కణకణమూ మానవజాతికి అంకితంచేసిన మహిళ, ఆమె వెనక విషాదం

Foil’d by our fellow-men, depress’d, outworn,

We leave the brutal world to take its way,

And, Patience! in another life, we say

The world shall be thrust down, and we up-borne.

ఆర్నాల్డ్ మ్యాథ్యూ ‘Immortality’ (1867)కవిత ఎవరి గురించి రాశారో తెలియదు గాని, ప్రపంచానికి ‘Immortal Cells’అందించిన Henrietta Lackhs కి ఇది అతికినిట్లు సరిపోతుంది. Source: PoemHunter)

ఎవరైనా చనిపోతే, అమరుడయ్యాడంటూంటారు. అమరుడు అంటే  మరణం లేని వాడు. నిజానికి చనిపోయిన వ్యక్తిని అమరుడనడంలో అర్థం లేదు.ఇది కేవలం ఉపమానంగా మాత్రమే చెబుతున్నాం. అంటే చనిపోయిన వ్యక్తి మన జ్ఞాపకాల్లో మిగిలి ఉంటాడు కాబట్టి ఆయన సజీవంగా ఉన్నట్లుగా భావించాలనే భావోద్వేగం ఇందులో ఉంది. అందువల్ల  మనిషి  భౌతికంగా అమరుడయ్యే ప్రసక్తే లేదు.
మరొక కోణంలో నుంచి చూద్దాం. ఇపుడు అవయవ మార్పిడి జరుగుతూ ఉంది. కొంతమంది తమ కుటుంబ సభ్యులు చనిపోయినపుడు అసమాన వితరణ గుణం ప్రదర్శించి వాళ్ల  అయవాలను దానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడుతుంటారు.మొన్న ఆగస్టు 17న పుణేకి చెందిన ఒక మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి అయిదుగురి ప్రాణాలను కాపాడారు. ఇందులో ఆమె ఊపిరితిత్తులు హైదరాబాద్ కూ వచ్చాయి. ఒక రోగి ప్రాణం కాపాడాయి.
ఈ మధ్య ‘అవయవ దానం’ ఉద్యమంగా మారింది. అవయవ దానం చేస్తే ఆ అవయవం ఆరోగ్యంగా ఉన్నంతవరకు దాత సజీవంగా ఉన్నట్లే లెక్క. అవయవం స్వీకరించిన వ్యక్తి చనిపోతే, అదే అవయవాన్ని మరొకరికి కూాడా దానం  చేయవచ్చు. ఇలాంటిది బాగా అరుదు.  2017లో ఒక పుణేలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కాలేయాన్ని మరొకరికి దానం చేశారు. చిత్రమేమిటంటే, ఈ కాలేయం ఆమెకు మరొకరు దానం  చేశారు. ఇండియాలో ఇలా జరగడం అదే మొదటి సారి. ప్రపంచంలో రెండో కేసు.
అంతకు ముందు అలాంటి సంఘటన అమెరికాలో జరిగింది. యూనివర్శిటీ ఆఫ్ క్యాలిపోర్నియా లాస్ ఎంజలీస్ (UCLA) రోనాల్డ్ రీగన్ మెడికల్ సెంటర్ లో డాక్టర జెఫ్రీ వీయేల్ (Dr Jeffrey Veale) ఒక మూత్రపిండాన్ని మరొక వ్యక్తికి అమర్చాడు. అయితే ఈ మూత్రపిండం కూడా మరొకరి నుంచి దానంగా వచ్చిందే.  ఇది ఇలా చేతులు మారినంతకాలం దాత సజీవంగా ఉన్నట్లే లెక్క. అయితే, ఈ అవయవాలు శాశ్వతంగా ఆరోగ్యంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. అంటే దాత అమరుడయ్యాడని అనేందుకు ఇక్కడా వీల్లేదు. అయితే, మెటఫరికల్ గా అవయవ దాత ఇలా సజీవంగా ఉన్నారని మనం మాట్లాడుకోవచ్చ.
మరి, ఒక మనిషి చనిపోయాక  అమరుడయ్యే అవకాశం ఉందా?ఉంది.  ఇంతవరకు ప్రపచంలో ఒకే ఒక వ్యక్తి అలా అక్షరాల సజీవంగా ఉంటున్నారు.
ఒక సినారియో వూహించండి. ఒక మనిషి కణాలుగా విడిపోయి, వేల లక్షల కోట్ల కణాలుగా నిరంతరం పునరుత్పత్తి అవుతూ ప్రపంచమంతా ఆవరించి ఉండటం సాధ్యమా?
సాధ్యమేనని హెన్రియెట ల్యాక్స్  (Henrietta Lacks)అనే మహిళ రుజువు చేసింది.
ఇది మొత్తం వైద్య చరిత్రలో అపూర్వం. అద్భుతాల గురించి వినడమే తప్ప మనం చూసి ఉండం.  అరవైయేళ్లుగా ఈ మిరకిల్ ను కొనసాగిస్తున్న నల్ల జాతి మహిళ లాక్స్. దీని వెనక పేదరికం, విషాదం,నిస్సహాయత అన్నీ ఉన్నాయి.ఇపుడిపుడు ఈ ప్రపంచం దీనిని గుర్తిస్తా ఉంది.
ప్రపంచంలో ఇంతవరకు శాస్త్రవేత్తలు ఎవరినీ అమరుడు (Immortal) అని ప్రకటించలేదు. ఒక్క ల్యాక్స్ శరీర కణాలను మాత్రమే ‘Immortal Cells’ అని పిలిచారు.
ప్రతికణంలో ‘ఆమె’ పునురత్పత్తి అవుతూ ఉంది. మానవ జాతికి ఎనలేని సేవ చేస్తూ ఉంది. పోలియో వ్యాక్సిన్ తయారు చేసేందుకు వాడిన కణాలివే. మానవ కణాన్నిక్లోనింగ్ చేసేందుకు వాడిన కణాలే కూడా ఇవే. మనిషిలో46 క్రోమోజోములున్నాయని కనుగొనేందుకకు సహకరించిన కణాలు ఇవే. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ డెవెలప్ మెంట్ కు కారణం ఇవే.మనషి శరీర కణాలు జీరో గ్రావిటిలో ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకునేందకు స్పేష్ షిప్ లో పెట్టి అంతరిక్షంలోకి పంపించిన తొలి మావన  శరీరకణాలు కూడా  ఇవే. విపరీతంగా అమ్మకానికి కొనుగోలుకి మార్కెట్ లో దొరుకున్నమనిషికణాలు కూడా ఇవే.
ఆమె కణజాలాన్ని HeLa (Henrietta Lacks) సెల్స్ అని పిలుస్తున్నారు. HeLa అంటే ఎమిటో చాలా మందికి తెలియదు. భారత దేశంతో సహాయం ప్రపంచంలో ఆమె శరీర కణాలు లేని దేశం లేదు. ఇపుడిది భారీ వ్యాపారం కూడా అయిపోయింది. HeLa అంటే హెన్నియెట లాక్స్ అని, ఆమె శరీర కణాలను అనైతికంగా వాడుతున్నారని,  అది జరిగిన వైనాన్ని దాని వెనక ఉన్న విషాదాన్ని రెబెకా స్క్లూట్ (Rebecca Skloot) అనే జర్నలిస్టు పూర్తిగా వెలికితీశారు.

బయోమెడికల్ రీసెర్చో లో, వాక్సిన్ ల పరిశోధనలో, మందుల పరీక్షలో, రోగాల వ్యాప్తిలో, పోలియో పరీక్షలో తాజాగా ఇపుడు   కోవిడ్-19 రీసెర్చ్ లో హెలా (HeLa)కణాలనే వాడుతున్నారు.  ఇప్పటి వరకు ఆమె కణాలను ఉపయోగించి 60 వేల రీసెర్చ్ పేపర్లను ప్రచురించారు. మానవజాతికి ఇంత సేవచేసిన మరొకరి శరీర భాగం లేదు. ఆమెకణాలను రోజుకు కోట్ల కోట్ల సంఖ్య లో పారిశ్రామికంగా ఉత్పత్తి చేసి అమ్ముతున్నారు. ఒక వయల్ ధర 250 డాలర్లు పెట్టి ఆన్ లైన్ లో ఎవరైనా కొనవచ్చు.  పరిశోధన కు వాడుకోవచ్చు.
మెడికల్ ఎధిక్స్ బలంగా లేనపుడు, ఆమె అనుమతి లేకుండా నల్లజాతి మహిళ అనే చిన్నచూపుతో శరీరకణాల సేకరణ జరిగింది. కానుకగా మిత్రులకు ఇష్టానుసారం పంపిణీ జరిగింది. క్యాన్సర్ పరిశీలన కోసం సేకరించిన ఆమెకణాలకు ఏమనిషికీ లేని పునురుత్పత్తి గుణం ఉందని ఆమెను పరీక్షించిన క్యాన్సర్  డాక్టర్ గమనించాడు. ఆయన ల్యాబ్ ప్రవేశించినప్పటి నుంచి అవి ఆగకుండా పునరుత్పత్తి అవుతూనే ఉన్నాయి.
సాధారణంగా మనిషి కణాలను సేకరిస్తే ల్యాబ్ కల్చర్ లో కూడా ఎక్కువ  కాలం బతకవు.  కాని, HL సెల్స్ ప్రతి 24 గంటలకు డబల్ అవుతున్నాయి. ఇది వైద్య చరిత్రలోనే అద్భతమని డాక్టర్ గమనించాడు. అయనే ఈ కణాలకు ‘Immortal Cells’ అని పేరు పెట్టాడు.
ప్రపంచవ్యాపితంగా హెన్రియెట కణాలు ఎన్ని ఉంటాయి? ఒక శాస్త్రవేత్త అంచనా ప్రకారం ప్రపంచంలో ఇంతవరకు పునురుత్పత్తి చేసిన HL సెల్స్ ను ఒక చోట కుప్పపోస్తే అవి 50 మిలియన్ టన్నుల బరువు తూగుతాయి.
ఇప్పటిదాకా సృష్టించిన HL కణాలన్నింటిని ఒకదానిపక్కన మరొకటి తాడులాగా పేనిస్తే అవి 350 మిలియన్ అడుగుల పొడవై పోయి, మూడుసార్లు భూమిని చుట్టవచ్చని మరొక శాస్త్రవేత్త చెప్పారు.
ఇపుడు భూమండలాన్ని మొత్తం అవరించిన హెన్రియెట బతికున్నపుడు ఎత్తు కేవలం ఐదు అడుగులే.
సజీవంగా ఉన్న  మనిషి మీద చేయలేని  ప్రయోగాలన్నింటి సునాయాసంగా ల్యాబొరేటరీలలో చేయడానికి హెన్రియెట కణాలు పనికొస్తున్నాయి. ఆధునిక వైద్యశాస్త్రానికి నిజంగా ప్రాణంపోసిన మహిళ ఆమె. గత ఆరు దశాబ్దాలలో   వైద్యశాస్త్రంలో వచ్చిన విప్లవాన్నింటిలో ఆమె శరీర కణాలు లేని ప్రయోగాలు లేవంటే ఆశ్చర్యం కాదు.

Like this story? Please share it with a friend

ఇంతకు ఎవరీ హెన్రియెట లాక్స్
ల్యాక్స్ ఒక పేద నల్ల జాతి పొగాకు రైతు. 1920 ఆగస్టు 1న అమెరికా వర్జీనియాలోని రోవనోక్ లో పుట్టారు.1941లో ఆమెకు వివాహమయింది.అప్పటికింకా నల్లజాతి  వారి మీద వివక్ష భయంకరంగా ఉంది. ఆసుపత్రులు ప్రత్యేకం. ఆసుపత్రులలో టాయిలెట్లు కూడా ప్రత్యేకం. ఒక సారి ఆమె శరీరంలో పుండు లేచి బాధించడం మొదలుపెట్టింది.ఇదేమిటో కనుక్కునేందుకు 1951జనవరి 29న జాన్స్ హాప్కిన్స్ కు వెళ్లారు.  ఆ ప్రాంతంలో నల్ల జాతిరోగులను పరీక్షించే ఒకే ఒక్క ఆసుపత్రి అది. డాక్టర్  ఆమె శరీరంలోని గడ్డ నుంచి కణజాలాన్ని తీసుకున్నారు. చివరకు అది  సర్వైకల్ క్యాన్సర్ అని తేలింది. బాగా ముదిరింది కూడా. ఆమెకు చికిత్సమొదలయింది. ఈ దశలో  ఒక సారి  సెర్విక్స్ లో ని గడ్డ నుంచి రెండు రకాల కణాలను సేకరించారు. ఇందులో ఒకకరం, ఆరోగ్యంగా ఉన్న కణాలు, రెండవ శ్యాంపిల్, క్యాన్సర్ కణాలు. వీటిని ఆసుప్రతి క్యాన్సర్ స్పెషలిస్టు  జార్జ్ ఒట్ గే (George Otte Gey) కి పంపించారు. 1961 ఆగస్టు 8న 31 సంవత్సరాల వయసులో ల్యాక్స్ చనిపోయారు. ఆమెకు లోకల్ స్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. కనీసం సమాధి కూడా లేకుండా అనామకంగా ఆమె పేద జీవితం ముగిసింది. తర్వాత ఆమెను అంతా మర్చిపోయారు.
హెన్రియెట ల్యాక్స్ పునర్జన్మ
అయితే, అర్నాల్డ్ మ్యాధ్యూ కవితలో లాగా ఆమె వైద్య శాస్త్ర ప్రపంచంలో ఆమె పునర్జన్మించింది. ప్రపంచాన్ని తన చేతిలోకి తీసుకుంది.ఆమె పునర్జీవిత యాత్ర అంతులేకుండా కొనసాగుతూ ఉంది. ఆగే అవకాశాలు కూడా లేదు. అందుకే  అమరురాలయిందనేందకు ఆమె అర్హత సంపాదించారు.
ఆమె క్యాన్సర్ కణాలు ఇతరుల కణాల్లా కాకుండా వింతగా ప్రవర్తిస్తున్నాయని డాక్టర్ గే గ్రహించాడు. ఇది వైద్యచరిత్రలో ఒక కొత్త మలుపు కాబోతున్నదని గ్రహించాడు. వూటబావిలాగా  అవి చాలా వేగంగా పునరుత్పత్తి కావడం ఆయన్ను అబ్బుపరిచింది.  సాధారంగా ల్యాబొరేటరీలో పరిశీలించేందుకు కల్చర్ లో  పెంచే కణాలు ఎక్కువ రోజులు బతకవు. అందుకే వీటి మీద ఎక్కువ పరిశోధనలు చేయడం సాధ్యంకాదు.
అయితే డాక్టర్ గే ల్యాబొరేటరీ రూపొందించిన రోలర్ ట్యూబ్ టెక్నిక్ లో హెన్రియెట సెల్స్ చావకుండా పెరుగుతున్నాయి, అది కూడా లక్షల సంఖ్యలో. అందుకే  ఈ కణాలు ‘immortal’ అని ఆయన ప్రకటించకుండా ఉండలేకపోయాడు.
 ల్యాబ్ లో  గుర్తింపు కోసం ఆమె పేరులోని రెండు మాటలను తీసుకుని ఈ కణాలకు ఆయన HeLa సెల్స్ అని ఆయన పేరు పెట్టారు. విపరీతంగా  తన ల్యాబ్ లో డెవలప్ అవుతున్న కణాలను ప్రపంచంలో నలుమూలల  పరిశోధనలుచేస్తున్న మిత్రులకు,ల్యాబొరేటరీలకు ఉచితంగా  అందించం మొదలుపెట్టారు.
George Otto Gey/ wikimedia

(ఇక్కడొక విశేషం చెప్పుకోవాలి. డాక్టర గే ఒక దశలో కూడా క్యాన్సర్ బారినపడ్డారు. ఆసుప్రతిలో చేరాడు. క్యాన్సర్ శరీర మంతా వ్యాపించింది. మృత్యువు కళ్ల ముందు కదలాడుతూ ఉంది. ఈ దశలో  తనకు చికిత్స చేస్తున్న డాక్టర్ల ను ఆయన ఒక కోరిక కోరారు. తాను కూడా హెన్రియెట లాక్స్ లాగా అమరుడు కావాలనుకున్నాడు. క్యాన్సర్ సోకిన తన క్లోమం నుంచి కొన్ని కణాలు తీసుకుని పరిశోధనలకోసం HL Cell లైన్ లాగా తన  సొంత  సెల్ లైన్ తయారు చేయాలని కోరారు. డాక్టర్లు ఖాతరు చేయలేదు. ఆయనకు తీవ్ర  ఆగ్రహం వచ్చింది. ఆ తర్వాత ఎక్కువ కాలం బతక లేదు.1970 నవంబర్ 8న చనిపోయారు. ఆయన అమరుడు కాలేకపోయారు.)

*ఇది కూడా చదవండి:ప్రపంచంలో ఒకే ఒక్క మెడికో విగ్రహం ఇది…. దీని వెనక వొళ్లు గగుర్పొడిచే కథ ఉంది…

అలా అలా ‘హెన్రియేట’ విశ్వవ్యాపితమై పోయి 1954 లో పోలియే పరిశోధనల్లో భాగమయ్యారు. ఈ సెల్స్ పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి మొదలు పెట్టారు. క్యాన్సర్ వ్యాపిస్తుందేమో చూసేందుకు ఆమె కణాలను ఎందరికో ఎక్కించి పరీక్షించారు. ఔషధాలలో ఎలా ప్రవర్తిస్తాయో చూశారు.ఆమె కణాల మీద చేయని పరీక్షలు లేవు. ఇలా  సుమారు 11,000 వేల మంది రకరకాల పేషంట్లు హెలా సెల్స్ తీసుకుని శాస్త్రపరిశోధన ట్రయల్స్ లో పాల్గొంటున్నారు.
కేవలం తన  క్యాన్సర్ నిర్ధారించేందుకు అసవరమయిన  పరీక్షలకు తీసుకున్న తన శరీర కణాలు ఇలా ప్రపంచమంతా ఆధునిక వైద్య ప్రయోగాలకు ఉపయోగపడతాయని  హెన్రియెట  ల్యాక్స్ వూహించి ఉండరు. అదే విధంగా ఆమె పునర్జన్మ విషయం వాళ్ల కుటుంబానికీ తెలియదు.
2013లో  హెలా సెల్స్ నుంచి వైద్య శాస్త్రం మరొక గొప్ప మలుపు తిరిగింది.
హెలా లైన్ నుంచి తీసిన ఒక రకం కణాల జీనోమ్ DNA సీక్వెన్స్ ను ప్రకటించారు. అది శాస్త్ర ప్రపంచంలో సంచలన వార్త అయింది. ఈ సమయంలో జర్నలిస్టు రెబెకా ప్రపంచంలో ఎపుడో చనిపోయిన హెన్రియేట శరీర కణాల మీద  ఏంజరుగుతున్నదో హెన్నీ( హెన్రియెట ముద్దు పేరు) కుటుంబానికి వెళ్లడించారు. అది భూకంపం  పుట్టించింది.
సైన్స్ చరిత్ర లో ఒక మహిళకు, అందునా నల్లజాతి మహిళకు ఎంత అన్యాయం జరిగిందో ఆమె వెల్లడించారు.
చావుబతుకుల్లో ఉన్న ఒక రోగి అనుమతి లేకుండా ఆమె కణాలను సేకరించడం, వాటిని రోగ  నిర్ధారణకు కాకుండా రకరకాల ప్రయోగాలకు ఉపయోగించడం, వాటి తో వ్యాపారం చేయడం…అన్నింటిని రెబెకా బయటపెట్టారు. నల్లవాళ్లని వివక్ష తో చూసే అమెరికా ఆధునిక వైద్య శాస్త్రానికి తనకణాలతో పునాదులేసింది ఒక నల్లజాతి మహిళ అనే  చేదునిజం బయట పెట్టారు.
Hela కు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలన్న డిమాండ్ మొదలయింది.
ఇపుడు అమెరికాలో నల్ల జాతి ఆత్మగౌరవం ఉద్యమం #BlackLivesMatter నడుస్తూన్నది నేపథ్యంలో ఆధునిక వైద్య శాస్త్ర విజయాలన్నీ ఒక నల్ల జాతి మహిళ శరీరం పునాదిగా వచ్చినవే నని  ప్రకటించాలనే డిమాండ్ మొదలయింది. అనుమతి లేకుండ తీసుకున్న కణాలు కాబట్టి ఇక ముందు వాటిప్రయోగాలు చేయరాదని, అది అన్యాయన్ని కొనసాగించడమే నని కొందరు వాదిస్తున్నారు.

 

 

ఈ వత్తిడిలో అనే చర్యలు మొదలయ్యాయి. 1996లో మోర్ హౌస్ స్కూల్ అప్ మెడిసన్ HeLa Women’s Health Conference నిర్వహించి హెన్రియెట ల్యాక్స్ కుగుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేసింది.  ఆ కాన్ఫరెన్స్ జరిగిన 1996 అక్టోబర్ 11 ను Henrietta Lacks Day గా అట్లాంట మేయర్ ప్రకటించారు. ఇపుడు హెన్రియెట మెమోరియల్ లెక్చర్స్ వస్తున్నాయి. విశ్వవిద్యాలయాలలో బిల్డింగులకు ఆమె పేరు పెడుతున్నారు.
2011లో మోర్గన్ స్టేట్ యూనివర్శిటీ  ఆమెకు మరణానంతర గౌరవ డాక్టొరేట్ ప్రకటించింది.2014లో మేరీ లాండ్ Women’s Hall of Fame లో ఆమెను చేర్చారు.జాన్స్ హాప్ కిన్స్ ఒక రీసెర్చ్ బిల్లింగ్ కు ఆమె పేరు పెట్టారు. రెబెకా స్క్లూట్ పుస్తకం అమెను  ఒక త్యాగమూర్తిగా ప్రపంచానికి పరిచయం చేసింది.  ఆమె జీవితం ‘The Immortal Life of Henrietta Lacks’ పేరు తో2017 లో తెరకెక్కింది.
Today, nearly 60 years after Henrietta’s death, her body lies in an unmarked grave in Clover, Virginia. But her cells are still among the most widely used in labs worldwide-brought and sold by the billions. Though those cells have done wonders for science, Henrietta-whose legacy involves the birth of bioethics and grim history of experimentation on African- Americans- is all but forgotten: Rebecca  Skloot (from Immortal Life of Henrietta Lacks)
ఈ యేడాది హెన్రియెట లాక్స్ శత జయంతి #HELA100 సంవత్సరం.