జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని వ్యక్త పరచే స్కిల్ లేకపోతే ఉద్యోగాలు కష్టం

(CS Saleem Basha)
యువతలో తగ్గుతున్న నైపుణ్యాలు, దానివల్ల తగ్గిపోతున్న ఉపాధి అవకాశాలు ఆందోళన కలిగించడం వల్ల యువతలో నైపుణ్యాలు, పెంపొందించ వలసిన అవసరాన్ని గుర్తించి 2014 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేకమైన తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం జూలై 15వ తారీకును “ప్రపంచ యువత నైపుణ్యాల దినం” (World Youth Skills Day) గా జరపుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అలా మొదటి సారి జూలై 15, 2015 లో ప్రపంచ యువత నైపుణ్యాల దినం జరిగింది.
.
అసలు ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం యొక్క అవసరం ఏముంది?
ప్రపంచంలో 70 శాతం మంది యువతకి ఏ విధమైన నైపుణ్యాలు లేవని సర్వేలో తేలింది. ప్రపంచంలో ప్రతి ఐదు మంది యువతలో ఒకరు NEET (Not in Employment, Education or Training) లో ఉన్నారు. మళ్లీ వీరిలో ప్రతి నలుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 2021 నాటికి దాదాపు 30 కోట్ల మంది NEET కేటగిరిలో ఉంటారని అంచనా! ఈ నేపథ్యంలో ప్రపంచ యువత నైపుణ్యల పై దృష్టి సారించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దశాబ్దకాలంలో యువత సంఖ్య గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా 2030 నాటికి మన దేశం యువ భారతదేశం కానుంది. ప్రపంచ జనాభాలో 15 నుంచి 20 శాతం యువత మన దేశంలోనే ఉండే అవకాశం ఉంది.
అలా ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రణాళికతో ఈ ప్రపంచ యువత నైపుణ్యాల దినాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నా సాంకేతిక, వృత్తి విద్య శిక్షణా సంస్థలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ సంవత్సరం 2020 లో ” పటిష్టమైన, నైపుణ్య వంతమైన యువత కోసం నైపుణ్యాలు” “Skills for a Resilient Youth””.అన్న లక్ష్యంతో ప్రపంచ యువత నైపుణ్యాల దినాన్ని జరపాలని నిర్ణయించారు.
ఈ ప్రపంచ యువత నైపుణ్యాల దినం, యువతకు సంబంధించిన నైపుణ్యాలు వివిధ నైపుణ్యాలు పెంపొందించటానికి ఏం చేయాలన్న దానిమీద వివిధ విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు, ప్రభుత్వము కలిసి యువతలో “జీవన నైపుణ్యాలు” (Life skills) పెంపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

Like the Story? Share it with a friend!

జీవన నైపుణ్యాలు అంటే ప్రతి మనిషి ఒక ఉన్నత స్థాయి జీవనం కోసం పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు. ప్రాథమికంగా అవి మూడు రకాలు 1. వ్యక్తిగత నైపుణ్యాలు, 2. సామాజిక నైపుణ్యాలు 3. ఉపాధి కల్పనా నైపుణ్యాలు(Employability Skills) . ప్రపంచ యువత నైపుణ్యాల దినం సందర్భంగా ఈ ఉద్యోగ నైపుణ్యాలు లేదా ఉపాధి కల్పనా నైపుణ్యాలు యువతలో పెంపొందించడం, వాటి గురించి అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ప్రపంచం ముందున్న సవాళ్లు. అయితే COVID-19 సందర్భంగా అన్ని శిక్షణా సంస్థలు, విద్యాసంస్థలు నడవకపోవడం వల్ల ఇది పెను సవాలే. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల మార్గాలు ద్వారా యువతలో ఉపాధి కల్పనా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాల అంటేనే ఉపాధి కోసం అవసరమైన నైపుణ్యాలు. దాదాపు అన్ని ఉద్యోగ కల్పన సంస్థలు, కంపెనీలు, ఉద్యోగుల్లో కొన్ని నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. ప్రపంచ యువత నైపుణ్యాల దినం సందర్భంగా అవేమిటో చూద్దాం.
మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైనది. కమ్యూనికేషన్ స్కిల్స్( భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు). ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది, మనదేశంలో, మన రాష్ట్రంలో 80 శాతం మందికి ఈ నైపుణ్యాల కొరత ఉంది. మన భావాలను వ్యక్తపరచడానికి అత్యంత అవసరమైన నైపుణ్యాలు ఇవే.
విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ సరైన వ్యక్తీకరణ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధిని పొందలేకపోతున్నారు అని సర్వేలో తేలింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులు 80 శాతం మందికి ఈ నైపుణ్యాలు లేవని తేలింది. చాలామంది ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇంటర్వ్యూలలో గమనించిన అంశం ఏంటంటే, చక్కటి పరిజ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని వ్యక్త పరచ లేక 90% మంది మంచి ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారు అని తెలిసింది. ఈ కంప్యూటర్ యుగంలో రాయటం అన్న నైపుణ్యం పూర్తిగా తగ్గిపోయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ముఖ్యమైన ఇంటర్ పర్సనల్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్(బృంద చర్చలు) నలుగురితో కలివిడిగా మాట్లాడడం వంటి నైపుణ్యాల కొరత వల్ల చాలామంది క్వాలిఫైడ్ అయినప్పటికీ ఉపాధి పొందలేక పోతున్నారు.. ముఖ్యంగా వెర్బల్( మాట్లాడటం), నాన్ వెర్బల్ ( చిరునవ్వు, బాడీ లాంగ్వేజ్ వంటివి) కమ్యూనికేషన్ స్కిల్స్ కొరత ఉపాధిని దెబ్బతీస్తోంది.
ఇక ఇందులో భాగంగా అవసరమైన ఇంగ్లీష్ భాష ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. దాదాపు 90 శాతం మంది యువత లో ఆంగ్లభాషా ప్రావీణ్యం లేదు. ఇంగ్లీషులో మాట్లాడటం చాలామందికి ఒక జీవన్మరణ సమస్య. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది ఏ ఉద్యోగానికైనా అవసరం. ఈ నైపుణ్యానికి కావలసింది తెలివితేటలు, డిగ్రీలు కాదు. కేవలం సాధన ద్వారా వచ్చేది. “అనగనగా రాగ మతిశయిల్లుచునుండు…. సాధనతో సమకూరు పనులు ధరలోన.. అన్నది ముఖ్యం. పట్టుదల ఉంటే నిరంతర సాధనతో ఇంట్లోనే ఉంటూ ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకో వచ్చు
రెండో ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యం ప్రాబ్లమ్ సాల్వింగ్( సమస్య పరిష్కారం నైపుణ్యం) చాలా మంది యువత లో ఈ నైపుణ్యం లేదు. ఉద్యోగం చేసే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించడంలో చూపవలసిన నైపుణ్య మీది. ముఖ్యంగా సాంకేతికపరమైన ఉద్యోగాల్లో, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో ఇది అత్యంత అవసరమైనది.
మూడోది అప్ డేటింగ్ స్కిల్స్… అంటే నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, సమాజంలో మార్పులు, తాము చేస్తున్న ఉద్యోగంలో మార్పులు గమనిస్తూ తదనుగుణంగా తమని తాము అప్డేట్ చేసుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే నిరంతర అభ్యాసం. ప్రస్తుతము ప్రపంచము కంప్యూటర్ మయమైపోయింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు. ఈ కంప్యూటర్ యుగంలో ప్రతి క్షణం తమని తాము అప్డేట్ చేసుకోవడం ఉపాధి కల్పన కి అత్యంత ఆవశ్యకమైన నైపుణ్యమిది
తర్వాత చెప్పుకోవాల్సింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (EQ) అంటే ఉద్వేగప్రజ్ఞ. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇంటా బయట, ఉద్యోగంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సమస్యలు సాధించడానికి అత్యంత అవసరమైన నైపుణ్య మీది. ఉద్వేగ ప్రజ్ఞ ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసింది. నేటి తరం లో దాదాపు 90 శాతం మందిలో కనబడని నైపుణ్యం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కు ఇది అత్యంత అవసరమైన నైపుణ్యం. గతంలో IQ ఉండేది. ( ప్రజ్ఞ సూచిక). అది ఇప్పుడు అవుట్ డేట్ అయిపోయింది. దాని స్థానంలో వచ్చిందే EQ. ఒత్తిడిని నిర్వహించుకుంటూ,(stress Management) సమర్థవంతంగా ఉద్యోగం చేయడానికి, ఈ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత అవసరమైన నైపుణ్యం ఇది.
క్రియేటివిటీ మరో ముఖ్యమైన నైపుణ్యం. క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ( సృజనాత్మక సమస్యా పరిష్కారం) అన్నది అనేకమైన సాంకేతికపరమైన ఉద్యోగాలకి, మానవ సంబంధ సంబంధిత ఉద్యోగాలకి చాలా అవసరమైనది. లేటరల్ థింకింగ్.. అంటే వినూత్నమైన కోణంలో అర్థం చేసుకొని, ఒక కొత్త పరిష్కారాన్ని సూచించటం
తరువాత చెప్పుకోవాల్సింది Leadership skills అంటే టీమ్ స్కిల్స్. యువతలో కొరవడిన మరొక నైపుణ్యం ఇది. ఒక సంస్థలో పని చేయడానికి కొన్నిసార్లు టీం సభ్యుడి గానూ, మరొకసారి టీంకి నాయకుడి గానూ ఉండవలసిన అవసరం రావచ్చు. అందుకే ఇది ఒక ముఖ్యమైన ఉపాధి కల్పనా నైపుణ్యం.
సమయపాలన నైపుణ్యం(Time management). ఒకప్పుడు ఒక రోజు అంటూ ఉండేది. ఇప్పుడు సెకండ్లు, నిమిషాలకి మారిపోయింది. ప్రతి నిమిషము టైం మేనేజ్మెంట్ లేకపోతే ఈ ఉద్యోగంలో అయినా ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. కాలం విలువ తెలియక పోతే చాలా కష్టం. సమయపాలన ఉద్యోగం తెచ్చుకోవడానికి, దాన్ని సమర్థవంతంగా చేయడానికి కూడా అవసరం.
Adaptability స్కిల్. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి సందర్భంలోనైనా, ఎటువంటి వారితో నైనా కలిసి పనిచేయగలిగే సామర్థ్యం. అంటే అనుగుణంగా తమని తాము మార్చుకోవడం. వివిధ పరిస్థితుల్లో వాటికి అనుగుణంగా మలుచుకోవడం ఒక ముఖ్యమైన వ్యక్తిగత నైపుణ్యం,
ఇంకా నిర్ణయ సామర్థ్యం(Decision making skills), విశ్లేషణ సామర్థ్యం (analytical skills), నైతిక విలువలు (Ethics and morals), ప్రణాళిక సామర్థ్యం(planning), బేసిక్ కంప్యూటర్ జ్ఞానం, సంఘర్షణ నిర్వహణ (conflict management), సంప్రదించే సామర్థ్యం (Negotiation skill) వంటివి ఉన్నాయి.
ఈ “ప్రపంచ యువత నైపుణ్యాల” సందర్భంగా, యువత వివిధ రకాల నైపుణ్యాలపై పట్టు సాధించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం. అదే యువత సాధికారతకు పునాది.
Saleem Basha CS

(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)