Home Features రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావుకు నివాళి : టి లక్ష్మినారాయణ

రైతు ఉద్యమ నేత కొల్లి నాగేశ్వరరావుకు నివాళి : టి లక్ష్మినారాయణ

334
0
(T Laskhminarayana)
కమ్యూనిస్టు నైతిక విలువలకు నిలువుటద్దం, శ్రామిక ప్రజల ఆపద్భాందవుడు, రైతాంగం సమస్యలపై అలుపెరగని పోరుసల్పిన ఉద్యమ నేత, విద్యార్థి దశలోనే “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అంటూ నినదిస్తూ వీరోచిత పోరాటంలో విద్యార్థి కార్యాచరణ కమిటీకి కన్వీనరుగా అగ్రభాగాన నిలబడి ఉద్యమించిన నాయకుడు, చల్లపల్లి జమీదారు భూములను పేదలకు పంపిణీ చేయాలని సంవత్సరాలు పాటు సాగిన పోరాటంలో క్రియాశీల భూమిక పోషించిన ధన్యజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు(82) గారు మే 21 మధ్యాహ్నం 3-30 గం.ల సమయంలో తీవ్రగుండె పోటుతో మృతి చెంది మా కుటుంబాన్నే కాకుండా భారత కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శ్రేణులను, శ్రేయోభిలాషులను అత్యంత విషాదానికి గురిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలవనరులపై లోతైన అధ్యయనం చేసి 2005లో “ఆంధ్రప్రదేశ్ జలదర్శిని” శీర్షికతో ఒక గ్రంధాన్ని రచించారు. నాటి ముఖ్యమంత్రి డా.వై.యస్.రాజశేఖరరెడ్డి గారు హైదరాబాదు జూబ్లిహాలులో ఆవిష్కరించి, ఒక ప్రత్యేక జీ.ఓ.జారీ చేసి, నీటి పారుదల రంగానికి సంబంధించి ఆ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని ఇరిగేషన్ కార్యాలయాలకు, అధికారులకు పంపించారు.
గోదావరి నదీ జలాలను తరలించి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న డిమాండుతో 1999 మార్చి 22న ఇందిరాపార్కు వద్ద ఆమరణ నిరాహారధీక్షకు పూనుకొన్నారు. అన్ని రాజకీయ పక్షాలు స్పందించి, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసిన మీదట అన్ని పక్షాల నాయకుల సమక్షంలో మార్చి 24న ధీక్ష విరమించారు. పోలవరం సత్వర నిర్మాణం కోసం, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు పరరక్షణ, పులిచింతల నిర్మాణం, బుడమేరు, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు, ఉత్తరాంద్రలోని వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి నిథులు కేటాయించి, యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని అంకితభావతో నిరంతరం పోరాడిన రైతాంగ ఉద్యమ నేత.
భారత దేశ రైతాంగం ప్రయోజనాలకు హానికలిగించే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్లుటీఓ) విధానాలను ఎండగడుతూ కా.కొల్లి నాగేశ్వరరావు వ్రాసిన పుస్తకాన్ని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. డబ్లుటీఓ – వ్యవసాయ సంక్షోభం అన్న శీర్షికతో రచించిన మరొక పుస్తకాన్ని సిపిఐ, ప్రధాన కార్యదర్శి కా.సురవరం సుధాకరరెడ్డి ఆవిష్కరించారు.
నకిలీ బిటి విత్తనాలు, మాన్సెంటో కంపెనీ దోపిడీపై గళమెత్తడమే కాకుండా సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి, పోరాడి విజయం సాధించారు.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ఉద్యమం సందర్భంగా కా.కొల్లి నాగేశ్వరరావుపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించింది.
విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా 2000 సం.లో జరిగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలబడ్డారు. బషీర్ బాగ్ లో పోలీసు కాల్పులు జరిగిన సందర్భంలో జరిగిన లాటీఛార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. నాటి ప్రభుత్వం 21 మందిపై అక్రమంగా బనాయించిన హత్యానేరం కేసులో కా.కొల్లి నాగేశ్వరరావు కూడా ఒకరు.
కా.కొల్లి నాగేశ్వరరావు గారు విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎ.ఐ.ఎస్.ఎఫ్.) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(1962-65), సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శిగా(1992-2002), అర్హ్యక్షులు(2002-07)గా, జాతీయ ఉపాధ్యక్షులు(2007 నుండి)గా సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించారు. రైతులోకం మాసపత్రిక సంపాదకులుగా బాధ్యత నిర్వహించారు.
1962లో ఫిన్లండులో జరిగిన ప్రపంచ విద్యార్థి – యువజనోత్సవాలలో పాల్గొన్నారు. అదే సంవత్సరం పోలెండులో జరిగిన ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డబ్లు.ఎఫ్.డి.వై.) మహాసభలకు అతిథిగా హాజరైనారు. 1973లో ఏడాది పాటు మార్క్సిస్టు సైద్ధాంతిక అధ్యయనం కోసం మాస్కోకు వెళ్ళారు. 1975లో చెకోస్లావేకియాకు వెళ్ళారు. 2007లో చైనా పర్యటనకు వెళ్ళి వచ్చి చైనా వ్యవసాయ రంగంపై పుస్తకాన్ని ప్రచురించారు.
1938 ఏప్రిల్ 7న కృష్ణా జిల్లా ముసునూరు మండలం, గుడిపాడు గ్రామంలో ఒక ఉన్నత మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన కా.కొల్లి నాగేశ్వరరావు గారు, ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, బీహార్ లోని భాగల్పూర్ యూనివర్సిటీలో యం.ఏ. చదివారు.
విద్యార్థి దశలోనే మార్క్సిస్టు భావజాలం వైపు ఆకర్షితులై విద్యార్థి, కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించి, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. కమ్యూనిస్టులకు సొంత ఆస్తి ఉండకూడదన్న భావనతోనే జీవితాంతం కట్టుబడి ఆదర్శంగా నిలిచారు. కా.కొల్లి నాగేశ్వరరావు గారి జీవిత భాగస్వామి కా.టాన్యా గారు అధ్యాపకురాలుగా పనిచేస్తూ కుటుంబ పోషణ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తే, ఆయన కమ్యూనిస్టు, రైతు ఉద్యమ నిర్మాణంలో పూర్తి కాలం అంకిత భావంతో పని చేశారు.
తాను ప్రేమించి, దండల పెళ్ళి చేసుకొన్నారు. తమ పెద్ద కుమార్తె ప్రేమించిన యువకునితో కులాంతర, అంతర్రాష్ట్ర, ఆదర్శ వివాహం చేశారు. పెద్ద కుమార్తె డాక్టర్, పెద్దల్లుడు ఇంజనీర్. ఉన్నత వైద్య విద్యను ఆర్జించి, డాక్టరైన చిన్న కుమార్తెకు కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం పని చేస్తున్న కార్యకర్తతో దండల పెళ్ళి చేశారు. తాను ఆదర్శ కమ్యూనిస్టు జీవితాన్ని గడపడమే కాదు, తన కుటుంబాన్ని కమ్యూనిస్టు నీతితో జీవించే వాతావరణాన్ని సృష్టించారు. కా.కొల్లి నాగేశ్వరరావు గారికి సంపూర్ణ తోడ్పాటును అందించిన మా అత్తమ్మ మాకు, మా పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు.
నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో కా.కొల్లి నాగేశ్వరరావు గారితో పరిచయం ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమం మాఇరువురిని మామా అల్లుళ్ళ బంధంతో పెనవేసింది. మా కుంటుంబ పెద్దగా కా.కొల్లి నాగేశ్వరరావు గారిని కోల్పోవడం తీరనిలోటు. అంతకు మించి కమ్యూనిస్టు ఉద్యమం ఒక ఆణిముత్యం లాంటి ఉత్తమ శ్రేణి, విలక్షణమైన నాయకుడ్ని కోల్పోయింది.
(T Laskhminarayana is a noted sociopolitical commentator from from Hyderabad, He led and participated in many poeples’ movements in erstwhile Andhra Pradesh)