మోదీకి అచ్చిరాని దక్షిణం, ఆ మ్యాజిక్ ఎక్కడ? : సివోటర్ సర్వే

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరును అంచనా వేయడంలో దక్షిణ భారత దేశానికి,మిగతా భారతదేశానికి చాలా తేడా ఉంది. ఒకే దేశంలో ఉన్నా మోదీ విషయానికొచ్చే సరికి  ఉత్తరం,దక్షిణం అక్షరాలా కలవని దృవాలలాగా ఉన్నాయి.  దక్షిణ భారతం దేశంలో భాగా కాదా అన్నట్లనిపిస్తుంది.

దేశంలోని 534 నియోజకవర్గాలలో  ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సివోటర్ (CVoter) జరిపిన ఒక సర్వే లో విషయం వెల్లడయింది.

సర్వే పలితాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేశంలోని అన్ని నియోజకవర్గాలలో మొత్తం 60,000 మంది వోటర్లను సర్వేకోసం సంప్రదించారు.

దక్షిణ భారతదేశంతో పాటు పంజాబ్ లో ప్రధాని పనితీరు మీద పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉంది. ఇక మోదీ పాపులారిటీ జార్ఖండ్, రాజస్థాన్, గోవా, హర్యానాలలో చాలా ఎక్కువగా ఉంది.  ప్రధానిగా మోదీమీద వారు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఈ సర్వే ప్రకారం, జార్ఖండ్ లో74 శాతం, రాజస్థాన్ లో 68.3శాతం.,. గోవాలో 66 శాతం, హర్యానాలో 65.9 శాతం  సంతృప్తి వ్యక్తం చేశారు.

దేశంలో అత్యంత ఎక్కువగా మోదీని ద్వేషించే రాష్ట్రం  తమిళనాడు. అక్కడ ఆయన పాపులారిటీ పాతాళంలో ఉంది. ఈ మధ్య మోదీ తమిళనాడుకు ఎపుడు వెళ్ళినా మోదీ గోబ్యాక్ అందోళన వస్తున్నసంగతి తెలిసిందే. ఇది  ఒక్క సోషల్ మీడియా(#ModiGoBack) లోనే కాదు, వీధుల్లోకూడా  కూడా కనిపించింది. రోడ్లెక్కి ప్రజలు మోదీగో బ్యాక్ అని అరిచారు. సివోటర్ సర్వే ప్రకారం మోదీ పాపులారిటి తమిళనాడులో కేవలం 2.2 శాతమే. ఈ నిరసనకు సర్వే అద్దం పడుతున్నది.

 

దక్షిణాదిలోమోదీ ఏ మాత్రం పాపులర్ కాకపోవడం ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే, ఇక్కడ  ఒక్క కర్నాటకలో తప్ప ఎక్కడాబిజెపికి ఎన్నికల్లో పోటీ చేసేంత శక్తి లేదు. చాలా చోట్ల ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు ఉంటేనే కొన్ని సీట్లు వస్తాయి.లేకపోతే, వురువు రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఇతర ప్రాంతీయ  పార్టీల చేయిపట్టుకుని బిజెపి ఇక్కడ నాలుగడుగులునడవాలనుకుంటున్నది.

తమిళనాడులో కరుణానిధి, జయలలితపోయాక, ఎఐడిఎంకె సాయంతో  బిజెపి  అక్కడ కాలుమోపాలని చూస్తున్నది. ఈ ప్రయత్నం విజయవంతంకాకపోవడమే కాదు,  ఎఐఎడిఎంకెనే ముంచే అవకాశం జాస్తి అని సివోటర్ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఏ దక్షిణాది రాష్ట్రంలో కూడా   బిజెపి లేదు.ప్రాంతీయ పార్టీ ఇంకా వేళ్లూనని కర్నాటకలో మాత్రమే బిజెపి బలపడింది. ఇపుడు జనతాదళ్ ఎస్ ప్రాంతీయ పార్టీ గా మారిపోతూ ఉంది.  అందుకే బిజెపి అంతకు మించి బలపడకుండా జెడిఎస్ అడ్డుకుంటూ ఉంటుంది. అందువల్ల కర్నాటకలో కూడా ఇంతకు మించి బలపడుతుందా? వేచి చూడాలి.

తమిళనాడుకు సంబంధించి  బిజెపి  హిందీ పార్టీ, బ్రాహ్మిణికల్ పార్టీ అని చెడ్డపేరు.  ద్రవిడియన్ నేషనలిజానికి ఇది ముప్పుని అని చాలా మంది తమిళ ప్రజలు భావిస్తున్నారు. కావేరి జలాల వివాదం నుంచి జల్లికట్టు దాకా మోదీ ప్రభుత్వం నిర్ణయాలన్నీ తమిళప్రజలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవే అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

తమిళనాడులోలాగే కేరళలో కూడామోదీ అంటే బాగా అసంతృప్తి ఉంది. ప్రధానిగా మోదీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది కేవలం 7.7 శాతమే. కేంద్ర పాలిత ప్రాంతంలో పుదుచ్చేరిలో కూడా మోదీ అంటే మోజుపడిన వారు కేవలం 10.7 శాతమే.

అంతగా హిందీ వ్యతిరేకత లేని ఆంధ్రలో పరిస్థితి కొంచెం మెరుగు. అక్కడ మోదీ అంటే సంతృప్తి వ్యక్తం చేసిన వారు 23.6 శాతం దాకా ఉన్నారు.

తెలంగాణ,కర్నాటక లలో మాత్రం మోదీ కొద్దిగా బలంగా నే ఉన్నారు. తెలంగాణలో ప్రధానిగా మోదీ  పనితీరు మీద 37.7 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కర్నాటకలో  38.4 శాతం ప్రధానిగా మోదీ  చేసిన దాని మెచ్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాల కు సంబంధించి ఆంధ్రలో రెండు ప్రాంతీయపార్టీలు,టిడిపి, వైసిపిలు, ఇప్పటికయితే బలంగా ఉన్నాయి. ఈ పార్టీలు మోదీ తో పొత్తు పెట్టుకున్నా సరే,  బిజెపిని మాత్రం ఎదగనీయవు. ఇంక తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ బిజెపికి కొంత జాగా ఉన్నట్లు కనిపిస్తుంది. కారణం, ఇక్కడ కాంగ్రెస్ బలహీనపడ్డాక ఏర్పడిన ఖాళీలోకి మరొక పార్టీ రాలేదు. తెలంగాణ జనసమితి ప్రయోగం విజయవంతం కాలేదు. తెలుగుదేశం పార్టికి  భవిషత్య్తు కనిపించడం లేదు. పవన్ తెలంగాణలోకి రావడానికి జంకుతున్నారు.వైసిపి అధినేత జగన్  తెలంగాణ రాష్ట్ర సమితితో  పోటీ పడే స్థితి లో లేరు. అందువల్ల  ఇక్కడ ఒక్క ప్రాంతీయ పార్టీ మాత్రమే ఉంది. మరొక పార్టీయే లేదు. ఒకే పార్టీ పాలన ఎంతోకాలం సాగదు.రెండోపార్టీకి ఉన్న జాగాలోకి మోదీ నాయకత్వంలో బిజెపి రాగలుగుతుందా? లేక మోదీ వచ్చే లోపు కాంగ్రెస్ బలపడుతుందా?  లేదంటే మరొక ప్రాంతీయ పార్టీ రావాలి.  ఈ సందిగ్ధ సంధ్య ఎంతకాలం ఉంటుందో చూడాలి.

మొత్తంగా నార్త్ ఇండియాలో పంజాబ్ మాత్రం మోదీ విషయంలో భిన్నంగా వ్యవహరించింది. ఇక్కడ కేవలం 12 శాతం మంది మాత్రమే ప్రధానిగా మోదీ పనితీరు మీద సంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, ఉత్తరాన కాంగ్రెస్ పార్టీ చేతిలోకి మళ్లీ వెళ్లిన మొదటి రాష్ట్రం పంజాబే. దీనికి కారణం సివోటర్ సర్వే లో కనిపిస్తుంది.

జనరల్ గా హందీ అధికార భాష కాని రాష్ట్రాలలో మోదీ పాపులారిటీ లేకపోవడం కనిపిస్తుంది. అయితే, తూర్పున  ఒదిషాలో  మాత్రం మోదీ బలంగా ఉన్నారు. అక్కడ బలమయిన ప్రాంతీయపార్టీ బిజూజనతాదళ్ అధికారంలో ఉన్నా  62.5 శాతం మంది ప్రధాన మంత్రిగా మోదీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా తెలంగాణ పరిస్థితే. మరొక ప్రాంతీయపార్టీలేదు కాబట్టి, జాతీయ పార్టీలు ఆజాగాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ వెనకబడింది.అందుకే మోదీ స్ఫూర్తితో బిజెపి దూకుడుగా ఉంది.

అయితే, హిందీ భూభాగంలో ప్రధానమయిన ఉత్తర ప్రదేశ్ లో  మోదీ పాపులారిటి తక్కువగా ఉండటం ఆశ్చర్యం. అక్కడ కేవలం 43.9 శాతం మంది మాత్రమే . మోదీ యుపి లోని వారణాసి  నుంచి ఎన్నికయిన  ఎంపి అని మరువ రాదు.  ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టిపోటీ ఇవ్వాలనుకుంటున్న పశ్చిమబెంగాల్ మోదీ పాపులారిటీ  43.2 శాతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *