చాలా మందికి తెలియని జాతీయోద్యమ తెలుగు బెబ్బులి ఇల్లూరు కేశమ్మ

(విద్యాన్  దస్తగిరి)
1920 ఖిలాఫత్ఉద్యమం, సహాయనిరాకరణోద్యమం మొదలుకొని 1930 ఉప్పుసత్యాగ్రహం ,1940 వ్యష్టి సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం, హరిజన దేవాలయ ప్రవేశం, కల్లంగళ్ల ముందు పికటింగు మొదలగు స్వాతంత్య్రోద్యమ  ముఖ్యమైన ఘట్టాలన్నింటిలోనూ అనంత దేశభక్తులు పాల్గొన్నారు.
జిల్లాలోని అన్నితాలూకాల నుండి ప్రజలు పాల్గొన్నారు. కానీ ఇందులో దాదాపు 284 మందికి శిక్షలు పడగా , ఇందులో మహిళలు నలుగురు. ఈ నలుగురూ వ్యష్టి సత్యాగ్రహం , క్విట్ యిండియా ఉద్యమంలో పాల్గొని శిక్షలు పొందినారు. ఒక ముస్లిం మహిళ– శ్రీమతి రాబియాబీ – ఆమెను అరెస్టు చేయలేదు ప్రభుత్వం.
1. ప్రతాపగిరి శాంతాబాయి — వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొని 20-01-1941 నుండి మూడు నెలలు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించినారు.
2. కరణం ఉమబాయమ్మ (కల్యాణదుర్గం తాలుకా శెట్టూరు గ్రామం) —వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిందని ప్రభుత్వం శిక్ష వేసింది. 25-01-1941 నుండి మూడు నెలలు వేలూరు, కడలూరు జైళ్లలో శిక్ష అనుభవించినారు.
3. వెంకమ్మ —క్విట్ యిండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 28-01-1943 నుండి ఆరు నెలలు వెల్లూరు జైలులో శిక్ష అనుభవించినారు.
4. ఎక్కువ శిక్ష పొందిన మరో దేశభక్తురాలు ఇల్లూరు కేశమ్మగారు.
Illuru Kesamma
కేశమ్మ 01-05-1916లో అనంతపురం ఇల్లూరు గ్రామంలో జన్మించినారు. తండ్రి అయితరాజు నరసప్ప. తల్ల్లి లక్ష్మమ్మ . నరసప్పగారు ఇల్లూరు కరణం. కేశమ్మ చెల్లెలు రాజమ్మ. (వీరు అనంతపురం జిల్లా కమ్యూనిస్టుఉద్యమ నిర్మాతలలో ఒకరైన  ఐదుకల్లు సదాశివన్ గారి సతీమణి.) తమ్ముడు సుందరయ్య. నరసప్ప గారికి , నీలం చిన్నపరెడ్డిగారికి మంచి స్నేహం వుంది. నీలం చిన్నపరెడ్డి గారు , తరిమెల సుబ్బారెడ్డిగారు గాంధీ గారి ప్రభావంతో ఇల్లూరు, తరిమెల గ్రామాలలో కల్లంగళ్ళు లేకుండా చేసినారు. మంచి పుస్తకాలతో గ్రంథాలయం నిర్వహించే వారు. తమ పిల్లల చదువుల పట్ల చాలా శ్రద్ధ వహించినారు. వీరి స్నేహితుడైన నరసప్ప కూడా తమ ఇద్దరు కూతుర్లనూ చదివింఛినారు. స్వాతంత్య్రో ద్యమం వల్ల మహిళలకు కలిగిన మేలు ఇది. జాతీయోద్యమం స్త్రీలను కుటుంబ పరిధి దాటి విశాలమైన సమాజం లోకి రావడానికి అవకాశం కల్పించింది.
1940 ఏప్రిల్ లో గాంధీ నాయకత్వాన కాంగ్రెసుపార్టీ వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభించింది. యుద్ధాన్ని వ్యతిరేకించమని, అరెస్టులకు సిద్ధం కమ్మని పిలుపు యిచ్చింది. `ఈ సమయానికి కేశమ్మ మదనపల్లిలో ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్నారు. గాంధీగారి పిలుపు అందుకొని చదువు వదిలేసి స్వాతంత్య్ర సమరానికి సిద్ధమైనారు. సత్యాగ్రహం చేసినా ప్రభుత్వంఈమెను అరెస్టు చేయలేదు. అరెస్టే దేశభక్తి కొలతను నిర్ణయిస్తుంది. అరెస్టు అయితే తప్పదాస్యశృంఖలాల
మీద దెబ్బ వేసిన తృప్తి కలగదు. అందుకే మరింత విస్తృతంగా ఉద్యమములో పాల్గొన్నది.
ఆమె ఒంటరిగానే 60 గ్రామాలలో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఒక మహిళ ఇంత అంకిత భావంతో పట్టుదలతో స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడం ప్రజలకు ఆశ్చర్యం , ఉత్తేజం కలిగించింది. ఉద్యమంలో పాల్గొనే మహిళల పట్ల గౌరవం పెరిగింది. ముఖ్యంగా స్త్రీలపై మంచి ప్రభావం
కలుగ చేసింది.
1942 ఆగస్టు 9న గాంధీజీ “క్విట్ యిండియా” నినాదం యిచ్చినాడు. కేశమ్మ ఆమె చెల్లెలు రాజమ్మ  కరపత్రాలు రాసి, కార్బన్ నకళ్ళు తయారు చేసినారు రాత్రంతా మేల్కొని. వాటిని తీసుకొని కేశమ్మ ఒక్కతే తాలుకా కేంద్రమైన “గుత్తి’ కి వెళ్ళింది. అక్కడ డిప్యూటి కలెక్టరు అధికారులతో సమావేశం జరుపుతున్నారు. ఆ సమావేశంలోకి దూసుకొని వెళ్లి, కరపత్రాలు పంచింది. ప్రభుత్వం వెంటనే ఈమెను అరెస్టు చేసి, ఒక నెలవరకు గుత్తి సబ్ జైలులో వుంచింది. విచారణ తర్వాత తొమ్మిది నెలలు శిక్ష విధించింది కోర్టు. 02-12-1942 నుండి 9 నెలలు రాయవేలూరు జైలులో శిక్ష అనుభవించింది కేశమ్మ.
శిక్షా కాలం పూర్తి అయిన తరువాత 1943 లో తిరిగి వచ్చింది.
బెంగాల్ కరువు ఫోటో
 ఆ సమయంలో బెంగాల్ లో భయంకరమైన కరువు వుంది. ల్లక్షలాది మంది స్త్రీ, పురుషులు . పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. జైలు నుండి రాగానే బెంగాల్ కరువు గురించి తెలుసుకొని చలించి పోయింది. తన చెల్లెలు రాజమ్మను తోడుతీసుకోంది. అలాగే సంఘ సేవకురాలు హట్టిపిళ్ళెమ్మ(అనంతపురం ) పుల్లమ్మ(ఛాయాపురం) గార్ల సహాయం తీసుకొని జిల్లాలోని అనేక ప్రాంతాలుతిరిగి, సుమారు నాలుగువేల రూపాయలు వసూలు చేసి సహాయనిధికి పంపినారు.
శారదా సమాజం అనంతపురం జిల్లాలోని మొదటి మహిళా సమాజం.1920 తొలి నుండే మహిళలకు కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది. జిల్లా ఉన్నతాధికారుల సతీమణులు– అంటే జిల్లా కలెక్టరు. డిప్యూటి కలెక్టరు ,ఎస్.పి, జిల్లా జడ్జి, ఆసుపత్రి సర్జన్, ఇన్స్పెక్టరు, ప్రొఫెసరు, ఇంజనీరు, వకీలు – వీరి సతీమణులు -–వీరే శారదా సమాజ నిర్వాహకులు.
శారదాసమాజానికి మూడో రోడ్డులో సొంత కార్యాలయం వుంది. రోజూ మహిళలు సమావేశం అయ్యేవారు. స్త్రీలకు కుట్టుపని మొదలగు చేతి పనులు నేర్పే వారు. ప్రతి శుక్రవారం ఎవరో ఒకరు ఏదోఒక విషయముపైవ్యాసాలు చదివేవారు. చర్చలు జరిగేవి. ‘శారదామునిసిపల్ ఉన్నత పాఠశాల” శారదా సమాజం ప్రారంభించిందే. ఈ సమాజం గ్రంథాలయం కూడా నిర్వహించేది. కేశమ్మ గారు 1944 నుండి 1945
వరకు గ్రంథాలయ బాధ్యతలు తీసుకున్నారు. స్త్రీలలో పఠనాభిలాషను పెంచడానికి కృషి చేసినారు.
వార్ధాలో “ నయీతాలిం” సంఘంలో నూతన విద్యాబోధనలో శిక్షణ పొందటానికి ఆంద్ర ప్రాంతం నుండి ఎనిమిది మంది మహిళలు ఎన్నికైనారు. అందులో కేశమ్మగారు ఒకరు. ఆమె వార్ధా వెళ్లి ఒక సంవత్సరం శిక్షణ పొందినారు. మహాత్మా గాంధీ , రాజేంద్రప్రసాద్, అరుణా అసఫ్ అలీ , సుచేతా కృపలానీ , అమృత కౌల్ , జాకీర్ హుస్సేన్ , వినోబాబావే మొదలగు వారు అక్కడ ఉపన్యాసాలు యిచ్చినారు, బోధనలు చేసినారు.
1947,1948 రెండు సంవత్సరాలు పెద్దవడుగూరులో అనాథ శరణాలయం నిర్వహించినారు. నిర్వహణకు పెద్ద వడుగూరులో చిన్నారపరెడ్డి గారు సహాయ సహకారాలు అందించినారు.
తరువాత 1949 నుండి రెండు సంవత్సరాలు దుర్గాబాయి ప్రోత్సాహంతో హైదరాబాద్ లో “కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు”లో ఆర్గనైజరుగా పని చేసారు. తరువాత నిజామాబాద్ జిల్లాలో ప్రధానోపాధ్యాయినిగా పని చేసి పదవీ విరమణ చేసినారు.
1975 లో అప్పటి ముఖ్య మంత్రి  జలగం వెంగళరావు గారు అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా అనంతపురంలో కేశమ్మగారిని సన్మానించినారు.
17-03-1991న భర్తను, కూతురును వదలి తనువు చాలించినారు.
ప్రజాసేవ పట్ల తపనతో, అంకిత భావంతో జీవితాంతము కార్యకలాపాలు నిర్వహించినారు. మితభాషి, నిరాడంబర జీవి, ఆదర్శ మూర్తి , స్ఫూర్తి దాత శ్రీమతి ఇల్లూరు కేశమ్మ.
( ఆధారం :- కొంత ముఖాముఖి ద్వారా, కొంత సన్నిహిత బంధువుల ద్వారా సేకరించిన సమాచారం. 12-08-2001 న ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి ప్రసారితం)

 

Vidwan Dastagiri

(విద్యాన్ దస్తగిరి రిటైర్డు టీచర్. నిరంతరపరిశోధకుడు.చరిత్ర విజ్ఞానపు గని. మరుగని పడిన  అనంతపురం జాతీయోద్యమ విశేషాలను వెలుగులోనికి తెచ్చిన వ్యక్తి. ఇలాంటి వాటిలో  ఇల్లూరు కేశమ్మ జీవితం ఒకటి)