Home Features రెండు రోజులుగా వార్తలన్నీ అజిత్ పవార్ చుట్టే… ఇంతకీ అజిత్ పవార్ కథేంది?

రెండు రోజులుగా వార్తలన్నీ అజిత్ పవార్ చుట్టే… ఇంతకీ అజిత్ పవార్ కథేంది?

111
0
(జింకా నాగరాజు*)
గత రెండు మూడు రోజులగా దేశంలోని న్యూస్ పేపర్లలో, చానెళ్లలో, సోషల్ మీడియాలో  ప్రధానవార్త అయిన వ్యక్తి మహారాష్ట్ర ఉప ముఖమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్.
పూర్తిపేరు అజిత్ అనంత్ రావ్ పవార్. చదివింది ఎస్ ఎస్ సి యే అయినా చాలా కాలంగా ఆయన ముఖ్యమంత్రి పదవి మీద ఆశపెట్టుకుని ఉన్నాడు. ఆయన శరద్ పవార్ పెద్దన్న అనంత్ రావ్ పవార్  కుమారుడు. శరద్ పవార్ కు తానే వారసుడినని ఆయన నమ్మకం.
స్వాతంత్య్రానంతరం అన్ని రాష్ట్రాలోలో వచ్చినట్లు మహారాష్ట్రలో కూడా ఆధునిక రాజవంశాలొచ్చాయి. అందులో శరద్ పవార్ దొకటి. ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి నాయకుడు శరద్ పవారే.చాలా కాలం అయన చెరుకు ప్రాంత రైతుల సాయంతోరాజకీయాలునడిపారు. అలా ఆయన కాంగ్రెస్ లో చాలా అత్యున్నత స్థాయికి వచ్చారు. సోనియాతో విబేధాలొచ్చినపుడు విడిపోయి, కొత్త పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) పెట్టినా ఆయన కాంగ్రెస్ తో సఖ్యంగా ఉంటూ వస్తున్నారు. ఆకుటుంబానికి చెరకు,సహాకార ఉద్యమాలే అండ. శరద్ పవార్ పార్టీ మీద అలిగి కొత్త పార్టీ పెట్టడం ఇదే రొండో సారి మొదటు ఆయన సమాంతర్ అనే పార్టీ పెట్టారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు.
పవార్  కు ఒక అన్న అనంత్ రావు పవార్, ఒక తమ్ముడు రాజేంద్ర పవార్ ఉన్నారు. అనంత్ రావుకుమారుడయిన అజిత్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పవారే. అజిత్ కు ఇద్దరు కుమారులున్నారు. ఇందులో ఒకరు పార్థ పవార్, రెండో కుమారుడు జేయ్ పవార్.
పార్థని రాజకీయాల్లోకి తీసుకురావాలని అజిత్ భావిస్తున్నారు. అయితే, దీనికి శరద్ పవార్ నుంచి పెద్ద గా సపోర్ట్ రావడం లేదని అజిత్ మనుసులో ఉందని చెబుతారు.
దీనికి కారణం, ఆయన మరొక తమ్ముడి కుమారుడయిన రోహిత్ రాజేంద్ర పవార్ ను ప్రోత్సహిస్తున్నాడని అజిత్ అనుమానం. అయితే, ఈ విషయంలో పవార్ పేచీపడటం సాధ్యంకాదు. మనసులో మాత్రం ఆయనకు అసంతృప్తి ఉందని మీడియా లో వార్తొలచ్చాయి.
శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే. పవార్ అమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లారు. ఆమె  లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. అందువల్ల అనారోగ్యం కారణాల వల్ల శరద్ పవార్ క్రియాశీల రాజకీయాలనుంచి వైదొలిగాక ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వారుసుడు తానే నని అజిత్ భావించారు.
2009లో మహారాష్ట్రంలో ఎన్ సిపి- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు ఇక తాను ఉపముఖ్యమంత్రి అని అజిత్ ఆశించారు. అయితే, పవార్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లుతూ ఛగన్ భుజ్ బల్ ను ఉప ముఖ్య మంత్రి చేశారు.వారసత్వం మీద అజిత్ మనుసులో అనుమానపు బీజాలు నాటారు.  2010లో చగన్ రాజీనామా చేశాక మాత్రమే అజిత్ ను ఆపదవికి నియమించారు. దీనితో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ కి తాను ఫస్ట్ చాయస్ కాదని అనుమానం బలపడింది.
అజిత్ జీవితాశయం  మాత్రం ముఖ్యమంత్రి అయి తీరడమే. అయితే, ఎన్ సిపిలో జరుగుతున్న తీరు చూస్తే ఈ కోరిక నెరవేరేలా లేదు. ఆయనలో  ఏమూలో శరద్ పవార్ ఎపుడో ఒకసారి సుప్రియా సూలేని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి ని చేస్తారేమోననే భయమూ, అనుమానమూ ఉన్నాయి. 2006లో సుప్రియా సూలే రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి పవార్ వారసత్వంత తనకురాదేమోననే బెంగ, అభద్రత అజిత్ లో ఎక్కువయింది.
అయితే, ఈ అసంతృప్తిని మీడియా బయటపెట్టడంతో పవార్ స్వయంగా వివరణ ఇస్తూ సుప్రియా ఎపుడూ రాష్ట్ర రాజకీయాల్లోకి రాదని చెప్పాల్సి వచ్చింది.
ఈ మధ్య కుమారుడు పార్ధును రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. అది విఫలమయింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్ద పవార్ ని నిలబెట్టాలన్నారు. ఇది శరద్ పవార్ కు ఇష్టం లేదు. అజిత్ మొండికేయడంతో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అది ఎన్ సిసి కంచుకోట. అయినా పార్దు ఓడిపోయాడు. మరొక వైపు తమ్ముడి కుమారుడు రోహిత్ కర్జత్ జాంఖేడ్ నియోజకవర్గం అసెంబ్లీకి గెల్చాడు.
ఈ నేపథ్యంలో పవార్ తో ఉంటే ఇక ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని అజిత్ ఒక నిర్ణయానికొచ్చినట్లున్నారు. ఇది బిజెపికి తెలిసింది. దానికితోడు ఆయన చాలా మీద కేసులున్నాయి. ఎన్ సిపిని బిజెపి వైపు తీసుకువస్తే కేసులను వాయిదా వేయడమే కాకుండా, ఉపముఖ్యమంత్రి పదవి ప్రస్తుతానికి ఇచ్చి, రొటేషన్ మీద ముఖ్యమంత్రిని కూడా ఇవ్వవచ్చని బిజెపి వూరించి వుండవచ్చు.దేశానికి ఆర్థిక రాజధాని అయిన ముంబాయి నగరంలో ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం బిజెపి కి చాలా చాలా చాలా ఉంది. అందువల్ల అజిత్ కు అలాంటి హామీ ఇచ్చేందుకు జంకాల్సిన పనిలేదు. ఆయనకు ఇలాంటి హామీ ఉందని  డిఎన్ ఎ రాసింది.
ఇప్పటి రాజకీయాల్లో విలువలేముంటాయ్. అంతే, ఆయన రాత్రికి రాత్రి ఎన్ సిపిని వదిలేసిచెంగున బిజెపిలోకి దూకడం జరిగిపోయింది.  ముంబయి మీద పొద్దింకా పడకముందే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశాడు. ఏమయితే ఏముంది ఇప్పటికయితే, ఆయన ముఖ్యమంత్రి పదవి నధిష్టించే దిశలో మరొక అడుగు ముందుకేశాడని అనుకోవాలి.
ఇక అజిత్ పవార్ సొంత వ్యవహారానికొస్తే ఆయన జూలై 22, 1959న పుట్టారు. తండ్రి మొదట ప్రఖ్యాత దర్శకుడు శాంతారామ్ ‘రాజ్ కుమల్’ థియోటర్ లో పనిచేసిన, తర్వాత బారామతి లో షుగర్ వ్యాపారం చేసే వాడు. అయితే, ఆనాగరోగ్యంతో హఠాత్తుగా చనిపోవడంతో అజిత్ స్కూల్ ఫైనల్ (ఎస్ ఎస్ సి) తోనే చదువు మానేసి వ్యాపారంలోకి రావలసి వచ్చింది.
అప్పటికి శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లోసూపర్ స్టార్ లా వెలుగుతున్నారు. దీనితో సులభంగా అజిత్ ని ఆయన 1982లో షుగర్ రాజకీయాల్లోకి తీసుకువస్తూ ఒక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎంపిక చేశారు. తర్వాత పుణే జిల్లా సహాకార బ్యాంకు ఛెయిర్మన్ అయ్యారు. ఒక సారి బారామతి నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. అయితే, పివి నరసింహారావు ప్రధాని అయినపుడు శరద్ పవార్ ను రక్షణ మంత్రిని చేశారు. అపుడు సీనియర్ పవార్ కోసం అజిత్ బారామతి లోక్ సభ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.తర్వాత బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1995,1999,2004,2009, 2014, 2019లలో ఎన్నికయ్యారు. ఈ మధ్య లో ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యారు.
అయితే, తాను ముఖ్యమంత్రి అయ్యేమార్గం కోసం అలోచించారు. ఎన్ సిపి, కాంగ్రెస్ , శివసేన చర్చల్లో పాల్గొని లోపుల ఏంజరుగుతుందో తెలుసుకున్నాడు. ఆచర్చల్లో ఎక్కడా రోటేషన్ చీఫ్ మినిష్టర్ తనపేరే వినిపించకపోవడంతో ఇక ఈ కాంబినేషన్ లో తనకు భవిష్యత్తు లేదనుకున్నారు. మరొక మార్గం వెదుక్కున్నారు. రాత్రికి రాత్రి బిజెపి చేతులు కలిపారు.
ముఖ్యమంత్రి కావాలనే ఆశయం తప్ప దానికవసరమయిన అర్హతలను సమకూర్చుకోలేక పోయారు అజిత్. చాలా వివాదాలు, అవినీతి ఆరోపణలు ఆయనను చుట్టు ముట్టాయి. 2012లో లావాసా లేక్ సిటీ రు.70వేల కోట్ల కుంభకోణంలో ఆయన మీద అవినీతి ఆరోపణలొచ్చాయి. 2003లో పూణే కరువులో ఉన్నపుడు ఆయన చేసిన ఒక వ్యాఖ్య బాగాదూమారం లేపింది. ఆయనను అపకీర్తి పాలు చేసింది. ఆ ఏప్రిల్ షోలాపూర్ కు చెందిన బయ్యా దేశ్ ముఖ్ అనే రైతు కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని కోరుతూ 55 రోజుల దీక్ష చేశాడు. ఈ సందర్భంగా పుణే సమీపంలోని ఇందపూర్ లో మాట్లాడుతూ డ్యామ్ కట్టి నీళ్లివ్వకపోతే, ఉచ్చలు పోయాల్న అని ఆయన చేసిన ప్రకటన పెద్ద సంచలనం సృష్టిచింది. తర్వాత 2014లో సుప్రియా సూలే లోక్ సభ బారామతి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ మసల్వాడి గ్రామంలో ప్రచారం చేస్తూ సుప్రియాకు వోటేయకపోతే గ్రామనికి నీళ్ళసరఫరా కట్ చేస్తామని ప్రకటన చేశారు.
ఇలా ఆయన ఎపుడూ ఏదో ఒక విధంగా వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇపుడు ఏకంగా పార్టీని బిజెపి వైపు తీసుకువస్తానని చెప్పి ఉపముఖ్యమంత్రి అయ్యారు.
అయితే, అజిత్ రాజకీయఎత్తులు పైఎత్తులన్నీ  చిన్నాన్న శరద్ పవార్ నుంచే నేర్చుకున్నారనరి వాటినే ఇపుడు పెద్దాయన మీదే ప్రయోగించారని మీడియా రాస్తున్నది. ఇలా కాంగ్రెస్ మీద తిరగబడి 41 సంవత్సరాల కింద శరద్ పవార్ అతి చిన్నవయసులో ముఖ్యమంత్రి అయ్యారు. అపుడు ఆయన విజయవంతమయ్యారు. ఇఫుడు అజిత్ తిరుగుబాటు ఏమవుతందో చూడాలి.

(ఫీచర్ ఫోటో facebook నుంచి)

(Jinka Nagaraju is a senior journalist  from Hyderabad. He was with Telugu Vaartha, Times of India, Asianet Telugu. Now he is a digital media professional.)