశ్వరం నిర్మించినారు సమాధానం లేదు. నేడు ఏపీకి 512 టీఎంసీల నీటి హక్కు కృష్ణలో ఉన్నది. పోతిరెడ్డిపాడు , సాగర్ వద్ద నీటి కొలతకు సంబంధించిన తెలిమిటర్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎపి తెలంగాణ వాడుకుంటున్న ప్రతి నీటి చుక్క లెక్కించడం జరుగుతుంది. అలాంటి సమయంలో నీటి దోపిడీకి ఆస్కారం ఎక్కడిది.
CWC కీలక పరిశీలన….
కృష్ణా నది వరద ఉధృతి పై CWC కీలక అంచనాను కూడా పరిగణలోకి తీసుకోవాలి
ఒక పరిశీలన మేరకు ప్రకృతి వైపరీత్యాలు తరచు సంభవించే అవకాశం ఉంది. కృష్ణలో 20 లక్షల క్యూసెక్కుల పైగా వరద వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో రిజర్వాయర్ ల భద్రత రీత్యా కూడా డైవర్షన్ ఏర్పాట్లు ఉండాలి అని పేర్కొన్నది. అందుకు శ్రీశైలం సిద్దేశ్వరం మధ్య ప్రాంతం అనువైనది అన్నది వారి అంచనా. నేడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇందుకు దోహదపడుతుంది. రాయలసీమ అవసరాలకు అనుగుణంగా వరద ఉధృతిని తట్టుకోవడం , రాష్ట్ర కేటాయింపులకు అనుగుణంగా నిర్మాణం చేయడం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల జరగదు.

కర్నూలు మూడేళ్ల పాప కరొనా సాహస గాథ

కృష్ణా నది తెలంగాణ రాయలసీమ మధ్య ప్రవహిస్తోంది. దక్షిణ తెలంగాణ , రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రెండు ప్రాంతాలు పరస్పర సహకారంతో ప్రాజెక్టులను ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో నిర్మించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వెనుకబడిన ప్రాంతాల మధ్య విభజన వాదాలు తెస్తే పార్టీలకు లాభం జరగవచ్చు గాని రాయలసీమ , దక్షిణ తెలంగాణ ఇప్పటికే నష్టపోయిన నిజాలను నేతలు గుర్తించాలి. రెండు ప్రాంతాల ప్రజలు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. తరతరాలుగా నీళ్లు ఉన్నా వాడుకోకుండా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం కోసం అడుగు ముందుకు వేశారు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలవాలి. తెలంగాణ ప్రభుత్వం, నేతలు రాయలసీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసత్య ప్రచారాలను తిప్పి కొట్టి సీమ సమాజానికి వాస్తవాలను తెలిపి చైతన్య పరచాల్సిన బాధ్యత రాయలసీమ మేధావుల పై ఉన్నది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి.)