వికేంద్రీకరణను అడ్డుకోవడం, వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయమే: డా. అప్పిరెడ్డి

(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి)

సీమ సాహిత్య, ప్రజాసంఘాలుగా మన హక్కులను కాపాడుకొందాం.

మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకొంది. అధికార, అభివృద్ధి  వికేంద్రీకరణ రాజధాని నుండే ప్రారంభించింది. ఈ ప్రజాస్వామిక స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు అన్ని  రంగాలలో ఫలితాలు అందుకొనే మార్గం ఏర్పడుతుంది. వికేంద్రీకరణ అనేది ఈ రోజు విషయం కాదు. 1937 శ్రీభాగ్ ఒప్పందంలోనే  వికేంద్రీకరణ మూలాలున్నాయి. రాజధాని, నీళ్లు, శాసనసభ స్థానాలు తదితర విషయాలలో రాయలసీమ ప్రాంతానికి సరైన ప్రాధాన్యత కలిగిస్తామని భరోసా ఇవ్వడంతోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు సాకరమైంది. లేదంటే ఆ రోజే సీమ దారేదో చూసుకొనేది. ఈ రోజున 1953 నాటి ఆంధ్రరాష్ట్రం మనముందు నిలిచింది. ఆనాడు రాజధానిగా కర్నూలు, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేసారు. సీమ‌ ఆకాంక్షలను ఆనాటి నాయకులు ఆమేరకు సాధించగలిగారు.
నేడు సీమకు రాజధాని స్థానంలో కనీసం హైకోర్టు లభించే అవకాశం వచ్చింది. నిజానికి సీమవాసుల డిమాండ్ రాజధానే అయినప్పటికీ తప్పని పరిస్థితులలో శ్రీభాగ్ ఒప్పందం మేరకు అసంతృప్తితోనైనా హైకోర్టుకు కట్టుబడుతోంది. మరో వైపు కార్యనిర్వాహక రాజధాని వెనుకబడిన ఉత్తరాంధ్రకు కేటాయించడంతో కొన్ని సమస్యలు ఉన్నా  సీమలో ప్రత్యామ్నాయంగా మినీ సెక్రటేరియట్ ను భవిష్యత్తులో కోరాలని కూడా  సీమ వాసులు భావిస్తున్నారు. సీమ సాగునీళ్ళ విషయంగా న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు.
సీమ వాసుల సగటు పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని పార్టీలు, అనుబంధ సంఘాలు ఏకీకృత రాజధానిగా ఇప్పటికే  నిర్ణయించిన ప్రాంతం నుండి కదిలించకూడదని చెబుతున్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి బహిరంగంగా అసలు శ్రీభాగ్ అస్తిత్వమే పట్టించుకోవలసిన అవసరం లేదని ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి. ఏ సీమ జీవితాలలో మార్పులకు ఎనిమిది దశాబ్దాల తర్వాత అవకాశం కలుగుతుందో ఆ ద్వారాలను మూసివేసే ప్రయత్నాలు చాకచక్యంగా జరుగుతున్నాయి. ఇందుకు ఒకరికొకరు తోడవుతుండడం సీమ సమాజం గమనిస్తూనే ఉంది. ఏకీకృత రాజధాని కోసం సీమలోను గందరగోళానికి గురి వేసి ఆందోళనలు చేయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అమరావతికి ఉన్న హక్కులు, ప్రాధాన్యత  అనంతపురం వంటి ప్రాంతాలకు కూడా ఉంటాయనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెడుతున్నారు.
ఈ రోజు వికేంద్రీకరణలో భాగంగా సీమలో  హైకోర్టు వస్తే ఎదో ఘోరం జరిగిపోతున్నట్లు రకాలుగా  రాత్రింబవలు ఆతృత చెందుతున్నారు. రేపు సీమ వాసులకు నీళ్ళు దక్కనిస్తారా అని అనుమానం కలుగుతోంది. తరతరాలుగా రాయలసీమ కరువులతో కూనరిల్లుతుంటే శ్రీభాగ్ ప్రకారం కృష్ణాజలాలలో కనీసం సగమివ్వమని ఎందుకు పార్టీలు తీర్మానం చేయవు? రాజధాని పై ఉండే ఆసక్తి సీమ అవసరాల పై ఎందుకు ఉండదు?.  ఇంత ధైర్యంగా, అమానవీయంగా సీమ భవితవ్యాన్ని  తాకట్టు పెట్టే స్థాయికి  చేరారంటే దానికి కారణం సీమవాసుల అమాయకత్వం, చైతన్య రాహిత్యమే అవుతుంది. ఈ రోజు అరకొరగా వస్తున్న అవకాశాలను కూడా సీమవాసులు అందుకోలేక పోతే భవిష్యత్తులో సీమ మనుగడనే కోల్పోవలసి వస్తుంది.
రాయలసీమ ప్రయోజనాలను అడ్డదిడ్డంగా వ్యతిరేకించే వారినెవరినైనా సరే ప్రశ్నిద్దాం. సీమలోని ప్రజాసంఘాలు, సాహిత్య సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక వర్గాలు తమ పరిధిలో సీమ హక్కులను కాపాడుకోవడానికి తీర్మానాలు, కార్యక్రమాలు చేపడదాం. నేడు హైకోర్టు, రేపు మినీ సెక్రటేరియట్, ఒక పూట అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు ప్రధానంగా నికరజలాలను సాధించుకొందాం.

(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక, అనంతపురం మొబైల్: 9963917187)