తిరుపతి ఘాట్‌రోడ్లో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే! (తిరుప‌తి జ్ఞాప‌కాలు-9)

(రాఘ‌వ‌శ‌ర్మ‌)
క‌పిల తీర్థం రోడ్డు ఎంత సంద‌డిగా ఉండేదో!
ఆ రోడ్లోనే తిరుమ‌ల‌కు వెళ్ళే బ‌స్సులు, వ‌చ్చే బ‌స్సులు.
ఆరోజుల్లో తిరుమ‌ల‌కు ఒక‌టే ఘాట్ రోడ్డు ఉండేది.
తిరుమ‌ల బ‌స్సుల‌న్నీమొద‌టి ఘాట్ రోడ్డులోనే న‌డిచేవి.
ఎదురుబొరుదుగా వ‌స్తున్నా ప్ర‌మాదాలు పెద్ద‌గా జ‌రిగేవి కావు.
చీక‌టి ప‌డ్డాక ఎన్‌జీవో కాల‌నీలో మా మిద్దెక్కి చూస్తే , ఘాట్ రోడ్డు పొడ‌వునా బ‌స్సు హెడ్‌ లైట్ల వెలుగు దీపాలు పెట్టిన‌ట్టుండేది.
దూరంగా మిణుకు మిణుకు మంటూ ఆకాశంలో చుక్క‌ల‌తో పోటీప‌డిన‌ట్టు ఉండేది !
బ‌స్సు లైట్ల వెలుగులో ప‌గ‌టి కంటే రాత్రిపూటే ఘాట్ రోడ్డు మెలిక‌లు స్ప‌ష్టంగా క‌నిపించేవి.
టీటీడీకి ప్ర‌త్యేక ట్రాన్స్‌పోర్టు విభాగం ఉండేది.
ఇత‌ర ప్రైవేటు వాహ‌నాల‌ను కొండ‌కు అనుమ‌తించేవారు కాదు. ఆర్టీసీ బ‌స్సులు అస‌లు వెళ్ళ‌డానికి వీలులేదు
టీటీడీ డ్రైవ‌ర్లంతా ఘాట్ రోడ్డులో బ‌స్సులు న‌డ‌ప‌డంలో బాగా అరితేరిన‌వారు.
కొండ మ‌లుపుల్లో ఏ మాత్రం వేగం త‌గ్గేది కాదు.
తిరుపతి ఘాట్ రోడ్ ములుపులు
ఆ వేగానికి మ‌లుపుల్లో కొంద‌రు యాత్రికులు సీట్ల‌నుంచి ప‌డిపోతే, మ‌రి కొంద‌రు వాంతులు చేసుకునే వారు.
అన్ని మెలిక‌ల్లోనూ డ్రైవ‌ర్లు క‌ళ్లు మూసుకుని న‌డిపిన‌ట్టు ఉండేది.
ఘాట్ రోడ్డులో బ‌స్సు న‌డ‌పడం వారికి న‌ల్లేరుపై న‌డ‌కే!
అలిపిరి నుంచి కొండ‌కు అర‌గంటే! మ‌ళ్ళీ యాత్రికుల‌ను ఎక్కించుకుంటే అర‌గంట‌లో దిగేసేవారు!
కొండ‌కు వెళ్ళే బ‌స్సులు ఇప్ప‌టిలా పెద్ద‌వి కావు.
కాస్త చిన్న బ‌స్సులు . తేలిగ్గా మ‌లుపుల్లో కూడా అదే వేగంతో న‌డిచేవి.

ఇది కూడా చదవండి

నిన్నముళ్ళ కంప‌లు, నేడు ఆకాశ హార్మ్యాలు (తిరుప‌తి జ్ఞాప‌కాలు -7)


తిరుమ‌ల‌కు వెళ్ళే ఏ ఒక్క‌ బ‌స్సు పాలిటెక్నిక్ కాలేజీ ప‌క్క‌నున్న టీటీడీ వ‌ర్క్‌షాపులో చెక్ చెయ్యందే క‌దిలేది కాదు. బ‌స్సు ఎన్నిసార్లు కొండ‌కు వెళితే అన్ని సార్లు బ‌స్సును మెకానిక్‌ చెక్ చేయాల్సిందే. కండీష‌న్‌లో ఉంద‌ని స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిందే.
ఒక్క ప్ర‌మాదం జ‌రిగేది కాదు. బ‌స్సులు చాలా శుభ్రంగా ఉండేవి.
అది 1974. సెల‌వుల‌కు నేను తిరుప‌తి వ‌చ్చాను.
ఒక రోజు సాయంత్రం ఘాట్ రోడ్డులో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే ఆగిపోయాయి.
నిముషాలే కాదు, గంట‌లు కూడా గ‌డిపోతున్నాయి. బ‌స్సులు క‌ద‌ల‌డం లేదు.
డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు ఎక్క‌డ బ‌స్సులు అక్క‌డే వ‌దిలేసి కింద‌కు దిగివ‌చ్చేశారు.
ఘాట్ రోడ్డులో మంచినీళ్ళు కూడా దొర‌క‌క భ‌క్తుల హాహాకారాలు మొద‌ల‌య్యాయి. చీక‌టిప‌డుతోంది.
తిరుప‌తి నుంచి గోలీ సోడా బండ్లు వ‌రుస‌గా ఉరుకులు ప‌రుగుల‌తో ఘాట్ రోడ్డులోకి వెళ్ళిపోయాయి. ఘాట్ రోడ్డులో గుక్కెడు సోడా నీళ్ళు కూడా చాలా ఖ‌రీదైపోయాయి. భ‌క్తుల‌కు తిండి లేదు.
అస‌లు ఎందుకిలా జ‌రిగింది!?
రాష్ట్ర‌వ్యాప్తంగా ఎన్‌జీవోల స‌మ్మె జ‌రుగుతోంది.
రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్‌జీవోలకు ఇచ్చే ప్ర‌యోజ‌నాలు అన్నీ టీటీడీ త‌మ ట్రాన్స్‌పోర్టు సిబ్బందికి కూడా అమ‌లు చేసేది.
టీటీడీ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులు కూడా స‌మ్మెలో పాల్గొన్నారు.
టీటీడీ కార్మికుల‌లో సీఐటీయూ చాలా బ‌లంగా ఉంది.
గోవింద రాజ స్వామి గుడి కోనేరు ద‌గ్గ‌ర ఉన్న తిరుమ‌ల బ‌స్టాండు స‌మీపంలో స‌మ్మె చేస్తున్న కార్మికుల‌పై పోలీసులు విరుచుకు ప‌డ్డారు.
పోలీసు కాల్పుల‌లో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు.
కాల్పుల‌కు నిర‌స‌న‌గా టీటీడీ డ్రైవ‌ర్టు, కండ‌క్ట‌ర్లు ఎక్క‌డి బ‌స్సుల‌ను అక్క‌డే నిలిపి వేసి కిందికి దిగి వ‌చ్చేశారు.
చీక‌టి ప‌డిన చాలాసేప‌టికి కానీ బ‌స్సులు క‌ద‌ల‌లేదు.
తిరుమ‌ల ఆల‌య సిబ్బందికి, టీటీడీ ట్రాన్స్‌పోర్టు సిబ్బందికి మ‌ధ్య అంత‌కు ముందు కూడా ఒక సారి వివాదం చెల‌రేగి ఇలాగే స‌మ్మె జ‌రిగింది.
అప్పుడుకూడా ఇలాగే బ‌స్సులు ఆగిపోయాయి.
టీటీడీ చైర్మ‌న్‌గా చెలికాని అన్నారావు ఉన్నారు.
ముఖ్య‌మంత్రి వెంగ‌ళ‌రావు 1975లో ఎమ‌ర్జెన్సీ విధించారు.
మ‌ళ్ళీ టీటీడీ ట్రాన్స్‌పోర్టు కార్మికుల స‌మ్మె మొద‌లైంది. ప్ర‌భుత్వం స‌మ్మెపై ఉక్కు పాదం మోపింది.
నాయ‌కుల‌నంద‌రినీ అరెస్టు చేసి ముషీరాబాద్ జైలుకు త‌ర‌లించారు.
1975 అక్టోబ‌ర్ 10వ‌ తేదీ అర్ధ‌రాత్రి టీటీడీ ట్రాన్స్ పోర్టు ఆధ్వ‌ర్యంలో న‌డిచే కొండ‌బ‌స్సుల‌ను అర్టీసీకి అప్ప‌గించేశారు.
ఉద్యోగులంతా ఆర్టీసీ కార్మికులు అయిపోయారు.
కానీ, తిరుమ‌ల‌కు వెళ్లే బ‌స్సుల కండీష‌న్ చెక్ చేసే విధానం ఆగిపోయింది.
వాటి శుభ్ర‌త కూడా లోపించింది. పెద్ద పెద్ద ఆర్టీసీ బ‌స్సులను కూడా ఘాట్ రోడ్డులోకి అనుమ‌తించ‌డం మొద‌లైంది.
ఘాట్‌లో బ‌స్సుల‌ను అల‌వోక‌గా న‌డ‌ప‌గ‌ల‌ నైపుణ్యం గ‌ల డ్రైవ‌ర్ల‌ను వేరే వేరే డిపోల‌కు విసిరేశారు
తిరుమ‌ల‌కు కొత్త డ్రైడ‌ర్లు వ‌చ్చారు. ఘాట్‌లో ప్ర‌మాదాలూ మొద‌ల‌య్యాయి.
ఒక ఆర్టీసీ బ‌స్సు అక్క‌గార్ల గుడి వ‌ద్ద నున్న అవ్వాచారి కోన‌లో ప‌డిపోయింది. బ‌స్సులో అంద‌రూ మృతి చెందారు. సీటు కింద ఇరుక్క‌న్న‌ ఒక్క అయిదేళ్ళ బాలిక మాత్రం ప్రాణాల‌తో బైట‌ప‌డింది.

 

బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన అవ్వాచారి కోన
ఆ బాలిక త‌ల్లి ఎవ‌రో తెలియ‌దు. తండ్రి ఎవ‌రో తెలియ‌దు.
ఆ బాలిక‌ను తిరుప‌తి రుయా ఆస్ప‌త్రి న‌ర్సు ఒక‌రు పెంచుకున్నారు.

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *