Home Features ఫ్లాష్‌బ్యాక్: పీవీపై సోనియా కక్షసాధింపు వెనక అసలు కథ ఇదీ!

ఫ్లాష్‌బ్యాక్: పీవీపై సోనియా కక్షసాధింపు వెనక అసలు కథ ఇదీ!

636
0
SHARE

(శ్రవణ్‌)

రెండున్నర దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి పీవీ నరసింహారావును సోనియా ప్రశంసించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ అధినేత్రి, ఎందుకు ఇలా టర్న్ ఎరౌండ్ తీసుకుందనేదానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. అయితే ఈ వ్యాసం దానిగురించి కాదు. అసలు వారిద్దరికీ మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి తెలియక చాలామంది సోనియాదే తప్పన్నట్లుగా judgements ఇచ్చేస్తున్నారు… ముఖ్యంగా తెలుగువారు. అందులోనూ ఒక సామాజికవర్గంవారైతే గత పదిహేనేళ్ళుగా సోనియాపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ సామాజికవర్గంలోని అత్యధికులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గంపగుత్తగా మద్దతు ఇస్తుండటానికి ఇదికూడా ఒక ప్రధాన కారణం అని అంటారు(ఈ పీవీయే తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనపై ఆగ్రహంగా ఉండేవారన్న సంగతికూడా వాళ్ళకు తెలియకపోవచ్చు). ఇక సోనియా – పీవీ కోల్డ్ వార్‌ వెనక ఉన్న అసలు కథ ఏమిటో చూద్దాం.

1991లో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మేలో ఎన్నికలు వచ్చాయి. మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత మే 21న రాజీవ్ హత్య జరిగింది. ఆ సానుభూతి పుణ్యమా అని మిగిలిన రెండుదశల పోలింగ్‌లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌కు అవకాశం లభించింది. అయితే పార్టీ అధ్యక్ష స్థానాన్నిగానీ, ప్రధానమంత్రి పదవినిగానీ తీసుకోవటానికి సోనియా నిరాకరించారు. ఆ సమయంలో శరద్ పవార్, అర్జున్ సింగ్ వంటి కురువృద్ధులు తామూ ఉన్నామంటూ కుర్చీపై కర్చీఫ్ వేయటానికి ఉరికారు. సోనియా మొదట శంకర్ దయాళ్ శర్మ అభ్యర్థిత్వానికి సముఖత వ్యక్తం చేసినా, ఆయన అనారోగ్యం కారణంగా నిరాకరించటంతో, ఫోకస్ పీవీవైపు తిరిగింది. అర్జున్ సింగ్, శరద్ పవార్‌ ఇద్దరూ రేసులో ఎక్కడా తగ్గకపోతుండటంతో మధ్యేమార్గంగా పీవీ పేరు తెరపైకి వచ్చింది. సోనియాకూడా ఆయన అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేసేశారు. అలా తెలుగుబిడ్డ ప్రధాని అయ్యారు.

వాస్తవానికి పీవీ నాడు వానప్రస్థాశ్రమం మూడ్‌లో ఉన్నారు. ఢిల్లీనుంచి అన్నీ సర్దుకుని వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. కుర్తాళంలోని సిద్ధేశ్వరీ పీఠానికి అధిపతిగా ఆయనకు ఒక ఆఫర్ ఉందని, ఆయన దానికి సిద్ధమయ్యారని కూడా అంటారు. ఏది ఏమైనా ఒకటిమాత్రం నిజం. నాటి ఆ వైరాగ్యభావన – అత్యున్నత పదవి చేపట్టినా ఆయన చాలావరకు స్థితప్రజ్ఞతతో వ్యవహరించటానికి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడిఉండవచ్చని అనిపిస్తుంది.

సోనియాతో సంబంధాల విషయంలో మొదట్లో ఇరువురిమధ్యా అంతా సాఫీగానే సాగిపోతుండేది. అసలు, ప్రధానిగా తన ఎంపిక ఖరారు కాగానే మొట్టమొదటసారి సోనియాను కలుసుకోవటానికి వెళ్ళినపుడు పీవీ ఆమెకు సాష్టాంగనమస్కారం చేశారని కూడా చెబుతారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతకూడా వారానికి ఒకసారి పీవీ 10 జన్‌పథ్‌కు వెళ్ళి ఆమెను పలకరించివస్తూ ఉండేవారు. క్షేమసమాచారాలు కనుక్కోవటంతోబాటు ఏమైనా కావాలేమో అడిగి సమకూరుస్తూ విధేయతను చాటుకుంటూ ఉండేవారు. హార్వర్డ్‌లో చదువుతున్న రాహుల్‌కు భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు లేఖకూడా రాశారు. అయితే రానురానూ ఇద్దరిమధ్యా అంతరం పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం పార్టీలో పీవీ వ్యతిరేకులు, సోనియా కోటరీలో ఉన్న నాయకులని చెప్పాలి.

సోనియా కోటరీలో అప్పట్లో కరుణాకరన్, అర్జున్ సింగ్, ఫోతేదార్, నట్వర్ సింగ్, ఎన్‌డీ తివారీ, ఆర్కే ధవన్, వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉండేవారు. ఈ విన్సెంట్ జార్జ్ రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పటినుంచి ఆయనకు, తర్వాత‌ సోనియాకు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తుండేవారు. కేరళకు చెందిన ఇతను వాస్తవానికి ఒక స్టెనో. కేరళలో ఫాస్టెస్ట్ టైపిస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆర్కే ధవన్ ఇందిరాగాంధి దగ్గర స్టెనోగా చేరి – కీలక వ్యక్తిగా మారినట్లే, జార్జ్ కూడా రాజీవ్ దగ్గర స్టెనోగా చేరి సన్నిహిత అనుచరుడిగా మారారు. 1991 మేలో రాజీవ్ చనిపోయిన తర్వాతకూడా 10 జన్‌పథ్‌లో అతని హవా కొనసాగింది. పీవీకి, సోనియాకు మధ్య విబేధాలు పెరగటానికి ఇతనికి రాజ్యసభ సీటును నిరాకరించటం ఒక ప్రధాన కారణం.

జనవరి 1992 లో కర్ణాటకలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బంగారప్ప ఆ సీటును జార్జ్‌కు ఇవ్వాలని అనుకున్నారు. దాని వెనక ఒక కథ ఉంది. 1990లో రాజీవ్ గాంధి బంగారప్పను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఆ ఎంపిక విషయంలో జార్జ్ సహకరించటంవలనే తాము ముఖ్యమంత్రి అయినందువల్ల, రాజ్యసభ సీటుతో ఆ కృతజ్ఞతను చాటుకోవాలని బంగారప్ప అనుకున్నట్లు చెబుతారు. అయితే పీవీ వర్గం కర్ణాటకకే చెందిన మార్గరెట్ ఆల్వాకు సీటు ఇవ్వాలని భావించింది. ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలనే మీమాంస నెలకొంది. సోనియా కోటరీ అందరూ జార్జ్‌ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పీవీకూడా సోనియాను నేరుగా అడిగారు. కానీ, తాను సిఫార్స్ చేసినట్లు బహిరంగంగా కమిట్ అవటానికి ఇష్టపడని సోనియా అవుననీ, కాదనీ చెప్పకుండా మీ ఇష్టమని మాత్రమే అన్నారు. పీవీ ఆల్వాకే సీటు కట్టబెట్టారు. దీనితో జార్జ్ పీవీపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. సోనియాను పలకరించటానికి స్వయంగా పీవీ 10 జన్‌పథ్‌కు వెళ్ళినాకూడా, జార్జ్ ఆయనను వెయిటింగ్‌లో పెట్టేవాడట. ఇతనిపై 2000 సంవత్సరంలో ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదవటంతో సోనియా ఆ మళయాళీని క్రమంగా పక్కన పెట్టేశారు.

సంబంధాలు చెడటానికి రెండో ప్రధాన కారణం, తాంత్రిక స్వామీజీ చంద్రస్వామి. ఇతని అసలు పేరు నేమిచంద్. జైన మతస్థుడు. బ్రూనే సుల్తాన్, బహ్రెయిన్ ఖలీఫా, హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటన్ నాటి ప్రధాని మార్గరెట్ థాచర్, ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి తదితరులు ఇతనికి క్లయింట్స్‌గా ఉండేవారు. చంద్రస్వామి కుటుంబం రాజస్థాన్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. ఆ కనెక్షన్ వల్లో, ఏమోగానీ పీవీకి చంద్రస్వామితో మంచి సంబంధాలు ఉండేవి. పీవీకి ఆధ్యాత్మిక సలహాదారుగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో చంద్రస్వామి పీవీ వెంటే కనిపిస్తుండేవాడు. ప్రభుత్వంలో పనులకోసం వ్యాపారవేత్తలు, బదిలీలకోసం ఐఏఎస్‌లు చంద్రస్వామిని కలుస్తుండేవాళ్ళు. పీవీకి జ్యోతిష్యులు, చంద్రస్వామి వంటి స్వామీజీలపై బాగానే నమ్మకం ఉండేది. చంద్రస్వామికి అతను బయట చెప్పుకున్నంత మహిమలు లేవుగానీ, కొద్దో, గొప్పో అయితే ఉందని – నరసింహారావు తన సన్నిహితులతో అన్నట్లుగా ఆయన పాలనపై హాఫ్ లయన్ అనే పుస్తకం రాసిన వినయ్ సీతాపతి దానిలో పేర్కొన్నారు. రాజీవ్ హత్యకేసులో చంద్రస్వామి పాత్రకూడా ఉందని ఆరోపణ ఉంది. రాజీవ్ హత్యకోసం ఎల్టీటీఈకి లండన్‌లో నిధులు సమకూర్చాడని ఆ కేసుపై దర్యాప్తు చేసిన జైన్ కమిషన్ ఛార్జిషీట్‌లో నమోదయిఉంది. అదే చంద్రస్వామి నిత్యం పీవీ వెంట ఉండటమే సోనియాకు ఆయనపై వ్యతిరేకత పెరగటానికి కారణమయింది. చంద్రస్వామిని తప్పించటంకోసమే రాజీవ్ హత్యకేసు విచారణ విషయాన్ని పీవీ కావాలనే పట్టించుకోవటంలేదని సోనియాకు అనుమానం. దీనికితోడు రాజీవ్ హత్యకేసులో చంద్రస్వామి ప్రమేయం ఉందనటానికి ఆధారాలు చూపే డాక్యుమెంట్లు ప్రధానమంత్రి కార్యాలయంనుంచి కనిపించకుండాపోవటం – ఎవరో కావాలని చేసిన పనే అని వార్తలు వచ్చాయి. దీనిపై ఔట్‌లుక్‌ లో వచ్చిన పరిశోధనాత్మక కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

మూడో కారణం – ప్రతిపక్ష బీజేపీపట్ల పీవీ సానుకూల వైఖరి. ప్రధానిగా ఆయన రైట్ వింగ్ రాజకీయాలనే నడిపారనే విమర్శ ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో పీవీ వైఖరి బీజేపీకి మేలు చేసిందన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనికితోడు, నాడు వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశంలో మాట్లాడటానికి పంపటం, జనతాపార్టీకి చెందిన సుబ్రమణ్యస్వామికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఓ కమిషన్‌కు ఛైర్మన్‌ను చేయటం వంటి విషయాలు రైట్ వింగ్ విమర్శలకు బలం చేకూర్చేలా చేశాయి. బీజేపీకి సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్-ప్రియాంకలకు భవిష్యత్తు లేకుండా చేయాలని పీవీ ప్రయత్నిస్తున్నారేమోనని సోనియాకు భయం పట్టుకుంది.

సోనియా కోటరీగా పేరుబడ్డ అర్జున్ సింగ్, ఎన్డీ తివారి నిత్యం 10 జన్‌పథ్‌కు వెళ్ళి పీవీపై ఆమెకు చాడీలు చెబుతూఉండేవారు. అయితే, ఆమె ఏమీ స్పందించకుండా, గుంభనగా అన్నీ వింటూ ఉండేది. బాబ్రీ మసీదు విషయంలో ప్రధాని వైఖరిని వారిద్దరూ బహిరంగంగా విమర్శించారు. వీరే 1995లో తివారి కాంగ్రెస్ అనే సొంత దుకాణంకూడా పెట్టారు. దీనివెనక సోనియా ఉందని అందరూ అనుకున్నారు. సోనియా తనకు వ్యతిరేకంగా పార్టీలో తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారని పీవీకికూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆ పార్టీ వ్యవస్థాపక కార్యక్రమానికి సోనియాను రప్పించాలని తివారి, సింగ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె వారి కోరికను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అక్కడనుంచి పీవీకూడా సోనియాను కట్టడి చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానికిముందు ఆమెతో సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినా అర్జున్ సింగ్ బ్యాచి చెప్పిన మాటలవల్లో, మరే కారణంవల్లోగానీ సోనియా సానుకూలంగా ప్రతిస్పందించలేదు. ఆ సంబంధాలు చెడిపోవటం తన ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందనికూడా సన్నిహితులవద్ద పీవీ మొదట్లో వాపోయినట్లు చెబుతారు.

మొత్తంమీద పీవీకూడా సోనియాపై ప్రతిదాడి ప్రారంభించారు. బోఫోర్స్ కేసులో పోలీస్ ఫిర్యాదును ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వంతో అప్పీల్ చేయించారు. దీనిపై సోనియా అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. బోఫోర్స్ కేసు ద్వారా పీవీ తనను జైలులో పెట్టించాలనుకుంటున్నారా అని సోనియా తనను అడిగినట్లు మార్గరెట్ ఆల్వా ఆత్మకథలో పేర్కొన్నారు.

పార్టీలో తన వ్యతిరేకులను నియంత్రించటంకోసం పీవీ హవాలా స్కామ్‌లను ఉపయోగించుకున్నారు. 1994లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ ప్రచారానికి రూపొందించిన వీడియోలలో ఇందిర, రాజీవ్‌ క్లిప్పింగ్స్‌ను పీవీ స్వయంగా కట్ చేయించి తీసేయించారు. ఇది సోనియాకు తెలిసింది. దీనితో విభేదాలు పరాకాష్ఠకు చేరాయి.

మొత్తం మీద చూస్తే ఇరువురిమధ్య సంబంధాలు బెడిసి కొట్టటానికి కారణం – మధ్యనున్న వ్యక్తులు కొంత, కమ్యూనికేషన్ గ్యాప్ కొంత అని చెప్పాలి. జార్జ్ – ఆల్వా రాజ్యసభ సీటు వ్యవహారంలో పీవీ మరింత ముందుచూపుతో వ్యవహరించిఉంటే పరిస్థితి చేయి దాటి ఉండకపోవచ్చు. దానికితోడు ఆయన చంద్రస్వామిని వెంటేసుకుని తిరగటంకూడా మరో ప్రధాన కారణం.

పీవీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను వేధించారనే కోపం పెట్టుకున్న సోనియా, 2004లో తనకు అవకాశం వచ్చినపుడు బదులు తీర్చుకున్నారని అనిపిస్తుంది. కానీ, తీవ్రస్థాయిలో అంతు చూడాలన్నంత కక్షసాధింపుగా వ్యవహరించినట్లుగా కూడా చెప్పలేము. హైదరాబాద్‌లో జరిగిన పీవీ అంత్యక్రియలకు నలుగురు క్యాబినెట్ మంత్రులను పంపారు. పీవీ పెద్దకుమారుడు రంగారావుకు 2004లో ఏపీ క్యాబినెట్‌లో కీలకమైన మంత్రి పదవి దక్కింది(అప్పటికి పీవీ బతికే ఉన్నారు). సోనియా అనుమతి లేకుండానే ఇది జరిగిఉంటుందని అనుకోలేము. పీవీ చిన్నకుమారుడు ప్రభాకరరావు నిందితుడుగా ఉన్న రు.133 కోట్ల యూరియా కుంభకోణం కేసు దర్యాప్తు 2004 తర్వాతకూడా కొనసాగినా, దానిపై సోనియా ఎటువంటి ప్రతీకార చర్యలూ తీసుకోలేదు(ఈ కేసులో పీవీ సమీప బంధువు పీవీ సంజీవరావుకు కోటి రూపాయల జరిమానా, మూడేళ్ళ జైలుశిక్ష పడింది). పీవీ విషయంలోనే కాదు, బోఫోర్స్ కేసుపై యాగీ చేసిన జైపాల్ రెడ్డిని, తన పౌరసత్వంపై పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తిన ఉపేంద్రనుకూడా ఆమె తదనంతర కాలంలో మంచిగానే చూశారు. ఉపేంద్రకు 1998లో విజయవాడ లోక్ సభ టిక్కెట్ ఇచ్చారు, జైపాల్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్లో కీలక మంత్రి పదవులు కట్టబెట్టారు.

ఈ విషయంలో మొత్తం తప్పు సోనియాదే అనిగానీ, పీవీ కళంకరహితుడు అనిగానీ చెప్పలేమన్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం. పీవీ దేశానికి చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. దేశాన్ని పాలించిన అత్యుత్తమ ప్రధానులలో పీవీ ఒకరు అనేది నిర్వివాదాంశం. ఆర్థికంగా, రాజకీయంగా దేశంలో అనిశ్చితి, సంక్షోభం వంటి పరిస్థితులు నెలకొనిఉన్న సమయంలో అధికారాన్ని చేపట్టినా దానిని టర్న్ ఎరౌండ్ చేసి, మళ్ళీ సుస్థిరతను నెలకొల్పటం, ప్రజల మనస్సులలో స్థైర్యాన్ని నింపటం ఒక అసాధారణ విషయం. పదవిలోకి వస్తూనే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ విధానాలకు తెరతీశారు. లైసెన్స్-కోటా-పర్మిట్ రాజ్‌కు స్వస్తి పలికారు. ఫలితంగా త్వరలోనే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడింది. మరోవైపు మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఐదేళ్ళ పూర్తికాలాన్ని విజయవంతంగా నడిపారు. ఆయన మొదలుపెట్టిన అణ్వస్త్ర పరీక్ష కార్యక్రమాన్నే తదుపరి ప్రధాని వాజ్‌పేయి విజయవంతంగా అమలుచేశారు. ఇక అంతర్జాతీయస్థాయిలో దౌత్యపరంగా భారత్ ప్రతిష్ఠ మెరుగుపడేలా విదేశాంగ విధానంలో పీవీ పలు మార్పులు చేశారు. అందుకే ఆయన ప్రధాని పదవి చేపట్టిన మొదటి రెండు మూడు సంవత్సరాలలో ఆయన ఇమేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. అపర చాణుక్యుడు అంటూ అందరూ వేనోళ్ళ పొగిడారు.

పీవీ అభిమానులు, ఆయన వర్గంవారికి మింగుడుపడకపోవచ్చుగానీ, ఆయనలో నెగెటివ్ అంశాలుకూడా చాలానే ఉన్నాయి. ప్రధానిగా ఆయన పాలనలో మొదట రెండు-మూడు సంవత్సరాలు అంతా సానుకూలంగా ఉన్నా ఐదేళ్ళు పూర్తయ్యే చివరి సమయానికి, కుంభకోణాలు, ఆరోపణలతో ప్రభుత్వంపై అనేక మచ్చలు పడ్డాయి.

మసీదు కూలితే కాంగ్రెస్ పార్టీకూడా హిందూ అనుకూలపార్టీ అనే ముద్ర పడుతుందని, ఇది పార్టీ అనుసరించే సెక్యులర్ విధానానికి వ్యతిరేకమని అపర చాణుక్యుడుగా పిలవబడే పీవీకి తెలియదని అనుకోలేము. మహాభారతంలో కౌరవులది తప్పని తెలిసినా, భీష్ముడు స్వధర్మం పాటించి వారి తరపునే పోరాడాడుగానీ, పాండవులకు లబ్దిచేకూరేలా వ్యవహరించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి లబ్ది కలిగేలా వ్యవహరించటమంటే తనకు అత్యున్నత పదవులను కట్టబెట్టిన కన్నతల్లిలాంటి సంస్థకు ద్రోహం చేయటమేనని ఆ పార్టీలోని పీవీ విమర్శకులు అంటారు. దీనివలన కాంగ్రెస్‌కు తగిలిన దెబ్బనుంచి ఇంకా తేరుకోలేదని, ముస్లిమ్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ అప్పటినుంచి పక్కకు షిఫ్ట్ అయిపోయిందని ఆరోపిస్తారు.

మరోవైపు, మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించటంలో చూపిన శ్రద్ధ పార్టీ విషయంలో చూపలేదు. ఆ పదవి, అధికారం ఐదేళ్ళు మనుగడ సాగిస్తే చాలని అనుకున్నారో, ఏమో పార్టీని పట్టించుకోలేదు. చివరికి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కూడా పీవీవల్ల తీవ్ర నష్టమే జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా మజ్జి తులసీదాస్ ను నియమించారు. ఆయనకున్న ఏకైక అర్హత పీవీ అనుచరుడు కావటమే. 1994 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడుగా నరసింహారావు ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అత్యంత దారుణమని చెప్పాలి. విజయావకాశాలనుబట్టి కాకుండా, ఇష్టమొచ్చినట్లు అభ్యర్థులను ఎంపికచేశారు. తన పరిచయస్థులు, మిత్రుల కుటుంబసభ్యులకు ఎడాపెడా టిక్కెట్లు ఇచ్చేశారు. నాటి ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలను ఈ అంశం మరింత మెరుగుపరిచి, ముందెన్నడూ లేనంత అత్యధిక మెజారిటీ రావటానికి కారణమయింది.

ఎవరైనా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమ సొంత ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసుకోవటం సహజం. అయితే విచిత్రంగా పీవీ దీనికి పూర్తి విరుద్ధం. రెండేళ్ళపాటు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగానీ, ఐదేళ్ళపాటు ప్రధానిగా ఉన్నప్పుడుగానీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదనే చెప్పాలి.

కేంద్ర క్యాబినెట్‌లో హోమ్, మానవవనరులు, విదేశాంగ వ్యవహారాలు వంటి శాఖలను చూసినప్పుడుకూడా ఆయాశాఖలలో తన ముద్ర చూపించే కార్యక్రమాలేమీ చేపట్టలేకపోయారు. పైగా ఆయన హోమ్ మంత్రిగా ఉన్నప్పుడే పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం, ఇందిర హత్య, సిక్కుల ఊచకోత జరిగాయి.

ఆయన పార్థివదేహాన్ని సోనియా అవమానించిందని అభిమాన వర్గం శాపనార్థాలు పెడుతూఉంటుంది. అయితే 1970లో పీవీ తన సొంత భార్య సత్యమ్మ చనిపోతే అంత్యక్రియలకుకూడా హాజరుకాలేదన్న విషయం వారిలో చాలామందికి తెలియదు. వారిద్దరి మధ్య సంబంధాలు అంత సాఫీగా ఉండేవి కావని అంటారు. దానికి కారణం ఆయన మనసులో వేరే కాంత ఉందని వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన పీవీఆర్కే ప్రసాదే స్వయంగా తన రచనలలో పేర్కొన్నారు. అయితే వ్యక్తిగతంగా అవినీతి లేదు. సంతానాన్ని రాజకీయ వారసులుగా తీర్చిదిద్దటానికిమాత్రం ప్రయత్నించలేదు. కానీ వారుమాత్రం తండ్రి పదవులద్వారా లబ్ది పొందారన్నది వాస్తవం. ఇలాంటి సందర్భాలలోనే, ‘every saint has a past and every sinner has a future’ అన్న ఆస్కార్ వైల్డ్ సూక్తిని గుర్తుచేసుకోవాలి.

(శ్రవణ్‌బాబు దాసరి, సీనియర్ జర్నలిస్ట్, 99482 93346)

LIKE THIS STORY? SHARE IT WITH A FRIEND!