Home Features షిర్డీ సాయిబాబా జన్మస్థలం, వంశవృక్షం వెల్లడించిన ఉస్మానియా ప్రొఫెసర్

షిర్డీ సాయిబాబా జన్మస్థలం, వంశవృక్షం వెల్లడించిన ఉస్మానియా ప్రొఫెసర్

375
0
(టిటిఎన్ డెస్క్)
సాయిబాబా కుటుంబ వారసులొకరు ఉస్మానియాలో మరాఠీ ఫ్రొఫెసర్ గా ఉండేవారు
షిర్డి దేశంలో రెండవ అతి పెద్ద క్షేత్రం.  మొదటిది ఆంధ్రప్రదేశ్ కుచెందిన తిరుమల. ఆతర్వాత, తిరుమలతో పోలిక లేదుగాని,  భారీ యాత్రికులు వచ్చే క్షేత్రం షిర్డి. అయితే, ఈ మధ్య షిర్డి ఒకవివాదంలో చిక్కుకుంది. షిర్డి అనేది  సాయిబాబ కర్మభూమి. మరి ఆయన జన్మభూమి ఎక్కడ?  దీని మీద చాలా చర్చ చాలా రోజులుగా సాగుతూ ఉంది.
ఈనేపథ్యంలో మహారాష్ట్ర పర్బనీ జిల్లాలోని పాత్రి వార్తలకెక్కింది. పాత్రి  అనే వూరు బాబా జన్మస్థలం అని దానికి కూడా  ప్రాముఖ్యం ఇచ్చి అభివృద్ధి చేయాలనే ఒక ప్రతిపాదన వచ్చింది.
జనవరి 9 వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఔరంగా బాద్ లో మాట్లాడుతూ వందకోట్ల రుపాయలతో బబా జన్మస్థలం పాత్రిని పుణ్యస్థలంగా అభివృద్ధి చేస్తామని  ప్రకటించడంతో గొడవ మొదలయింది.
దీనితో  షిర్డీ ప్రాముఖ్యం తగ్గుతుందని అక్కడి వ్యాపార వర్గాలలో భయం మొదలయింది. వెంటనే భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగి బంద్ ప్రకటించింది. బంద్ జరిగింది. సాయిబాబ క్షేత్రం షిర్డి మూత పడి, అక్కడ నుంచి పాత్రి కి మారుతుందనే ప్రచారం మొదయింది.

ఇది కూడా చదవండి

Shirdi Bandh: Temple Open While Town Remains Shut

నిజానికి పాత్రి గ్రామాన్ని క్షేత్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఇప్పటిది కాదు, బిజెపి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాయంలోనే వచ్చింది.
2016 జనవరిలో అప్పటి బీహార్ గవర్నర్ (ఇపుడు రాష్ట్రపతి) రామ్ నాథ్ కోవింద్ పాత్రి గ్రామం సందర్శించారు. అపుడు స్థానికులు పాత్రిని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం  ఉందని,  సాయం చేయండని ఒక వినతిపత్రం ఇచ్చారు.
రామ్ నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందిస్తూ  పాత్రి లో వసతులు మెరుగుపరిచేందుకు అవసరమయిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.
షిర్డీకి పాత్రి 125 కి.మీదూరంలో ఉంటుంది. ఔరంగా బాద్ పట్టణానికి  180 కిమీ దూరాన ఈ గ్రామం ఉంటుంది. పాత్రి జనాభా 40 వేల దాకా ఉంటుంది.మునిసిపాలిటి కూడా. ఆవూర్లో  ఎన్ సిపి బలమయిన పార్టీ అని చెబుతారు.
అయితే, పాత్రి  సాయిబాబా జన్మస్థలం అని ఒక వర్గం భావిస్తు ఉంటే, షిర్డీ వాదులు మాత్రం అది తప్పని, దానికి ఎలాంటి అధారాలు లేవని చెబుతున్నారు. అందువల్ల పాత్రిని సాయి జన్మస్థలంగా అభివృద్ధి చేయడం తగదని వారు వాదిస్తున్నారు.
సాయిబాబా జన్మస్థలం, కుటుంబం గురించి నిర్ధారించేందుకు చాలా కాలంగా ప్రయత్నం జరగుతుంది. జన్మస్థలానికి, కుటుంబానికి, వాటినుంచి వచ్చే గౌరవాలను తిరస్కరించిన బాబాను  ఫలానామతానికి, కులానికి అంటగట్టేందుకు కూడా  ప్రయత్నాలు జరుగుతున్నాయి.
1975లో  విబి ఖేర్ అనే బాబాభక్తుడొకాయన బాబా పాత్రి గ్రామంలో పుట్టారని, ఆయన యజుర్వేది దేశస్థ బ్రాహ్మణ కుటుంబలో జన్మించారని ప్రకటించారు.  ఈ కుటుంబానికి చెందిన పరశురామ్ భూసారి సాయి తండ్రి అని, పరశురాం అయిదురుగరు సంతానంలో బాబా ఒకరని ఖేర్ చెప్పారు. ఇది బాబాని ఒక మతానికి, కులానికి, వూరికి కుటుంబానికి పరిమితం చేసినట్లయింది. ఇక కుటుంబమే సాయి కుటుంబం అని నిర్ధారించేందుకు ఖేర్ బాగా శ్రమించారు.
ఖేర్ చొరవ తో  పాత్రిలో సాయి కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. 1978 లో సాయి స్మారక సమితి అనే సంస్థ ఏర్పాటయింది.  పాత్రిలో గుడికట్టే ప్రయత్నాలు జరిగాయి. తర్వాత చాలా మంది పాత్రి బాబా జన్మస్థలంమని నమ్మి ప్రచారం చేశారు. ఎపుడో బాబా ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని, 1872లో బాబా షిర్డీకి వచ్చారని,  1918 అక్టోబర్ 15 సమాధి అయ్యారని చెబుతారు.
 తర్వాత సాయిబాబా జీవితచరిత్ర ‘సాయి సచ్ఛరిత’ ను గోవింద్ రఘునాథ్ దభోరల్కర్ మరాఠీలో రాశారు. దీనికి ముందుమాట రాస్తూ హరిసీతారామ్ దీక్షిత్ అనే భక్తుడు కూడా  పాత్రి వూరి ప్రస్తావన తీసుకువచ్చారు.
దీక్షిత్ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండేవారు. వృత్తి రీత్యా న్యాయవాది. అయితే, వృత్తిని, రాజకీయాలను వదులుకుని బాబాసేవకు ఆయన పూర్తిగా అంకితమయ్యారు.ఇపుడు షిరిడీ గుడి బాధ్యతలను చూసే  షిర్డీ సాయిబాబా సంస్థాన్ ను స్థాపించింది కూడా ఆయనే.
సాయి సచ్ఛరిత 1923లో అచ్చయింది. ఈపుస్తకంలో ఆయనేమి రాశారాంటే,  ‘ఇప్పటికి 50 యేళ్ల కిందట సాయిమహారాజ షిర్డీకి వచ్చారు. అపుడు షిర్డీ అహ్మద్ నగర్ రహాత తాలూకాలో ఉండింది. ఆయన జన్మస్థలం గురించి తల్లితండ్రుల గురించి స్పష్టమయిన సమాచారం లేకపోయినా,ఆయన నైజాం రాజ్యానికి చెందిన వారని చెప్పవచ్చు. బాబా ప్రసంగాలలో సేలు, జల్నా, మన్వత్, పాత్రి, పర్బని, ఔరంగాబాద్ , భీర్,బీదర్ వంటి పేర్లు తరచూ వినిపించేవి. ఒక సారి పాత్రి నుంచి ఒక వ్యక్తి బాబా దర్శనానికి షిర్డీ వచ్చారు. అపుడు వూర్లో ఉన్న ప్రముఖుల గురించి పేరు పేరున వాకబు చేశారు బాబ. దీనితో బాబాకు పాత్రి గ్రామం గురించి బాగా తెలుసునని, అందుకే ఆవూరు ఆయన జన్మస్థలం అయిఉంటుందనే విశ్వాసం మొదలయింది. అయితే, కచ్చితంగా పాత్రియే ఆయన పుట్టిన వూరని చెప్పలేము.’
అయితే,బాబా  ప్రముఖ సేవకుల్లో ఒకరయిన బివి నరసింహస్వామి ఒక పుస్తకం రాస్తూ ఇల్లు, కుటుంబం, పుట్టిన వూరు వంటివాటి గురించి మాట్లాడటానికి బాబా విముఖత చూపారని రాశారు, గుచ్చి గుచ్చి అడిగినపుడు ఆయన మార్మికంగా సమాధానం చెప్పే వారని ఆయన రాశారు.
అయితే బాబా తొలినాళ్ల సేవకుల్లో ఒకరయిన  మాల్సపతి అనే కంసాలి  ‘బాబా నైజాం కుచెందిన పాత్రి  గ్రామంలోని ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మించారని చెప్పారని ఆయన కూడా రాశారు.
ఈ మిస్టరీ చేధించాలని ఖేర్ భావించారు. ఆయన పాత్రిలోని అనేక బ్రాహ్మణ కుటుంబాల చరిత్ర కూపీలాగి ఒక కుటుంబాన్ని బాబా కుటుంబంగా గుర్తించారు.
1975 జూన్ లో ఖేర్ పాత్రి వచ్చి అనేక కుటుంబాలను ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఒకబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారని, అయితే,   చిన్నపుడే ఆ బాలుడిని ఒక ముస్లిం వలీ తీసుకువెళ్లి పోషించాడని ఆయన సమాచారం సేకరించారు. పాత్రిలోని వైష్ణవ గల్లిలోనే భూసారి కుటుంబంలో బాబా జన్మించారని తాము నమ్ముతున్నట్లు చాలా మందిబ్రాహ్మణులు తనతో చెప్పినట్లు ఖేర్ రాశారు. తర్వాత ఆయన ఈ బ్రాహ్మణకుటుంబం వారసులో దూరపు బంధువులో-ఎవరో ఒకరు -దొరకకపోతారా అనే అన్వేషణ మొదలుపెట్టారు. ఇదే ఆయనను హైదరాబాద్ కు తీసుకువచ్చింది.
వైష్ణవ గల్లి లో  ఖేర్ ఒక పాత ఇల్లును కనిపెట్టారు. చివరకు భూసారి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిదని  తెలుసుగోలిగారు. అంతేకాదు,  ఈకుటుంబానికి చెందిన ఒకరు  ఉస్మానియా విశ్వవిద్యాలంలో మరాఠీ ప్రొఫెసర్ గా రిటైరైయ్యారని, ఆయన పేరు ఫ్రొఫెసర్ రఘునాథ్ భూసారి అని కనుగొన్నారు.
ఫ్రొపెసర్ తో కలసి ఖేర్  భూసారి వంశ వృక్షం రూపొందించారు. ఇందులో మూడుతరాల వెనక ఉన్న భూసారి ని కనుగొన్నారు. ఆయన పేరు పరశురామ్ భూసారి అని ఆయనే  బాబా తండ్రి అని అయి ఉండవచ్చని భావించారు.దీనికి కొంత సమాచారం రఘునాథ్ భూసారి దగ్గిర లభించింది.
తమ పూర్వికుడయిన పరశురామ్ భూసారికి అయిదుగురుసంతానమని తన నాయనమ్మ తనతో చెప్పేదని ప్రొఫెసర్ భూసారి చెప్పారు.
ఈ అయిదుగురిలో ముగ్గురు చిన్నపుడే ఇంటి నుంచి వెళ్లి పోయారు. మిగిలిన ఇద్దరిలో హరిభావ్ ఒకరు. ఆయన కూడ దేవుడిని వెదుక్కుంటూ వెళ్లిపోయారు. ఆయనే సాయిబాబా అయ్యారు.
తర్వాత ఖేర్ ,  పాత్రికి చెందిన  దినకర్ చౌధరితో కలసి భూసారి కుటుంబానికి చెందిన పాత ఇంటిని  కొన్నారు. అక్కడే  సాయి స్మారక సమితి ఏర్పాటుచేశారు. చిన్న గుడి కట్టి 1999లో ఆవిష్కరించారు.
ఇపుడు సాయి స్మారక సమితిలో చాలా  మంది ప్రముఖలున్నారు.  పాత్రి లో బాగా పలుకుబడి ఉన్న, గతంలో చాలా   సార్లు మునిసిపల్ చెయిర్మన్ గా ఉన్న అబ్దుల్లా ఖాన్ దుర్రానీ వారిలో ఒకరు. ఆయన ఎన్ సిపి నాయకుడు కూడా.
1978 నుంచి ఆయన సాయి స్మారక సమితి లో సభ్యుడిగా ఉన్నారు.  2016లో  ప్రజల కోరిక మేరకు రామ్ నాథ్ కోవింద్ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఫోన్ చేసి పాత్రి అభివృద్ది చేయాల్సిన ఆవశ్యకత  గురించి చర్చించారని ఆయన చెప్పారు.
అపుడది కార్యరూపం దాల్చలేదు. ఇపుడు శివసేన తో  ఎన్ సిపి కి భాగస్వామ్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉద్ధవ్ నూరు కోట్ల రుపాయల  నిధులు కేటాయించి పాత్రి ని అభివృద్ధి చేస్తామని ప్రకటించడం వెనక  శివసేన- ఎన్ సిపి ల స్నేహం కూడా వుండవచ్చు.
అయితే ఆలయాల చుట్టూ చాలా ఆర్థిక వ్యవస్థ అల్లుకు పోతుంది. ఆలయం విజయవంతమయితే, పల్లటూరు అమాంతం పట్టణమవుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు మొదలుకుని స్టార్ హోటళ్లు రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులు, కిరాణాషాపులు, పూల, పళ్ల దుకాణాలు…ఇక్కడి స్థిరపడిన వారి అవసరాలు తీర్చే వ్యాపారాలు ఎన్నో వస్తాయి.
ఇలాంటపుడు పక్కనే మరొక టెంపుల్ టవున్  పోటీ కి వస్తే, ఇక్కడి కి వచ్చే భక్తులు సంఖ్య తగ్గిపోయి వ్యాపారం తగ్గిపోతుందని ఒక వర్గం ఆందోళన చెందుతూ ఉంది. దాని ఫలితమే షిర్డీ బంద్.