నాలుగ్గాళ్ళ మండ‌పం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-30)

‌(రాఘ‌వ శ‌ర్మ‌)

తిరుప‌తిలో నాలుగ్గాళ్ళ‌మండ‌పం.

అంటే,  న‌గ‌రం న‌డిబొడ్డున ముఖ్య‌మైన నాలుగు రోడ్ల కూడ‌లి.అలనాటి తిరుప‌తి పంచాయ‌తీకి గ్రామ చావ‌డి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బేల్దారి (భ‌వ‌న‌నిర్మాణ‌) కార్మికుల ఆశల ఊ పిరి. నిరసనలకు, ఆందోళనలకు అడ్డా.

పులికంటి కృష్ణారెడ్డి సాహిత్యంలో శీర్షిక‌గా చోటుసంపాదించుకున్న పురాత‌న రాతి మండ‌పమే ఈ నాలుగ్గాళ్ళ మండ‌పం.

నాలుగ్గాళ్ళ మండ‌పం అంటే, నాలుగు రాతి స్తంభాల‌పైన నిర్మించిన రాతి మండ‌పం.ఆ పేర‌డిగితే తిరుతిలో తెలియ‌ని వాళ్ళుండ‌రు. చెప్పని వాళ్ళూ ఉండరు.

తొలుత బండ్ల‌వీధి మొద‌ట్లోనే ఈ నాలుగ్గాళ్ళ మండ‌పం ఉండేది.

తిరుప‌తి పంచాయ‌తీగా ఉన్న‌ప్పుడు క‌ర‌ణం, మున‌స‌బులు ఇక్క‌డే కూర్చుని జ‌మాబందీ లెక్క‌లు రాసేవారు.

ఇది గ్రామ చావ‌డ‌డిగా శ‌తాబ్దాల‌పాటు కొన‌సాగింది.తిరుప‌తి పంచాయ‌తీ కాస్తా మున్సిపాలిటీగా 136 ఏళ్ళ క్రితం ఏర్ప‌డింది.అప్ప‌టి నుంచి, అంటే 1886 ఏప్రిల్ 1వ తేదీనుంచి ఇది గ్రామ‌ చావ‌డి కాదు.నాలుగ్గాళ్ళ మండ‌పంగా పేరు స్థిర‌ప‌డిపోయింది.

ప్ర‌ముఖ క‌వి గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ఇక్క‌డ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేశారు.

కొన్నేళ్ళ క్రితం వ‌ర‌కు నాలుగ్గాళ్ళ మండ‌పం ఈ కూడ‌లికి తూర్పున బండ్ల‌వీధి మొద‌ట్లో ఉండేది.రోడ్డు విస్త‌ర‌ణ‌లో ద‌క్షిణాన జీకార్ స్ట్రీట్ వైపు, కూడ‌లికి మొదట్లోకి మార్చారు.

ఈ మండ‌పం వెనుక భాగాన వినాయ‌కుడి ఆల‌యాన్ని కూడా నిర్మించారు.ఈ మండ‌పం తొలుత ఉన్న బండ్ల వీధి చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది.వ‌ర్షం వ‌చ్చిందంటే చాలు, ఈ వీధి వెనిస్ న‌గ‌రాన్ని త‌ల‌పించేది.మోకాలు లోతు నీళ్ళ‌లో కాళ్ళ‌ను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళాల్సి వ‌చ్చేది.

ఈ వీధిలోనే ర‌చ‌యిత పులికంటి కృష్ణారెడ్డి నివ‌సించేవారు.ఈ ప్రాంత‌మంటే ఆయ‌న‌కు ఎంత ఇష్ట‌మో!

రాయ‌ల‌సీమ మాండ‌లికానికి ప‌ట్టం క‌ట్టిన పులికంటి కృష్ణారెడ్డి ఆంధ్ర‌ప్ర‌భ‌లో నాలుగ్గాళ్ళ మండ‌పం పేరుతో కొన్నేళ్ళు ఒక శీర్షిక నిర్వ‌హించారు.

అలా ఇది సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకుంది.ఈ మండ‌పానికి తూర్పున బండ్ల వీధిలో వెళితే గ్రూప్ థియేట‌ ర్లూ, బ‌స్టాండు వ‌స్థాయి.మండ‌పానికి ద‌క్షిణాన రైల్వేస్టేష‌న్ క‌నిపిస్తూనే ఉంటుంది.

ఈ వీధిలోనే పురాత‌న గోవింద‌రాజ స్వామి ఆలయం, ఆలయ తేరు ఉన్నాయి.ప‌డ‌మ‌ర‌న ప్ర‌ధాన‌మైన గాంధీ రోడ్డు.ఉత్త‌రాన తిల‌క్ రోడ్డు.

నాలుగ్గాళ్ళ మండ‌పం నుంచి తిల‌క్ రోడ్లోకెళ్ళే ఎడ‌మ మూల వేపు చిన్న జాగాలో ఓ లావాటి వ్య‌క్తి కూర్చునుండేవాడు.

మ‌తి స్థిమితం లేని వారికి నిమ్మ‌కాయ‌లు మంత్రించి ఇచ్చేవాడు.ఆధునిక వైద్యం ఎంత ఎదిగినా, 20, 21 వ శ‌తాబ్దాల‌లో కూడా అత‌నంటే గుడ్డి న‌మ్మ‌కం!

అత‌ను మంత్రిస్తే మాన‌సిక రోగం న‌య‌మ‌వుతుంద‌నేది వారి విశ్వాసం! ద‌శాబ్దాలుగా అత‌న్ని చూస్తూనే ఉన్నాను.

అక్క‌డికొచ్చే అమాయ‌కుల‌ను చూసి ఆశ్చర్య పోతూనే ఉన్నాను.కొన్నేళ్ళుగా అత‌ను క‌నిపించ‌డంలేదు. ఏమ‌య్యాడ‌ని విచారిస్తే పోయాడ‌ని చెప్పారు.

ఇప్పుడ‌క్క‌డ బిగ్‌సీ వెలిసింది.అక్క‌డే తిల‌క్ రోడ్డు వైపు డివైడ‌ర్ పైన ప‌డుకుని ఓ పిచ్చిత‌ల్లి త‌న‌లో తానే మాట్లాడుకుంటూ ఉండేది.ఒక్కొక్క సారి పెద్ద‌గా అరిచేది.

ఆమె ఎవ‌రినీ ప‌ట్టించుకునేది కాదు.ఆ దారిలో పోయే వారెవ‌రు కూడా ఆమెను ప‌ట్టించుకునే వారు కాదు.

ఏళ్ళ‌త‌ర‌బ‌డి ఆమెను చూస్తూనే ఉన్నాను.ఇప్పుడు ఆమె కూడా క‌నిపించ‌డంలేదు.

ఈ నాలుగ్గాళ్ళ మండ‌పం వ‌ద్ద‌ ఎప్పుడూ ర‌ద్దీగానే ఉంటుంది.తిరుపతి లో ఎవరు ఆందోళన చేయాలన్నా ముందు గుర్తొచ్చేది నాలుగ్గాళ్ళ మండ పమే !

ధర్నాలు, రాస్తా రోకోలు చేయాలంటే నాలుగ్గాళ్ళ మండప మే!ఇక్కడ ఆందోళన చేస్తే ట్రాఫిక్ ఆగిపోతుంది.

ఆందోళన బాగా హైలైట్ అవుతుంది.చాలా ఆందోళనలు నాలుగ్గాళ్ళమండ పం నుం చే మొదలవుతాయి.

అలా కాకుంటే, ఇక్కడి వరకు వచ్చి ముగుస్తాయి.నాలు గ్గాళ్ల మండపం దగ్గర లెక్కలేనన్ని ఆందోళనలను చూసాను.

తెల్లారే స‌రిక‌ల్లా బేల్దారీ కూలీలు ప‌నుల కోసం నాలు గ్గాళ్ల మండపం వద్ద నిల‌బ‌డే వారు.ఉద‌యం ఏడు గంట‌ల నుంచి దాదాపు ప‌ది గంట‌ల‌వ‌ర‌కు ప‌నుల కోసం ఎదురు చూసే వారు.కూలీలు వ‌స్తూ వ‌స్తూ మ‌ధ్యాహ్న భోజ‌నం బాక్సుల్లో పెట్టుకొచ్చేవారు.

వారు తెల్లవారు జామునే నిద్ర లేచి వంట చేసుకుని, తయారవు తే కానీ పనులకు రాలేరు.ప‌నుల‌కు ఎవ‌రు పిల‌సుస్తారా అని ఎదురు చూసేవారు.

ప‌ని దొర‌క‌ని రోజు ఉసూరు మంటూ తెచ్చుకున్న అన్నం మూట‌తో ప‌ది గంట‌ల‌కు ఇంటి ముఖం ప‌ట్టేవారు.

ఈ నాలుగ్గాళ్ళ మండ‌పం వ‌ద్దే దాదాపు నాలుగు వంద‌ల మంది కూలీలు ఉండేవారు. వీరిలో ఎక్కువ‌మంది వ‌ల‌స జీవులు.

ప‌నుల కోసం వివిధ ప్రాంతాల నుంచి తిరుప‌తికి వ‌చ్చిన వారు. స్థానికంగా స్థిర‌ప‌డిన కూలీలు, బేల్దారులు పెద్ద‌గా ఇక్కడికి రారు.

స్థానిక కూలీలు బేల్దారి మేస్త్రీ (లేబ‌ర్ కాంట్రాక్ట‌రు)తో ఒప్పందం చేసుకుని, వారితోనే ఉంటూ, వారి ప‌నులకే వెళుతుంటారు.

స్థానిక లేబ‌ర్ కాంట్రాక్ట‌ర్లు కూడా ఎక్కువ సంఖ్య‌లో కూలీలు కావాల్సి వ‌స్తే ఇక్క‌డికే వ‌స్తారు.

ఇప్పుడిస్తున్న కూలీ ప్ర‌కారం మహిళా కూలీకి అయిదొంద‌లు, మ‌గ కూలీకి ఆరు వంద‌లు, బేల్దారు మేస్త్రీకి ఏడు నుంచి ఎనిమిది వంద‌ల రూపాయ‌లు ఇస్తారు.

తిరుప‌తిలో ఉండే బేల్దారి మేస్త్రీలు కొంద‌రు లేబ‌ర్ కాంట్రాక్ట‌ర్లుగా అవ‌తార మెత్తి భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేయిస్తుంటారు. కూలీలు, మేస్త్రీల పై వీరు ప‌ట్టు పెంచుకుంటారు. అవ‌స‌ర‌మైతే కొంద‌రు అడ్వాన్సులు కూడా ఇస్తుంటారు.

వారి కిచ్చే రోజు కూలీలో యాభై నుంచి వంద రూపాయ‌ల వ‌ర‌కు కమీషన్ గా ప‌ట్టుకుంటారు.

అలా ప‌ట్టుకోవ‌డం ఇష్టం లేని కూలీలు స్వ‌తంత్రంగా నాలుగ్గాళ్ళమండపం వద్ద పనుల కోసం ఎదురు చూస్తుంటారు.వీళ్ళంతా అసంఘ‌టి కార్మికులు.ప‌ని దొరికిన రోజు కూలిడ‌బ్బులు వ‌స్తాయి.ప‌ని లేని రోజు అంతే సంగ‌తులు.

నాలుగ్గాళ్ళ మండ‌పం వ‌ద్ద కూలీల వ్య‌వ‌స్థ ఎంత‌గా ప్ర‌సిద్ధి చెందిందంటే.వార్త‌లో చేస్తున్న‌ప్పుడు మా ప‌రిస్థితి ‌ కూడా దాదాపు అలాగే ఉండేది.

ఉద్యోగం ఏ రోజు ఉంటుందో, ఏ రోజు పోతుందో తెలియ‌ని స్థితి. ‘మ‌నం కూడా నాలుగ్గాళ్ళ‌మండ‌పం కూలీలైపోయాం ‘ అనుకునే వాళ్ళం.మిగ‌తా ప‌త్రిక‌ల్లో ప‌రిస్థితి ఇందుకు ఏ మాత్రం భిన్నంగా లేదు.

లాక్ డౌన్ కాలంలో, లాక్ డౌన్ అనంత‌ర కాలంలో ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది.

నాలుగ్గాళ్ళ మండ‌పం కూలీల స్థాయి నుంచి, వాళ్ళే న‌యం అనే స్థాయికి జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి దిగ‌జారింది.

వైకుంఠపురం వద్ద  పనుల కోసం ఎదురు చూస్తున్న కూలీలు

ఇలా ప‌నుల కోసం ఎదురు చూసే కూలీలు ఇప్ప‌డు వైకుంఠ‌పురం ద‌గ్గ‌ర , తిరుచానూరు ఓవ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద‌, లీలామ‌హ‌ల్ సెంట‌ర్‌లో కూడా పెద్ద సంఖ్య‌లో గుమిగూడుతున్నారు.

ఈ నాలుగు చోట్లా కూలీలు దాదాపు వెయ్యిమంది వ‌ర‌కు ఉంటారు.

వీరి వ‌ల్ల నాలుగ్గాళ్ళ మండ‌పం ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య ఏర్ప‌డుతోంద‌ని వీరిని మున్సిప‌ల్ ఆఫీసు వ‌ద్ద‌కు త‌ర‌త‌లించారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ ప్రాంతాల‌న్నీ ఖ‌ళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి.కూలీలు త‌మ‌త‌మ ఊళ్ళ‌కు వెళ్ళిపోయారు.లాక్‌డౌన్ కాలంలో ప‌నులు లేక వీరంతా ఎంత‌ అల్లాడిపోయారో!

మ‌ళ్ళీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయంటే, ఈ కూలీల‌లో మ‌ళ్ళీ బ‌తుకు భ‌యం వెంటాడుతోంది.మ‌ళ్ళీ లాక్ డౌన్ విధిస్తే త‌మ జీవ‌నం ఏం క‌వాల‌ని ఆందోళ‌న చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *