అమరావతి పాలిటిక్స్, నాడు ఆమోదం – నేడు మూడు ముక్కలాట: టిడిపి

(కిమిడి కళా వెంకట్రావు)
ప్రజా రాజధాని అమరావతే అంటూ నాడు అసెంబ్లీలో తీర్మానం చేసినపుడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి నేడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడడం దుర్మార్గం.
నాడు ఏకగ్రీవంగా ఆమోదం తెలపిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ మరిచిపోయారా.? స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల సూచనల మేరకు అమరావతిని రాజధానిగా ప్రకటించి, తీర్మానం చేసినప్పటి నుండి గత ఐదేళ్లలో ఏ రాజకీయ పార్టీ గానీ, ప్రజా సంఘాలు కానీ తప్పు అన్నవారే లేరు. కానీ నేడు మూడు రాజధానుల నిర్ణయాన్ని ఐదు కోట్ల ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు తూర్పారబడుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదనే కదా.? అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ సహా పలువురు వైసీపీ నేతలు విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆక్రమించుకున్న వేల ఎకరాల భూముల కోసమే మూడు రాజధానులు అంటూ నానా యాగీ చేస్తుండడం ఎవరి మేలు కోసం?
ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తైతే రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూరుతాయనేది వాస్తవం కాదా.? యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అనేది వాస్తవం కాదా.? రాష్ట్ర అభివృద్ధి, ఆర్ధిక పరిపుష్టే లక్ష్యంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని ఆపేయడం కుట్రపూరితం, కక్ష పూరితం కాదా?
పెద్దలసభ అయిన శాసన మండలి తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపించిన బిల్లును ఆమోదించాలని గవర్నర్ వద్దకు వెళ్లడం రాజ్యాంగ విరుద్ధం కాదా.? ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం ఒకటి ఉందనే జ్ఞానం కూడా లేకపోవడం దుర్మార్గం కాదా?
అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ ముందు.. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ప్రతి జిల్లాను తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాటలో వాస్తవం కాదా.? రూ.వేల కోట్ల పెట్టుబడులతో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటే వాటినీ మీ కమిషన్ల కోసం బెదిరించి పారిపోయేలా చేసింది వాస్తవం కాదా?
అలాంటి వైసీపీ నేతలు ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడడానికి సిగ్గుపడాలి. విశాఖ నుండి లులూ, అదానీ వంటి ప్రఖ్యాత సంస్థలను తరిమేయడం అభివృద్ధి వికేంద్రీకరణా.? ప్రకాశం జిల్లాలో ఏర్పాటవ్వాల్సిన పేపర్ పరిశ్రమను తరిమేయడం అభివృద్ధి వికేంద్రీకరణా?
పోలవరం పనుల్ని నిలిపేసి ఏడాదిగా తట్ట మట్టి కూడా వేయకపోవడం వికేంద్రీకరణా? కియా కార్ల పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించడంతో దాదాపు 40 కియా అనుబంధ పరిశ్రమలు బెంగళూరుకు తరలిపోవడం వికేంద్రీకరణా? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించడం అభివృద్ధా.? లేక వచ్చిన పరిశ్రమలను తమ కమిషన్ల కోసం తరిమేయడం అభివృద్ధా? ఏది అభివృద్ధి? ఏది సుపరిపాలనో మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి.
సీనియర్ రాజకీయ నేతగా బొత్స సత్యనారాయణ కాస్తయినా విజ్ఞతతో వ్యవహరించాలి. ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతిని, తెలుగువారి ఘనకీర్తిని మరో వేయ్యేళ్లు వెలుగులీనేలా, సుందరంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసి పునాధులు వేసింది.
వేలాది మంది రైతులు నిస్వార్ధంగా ఆస్తులు త్యాగం చేసిన రైతుల గుండెలపై కక్ష పూరితంగా తీసుకున్న మూడు ముక్కల నిర్ణయంతో రాజధాని రైతుల గుండెలు మండుతున్నాయి. తమ స్వార్ధం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి వంతపాడుతున్నందుకు కాస్తయినా సిగ్గుపడండి. అమరావతికి మద్దతుగా చేయి కలపండి.
(పత్రికా ప్రకటన)
(కిమిడి కళా వెంకట్రావు,ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు)