Home Features బ్రిటిష్ వాళ్లు ‘ప్రిన్స్ చార్మింగ్’ అన్న తెలుగు రాజావారు ఎవరు?

బ్రిటిష్ వాళ్లు ‘ప్రిన్స్ చార్మింగ్’ అన్న తెలుగు రాజావారు ఎవరు?

622
0
SHARE
రుగ్వేదాన్ని మొదట ఇంగీష్ లోకి అనువదించిన  యూరోపియన్ సంస్కృతపండితుడు మ్యాక్స్ ముల్లర్ (1823-1900). మ్యాక్స్ ముల్లర్ జర్మనీ దేశస్థుడయినా సంస్కృతం ఆయన్ని  బ్రిటన్ కు తీసుకువచ్చింది. అక్కడ స్థిరపడ్డారు. అక్స్ ఫోర్డ్ లో  ప్రొఫెసర్ గా ఉండేవారు. సంస్కృత పండితుడయిన ఒక ఫ్రెంచ్ మిత్రుడి సలహామేరకు మ్యాక్స్ ముల్లర్ రుగ్వేదం అధ్యయనం చేయడం మొదలుపెట్డారు. దీనిని రాతప్రతులు లండన్ లో ఉన్నాయని తెలిసి అక్కడి వచ్చారు. రుగ్వేదం చదువుతూ ఆయన అక్కడే స్థిరపడిపోయారు. ఆక్స్ ఫోర్డ్ లో ఆయన Modern European Languages ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.
భారతీయుల  మానసిక పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే రుగ్వేదం చదివితీరానేది ఆయన అభిప్రాయం
రుగ్వేద సంహిత  ఇంగ్లీష్ అనువాదం  మొదటి ఎడిషన్ కాపీలన్నీ అమ్ముడు పోయాయి. సెకండ్ ఎడిషన్ కు వెళ్లేందుకు మ్యాక్స్ ముల్లర్ ప్రయత్నిస్తున్నారు. దీనికవసరమయిన నిధులకోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయం విజయనగరం రాజా పూసపాటి ఆనంద గజపతి (1850-1897) కి తెలిసింది. ఇది ఎలా ఆయనకు తెలిసిందంటే… ఆనందగజపతి గొప్ప పండితుడు. ఇంగ్లీష్ ఫ్రెంచ్, హిందీ,సంస్కృతం,హిందీ ఉర్దు ల తో పాటు ఆయనకు 20 భాషలు తెలుసు. ఆయన ఎంతో మంది కవులను, కళాకారులను పోషించారు. ఆందుకే ఆయనకు ‘అభినవ ఆంధ్రభోజుడు’ అని పేరు కూడా వచ్చింది
ఆయనకు మ్యాక్స్ ముల్లర్ అనువదించిన రుగ్వేద సంహిత గురించి తెలిసింది. ఆ కాపీ ఆయనకు ఎక్కడా దొరకలేదు. అపుడు ఆయన స్వయంగా మ్యాక్స ముల్లర్ కు లేఖరాసి ఒక కాపీ పంపాలని కోరారు. అయితే, కాపీలన్నీ అమ్ముడయి పోయాయాని, సెకండ్ ఎడిషన్ అచ్చేసేందుకు ప్రయత్నిస్తున్నానని మ్యాక్స్ ముల్లర్ తిరుగుజాబు రాశారు.
అపుడాయన రెండవ ముద్రణను ప్రోత్సహించారు. దీనికోసం రు. 50 వేల గ్రాంటు మంజూరు చేశారు. ఇది వందేళ్ల కిందటి మాట.
అపుడు 50 వేలంటే ఎంత పెద్దమో తెలుసుకదా. అనుకోని ఈ వితరణకు ఎలా సమాధానం చెప్పాలో మ్యాక్స్ ముల్లర్ కు అర్థం కాలేదు.
రుగ్వేద సంహిత రెండవ ప్రకరణానికి ముందు మాట రాస్తూ మ్యాక్స్ ముల్లర్ ఇలా ఉటంకించారు. ” The Princely and truly patriotic liberality of his Highness the Maharaja of Vizianagaram has enabled me to take up once more in the evening of my life that work.After this generous offer from one of the most enlightened and distinguished princes of India I could hesitate no longer. “
ఈ భూరి విరాళానికి ప్రతిఫలంగా మ్యాక్స్ ముల్లర్ ఆనంద గజపతికి అంకితం ఇవ్వాలనుకున్నారు.
ఈ విషయాన్ని మహారాజా కు చెప్పారు. అయితే, ఆనంద గజపతి దానిని తిరస్కరించారు. మ్యాక్స్ ముల్లర్ కు ఒక లేఖ రాస్తూ పుస్తకాన్ని విక్టోరియా మహారాణికి  అంకితమీయాలని కోరారు. కీర్తికాంక్ష ఆనంద గజపతికి లేకపోవడాన్ని మ్యాక్స్ ముల్లర్ విశేషంగా పేర్కొంటూ, fame is the last informity of the noble mind, అని ప్రశంసించారు.
ఆనంద గజపతి గతం…
తండ్రి పూసపాటి విజయరామరాజు గజపతి 1879, ఏప్రిల్ 28న చనిపోయాడు. దానితో ఆనంద గజపతి ఆయన వారసుడిగా సంస్థానాధిపతి అయ్యారు. అప్పటికి ఆయన వయసు 29 సంవత్సరాలు. చదువు పాండిత్యంతో ఆయన పండితుల మధ్య, యూరోపియన్ల మధ్య, జమీందారుల మధ్య ఒక వెలుగు వెలిగే వారు. అందుకే  యూరోపియన్లు ఆయనను ‘ప్రిన్స్ చార్మింగ్’ అని కొనియాడేవారు. అప్పటి మదరాసు గవర్నర్  ఎం ఇ గ్రాంట్ డఫ్ ఆయనికీ పేరు పెట్టారు.
విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్టించిన గోల్డన్ జూబిలీ సంవత్సరంలో 1887లో  మదరాసు మౌంట్ రోడ్ లో లార్డ్ రిప్పన్ విగ్రహంతో ఆయన ఒక ఫౌంటెయిన్ నిర్మించారు. దీనిని కాపాడుకునేందుకు  తమిళనాడు ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. దీనిని తీసివేశారు. (వ్యాసం చివరిఫోటో)
(ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలోకండి)
(ఇక్కడ మరొక విషయం విజయనగర సంస్థానం కీర్తి లండన్ దాకా వ్యాపించింది. అనందగజపతి తండ్రి విజయరామ గజపతి  లండన్ హైడ్ పార్క్ లో ఒక ఫౌంటెయిన్ నిర్మించారు. 1964 దాకా ఇది ఉండింది. ఇపుడు కేవలం ఒక శిలాఫలకం మాత్రం మిగిలింది.)

తండ్రి ఆయనను ఒక పండితునిగా తీర్చిదిద్దారు. ఇది చాలా అరుదు. కుమారులు వీరులు,శూరులుకావాలనుకుంటారు గాని, ఇలా పండితుడయిపోవాలని, వితరణ శీలి కావాలని ఎవరూ అనుకోరు.
మేజర్ థాంప్సన్, నాటి ఇంగ్లీష్ పండితుడు లింగం లక్ష్మాజీ పంతులు ఆయనకు ఇంగ్లీష్ నేర్పించారు. అపుడే ఆయన అనేక భాషలు నేర్చుకున్నారు. ఇరవై భాషలు ఆయన మాట్లాడే వారని పేరు.
సాహిత్యాభిమాని కావడంతో ఆయన ఇల్లు గ్రంథాలయమయిపోయింది. ఆయన జీవన శైలి కూడా సాదాసీదా ఉండేది. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఇష్టపడేవాడు కాదు. బంగారు జలతారు అంచులున్నదుస్తులు తొడిగే వాడు. ముత్యాల హారం ధరించే వాడు కాదని చెబుతారు. నిరాడంబర మహారాజుగా ఆయనకు పేరుంది.
ఆయన బ్రిటిష్ వారితో బాగా సఖ్యంగా ఉండటంతో వారు కూడా ఆయనకు చాలా గౌరవం ఇచ్చేవారు. ఆయనను భారతదేశ రాజ్యాల గ్రాండ్ కమాండర్ (Knight Commander of Order of the Star of Indi- KCSI) గా ప్రకటించారు.1887లో బ్రిటిష్ సామ్రాజ్యం Knight Commander(KBE) గా నియమించారు. 1884,1894 లో రెండు సార్లు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడయ్యారు.
స్త్రీ విద్య, వితంతు వివాహాలాలను ప్రోత్సహిస్తూ సంస్కర్తగా పేరు పొందారు.
ఆయన దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు విపరీతంగా దానధర్మాలు చేశారు. కలకత్తా యూనివర్శిటీ లో సాంకేతిక విద్య అభ్యసించే వారికోసం ఆరువేల రుపాయల స్కాలర్ షిప్ మంజూరు చేశారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్, విక్టోరియా మెమోరియల్ హాల్ , మద్రాస్ లోని అడ్మిరాల్టీ భవన్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ అఫ్ సైన్స్ భవనం, బెనారస్ లోని టౌన్ హాల్ ఆయన విరాళాలతో కట్టించినవే.
మద్రాసు మహారాజ ఫౌంటెయిన్
Source :Vizianagaram Zamindhary in Colonial Andhra, 1802-1949. By Dr. Syam Sundar Raju B
(ఈ ఆర్టికల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. trendingtelugunews.com ను ఫాలోకండి)