ప్రఖ్యాత సంపాదకుడు పొత్తూరి ఇక లేరు…

ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ ఇక లేరు
ప్రెస్స్అకాడమీ మాజీ చైర్మన్, తొలితరం జర్నలిస్టులలో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఈ రోజు ఉదయం హైదరాబాదు లోని విజయనగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో దివంగతులయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడికి నమస్కరిస్తూ..
ఆయన గురించి క్లుప్తంగా..
పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు. ఐదు దశాబ్దాలుగా పత్రికారంగంలో పనిచేసిన వ్యక్తి. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పలు హోదాలలో పనిచేశారు. ఆంధ్రభూమి పత్రికతో ఆయనకు అనుబంధం ఉంది. ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశారు.
తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి “గొప్పతనం” సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం:
డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగంలో ప్రముఖులుగా నిలిచారు. అనేక పరిణామాలని, మార్పులని చూశారు. ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ పత్రికలతో అపార అనుభందం ఉంది. ఆంధ్ర ప్రభ వార్తా పత్రిక సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు. ఎందరో సాహిత్యకారులకి బాసటగా నిలిచి తద్వార తెలుగు భాషాభ్యున్నతికి కారకులైయ్యారు. వారే డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు. తెనుగు భాషా వికాస దోరణి ఆయన్ను ఎప్పుడూ వీడలేదు. నేటికీ ఆయన తెలుగు సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు.
దాదాపు నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికా చరిత్రను ఆకళించుకుని – నిలువటద్దంగా నిలిచారు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు. నాటి పత్రికా విలువలు ఎరిగిన వారు. నేడు ఈ విలువలు ఎలా మారి పోయాయో, ఏ కారణాల చేత మారిపోయాయో తెలిసిన వారు.
మనుషులలో ఉన్న మంచితనం చూడడం వీరి విశేష గుణం. తిరగేసిన ఏ గ్రంధానైనా అక్షుణముగా ఆకళించుకుని, దానిలో, వ్రాసిన వారిలో ఉన్న మంచిని, రచయిత దోరణిని సైతం విశదీకరించగలరు. తెలుగు సాహిత్యం పట్ల పొత్తూరి వారి నిష్ఠ అపారమైనది. నిశితమైన దృక్కు కలిగి ఉన్న వ్యక్తి. యావత్ తెలుగు పత్రికా చరిత్రనెరిగిన మేటి సంపాదకులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు.
ఓ మేటి పాత్రికేయుడిలో ఉండవలసిన సలక్షణాలన్నీ డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారిలో చూడ వచ్చు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ అంశాలలో అపారమైన జ్ఞానం సంతరించుకున్నారు.
నాటి పత్రికలు విలువలు పాటించేవి. సంపాదకులు నడిపించేవారు. నేడు, పరిస్థితి వేరు. యజమానులే నడిపిస్తున్నారు. పత్రికలను ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతున్నారు. రేటింగులకి ప్రాధాన్యం ఇస్తున్నారు, విలువలు పడిపోయాయి. అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు.
తెలుగు సాహిత్య జగత్తులో గత అరవై యేళ్ళుగా సాగుతున్న కృషిని, పరిణామాలని ఒక్కరి ద్వారా వినాలి అనుకుంటే అది డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అని చెప్పవచ్చు. వారి అనుభవం అపారమైనది. సాహిత్య ప్రియులందరికీ ఆయన అందుబాటులో వుంటారు. సభలలో తరచు పాల్గొంటారు. ఓ మంచి మాట చెబుతారు. అభిమానించి అడిగితే ఔత్సాహిక సాహిత్యకారులకి సైతం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. అనేక పుస్తకాలకి ముందు మాట వ్రాసారు. మల్లాది కృష్ణానంద్ గారి – తెలుగు పెద్దలు – ముందు మాటలో ఇలా వివరించారు : నోబెల్ బహుమతి అందుకున్న సర్ సి వి రామన్ విశాఖపట్టణంలో జన్మించారు. చిన్న తనం అంతా అక్కడే కొనసాగించారు. మద్రాసు హాస్టల్ లో తెలుగు వాళ్ళు ఆయన అరవవాడని, అరవ వాళ్ళు ఆయన తెలుగు వాడని వెలివేశారట. ఇలా దాగి ఉన్న విషయాలను తనదైన రీతిలో సందర్భోచితంగా వ్రాస్తారు. కృష్ణా జి గారి మాటలలో వర్ణించాలి అంటే ఓ వార్త ముక్క ఎలా, ఎక్కడ, ఎప్పుడు వెయ్యాలో భలేగా! తెలసిన దిట్ట.
మరొక ఉదాహరణ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు విద్యార్ధిగా ఉన్నప్పుడు తాను వ్రాసిన పుస్తకమే తనకు పాఠ్య గ్రంధమైంది అని వివరించారు.
జి కృష్ణ గారి అప్పుడు – ఇప్పుడు ముందు మాటలో మరికొన్ని ఆణి ముత్యాలు దొర్లించారు అప్పుడు – ఇప్పుడు తెలుగు తీయదనాన్ని చూపించే గ్రంధం, మన భాష భావవ్యక్తీకరణకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో నిరూపించే గ్రంధం. పత్రికా రచయితలకు మెలకువలు నేర్పే గ్రంధం. ఆద్యంతం ఆసక్తికరంగా చదివించే గ్రంధం. వివిధ జీవన రంగాల విలువలను సంకేతాత్మకంగా చెప్పే గ్రంధం “. ఇలా ఉన్నది ఉన్నటు, అంశంలోని విషయాన్ని, అందులో ఉన్న నిక్షిప్త సారాన్ని చదువరుకలు బోధపడేటట్టు సరళమైన భాషలో చెప్తారు. ఈ నేర్పు, కూర్పు, ఉదార గుణం పొత్తూరి వారి ప్రత్యేకత అని ఘంటాపదంగా చెప్పవచ్చు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెంకటేశ్వరరావు గారికి డాక్టరేట్ పట్టాతో గౌరవించింది.
కొన్ని దశాబ్దాల తెలుగు పత్రికలను డిజిటల్ (ఎలక్ట్రానిక్) రూపంలోకి మళ్ళించి అంతర్జాలం (ఇంటర్ నెట్) మీద అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ పథకం అవిష్కరించారు వెంకటేశ్వరరావు గారు.
నేడు చిన్న (స్థానిక) పత్రికలు చాలా మటుకు అంతరిస్తున్నాయి. వ్యయ ప్రయాసలు చాలా పెరిగి పోయాయి. ఇదొక కారణం. వీటితో పాటు విలువలు, ప్రమాణాలు పరిరక్షిచుకోవడం మరింత కష్టమవుతోందని డాక్టర్ పొత్తూరి వారి ఉవాచ.
మంచిగా చదవడం, వ్రాయడమే కాదు మంచిగా మాట్లాడడం కూడా అవసరం. సంభాషణలు మానసిక వికాసానికి ఎంతైనా తోడ్పడతాయని తన అనుభవ జ్ఞానంతో చెప్పారు వెంకటేశ్వరరావు గారు.
శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఫిబ్రవరి 8, 1934 లో గుంటూరు జిల్లాలోని పొత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్రజనతలో అడుగు పెట్టారు. ఉద్యోగరిత్యా అనేక పదవులను పోషించారు. హైద్రాబాదు, విజయనగర్ కాలనీ, పి ఎస్ నగర్ లో స్థిరపడ్డారు.
రచనలు:
శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు చెప్పారు – ఓ రచయిత మంచి చదువరి అయి వుండాలని. ఇది పొత్తూరి వారి విషయంలో అక్షర సత్యం. వెంకటేశ్వరరావు గారు గొప్ప చదువరి. చదవడంతో పాటు రచయిత సమ కాలీన స్థితి గతులు, భాషా పదజాల ప్రయోగం, రచయిత రచానా నడక, దాని ఉనికి, అందులోని నిక్షిప్త సారం ఇలాటి విషయాలన్ని తెలుసుకుంటారు. ఇవి రచనా కౌశలం పెంపొందిస్తాయి.
ఇవి కాక రచయిత ధోరణి, వారి భావాలు, విషయం తెలిపే విధానం, వారికున్న చింతన ఇలాటి విషయాల్ని కూడా ఆకళించుకుంటారు. ఇది అంత సామాన్య విషయమేమి కాదు. దీనికి “సద్ చింతన” ఉండాలి. అది తప్పని సరి. ఇది పొత్తూరి వారిలో మెండుగా ఉంది.
నియమ నిబద్దతలు కలిగిన అనుభవ యోగ్య భాషా పరిజ్ఞానికుడు. వీటికితోడు విభిన్న క్షేత్ర, రంగ విషయాలు తెలసివుంటే రచనల మీద ఇంకా మంచి పట్టు ఏర్పడుతుంది. ఇవన్నీ సాధించిన వారు వెంకటేశ్వరరావు గారు. రచనలని వాడుక భాషలో వ్రాస్తే అది ప్రజలకు మరింత చేరువవుతుంది. వీటన్నిటి సమ్మేళనం, డాక్టర్ వెంకటేశ్వరరావు గారి రచనలలో కానవస్తాయి.
డాక్టర్ పొత్తూరి గారి రచనలు, సామాన్య భాషలో, సూటిగా ఉంటాయి. వీరి వ్యాసాలు, రచనలు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తాయి. డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి రచనలలో కొన్ని ముఖ్యమైనవిే
*తెలుగు పత్రికలు
*నాటి పత్రికల మేటి విలువలు
*చింతన
*చిరస్మరణీయులు
*కాశీనాధుని నాగేశ్వరరావు
*పారమార్ధిక పదకోసం
చింతన – శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావుగారు వ్రాసిన ఆధ్యాత్మిక సంపాదకీయాల సంకలనం.
చిరస్మరణీయులు – స్ఫూర్తిగా నిలచిన మహనీయుల మీద వ్రాసిన సంపాదకీయాల సంకలనం. ఇవి ఇదివరలో ” ఆంధ్ర ప్రభ ” లో వెలువడ్డాయి. తరువాత పుస్తక రూపం దాల్చాయి.
నాటి పత్రికల మేటి విలువలు – తెలుగులో ఏ పత్రికలు ఏయే భావాలతో పుట్టాయో, ఏమి ప్రత్యేకతలు సంతరించుకున్నాయో, మహనీయులు ఎలా శ్రమించారో ఈ రచనలో వివరించారు.
తెలుగు పత్రికలు – తెలుగు పత్రికల చరిత్రకు అద్దం పట్టేది ఈ గ్రంధం. విషయ అవగాహనతో, పరశోధనా శక్తితో, కృషి, దీక్షా పట్టుదలతో వ్రాసినది ఈ గ్రంధం.
వ్యాస ప్రభ – సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ ఇత్యాది అంశాల మీద అనేక సంకలనాలు తన కలం ద్వారా, సంపాదకీయం ద్వారా ప్రజల ముందుకి తీసుకొచ్చారు. దాదాపు 160 వ్యాసాలు, ఈ సంకలనంలో వెలయించారు.
టి టి డి ప్రచురణలకు సంపాదకుడిగా ఉన్నారు.
పొత్తూరి వెంకటేశ్వరరావు గారికి చాలా కాలం బ్రిటీష్ లైబ్రరి సభ్యత్వం ఉండేది. అంతర్జాల (ఇంటర్ నెట్), లాప్ టాప్ లు అందుకోవడంతో ఇవి వారి సాధనోపకరణాలుగా తయారైయ్యాయి.
ఐదు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు వెంకటేశ్వరరావు గారు. నేటికీ ఆయన తెలుగు భాషాభివృద్ధికి తన వంతు సహాయం నిస్సంకోచముగా అందిస్తున్నారు. ఇలాటి అనుభవ పూర్ణ తెలుగు భాషా విశారధుల ఆవశ్యకత నేడు ఎంతైనా వుంది.
(పొత్తూరి “కి ఐజేయూ, *ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ నివాళి)
ఐజేయూ ఉపాధ్యక్షులు
*అంబటి ఆంజనేయులు*
అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు
*చావా రవి*
*కొండా రాజేశ్వరరావు*
ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు
*నిమ్మరాజు చలపతిరావు*
*ఆర్ వసంత్*