పాజిటివ్ థింకింగ్ అంటూంటారు, ఏంటది? నాలుగు ముక్కల్లో చదవండి

(సిఎస్ సలీమ్ బాషా)
ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్ జీవితం చాలా మటుకు దుర్భరంగా గడిచింది. అయితే ఎప్పుడు వ్రాయటం ఆపలేదు. ఎన్నో గొప్ప రచనలు చేశాడు. బీదరికాన్ని పట్టించుకోలేదు. చిన్నప్పుడు ఒకసారి ‘లండన్ కైట్ ఫెస్టివల్’ (గాలిపటాల పండగ) లో పాల్గొనడానికి వెళ్ళాడు. తన దగ్గరున్న ఏకైక గాలిపటం( అది కొంచెం చిరిగి పోయింది) తీసుకొని వెళ్ళాడు.
Charles Dickens
అక్కడ బాగా డబ్బున్న కుర్రవాడు డికెన్స్ గాలిపటాన్ని చూసి హేళన చేస్తూ,” ఆకాశంలో ఎగిరేయటానికి నా దగ్గర బోలెడు గాలిపటాలు ఉన్నాయి” అన్నాడు. అప్పుడు తన దగ్గరున్న ఏకైక గాలిపటాన్ని పొదివి పట్టుకుని ” నా దగ్గర ఒకటే గాలిపటం ఉంది, కానీ, దాన్ని ఎగిరేయటానికి బోలెడు ఆకాశం ఉంది” అని ధీమాగా చెప్పాడు. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు.
థామస్ అల్వా ఎడిసన్ గురించి తెలియని వారుండరు. ఎన్నో వేల సార్లు ఫెయిల్ అయిన తర్వాత బల్బ్ కనుక్కున్న ఎడిసన్ ను ఎవరో అడిగారు ” మీరు బల్బు కనుక్కోవడానికి ముందు కొన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యారు కదా” అని. అప్పుడు ఎడిసన్ నవ్వి ” నేను బల్బు తయారు చేసే పద్ధతి ఒకటి కనుక్కున్నాను, ఎలా తయారు చేయలేము అన్న పద్ధతులు కొన్ని వేలు కనుక్కున్నాను!” అన్నాడు. పాజిటివ్ థింకింగ్ కి మరో ఉదాహరణ ఇది.
Thomas Alva Edison (credits Biography.com)
“పాజిటివ్ థింకింగ్”. ఈమధ్య తరచూ వినబడుతున్నమాట. పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్ గా ఆలోచించక పోవడం కాదు. అంతకన్నా ఎక్కువ. అదో వ్యక్తిత్వ వికాస విషయం. ప్రతి విషయాన్ని పాజిటివ్ తీసుకోవడం అన్నది వ్యక్తిత్వ వికాసం లో చాలా ముఖ్యమైన అంశం. ఏం జరిగినా మన మంచికే అని అనుకోవడం, దాంట్లో ఒక భాగం. “గీత”లో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం కూడా అదే! అంతా మనమంచికే అనుకోవడం. పాజిటివ్ థింకింగ్ అన్నది ఒక ఆరోగ్యకరమైన, ఆశావాద దృక్పథం (attitude). దానివల్ల జీవితంలో నిరాశా నిస్పృహలకు చోటుండదు. అది ఏ వ్యక్తికైనా, ఏ రంగంలో అయినా విజయాన్ని సాధించడానికి పనికొచ్చే ఒక పరికరం. పాజిటివ్ గా ఆలోచించడం చాలా గొప్ప విషయం ఏమీ కాదు కాదు. అది చాలా సింపుల్ విషయం. దాన్ని కామన్ సెన్స్ అని, లోకజ్ఞానం అని కూడా అనవచ్చు. పాజిటివ్ గా ఆలోచించే వాళ్లకి గా అద్భుతమైన తెలివితేటలు ఉంటాయని అనుకోవడం కూడా పొరపాటు. తెలివితేటలకి పాజిటివ్ థింకింగ్ కి సంబంధం లేదు. పాజిటివ్ గా అలోచించే వారు ఎదుటి వాళ్ళని కూడా పాజిటివ్ గానే చూస్తారు.
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతోమంది వ్యక్తిత్వాలను గమనిస్తే అందరికీ పాజిటివ్ దృక్పథం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పాజిటివ్ దృక్పథంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను, కష్టాలను, ఎదుర్కోవడం నల్లేరు మీద నడకే! గొప్ప స్థాయికి ఎదిగిన ఎవరి జీవితాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది.
అయితే పాజిటివ్ దృక్పథం పెంపొందించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభం కాదు, అలాగని పెద్ద కష్టం కూడా కాదు. పిల్లలకు చిన్నతనం నుంచే ఈ రకమైన దృక్పధాన్ని అలవాటు చేయడం తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఒక మనిషి పాజిటివ్ గా లేదా నెగిటివ్ గా ఆలోచించడానికి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, చదువు అనుభవాలు కారణం కావచ్చు. ప్రతి మనిషి చిన్నప్పటినుంచి ఒక రకమైన ఆలోచనా విధానానికి అలవాటు పడటం సహజం. అయితే ఎదిగే క్రమంలో ఆలోచన విధానం మారవచ్చు. పాజిటివ్ గా ఉన్న వ్యక్తి నెగిటివ్ గా మారవచ్చు అలాగే నెగిటివ్ వాతావరణంలో పెరిగిన వ్యక్తి పాజిటివ్ గా మారవచ్చు. నెగిటివ్ గా ఉన్న మనిషి పాజిటివ్ గా మారడం కొంచెం కష్టం కావచ్చు.. కానీ అసాధ్యం అయితే కాదు. అదే పాజిటివ్ గా ఉన్న మనిషి నెగిటివ్ గా మారడం చాలా సులభం. నిరాశా నిస్పృహలు, ఏమీ సాధించలేకపోవడం, పదే పదే వచ్చే సమస్యలు కొంతవరకు మనిషిని నెగిటివ్ దృక్పథం వైపు కనిపించే అవకాశం ఉంది.
ఇప్పుడు ప్రపంచమంతా “కోవిడ్” సమస్యతో సతమతమవుతోంది. లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పాజిటివ్ గా తీసుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అయితే చాలామంది దీన్ని నెగిటివ్ గా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడటం, ఒత్తిడికి గురి కావడం, కొంతమంది నిరాశా నిస్పృహల్లో కి లోకి వెళ్లడం గమనిస్తున్నాం .
ఉదాహరణకి పిల్లలు స్కూల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు! తల్లిదండ్రులకు పిల్లలు తయారు చేయటం అనే పని లేదు. పిల్లలు తల్లిదండ్రులతో గడిపే అవకాశం వచ్చింది. దాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోలేదు. అలాగే కుటుంబం అంతా కొన్ని రోజుల పాటు ఒకే చోట ఉండే అవకాశం కూడా వచ్చింది. దాంతో కుటుంబ సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంది. అలాగే కోవిడ్ కొన్ని విషయాలను మనకు నేర్పింది. కొన్ని పాఠాలు అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా జరగొచ్చు. దానికి మనం సిద్ధంగా ఉండాలి అన్నది మొదటి పాఠం.
చాలామంది నాకు కరోనా వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు. కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది, కోలుకొని హాస్పిటల్ నుంచి హ్యాపీ గా ఇంటికి వెళ్తున్నారు. ఇది ఒక పాజిటివ్ అంశం. ఈ దృక్పథంతో ప్రతి అంశాన్ని చూడగలిగితే జీవితంలో సమస్యలు తీరవు కానీ, సమస్యలను తీర్చుకునే శక్తి వస్తుంది.
ఈమధ్య యువతలో మనం దీన్ని గమనిస్తున్నాం. పాజిటివ్ థింకింగ్ లేకపోవడంవల్ల అభద్రతా భావన ఎక్కువ అవుతుంది. చాలాసార్లు ఆత్మహత్యలు చేసుకోవడం పాజిటివ్ థింకింగ్ లేకపోవడాన్ని సూచిస్తుంది.
పరీక్షలో ఫెయిల్ అవుతే, చాలా మంది విద్యార్థులు కుంగిపోవడం, కొంత మంది ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తున్నాం. ఫెయిల్యూర్ ని కూడా పాజిటివ్ గా తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది. అయితే పరీక్షలు ఫెయిల్ కావడం పాజిటివ్ గా ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఈ ప్రపంచంలో పరీక్షల్లో ఎవరైనా ఫెయిల్ అవుతారు. ఉన్నత స్థాయికి వెళ్లిన చాలామంది ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అయి ఉంటారు. ఫెయిల్ కావడంలో కూడా లాభాలున్నాయి. మొదటి లాభం ఏమిటంటే మళ్లీ పరీక్ష రాయవచ్చు. ఈసారి ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది! రెండోసారి చదువుతారు కాబట్టి ఇంకా ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశం ఉంది! అన్నింటికన్నా ముఖ్యం ఫెయిల్ కావడం అలవాటవుతుంది!! ఇదే పాజిటివ్ థింకింగ్!

ఇక నుంచి సలీమ్ పాజిటివ్ ధింకింగ్ గురించి రెగ్యులర్ గా నాలుగుముక్కలో చిక్కు ముడులు విప్పుతూ ఉంటారు. ఈ పోస్టునచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండంతే…

ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. కాలిఫోర్నియాలో చక్కటి ఉద్యోగం, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఉద్యోగి, ఉద్యోగం పోయింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు! అందరూ ఆశ్చర్యపోయారు. సైకాలజిస్ట్ అతని జీవితాన్ని స్టడీ చేశారు. అతని ఆత్మహత్యకు కారణం,అతను ఇంతవరకు చదువులో కానీ, ఉద్యోగ ప్రస్థానం లో గాని ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు!! ఒక్కసారి ఫెయిల్ కాగానే కుంగిపోయాడు. అదీ విషయం. ఫెయిల్యూర్ ని పాజిటివ్ తీసుకోలేక పోయాడు
పాజిటివ్ థింకింగ్ లేకపోవడం అన్నది మనిషిని నిరాశా నిస్పృహలకు గురిచేయవచ్చు. ఆత్మవిశ్వాసం కొరవడచ్చు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే శక్తి తగ్గిపోవచ్చు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుట్ దీనికి ఒక ఉదాహరణ. అవమానాలు ఎవరికైనా జరుగుతాయి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అన్న విషయం అర్థం చేసుకో లేకపోతే ఇలానే జరిగే అవకాశం ఉంది.
“ప్రతి అవమానం ఒక పాఠం నేర్పుతుంది; అవమానం మర్చిపోవాలి, పాఠం గుర్తుపెట్టుకోవాలి” ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే!
సలీమ్ బాషా
(సిఎస్ సలీమ్ బాషా కౌన్సెలింగ్ సైకాలజీ నిపుణుడు. రాష్ట్రంలో ని పలు ఇంజనీరింగ్ కాలేజీలలో ఆయన పాజిటివ్ ధింకింగ్ మీద ఉపన్యాసాలిస్తుంటారు.హోమియో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఆయన ఫోన్ నెంబర్ :9393737937)