‘సెపక్ తక్రా’లో బంగారు గెల్చిన ఒకే ఒక్క తెలుగు వాడు అశోక్

(చందమూరి నరసింహారెడ్డి)
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి అంతేకాదు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. క్రీడలు అనగానే చాలామందికి క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్, వాలీబాల్ ,బ్యాడ్మింటన్ తదితర గేమ్స్ గుర్తుకొస్తాయి. వాటి గురించి చాలా మందికి తెలుసు .అయితే సెపక్ తక్రా (Sepak Takraw) చాలామందికి తెలియదు. 2018 ఆసియా క్రీడలవరకు సెపక్ తక్రా నాకు కూడా తెలియదు అన్నది వాస్తవం.
సెపక్‌తక్రా… వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, ఇరాన్, జపాన్, సింగపూర్, లావోస్, చైనా, ఇండోనేషియా, కొరియా లాంటి దేశాలలో మాత్రం బాగా పాపులర్. ఈ ఆటలో భారత్ ఇప్పుడిప్పుడే పథకాలు సాధిస్తుంది.
సెపక్ తక్రా ఆటలో జాతీయ స్థాయిలో పేరుగడించిన ఆటగాడు తెలుగు వారిలో కూడ ఉన్నాడు. ఆసియాక్రీడల్లో పాల్గొని మెడల్స్ అందుకొన్నారు. కష్టాలు పడ్డాడు.
జీవితంలో కష్టాలు సర్వసాధారణం….ఇబ్బందులు వచ్చాయని కుంగిపోతే జీవితంలో ఎదగలేరు. వాటిని అధిగమించాలి. అప్పుడే విజయతీరాలకు చేరుతారు. పసి ప్రాయం నుంచి కష్టాలతో పోరాటం సాగిస్తూ తన లక్ష్యం కోసం అలుపెరగని కృషి తో ముందుకు సాగుతున్న యువకుడు… అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు. ఎన్నో పతకాలు అందుకొన్నాడు. అతడే కర్నూలు వాసి అశోక్ కుమార్.
కర్నూలు నగరం బంగారుపేట కు చెందిన ఎర్రన్న ,సరస్వతి దంపతుల మొదటి కుమారుడు అశోక్ కుమార్.ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి వంట మాస్టర్ తల్లి కూలి. 2014 లో తండ్రి ఎర్రన్న చనిపోయారు. తండ్రి మరణంతో అశోక్ ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేస్తూ కుటుంబానికి  అండగా ఉన్నారు.
సెపక్ తక్రా కు పెద్దగా ప్రాచుర్యం లేకపోవటం క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవటం వల్ల అశోక్ గురించి చాలా మంది కి తెలియదు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా నిరూపించుకున్నారు అశోక్ కుమార్ . 2005 నుంచి ఈ క్రీడను అభ్యసిస్తూ ఎన్నో పోటీల్లో తిరుగులేని ప్రదర్శన చేశాడు.
2006 లో సబ్ జూనియర్స్ నేషనల్​లో మొదట బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయి గుర్తింపు అందుకున్నారు. ఆసియా ఛాంపియన్​షిప్ పోటీల్లో భాగంగా చైనాలో జరిగిన పోటీల్లో భారతజట్టు పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ జట్టులో సభ్యుడైన అశోక్ కుమార్ జట్టును విజయపథంలో నడిపించటంలో కీలకపాత్ర పోషించారు.
బ్యాంకాక్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ భారత జట్టులో అశోక్ పాల్గొన్నారు . సెపక్ తక్రా జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ క్రీడాకారుడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలని కోరుతున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాదించిన అశోక్ కుమార్ ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శనీయం.
2007 సంవత్సరంలో గోవా, ఢిల్లీలో జరిగిన
జాతీయస్థాయి సబ్ జూనియర్స్ సెపక్ తక్రా పోటీల్లో వరుసగా వెండి పతకాలు అందుకున్నారు .
2008 సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. 2009లో కర్ణాటక లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పోటీల్లో వెండి పతకం సాధించారు. బ్యాంకాక్ లో జరిగిన అంతర్జాతీయ శిక్షణ శిబిరంలో భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహించారు.
2011 ఆగస్టు లో జరిగిన జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2016 సంవత్సరంలో ఎస్టీ బీసీ కళాశాలలో బీఏ పట్టా పొందారు.
2017 సంవత్సరంలో యన్. ఐ.యస్ శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణలో ఏ గ్రేడ్ పొందిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు సాధిం చారు.
2018 సంవత్సరంలో థాయిల్యాండ్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడల్ సాధించారు. 2019 సంవత్సరం జూన్ 10 నుంచి 14వ తేదీ వరకు చైనాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించారు.
2019 సెప్టెంబర్ లో బ్యాంకాక్ లో ప్రపంచ సెపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. 2019 జనవరి లో రాజస్థాన్ లో జరిగిన సీనియర్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించారు.
ఇప్పటి వరకు 20 జాతీయ స్థాయి పోటీల్లో నాలుగు బంగారు, ఎనిమిది వెండి, మూడు కాంస్య పతకాలు అందుకున్నారు. 30 రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్లు, జూనియర్లు, సబ్ జూనియర్ల విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. పేదరికంలో మగ్గిపోతున్న ఈ క్రీడాకారుని కి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇలాంటి  క్రీ   డాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ప్రచారం లేని సెపక్ తక్రా లాంటి ఆటలను, ఆటగాళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల తగిన గుర్తింపు రావడం లేదు.

 

Chandamuri Narasimhareddy
(చందమూరి సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)