ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి చుట్టూర ఎన్ని వింతలో. ఎన్నోచారిత్రక కట్టడాలు,చరిత్ర పూర్వయుగ అవశేషాలు ఇక్కడ చెక్కుచెదరకుండా నిలబడి తెలుగు ప్రజల సుదీర్ఘ చరిత్రను గుర్తుకు తెస్తాయి. ప్రముఖ రచయిత భూమన్ వీటిని ఒక్కటొక్కటే వెలుగులోకి తెస్తున్నారు. ఈ ప్రాంతాలన్నింటికి ఆయన ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఈ శకలాల వెనక ఉన్న చారిత్రక సత్యాల గురించి చెబుతున్నారు. చిత్రమేమంటే, విలువయిన ఈ చారిత్రక సంపద ఈరోజు అనాథ లాగా పడి ఉంది. వీటిని భద్రపర్చాలన్న స్పృహ కొరవడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇవి చూస్తుండగానే కనుమరుగుతాయి.
కాలభైర గుట్ట గురించి
కాలభైరవ గుట్టను మల్లేశం కొండ అని కూడా పిలుస్తారు. ఇది తిరుపతికి 15. కి.మీ దూరంలో ఉంది.160 అడుగుల రహదారిలో చంద్రగిరి ‘కేఫేడే’ కి ఎడమవైపు డోర్నకంబాల దారిలో ఉంటుంది. ఈ గుట్ట ను ఎక్కేముందు వినాయకుడి ఆకృతి, పాదాలు అబ్బురపరుస్తాయి. కొండపైన ఈ కట్టడం ఆశ్చర్యం, అద్భుతం. చాలా విశాలమయిన గుడి. గుడి పక్కనే కోనేరు, దాని పక్కనే విజయనగర రాజుల నాటి కల్యాణ మంటపం, మంటపం ముందు ఆంజనేయుడి విగ్రహం, గుడికి ఎడమవైపున విశాలమయిన రాతి పరుపు, కుడిపక్కన ఆ రోజుల్లో అంగళ్ల సభా స్థలి చూపరులను ఎక్కడికో తీసుకువెళ్తాయి.
నేను ఈ గుట్టమీదకు వెళ్లడం 16వ సారి. ప్రతిసారి నాకు కొత్తగానే అనిపించే వైభవం. దారెంట ఆనాటి రాతి దీప దారి. ఆగుతూ చూస్తే చంద్రగిరి కోట, ఉప్పుసట్టి, పప్పుసట్టి, ఉరికంబం , చూసినంతా తనివితీరని అనుభవం. ఆరోజుల్లో రాజులు రాణులు నడిచిన దారిలో నడుస్తుండటం అప్పటి రాజులు ఎలా ఉండేవారని నెమరేసుకోవడం… అదో అద్భత చారిత్రాత్మక అనుభూతి.
రాతిపరుపు నుంచి చూస్తే తాటికోన శివాలయం, మల్లయ్యపల్లె పాండవ గుడి, డోర్నకంబాల గుట్టలు, చంద్రగిరి కోట, ఉరికంబం, శేషాచల శిఖరం, స్వర్ణ ముఖినదీ పరీవాహక ప్రాంతం కనువిందుచేస్తాయి. అక్కడక్కడ పడిపోయిన రాతి స్తంభాల పైన చెక్కిన తమిళ శాసనాలు చరిత్ర కెక్కని ఎన్నో సంగతులు చెబుతాయి. అద్భుతమయిన కాలభౌరవ గుట్ట ఈనాడు అనాథ.
Pictures: Bhooman
MORE TREKKING IN SESHACHALM HILLS, TIRUPATI ANDHRA PRADESH