తెలుగు ఇళ్లలో ఉన్న నిషేధాలివి, మీ ఇంట్లో ఎన్ని ఫాలో అవుతున్నారు?

తప్పు అనే మాట ఎట్లా వచ్చింది? ఆంధ్రపత్రిక 1945-46 సంవత్సరాది సంచికలో చిలుకూరి నారాయణరావు  ‘తప్పుల శాస్త్రం’ అని ఒక వ్యాసం వచ్చింది. అందులో ’తప్పు’ మాట ఏమిటో వివరించారు. అదే విధంగా తెలుగు వాళ్ల ఇళ్లలో పాటించే అనేకాచారాలను ఆయన సేకరించారు.  ఆంధ్రప్రతిక లో అచ్చయిన వ్యాసం నుంచి కొంత భాగం ఇక్కడ అందిస్తున్నాం.
(డా. చిలుకూరి నారాయణరావు)
“ తప్పు అనే పదము వైదిక, సంస్కృత ‘దభ్ర’ శబ్దభవం. దీనికి మహారాష్ట్రీయ ప్రాకృతములో ‘దబ్భో ’, అపభ్రంశ ప్రాకృతములో ‘దబ్బు’ పైశాచీ ప్రాకృతముంలో ‘తప్పు’ అని రూపములు. తప్పు అనే పదమే పోలినీసియను భాషలలోను,తప్పు దీవులు, ఆస్ట్రేలియా భాషలలోను ‘తబు’ అనేరూపముతో కనబడుతున్నది…. తప్పుకు పర్యాయపదమైన పోలినీషియను మాట ‘తబు’ అనేదానికి సంబంధించిన నిషేధములు ప్రపంచమందంతటా ఉన్నవి. ప్రాచీన రోమక దేశములో ఇట్టివాటిని ‘సేసర్ ’(Sacer) అనే వారు. గ్రీకులు ‘అగోస్ ’ (agos) అనేవారు. ఆమెరికా,ఆఫ్రికా, ఉత్తర, మధ్య ఆసియా మొదలయిన దేశాలలోని ఆయా సంఘముల వారిలో ఇట్టి తప్పల కమితముగా ప్రచారంలో ఉన్నది.  ‘తబు’ అనేది తప్పుతో సంబంధించిన పదమైనా ఇట్టి ప్రత్యేక తప్పులకు మాత్రమనువర్తింప చేసి ఇంగ్లీషు వారు టాబూ (Taboo) అనే పదమును తమ భాషలోనికి తీసుకుని ఆ ఆర్థములో వాడకొంటున్నారు.
‘తబు ’ అనే పదమునకు 1. పవ్రితమైన, దైవనివేదితమైన-అనిన్నీ, 2.అపాయకరమైన, నిషిద్దమైన, మైల అయిన- అనిన్నీ రెండు అర్థములున్నవి. ఎట్లాయినా ఇది ఆయా వస్తువులను గురించిన నిషేధములను గురించి తెలియజేస్తుంది. కొన్ని ఉదాహరణలిస్తే ఇట్టి నిషేధాల స్వభావము తెలుస్తుంది.
కొన్నికులాలలో ఇండ్లకు ఈతాకులు కప్పకూడదు. కొన్నికులాల వారు కొన్ని రకాల పక్షులను,జంతువులను చంపకూడదు.
పల్లెటూళ్లలోనికి ఒక ఇంటి అల్లుడు పోతే, అందరున్ను ‘మా’ అల్లుడువచ్చినాడంటారు. మా అమ్మాయిని కాకినాడకు ఇచ్చినామంటారు. ‘నీ భార్య ఆరోగ్యముగా ఉన్నదా’అనడానికి ‘మనవాళ్లు బాగున్నారా’ అని అడుగుతారు.
ఇంటివారి పేర్లు ఇతరులతో చెప్పకూడదు. దగ్గరి బంధువులను పేళ్లలో  పిలువకూడదు. తన సొంత తండ్రిని కానివానిని కూడా నాయనా అని పిలుస్తారు. తన్ను కన్నది కాకున్నా ఇతర స్త్రీని  అమ్మా అని పిలుస్తారు.
అట్లే అక్కచెల్లెళ్ల వరుసలు, అత్తమామల వరుసలు, బావమరదుల వరసలు, కొడుకు వరసలు కూడాను. సగోత్ర వివాహాలు కూడదు.
అసవర్ణ వివాహాలుకూడదు. సమానప్రవర వివాహాలు కూడదు. మాతృదోహము మహాపాతకము. కొన్నికూలాలలో పెండ్లిఅయిన అక్కా చెల్లెళ్లు అత్తవారింట ఉన్నపుడు అన్నదమ్ములు చూపులకు వెళ్లితే వారితో మాట్లాడకూడు. వారికి వీధి అరుగు మీదనే భోజనాదికము జరగవలెను.
చెల్లెలు అన్నను పేరుతో పిలువకూడదు. అల్లుడు వస్తే అత్త లేచి వెళ్లిపోతుంది. ఆషాడమాసములో అత్తా అల్లుడూ ఒక ఇంటిలో ఉండకూడదు.అట్లే ఆ మాసంలో అత్తా కోడలు ఒక ఇంటిలో ఉండకూడదు.
మగడు , పెండ్లాము ‘ఊ’ ‘ఆ’ ‘ఔనా’  అనే మాట్లాడుకోవలనే గాని ఎక్కువ చనువుగా మాట్లాడుకోకూడదు.
జార్జి చక్రవర్తిగారు ప్రయాణమైతే వెంట ఒక నల్లపిల్లి కూడా ఉండాలి. దేవుడికి గాని, దేవతకు గాని స్వయముగా పూజచేయకూడదు. పూజారి ఒకడు కావలెను.
రాజుగారికి మనవిని మంత్రిగారి ద్వారానే తెలియజేసుకొనవలెను. ఎరుకల యానాది మొదలయిన జాతులలో ప్రసవించే స్త్రీని  ఊరిబయట గుడిసెలో ఉంచవలెను. ప్రసవించిన తర్వాత కొన్ని సంస్కారాలు జరిగే వరకు తల్లిని బిడ్డను ఇంటిలోకి తేకూడదు.
నిప్పును నోటితో ఊదకూడదు. దీపమును చేతితో ఆర్పకూడదు.
దర్శనం చేసుకొని కొంతసేపు దేవాలయములో కూర్చొననిదే బయటికి రాకూడదు. విష్ణు విగ్రహమునకు జిల్లేడు పూలతో పూజ చేయకూడదు. చేట బోర్లించకూడదు.నిచ్చెనని చేరవేయనిదే నేల మీద ఉంచకూడదు.
తుమ్ముతూ ఉంటే బయలు దేరకూడదు. శవము వద్ద ఏడ్పురాకున్నా ఏడ్వవలెను. కూలిచ్చి అయినా ఏడ్పించవలెను. తర్పణము విడుస్తూ  ఏడవకూడదు. తద్దినము వద్ద ఏడ్వ కూడదు.
తననీడనొకరు త్రొక్క నివ్వకూడదు. ఒకరి అడుగుజాడలో తన అడుగు పడనివ్వ కూడదు. చచ్చిన శవమును బయటవేయవలెను, మంచము మీద చచ్చిపోనీయకూడదు.
అమృతముపుచ్చకోనిదే లేవకూడదు. ఆశీర్వదిస్తూ తలమీద చేయిపెట్టవలెను. విధవ ఆశీర్వదించకూడదు.
రాజదృష్టి తన మీద పడకూడదు.ఆదివారంనాడు ఉసిరికను ఏవిధముగాను ఉపయోగించకూడదు.  ఇట్లే జాతౌశౌచము, మృతాశైచము, స్పర్శాశౌచము,  దృష్టిదోషము, దిగదుడుపులు, బలులు,  క్షౌరము, దెయ్యాలు, దేవతలు, యజ్ఞములు, ప్రాయశ్చిత్తాలు, ఉపవాసాలు, వ్రతాలు, ముట్టుదోషము, శకునాలు, స్వప్నాలు, ఉపశ్రుతులు, పక్షులు,జంతువులు, చెట్లు మొదలయిన వాటిని గురించిన సంప్రదాయాలు, ఇవీ అవీ ఏమిటి ఎక్కడ చూచినా నిషేధాలు, తప్పులు తండొపతండాలుగా కనబడుతూనే ఉంటాయి.
వీటి తత్వమును తెలుసుకోవాలంటే పాశ్చాత్యశాస్త్రజ్ఞు లవంభించిన పద్ధతుల ననుసరించి పరిశోధనలు సాగించాయి.  ఈ విషయమై భారత వర్షములో ఎట్టి పరిశోధన జరగలేదు.‘ తప్పుల శాస్త్రము’ అని ఎవరున్నూ హేళన చేయనక్కరలేదు. ‘తప్పులశాస్త్రము’ ఏర్పడితే గాని, ‘ఒప్పుల శాస్త్రము’ ఏర్పడడానికి వీలు లేదు. ఆధునిక కాలములో తప్పు అనేది లేకుండా ఉండే స్థితి  ఏర్పడుతున్నది.  ‘ఒప్పు’ ఏదో తెలియని వ్యవస్థ కూడా వచ్చిపడుతున్నది. కారణము తెలియనిదాని ననుసరిస్తే మూఢవిశ్వాసమని ఉపేక్షించే కాలము వచ్చినది. అయినా ఈ మూఢ విశ్వాసాలు మనకు అస్థిగతములై నిలిచి పోయినవి
. బయట బడాయిగా మాట్లాడినా ఆసమయం  వచ్చినపుడు మనస్సులో లడాయి తప్పదు. తుదకు నిషేధము పాటించడమున్నూ తప్పదు. ఈ తప్పులకు  కారణాలేవో ఉండకపోతవా అన్నంత మాత్రముచేతనూ కార్యము లేదు.  కారణము లేని కార్యముండదన్నమాట సత్యమే. కాని, ఆ కారణమేమిటో తెలుసుకోవడమే శాస్త్రజ్ఞ లక్షణము.
మనమాకారణములను తుదకు తెలుసుకొనవచ్చును; తెలుసుకొనలేకపోవచ్చును. కాని పరిశోధనము, అన్వేషణము నిరంతర ప్రయత్నము- వీటిని శాస్త్ర దృష్టి కలవారు విడిచిపెట్టకూడదు.
ఈ దృష్టితోనే ‘కూడదు’ అని ఆంధ్రలోకముంలో ఉండే నిషేధాల నన్నింటిని ఒకచోటచేర్చనారంభించినాను.
ఇందులో వాటిలో కొన్నింటిని  ప్రకటిస్తున్నాను. అవన్నీ పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తప్పులని పరిశోధించే ‘తబు’ లు కాదు. ఏవి ‘తబు’లో,ఏవి కావో , అవి ‘తబు’లుగా ఏర్పడటానికి కారణాలేవో, అట్టి వానితో ఇతర దేశాలలో ఉండే ‘తబు’లేవో ,వాటికికారణాలేవో ముందర ఆ నిషేధములను సంగ్రహించిన తరువాత చేయవలసిన పని.
ఆంధ్ర దేశములో ప్రత్యేకముగా తప్పులుగా పరిగణింపబడేవాటిని నాకు పంపిస్తే తప్పు నిఘంటువులో చేర్చుకుని ప్రకటిస్తాను. నాకు పంపినా,పంపకపోయినా, ఈ విషయమై  కృషి జరుగవలసి ఉన్నదని పాఠకులు గ్రహిస్తే  అదేనాకు పది వేలు.
కూడదు
అక్ష, ఆరగ్వథ, కార్సాస, కరవీర, కరంజక సమిధలను  హోమమునకు వాడకూడదు
 ఆగ్నిని దాట కూడదు.
ఆగ్నిహోత్రమును నోటితో ఊదకూడదు.
అడవిలోనికి చేత కట్టెలేకుండా పోకూడదు.
అడవిలో పోతూ మాట్లాడకూడదు.
అత్తవావి అడగకూడదు. అన్నము బట్ట అంగడిలోకొని ఉపయోగించకూడదు. అపత్నీ కుడు పురోహితుడిగా  ఉండకూడదు.  అపత్నీకుని బ్రాహ్మణార్థానికి పిలువకూడదు. ‘అభద్ర’ మనకూడదు.(భద్రమనవలెను)
అభిఘరించనిదీ భోంచేయకూడదు.అమావాస్యనాడు క్షౌరము చేసుకోకూడదు.
అమృతము పుచ్చుకోనిదే భోజనమువద్ద నుంచి లేవకూడదు. అమ్మవారి గుడిల పడుకో కూడదు. అమ్మవారు ఊర్లో ఉన్నపుడు  ఇంటిలో నూనెతో పిండివంటలు చేయకూడదు.ఇళ్ల ముంజూరులో వేపాకుకొమ్మలు దోపకుండా ఉండకూడదు. ఇంటి ముందుగోడ మీద బొమ్మలు వ్రాయకుండా ఉండకూడదు.
అమ్మవారున్న ఇంటిచెత్తను వీధిలో వేయకూడదు. అమ్మవారున్న ఇంటి వారాయిల్లువిడువకూడదు.  అరణ్య కాండము తప్పించకుండా రామాయణము చదవుకూడదు. అలంకరించుకని పడుకో కూడదు. అలికిన చోట ముగ్గు వేయకుండా ఉండకూడదు.
అష్టమీ, చతుర్దశీ, పూర్ణిమా, అమావాస్య, రవి సంక్రాంతి దినములలో తైలాభ్యంగము చేసుకోకూడదు. ఆగ్నేయములో బావి తవ్వకూడదు.ఆచమించనిదీ భోంచేయకూడదు.
ఆచార్య, ఆచార్యపుత్రుడు, ఆచార్య భార్య, దీక్షితుడు, గురువు, పిత, మాత, మాతులుడు, హతైషి, విద్వాంసుడు, మామ,పినతల్లి, మగడు- వీరి పేళ్ల నుచ్చరించకూడదు. ఆడదానిని ఉత్తసున్నమడుగకూడదు. ఆడది పరుపురుషునికి సున్నమివ్వ కూడదు.
ఆడవాళ్లు గుమ్మడికాయ తరుగ కూడదు. ఆది, మంగళ, శుక్రవారములలో మధ్యాహ్నం,రాత్రి సంధ్యలలో రావిచెట్టు మొదటికి పోకూడదు.ఆదివారమునాడు ఉసిరిక నుపయోగించకూడదు. ఆలుమగల మధ్య నుంచి పోకూడదు.  ఆవును కట్టిన పలుపు(కన్నె, త్రాడు)ను దాట కూడదు.అవునమ్మినపుడు పలుగు (కన్నె)నివ్వ కూడదు.
ఇంటి గురించిన  నిషేధాలు
ఆషాడమాసములో అత్తా,కోడలు ఒకచోట ఉండకూడదు.  ఆషాడ మాసములో అత్తా అల్లుడు ఒకచోట ఉండకూడదు.
 ఇంటి ఆవరణలో కాకులు గుంపులుగా అర్వ కూడదు.  ఇంటి ఆవరణలో తీతువ పిట్ట అర్వ కూడదు. ఇంటికి ఈతాకు కప్పకూడదు. ఇంటికి ఐమూల ఉండరాదు. ఇంటికి దగ్గిరగా చింతచెట్టు ఉండకూడదు. ఇంటికి నడుమ స్థంభ ముండగూడదు. ఇంటికెదురుగా నుయ్యి ఉండగూడదు. ఇంటి పెరటిలో  ముండ్ల చెట్లుండగూడు. ఇంటి మధ్య భావి ఉండగూడదు.  ఇంటి ముందర వెలగచెట్టు ఉండగూడదు. ఇంటి ముందర స్తంభముండగూడదు. ఇంటిలో ఏదబంది ముల్లు ఉంచగూడదు. ఇంటిలోనికి వెళ్లేటపుడు దూలము కిందికి నడువ కూడదు. ఇంటిలో పలుకురాయి డ కూడదు. ఇంటిలోమూడు ద్వారాలు ఒక్క వరుసలో ఉండగూడదు. ఇంటి స్థంభముల వరుసల తప్పగూడదు. ఇద్దరికి మధ్య నిప్పు తీసుకుపోగూడదు. ఎడమ కాలితో ( కొత్త అల్లుడు ,  కోడలు) ఇంటిలో ప్రవేశించకూడదు.ఐమూలమంచము మీద పడుకో గూడదు.  ఐమూల యింటిలో వాసము  చేయగూడదు. ఒక్క మంచము మీద మూడు గోత్రాల వారు కూర్చోగూడదు..తన ఇంటిలో తూర్పుతల,  మామ ఇంటిలో దక్షిణపు తల, మార్గమధ్యంలో పడమటి తల, ఉత్తరపు తలగా ఎన్నడూ పడుకోరాదు.చచ్చిన పద్నాలుగో నాడు బంధువు ఇంటిలో ఉండరాదు.  వెళ్లతూ వెళ్లుతున్నామని చెప్పరాదు.పెండ్లిఅయిన తర్వాతి చైత్రమాసంలో పుట్టింట ఉండగూడదు. పుష్యమాసములో అత్తింట ఉండగూడదు. పెండ్లి పదహారుదినముల దాకా పెండ్లిపందిరి తీయగూడదు.
భారతము పద్దెనిమిది పర్వములు ఇంటిటో ఉంచకూడదు.రాత్రి ఇంటిలో ఈల వేయకూడదు.మూడు వాకిళ్లెదురుగా ఉండరాదు.కొత్త కుండకు సున్నం తగిలించనిదే ఇంటిలోనికి తేగూడదు. కొత్త కుండను తడుపనిదేఉపయోగించగూడదు. కొత్త కుండను ముందటి వాకిలినుంచి తేగూడదు.
మరికొన్ని నిషేధాలు
ఇద్దరు బ్రాహ్మణుల మధ్య నుంచి పోకూడదు. ఇంధ్ర ధనుస్సు అనకూడాదు. ‘మణి’ ధనుస్సు అనాలి. ఇనుమును బంగారమును ఒక చోట ఉంచరాదు.  ఈనిన ఆవు మొదటి పాలు ఇతరులకివ్వనిదే ఉపయోగించకూడదు. ఉత్త ఉయ్యాల ఊచగూడదు. ఉత్త ఏలక కాయలు నమలకూడదు. ఉత్త వక్కలునమల కూడదు. ఉప్పు ఎరువిచ్చి  అడగకూడదు, ఉప్పు చేతిలో వేయకూడదు,వేయించుకోకూడదు. ఉప్పు కింద చల్ల కూడదు.  ఎటు వెళుతున్నావ్, ఎక్కడికి వెళ్తు తున్నావు అని అడగకూడదు.  ఎండకెదురుగా పోగూడదు.
నిప్పును ఎదురుగా తీసుకుపోకూడదు. ఎద్దును, ఎనుమును ఒక్క కాడికి కట్ట కూడదు. ఎలకుల పొడి వేసిన పాలు త్రాగకూడదు.  ఒంటికి నూనె పూసుకుని ఏమిన్నీ తినగూడదు. కడిగినపాత్రను బోర్లించకుండా ఉంచకూడదు. కడుపుతో ఉన్న వాళ్ళు కూరలు తరగకూడదు. ‘కపాలము’ అనగూడదు. (‘భగాలము అనవలెను). కప్పను చంపకూడదు.
కాలిన కుండలో నీళ్లు పోయగూడదు. క్రీనీడలో కూర్చో గూడదు, నిలుచోగూడదు.  గాడిదల చేత దున్నించకూడదు. గుమ్మము మీద కూర్చుని తుమ్మగూడదు. గొడ్డుటావుఅనకూడదు. ధేను భవ్యఅనవలెను. గొఱ్ఱెల(మేకల) మంద మధ్యనుంచి  పోగూడదు. గోడకు పూసిన సున్నమును తాంబూలమునకు ఉపయోగించకూడదు. గ్రహణమపుడు నీళ్లమీదను, వండిన పదార్థాల మీదను దర్బలు వేయకుండా ఉంచరాదు.  చిన్నవారి చేతినుంచి డబ్బును చేతిలో వేయించుకోరాదు. చేట జల్లెడ, దాగరి బోర్లించకూడదు. చేటతోను, చేతితోనూ, బట్టతోనూ, నోటితోనూ, పిడకతోనూ అగ్గిని విసరకూడదు. చేటను దాటకూడద. చేటలో నిప్పులు చెరగగూడదు.  చౌతి చంద్రుని చూడగూడదు.తడిపిన బట్ల నీళ్లను మీద పడనీయ కూడదు.
తద్దినానికి వంకాయ కూర వండగూడదు. తనకు తానే క్షౌరం చేసుకోకూడదు తమల పాకు వేసుకోనిదే వక్క వేసుకోరాదు. తాటి, రావిచెట్ల నీడను దాటకూడదు. తొడమీద కంచెం (గిన్నె) పెట్టుకుని తినకూడదు. దీపమారినది అనకూడదు.(కొండెక్కినది, ఘనమైనది అనవలెను).
నీటిలో నీడ చూసుకోగూడదు. నూనె అప్పు ఇచ్చిపుచ్చుకున్నపుడు తక్కువ అనకూడదు. పరగడుపున ముట్టనీళ్లది చంటిబిడ్డను చూడకూడదు. పర్వదినాలలో సముద్రం తాకకూడదు. పసుపు,కుంకుమ, బియ్యము అయిపోయినవి (లేవు) అనకూడదు. (నిండుకొన్నవి అనవలెను). పసుపుకుంకుమల నెరవీయకూడదు. పసుపు సున్నము ఒక చోట ఉంచకూడదు.పాఢ్యమి చంద్రుని చూడగూడదు.
పాదము మీద పాదము వేసి తోమకూడదు .పీటలను గోడలకు వెల్లకిల చేరవేయ కూడదు.  పెద్ద గమ్మడి కాదు, పెరిగిన దుంపలు, శ్రీఫలము, కళింగము, ఉసిరిక, వీటిని పాడ్యమినాడు తినగూడదు.నోటిలో బియ్యం గింజలు వేసుకుని నమలగూడదు. పగలు సెనగలు తినకూడదు  పదార్థములనొడిలో పెట్టుకుని  తినగూడదు.
పెళ్లిళ్లలో మధ్య కన్నము పెట్టి గారెలుచేయరాదు. పేడను దాటగూడదు.ప్రయాణమయిన తొమ్మిదో నాడు గమ్యస్థానం చేరగూడదు, తిరిగి రాకూడదు.ప్రొయ్యి మీద కూర్చోగూడదు.
బంగారమును నేలమీద పెట్ట గూడదు.బేసి ఆకులు, సరి వక్కలు ఇవ్వకూడదు. భార్యను పేరుతో పిలవుగూడదు. భార్యపేరనితరులకు చెప్పగూడదు. భోంచేసి స్నానము చేయకూడదు. మగని పేరు చెప్పగూడదు. మంగళవారం నాడు చింకిగుడ్డలు కుట్టకూడదు.
మంచము కాళ్ల కడ దిక్కున తల పెట్టుకుని పడుకోగూడదు. మంచము మీద కూర్చుని భోంచేయకూడదు. మంచము మీదనిప్పు పెట్టకూడదు. మంచాల కింద నిప్పుల కుంపటి ఉంచకూడదు.వంటకోసం మరొక ఇంటినిప్పు తీసుకురాకూడదు.  వంటపొయ్యిని అలుకనిదే నిప్పు వేయగూడదు.  వంటపొయ్యిని కిరసనూనే వేసి ముట్టించగూడదు. వధూవరులు మధ్య నుంచి పోకూడదు. వరివేళ్లు నమలకూడదు.
మజ్జిగలో పాలు పోయకూడదు. మరొక వస్తువు ఉన్నదనవలెను గాని, అడిగినవస్తువు లేదనుకూడదు . మర్రి ఆకులో భోజనం చేయకూడదు.మోదగాకులతో తినకూడదు. రాగిపాత్రలో పాలు త్రాగకూడదు, పోయకూడదు.ముట్టునీళ్లు పోసుకొన్ననాడు  వంట చేయకూడదు. ముఱ్ఱుపాలు తాగకూడదు. రాత్రి తేనె తినగూడదు. రాత్రి నువ్వులు కలసిన ఏ పదార్థమూ తినగూడదు. రాత్రి పూట బయటినుంచి నీళ్లు తేగూడదు. రాత్రి పెరుగుతినగగూడదు. రాత్రి మంచమునేయగూడదు.రాత్రి వెలగపండు తినగూడదు.వండిన గిన్నెలో నుంచే వడ్డించకూడదు. వండిన పాత్రలో భోంచేయకూడదు. రాత్రి పసుపు, కుంకుమ, మజ్జిగ, సున్నము, తమలపాకులు, పరులకుఇవ్వకూడదు.
  ముఖ క్షౌరం మాత్రం చేసుకో కూడదు ముగ్గురు బ్రాహ్మణులు కలసిపోరాదు.
ముట్టుది ముట్టదానిని ముట్టకోరాదు. ముట్లు నీళ్లనాడు కాటుక బొట్టు పెట్టుకోకూడదు. ముట్లునీళ్లు పోసుకుని చంటిబిడ్డలున్న ఇంటికిపోకూడదు. ముట్టునీళ్లు పోసుకుని చింతపండు నోటిలోపెట్టుకుని వేసుకోనిదే చంటిబిడ్డను ముట్టుకోకూడదు.
మూడుజాతుల కట్టెలతో మంచము చేయరాదు.మొలత్రాడు లేకుండా ఉండరాదు.
రాత్రి నిషేధాలు
యక్షగానాలయములలోను, కుమార స్వామి ఆలయములలోనూ నిద్రించకూడదు. రంగుబట్ట కట్టుకోకూడదు. రాత్రి ఎలుకులు అనకూడదు,‘సోములు’అనవలెను. రాత్రి కోతి అనకూడదు, అంటే ‘చెవి’ గిల్లు కోవలెను. రాత్రి పువ్వులు కోయగూడదు. రాత్రి పూట కసవూడ్చి బయటవేయరాదు. రాత్రిపూట గింజలు, నీళ్లు, అన్నము, అగ్గి, పాలు, ధన్యాము, ఔషధములు ఇతరుకు ఇవ్వకూడదు. రాత్రి పూట పెరుగటుకులు తినరాదు. రాత్రిపూటపేడ ఎత్త కూడదు.
రాళ్లసున్నము తాంబూలములో ఉపయోగించకూడదు. రోకిలిని కింద పరుండ బెట్టకూడదు. రోటిని, సన్నెకంటిని, పుస్తకమును కాలితో తన్నకూడదు. రోటి మీదకూర్చోకూడదు, కూర్చుని తుమ్మ కూడదు. వంకాయ,సొరకాయ,బూడిదగుమ్మడికాయ పొట్లకాయ తద్దినాలకు పెట్టకూడదు.
 వక్కలు చూచి ఊదనిదీ నోటిలో వేసుకోకూడదు.
విదియ(శుక్ల) చంద్రుని చూడగూడదు. వీధిలో (గ్రామములో) ఒక ఇంట శవమున్నపుడు పొయ్యిలో నిప్పు వేయగూడదు. వెల్లకిలపరుండగూడదు.‘శనివారము’ అని అనకూడదు, మందవారము అనవలెను. శవము వస్తుంటే ఎదురుగా పోకూడదు.
శివనిర్మాల్యమునుపయోగించకూడదు. శివప్రసాదము నుపయోగించుగూడదు. శివాలయమునకు ముందు, విష్ణ్వాలయమునకు వెనక, కుమార స్వామి ఆలయమునకు పక్కల, దేవీ ఆలయమునకు ఏప్రక్కను ఇల్లు కట్టగూడదు.
శుక్రవారం నాడు కొత్త కుండలను  కొనగూడదు. శ్రాద్ధ, జన్మ, వివాహ, వ్రత, ఉపవాస దినాలలో తైలాభ్యంగము చేయరాదు. శ్రాద్ధపు వంటలో ఇంగువ కరివేపాకు వేయకూడదు. సంధ్యాకాలముంలో గోమూత్రము పట్టరాదు.
సంపుటములుగా ఉన్న ఏ గ్రంధమును ఇంటిలో ఉంచుకొనరాదు. స్త్రీలను పేరుతో పిలువగూడదు. స్మశానముదాటిన తర్వాత వెనుకకు చూడగదు.స్మశానముంలో ఉదకుంభము పగులగొట్టి వెనకకు చూడగూడదు.