రైలు కూత సౌండ్ పెంచుతున్నారు, అసలు రైలు కూతలెన్నిరకాలో తెలుసా?

(TTN Desk)
రైలు పట్టాల మీద ప్రమాదాలెక్కువగా జరుగుతూ ఉండటంతో రైలు కూత (horn) ధ్వని పెంచాలని భారత రైల్వేస్ భావిస్తున్నది. ఎలెక్ట్రిక్, డీజిల్ ఇంజిన్ల సౌండ్ ఇంటెన్సిటీ ఇక ముందు బాగా పెరుగుతుంది. ఇంతవరకు రైలు కూత ధ్వని తీవ్రత 90-95 డెసిబుల్స్ మాత్రమే ఉండింది. దీనికి ఇపుడు 115-125 డెసిబుల్స్ కు పెంచుతున్నారు.  కొన్నిరైళ్ల లో కొత్త సౌండ్ అమలులోకి వచ్చేసింది కూడా.
ఇటీవల సాంకేతిపరిజ్ఞానం పెరిగి, రైలు ఇంజిన్లు తక్కువ శబ్దంతో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎలెక్ట్రిక్ రైలు ఇంజన్లు అంత పెద్దగా సౌండ్ చేయడం లేదు. ఇదే సమయంలో రైలు వేగం పెరిగింది. దీనితో రైలు ఎక్కడో దూరాన ఉందనుకుని రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తున్నవారు ప్రమాదాలకు లోనవుతున్నారు. అందువల్ల ఈ దుస్సాహసికులను అప్రమత్తం చేసేందుకు రైలు కూత ధ్వని పెంచాలని నిర్ణయించారు. ఇపుడు WAP-4,WAP-7, డీజిల్ ఇంజిన్ WDM-3A, గూడ్స్ రైలు ఇంజిన్   WDG-3  కూత ధ్వని పెంచేశారు.
చాలా మంది ఈ మధ్య హెడ్ ఫోన్లను చెవులకు తగిలించుకుని  మెబైల్ ఫోన్లలో మాట్లాడుతూ  పట్టాలను దాటుతున్నారు. ఇపుడున్న ధ్వనితో ఎన్ని సార్లు హార్న్ కొట్టినా  వారి చెవికెక్కడం లేదు. అందువల్ల    రైలు కూత సౌండ్ బాగా పెంచాల్సివచ్చిందని రైల్వే  వారు చెబుతున్నారు.
ఇది సరే, రైలు కూతలు ఎన్నిరకాలో తెలుసా?
రైలు కూత గురించి చాలా మందికి తెలియదు. బస్సులకు, కార్లకు హార్న్ ఉన్నట్లు రైళ్లకు కూడా హార్న్ ఉందని మాత్రమే తెలుసు. అంతకు మంచి రైలు కూత గురించి దాని వెనక అర్థం గురించి చాలా మందికి తెలియదు. అసలు విని ఉండరు కూడా.  మొత్తంగా మన రైళ్లకు 11 రకాల కూతలున్నాయి. రైలు కూతలన్నీ ఒక సమాచారాన్ని ప్యాసెంజర్లకు, రైల్వే సిబ్బందికి చేరవేసే వ్యవస్థ. అంటే రైళ్లకి విజిల్ అండ్ హార్న్ కోడ్ ఉంటుంది. దీని ప్రకారమే రైళ్లు కూత వేయాలి.ఈ కూతలకు కూడా స్పష్టమయిన సింబల్స్ ఉన్నాయి. టెలిగ్రాఫ్ కోడ్ లాగా రైళ్ల విజిల్, హార్న్ కోడ్ లో ఒక పొడవాటి, ఒక పొట్టి హార్న్ కాంబినేసన్  లో ఉంటాయి. వాటి గురించి ఇపుడు చూద్దాం.
  1. స్వల్ప వ్యవధి హార్న్- ఇది రైలును తదుపరి యాత్రకు సిద్ధం చేసేముందునీళ్లతో కడిగి, శుభ్రం చేసేందుకు షెడ్ కు తీసుకువెళ్తారు. ఆసమయంలో వాడే హార్న్ ఇది.
  2. రెండు స్వల్ప వ్యవధి హార్న్ లు – రైలు మోటార్ మన్ (లోకోపైలట్) ఇలా రెండు సార్లు స్వలప్ప వ్యవధి హార్న్ కొట్టారంటే, రైలు కదలడానికి సిగ్నల్ ఇవ్వాలని రైల్వే వారికి చెప్పాలని గార్డ్ కు  గుర్తు చేయడం
  3. మూడు స్వల్ప వ్యవధి  హార్న్ లు- ఇలాంటి హార్న్ లు కొట్టడం చాలా అరుదు. ఇలామూడుసార్లు స్వల్ప వ్యవధి హార్న్ లు కొట్టారంటే రైలే అదుపు తప్పిందని వెంటనే వ్యాక్యూమ్   బ్రేక్ అప్లయ్ చేయమని గార్డ్ ను హెచ్చరించడం.
  4. నాలుగు స్వల్ప వ్యవధి హార్న్ లు- ఇలాంటి హార్న్ ఇచ్చారంటే రైలులో సాంకేతిక సమస్య వచ్చిందని, రైలు ముందుకు పోలేదని అర్థం.
  5. ఒక దీర్ఘకాల, ఒక స్వల్పకాల హార్న్- ఇది గార్డ్ కోసం చేసే హార్న్. రైలు కదలడానికి ముందు బ్రేక్ పైప్ ను సిద్ధం చేయమని అర్థం.
  6. రెండు దీర్ఘ కాల, రెండు స్వల్ప వ్యవధి హార్న్ లు-        ఇక ఇంజిన్ ను కంట్రోల్ లోకి తీసుకోమని గార్డ్  సిగ్నల్ ఇవ్వడం.
  7. హార్న్ ఆగకుండా కొట్టడం ( A continuous horn): రైలు నాన్ స్టాప్ గా చాలా స్టేషన్లను దాటుకుంటూ పోతున్నదని ప్రయాణికులనుకు చెప్పేందుకు ఈ హార్న్ కొడతారు.
  8. కొద్ది సేపు విరామంతో రెండు సార్లు కొట్టే హార్న్- రైలు రైల్వే క్రాసింగ్ దాటుతున్నదని క్రాసింగ్ దగ్గిర ఉన్న ప్రజలను హెచ్చరించడం.
  9. రెండుదీర్ఘకాల, స్వల్పకాల హార్న్ లు- ఇలాంటి హార్న్ ట్రాక్  మారుతున్నపుడు కొడతారు.
  10. రెండు స్వల్ప కాల, ఒక దీర్ఘ కాల హార్న్ లు – ఎవరైనా ప్యాసెంజర్ చైన్ లాగినపుడు లేదా గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ వేసినపుడు ఇలాంటి హార్న్ కొడతారు.
  11. ఆరుసార్లు షార్ట్ హార్న్ – ఇదొక ట్రబుల్ సిగ్నల్.  రైలు ప్రమాదంలో పడిందని చెప్పేందుక ఇలా               ఆరుసార్లు స్వల్ప వ్యవధి హార్న కొడతారు.