మా మామగారి పిన్నీసుల కలెక్షన్ గురించి చెప్పాల్సిందే…

(శారద శివపురపు)

ఇంతవరకు మామగారు పండించే హాస్యం గురించి మాట్లాడు కొన్నాం కదా.  ఎంతో గాంభీర్యం చూపించే మామగారు, ఇంట్లో ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఎంత ఆందోళన పడేవారంటే, పైగా డాక్టర్ ఏమో, వెంట వెంటనే టెంపరేచర్ చెక్ చేయడం ఏంటి,  అసలు ఎందుకు జ్వరం వచ్చింది, ఎందుకు తగ్గట్లేదు ఎందుకు పెరుగుతోంది, ఏం టెస్టులు చేయించాలి, ఏం పెట్టాలి, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మందులు వాడుతూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆరోగ్యంగా తిరగాలి. అంతవరకు మంచం చుట్టూనే తిరుగుతూ ఉండే వాళ్ళు. 9, 10 ఏళ్ల వయసులో పెళ్లి అయిన మా అత్తగారు ఎప్పుడు చెబుతుండేది. చిన్నప్పటి నుంచి తను కొంచెం వీక్ అని వాళ్ళ నాన్నగారు డాక్టర్ అయితే బాగా చూసుకుంటాడని మామగారికిచ్చిచేశారని. నిజంగానే ఆయన ఆవిడను అలాగే చూసుకున్నారు.  ఆవిడ మంచం పట్టినప్పుడల్లా అన్నీ తానే అయి పోయే వారు ఇంక. భార్యని, పిల్లల్ని బాగా చూసుకోవడంలో ఆశ్చర్యం ఏం లేదు.

అయితే కోడలిగా ఆ ఇంటికెళ్లిన నన్ను కూడా ఆయన అలాగే చూస్కున్నారు. మా పుట్టింట్లో ఎవరికైనా ఏమైనా వచ్చినా అంత పెద్దగా పట్టించుకునేవారు కాదు.   ఏమొచ్చినా   దానంతట అది తగ్గిపోవాల్సిందే.  ఏ రోగమైనా వారం తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్.  అసలు మా నాన్న గారికి డాక్టర్ అన్నా మందులు అన్న మహా భయం. నాకు బాగా గుర్తు.‌ ఒకసారి నాన్న గారు ఒక కొంచెం పెద్ద సైజు టాబ్లెట్ వేసుకోవలసి వచ్చింది. ఇంక అప్పుడు మా నాన్నగారు చేసిన ఫస్ మేము ఎవరో ఎప్పటికి మర్చిపోలేము. ఆ టాబ్లెట్ గొంతులోనే ఇరుక్కుపోయినట్టాయనికి అనుమానం. అందుకోసం అని ఆ తర్వాత రెండు అరటి పండ్లు తిన్నారు. అయినా అనుమానం తీర లేదు, అది గొంతులోనే ఉందంటారు.  ఒక రెండు చెంబులు నీళ్లు తాగారు అయినా అనుమానం తీరలేదు. బయటికి వచ్చేస్తుందేమో టాబ్లెట్ పీడా  వదిలిపోతుంది అని చివరికి నీళ్లు అరటి పళ్ళు ఇవన్నీ కలిసి ఎక్కువ అయి,
వాంతి అయినా ఆ టాబ్లెట్ మాత్రం బయట పడలేదు, ఆయనకి అనుమానం తీరలేదు.  అదంతా ఒక గంట ప్రహసనం అనమాట.

మా నాన్నగారిని డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్లాలంటే  చాలా కష్టపడాల్సి వచ్చేది. నాకు బాగా గుర్తు చాలా సీరియస్ కండిషన్లో ఉంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళనని మొరాయిస్తుంటే,  ఆఖరికి అమ్మ నాలుగైదు రోజులు ఉపవాసం చేయాల్సి వచ్చింది.  ఇంక అప్పటికి గానీ ఆయన డాక్టర్కి చూపించుకోవడానికి  ఒప్పుకోలేదు.  ఇంత భిన్న థ్రృవాలు నాన్న గారు, మామగారు ఆరోగ్యం, వైద్యం విషయంలో.  ఎంత ఆరోగ్యం బాగోలేక పోయినా, ఎవరైనా అంత పట్టించుకోవడం అనేది నాకు పెళ్లయిన తర్వాతే అనుభవంలోకి వచ్చింది.  అలవాటు లేదు కదా నాకు, అందుకని  మొదటి సారి కొంచెం వింతగా అనిపించిన మాట నిజం. జ్వరం వస్తే మామగారు గంట గంటకి టెంపరేచర్ చూడడం, క్రోసిన్ టాబ్లెట్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత తగ్గిందా లేదా అని చెక్ చేయడం, ఏం తినాలి,  ఎలా తినాలి అని చెప్పడం, అలా తిన్నామా లేదా చూడ్డం, ఇదంతా చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. చంటిపిల్లల్ని చూసుకున్నట్టు రాత్రికూడా రెండు మూడు సార్లు లేచి ఎలా ఉన్నదీ కనుక్కుంటుండేవారు.


టైగర్ మామగారు-4


ఇది చెప్తుంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది. అది ఏంటంటే ఒకసారి ఇలాగే ఓ వారం రోజులు సుస్తీ చేసి, నేను ఇంకా పూర్తిగా కోల్కోకుండానే  సెలవు ఇబ్బంది వల్ల ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చింది. అయితే సరిగ్గా సమయం చూసి పనిమనిషి మానేసింది. నేను ఇబ్బంది పడుతున్నాను. అసలే ఒంట్లో బాలేదు సెలవు కూడా లేదు.  నామీద చాలా జాలి పడిపోయారేమో. సాయంత్రం నేను వచ్చేటప్పటికి నాతో ఏమన్నారంటే చూడు గిన్నెలు కడగడం ఎంత తేలికో, ఏంటో మీ ఆడవాళ్లు చాలా కష్టపడి పోతారు గానీ,  కాసేపు నానబెట్టి కడిగితే తేలిగ్గా వదిలిపోయే అన్నారు. దెబ్బతో నేను బెదిరిపోయి వంటింట్లోకి పరిగెత్తి చూస్తిని కదా వంటిల్లంతా రెండు అంగుళాలు నీళ్లలో తేలుతోంది అందులో కొన్ని ప్లేట్లు తేలికపాటి గిన్నెలు  కాగితం పడవల్లాగా తేలుతున్నాయి. ఇక గిన్నెలు, బట్టల్లాగా నాననిచ్చి  ఆ తర్వాత మంచి నీళ్ళలో జాడించి నట్టుగా ఇంకో బకెట్ నీళ్లలో ఇంకొన్ని గిన్నెలు మునిగి ఉన్నాయి.  ఇంక అప్పుడు చేసుకోవాల్సి వచ్చిన పని పక్కనపెడితే నాకు సాయం చేయాలని ఆయనకు అస్సలు చేతగాని పని చేయడానికి పూనుకున్నారు చూశారా అది ఎంతగానో కదిలించింది.  అయితే అప్పుడు ఆ విషయం ఆయనకి చెప్పాలని తెలీలేదు. ఇప్పుడనిపిస్తుంది ఆయనకి థాంక్స్ చెప్పుంటే ఎంత బాగుండేది అని. బహుశా మా అత్త గారికి కూడా అలాంటి సహాయం ఎప్పుడూ చేసి ఉండరు. ఇలా నా ఆరోగ్యాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఎంతో నిశ్చింతగా ఉండేదాన్ని.  ఈ సంఘటన నేను ఎప్పటికీ మరువలేను.   అమ్మా నాన్నల అండ, మనం అమ్మా నాన్నాలయ్యాకా కూడా ఉండటం ఒక అదృష్టం.

నిజానికి ఆయన ఎంత జాగ్రత్తగా పేషెంట్స్ ని చూసుకోకపోతే ఆయన పనిచేసిన జిల్లాలు, అదిలాబాద్ మెదక్ నిజామాబాద్ సిద్దిపేట ఇలా ఎక్కడెక్కడి నుంచో ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్లు, దూరాభారం అనుకోకుండా హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి ఆయనను కలిసి ఆ పాత విషయాలు తృప్తిగా మాట్లాడుకునేవాళ్ళు. ఎంత గొప్ప నిబద్దత కలిగిన డాక్టర్ కాకపోతే ఇలా పది పది మంది మూలమూలల నుంచి వచ్చి కలిసి వెళతారు ? ఇది ఎంత అరుదైన విషయం  కదా అనిపించేది.

ఈ ఫీలింగ్స్ వారుండగా వారికి చెప్పనందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, మామగారు అనుకోకుండా మాకు మిగిల్చిన హాస్యాన్ని, జ్ఞాపకాల్ని మీతో పంచుకుంటూ ఈ వ్యాసాలు రాయడం జరిగింది. ఈ వ్యాసాలు చదివినవారు వారి పెద్దల్ని ప్రేమగా గుర్తు చేసుకుని  మధురమైన, మరువలేని సంఘటనలని కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు మాట్లాడుకుంటే నేను ధన్యురాలిని. మన పెద్దలు, ప్రియమైన వాళ్ళు,  కుటుంబసభ్యులు మన్ని వదిలి వెళ్లిపోయాకా, జీవించి ఉండేది మన జ్ఞాపకాల్లోనే కదా. మనం కూడా వెళ్లి పోయాక మన ముందు తరాల వాళ్ళకి మన ముందు తరాల వాళ్ల గురించి తెలియాలంటే
భద్రపర్చుకోవాలికదా.

ఈ సందర్భంలో లో నాకు ఒక హోమియో డాక్టర్ గుర్తొస్తున్నారు నా చిన్నప్పుడు నాకు కాస్త చల్లగాలి వీస్తే చాలు టాన్సిల్స్ వాచి పోయేవి. వాచిన నొప్పికి ఆకలేసినా తినలేక పైగా జ్వరం కూడా వచ్చి అవస్థ పడుతూ ఉండేదాన్ని. ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం. ఆపరేషన్ చేయించుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెబుతుండేవారు. అప్పుడు ఎవరో ఈ హోమియో డాక్టర్ మందు ఇస్తారు,  నయమైపోతుంది వెళ్ళండి అని సలహా ఇచ్చారు. నిజంగానే ఆయన దగ్గరికి వెళ్లి ఆయన ఇచ్చిన మందు తీసుకున్నాక నాకు మళ్ళీ టాన్సిలైటిస్ రాలేదు. దాంతో ఆయన మీద బాగా గురి కుదిరింది, కానీ  ఆయనకి కోపం ఎక్కువ. తర్వాత తర్వాత నా చిన్నప్పుడు బాగా ఇచ్చారు కదా అని వెళ్తే, ఏంటో చెప్పండి అనేవారు తీరా ఒకసారి చెప్పాక పొరపాటున మళ్లీ డాక్టర్ గారు ఇలా కూడా ఉంటుంది అని అన్నాననుకోండి, మొదట ఎందుకు చెప్పలేదని గుడ్లురిమే వారు. నిన్నా మొన్నా ఏంతిన్నావంటే, గుటకలు మింగడమేగానీ ఏం తిన్నదీ చచ్చినా గుర్తొచ్చేది కాదు‌. చిన్నప్పుడు లెక్క తప్పు చేస్తే మాస్టారు చేతిమీద బెత్తం చళ్ళు మనిపించటం గుర్తొచ్చి చెమటలు పట్టేవి. చెయ్యి చాపు, చెయ్యిచాపు అని బెత్తం తీస్తాడు అనిపించేది ఆయన మొహం చూస్తే.

ఓసారి ఇలాగే నాకు ఉన్నవి రెండు వేరు వేరు కంప్లైంట్స్ అనుకొని మొదట ఒక కంప్లైంట్ చెప్పి తర్వాత ఇంకో కంప్లైంట్ చెప్పా, దాంతో ఆయనకు అన్నీ ఒక్కసారే చెప్పనందుకు ఎంత కోపం వచ్చిందంటే ఆయన మందు ఇవ్వడం మాట దేవుడెరుగు కోపంతో నన్ను ఎక్కడ కొట్టి చంపేస్తారో ఏంటో అన్నంత భయం వేసింది.  గొంతు వణికేది, చేతులు వణికేవి.  అవి గమనించి  ఇవి చెప్పవేమని నిలదీస్తే ఈ లక్షణాలు ఇక్కడ ఉన్నంత సేపే ఉంటాయని చెప్పాల్సొస్తుందేమోనని గుండె నిముషానికి వెయ్యి సార్లు కొట్టుకునేది.  ఇంక అప్పటి నుంచి మళ్లీ ఫాలో అప్ విజిట్స్ కి వెళ్లాలంటే పిచ్చి టెన్షన్ వచ్చేది.  టెన్షన్ రెండు రోజుల ముందు నుంచి ఉండేది.  అది ఆయన కన్సల్టేషన్ పూర్తి అయి మందు కట్టిచ్చి బయటపడినప్పుడు కానీ తగ్గేది కాదు. ఈ రకంగా కొన్నాళ్లు తిప్పలు పడ్డాక కడుపులో నొప్పి కాలు నొప్పి మాట దేవుడెరుగు కొత్తగా బిపి,  గుండెపోటు లాంటివి కూడా వస్తాయేమో వయసు కాని వయసులో అని భయమేసేది.  దాంతో ఇక ఆయన దగ్గరికి వెళ్లడం మానేసాను.

మా మామగారు మమ్మల్ని ఎంత భయ పెట్టినా, పేషెంట్స్ ని ఎంతో కంఫర్టబుల్గా ఉంచేవారు అందరూ చాలా ఫ్రీగా వారి బాధలు చెప్పుకునే వారు ఫాలో అప్ కూడా అంతే శ్రద్ధగా చేసేవారు. ఎనభై ఏళ్ళ వరకూ ఆయన పేషంట్సుని చూసేవారంటే గొప్ప విషయం కదా. అసలు కొంత రోగం డాక్టర్ పేషెంట్ తోటి స్నేహంగా మాట్లాడితే తగ్గిపోతుంది.  అలాంటి డాక్టర్ ఆయన.

ఇప్పుడు కాసేపు మళ్ళీ కొన్ని కామెడీ కబుర్లు చెప్పుకుందాము. మా ఇంట్లో ముందు రూమ్ లోనే మామగారు పేషంట్స్ ని చూసేవారు. దానికోసం ప్రత్యేకంగా పొడుగాటి బల్ల ఉండేది.  సింబాలిక్ గా దానికొక ఆకుపచ్చని రంగు బట్టి కప్పి ఉండేది. అలాగే ప్రైవసీ కోసం పదడుగుల  పొడుగు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న చెక్క పార్టిషన్ ఉండేది.

ఆ పార్టీషన్ కి కూడా అదే ఆకుపచ్చ రంగు బట్ట కట్టి ఉండేది సగం నుంచి కిందకి. ఓ నాలుగు కుర్చీలు ఓవరసలో వేసుండేవి.  ఇవన్నీ మామగారి ఇఛ్చ ప్రకారం వాటి పొసిషన్స్ మార్చుకుంటుండేవి.  అయితే ఈ మార్పుల వలనో, వయసయి పోవటంవలనో, పార్టీషన్ కాళ్ళు అరిగి, ఊగుతుండేది.  అందుకని దానికి ఏదో ఒక సప్పోర్ట్ పెడుతూండేవారు.

ఒకసారి అది ఒక తేలికపాటి సోఫానానుకుని మహా ఫోజుగా నిలబడుంది.  అయితే ఇంటికి వచ్చిన ఒకాయన ఈవిషయం తెలియక సోఫాని ముందుకు జరిపి కూర్చున్నాడు. అంతే మా పార్టీషన్ యమా కోపంగా ఆయన గుండు ఠంగుమనిపించింది.

ఇంకో అరేంజ్మెంట్ లో మా పార్టిషన్ ఆ పేషెంట్ బల్లని ఆనుకుని నిలబడింది. కానీ పేషెంట్ బల్ల నిడివి రెండడుగులు పార్టిషన్ పొడుగు ఏమో పది అడుగులు. పార్టిషన్ తాగినవాడిలా తూలుతూ బ్యాలెన్స్ లేకుండా ముందుకీ వెనక్కీ అవుతుంటే బల్ల మాత్రం దూరం దూరం అంటూ ఉండేది.  ఈ రెండింటికీ ముడి పెడితే బాగుంటుందనిపించింది మామగారికి.  ఆ రెండింటికీ చుట్టి ఉన్న గుడ్డల్ని కలిపి ఒక పిన్నీసు పెట్టారు. అదెలా ఉండేదంటే, బాగా పెరిగిపోయిన పొట్టకి సరిపోని, టైట్ గా పట్టే చొక్కా గుండీలా ఉండేది. ఇక ఆ పొట్టలో పూజారి ఇచ్చిన తీర్థం అంత, ఓ చెంచాడు ద్రవం పోసినా గుండీపని ఫట్టే.  అలా వాటి బంధం కూడా, గొడవలు పడే తాగుబోతు మొగుడు పెళ్ళాల సంసార బంధంలా,  తెగుతుందా, ఉంటుందా అన్నట్టుండేది. పార్టిషన్ పక్కనుంచి వెళ్ళేప్పుడు మా జాగ్రత్తలో మేముండేవాళ్ళం.  హెల్మెట్ వేసుకోవటం ఒకటే తక్కువ.

అన్నట్లు పిన్నీసు అంటే గుర్తొచ్చింది.  ఈ పిన్నీసు కొక కథ ఉంది. ఓరోజు ఆఫీస్ కెళ్ళే హడావిడి లో అర్జెంటు గా పిన్నీసు కావలిసి ఎంత వెతికినా దొరక్క అత్తగారిని అడిగా. ఆవిడ మామ గారినడగమన్నారు.  మామగారినా ? పిన్నీసా ? సరిగా విన్నారా అని అనుమానంతో మళ్ళీ అడిగితే మామగారినే అడగమని ముసిముసిగా నవ్వారు.  పోయిపోయి టైగర్ మామగారిని పిన్నీసడగడం, ఓ కొత్త కోడలికెంత కష్టం ఆలోచించండి.  అప్పుడు గుర్తుకు వచ్చింది, మామగారు పిన్నీసును టూత్ పిక్ లా వాడటం చూసినట్లు. తప్పదుగా అవసరం మనదయినపుడు, సాహసం చెయ్యక తప్పదనుకొని వెళ్ళి అడిగాను. అడిగాను,  కన్నా గొణిగా అంటే కర్రెక్ట్. ఆయనకి సరిగ్గానే అర్థం అయింది. వెయ్యి వాల్ట్జ్ బల్బులా వెలిగే ఆయన మొహంలో ఆయన్ని ఇంకా వెలిగించే ఆ నవ్వు మొదటి సారి అవునో కాదో మరి, నాకు గుర్తున్నదైతే‌ అదే. ఇక అప్పుడు పిన్నీసు కావాలా అంటూ ఓ డబ్బా లోంచి తీస్తుంటే ఒకదానికొకటి పెట్టి ఉన్నట్టున్నాయి, ఎన్ని పిన్నీసులో.  చివరికి పైకి వచ్చింది ఒక పెద్ద పిన్నీసుల దండ.

రామ రావణయుథ్థంలో తనవైపు వీరులంతా మరణించాకా రావణుడు, కుంభకర్ణుడిని నిద్ర లేపమంటాడు చూసారా.  అప్పుడు నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటున్న అతని శరీరం విస్తరిస్తే ఆ మహాకాయుడిని చూసి రాక్షసులే దడుచుకున్నారట. మధ్యలో ఈ పిట్ట కథేంటనుకుంటున్నారా. ఆగండాగండి అక్కడికే వస్తున్నా.  మామగారు బయటికి తీసిన పిన్నీసుల దండ ఏదైతే ఉందో అది ఆ మహాకాయుడికి జంధ్యం అయ్యేదంటే నమ్మండి. ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుందని అప్పుడే తెలిసింది.

మామగారికి ఇంకో అలవాటు ఉండేది. ఏంటంటే వాడిని ఏవస్తువునైనా విసిరిపారెయ్యడం. ఈ అలవాటుకి దువ్వెన, పంచె, తువ్వాలు, టిఫెన్ ప్లేట్లు లాంటివి ఆనందంగా అలవాటు పడితే, టూత్ బ్రష్, కాఫీ కప్పులాంటి అర్భకప్రాణులు మాత్రం కేవలం వాటికున్న స్పెషాలిటీస్ వల్ల తప్పించుకొనేవి.

మూడొంతులు జీవితం అయిపోయినా ఒక పనిని ప్రతి రోజూ ఒక టైమ్ కి చెయ్యడం నాకలవడలేదు. ఫైలయిన ప్రతి సారీ అంతకష్టపెట్టుకోవటం అవసరమా అనుకొని సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేసెయ్యటం మాత్రమే నాకలవాటయింది.   మామగారిని చూస్తే మాత్రం క్రమశిక్షణ అంతకష్టమైన విషయం కాదేమో అనిపించేంత తేలిగ్గా, సూర్యుడు ఉదయించిి, అస్తమించినంత సహజంగా జరిగిపోతుండేది ఆయన రోజు. డైట్ విషయానికొస్తే, తినే ప్రతి దానికీ ఒక లెక్క, ఒక కప్పు అంటే ఒక కప్పే, కూరకూ,అన్నానికి, పెరుగు కీ అన్నింటికీ ఒక లెక్క. అది మించ కూడదు, అలాగే తగ్గటానికీ వీల్లేదు. మూడు చెపాతీలు గుండ్రంగా అరచేతి వెడల్పులో మూడంగుళాల రేడియస్తో.

ఇక పండగవస్తే కొంచెం దూరంగా ఉండే దగ్గర బంధువు లను ప్రతి సారీ ఇంటికి పిలిచేవారు.  ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే రావడానికి టైమ్ ఉన్నట్లే ఇంటి కొచ్చేవాళ్ళు వెళ్ళడానికి కూడా అదే టైమ్. ఎందుకంటే తొమ్మిది కొట్టగానే బయటి గేట్ తాళం పడి పోవాలి. ఆ టైమ్ కి ఇంకా వాళ్ళు భోంచేస్తున్నా సరే,  మీరు త్వరగా వెళ్తే నే గేట్ తాళం వేసుకుంటా అనేస్తారు. సరే మామగారి డిసిప్లిన్ గురించి అందరికీ  తెలిసిందేగా.  అన్నట్టు ఈ గేటుకీ, అది చేసే చప్పుడు కీ, మామగారి కొచ్చేకోపానికీ కూడా కొంత సంబంధం ఉండేది. ఆ గేటుని ఎవరు ఎప్పుడు చప్పుడు చేసినా ఎవరు, ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలకు మనదగ్గర సమాచారం, సమాధానం ఉండాల్సిందే.  ఈ సీను ఆయన పూజ చేసుకునేప్పుడూ, ఇంట్లో మిగతా అందరూ ఎవరి బిజీలో వారు వంటలోనో, ఆఫీస్కి రెడీ అవుతూనో, పిల్లల్ని స్కూలుకి రెడీ చేస్తున్నప్పుడో మరింత రక్తి కట్టేది.  పాలవాడూ, పేపరు వాడూ పనిపిల్ల వచ్చినపుడు, వెళ్ళేటప్పుడు కూడా రోజూ చెప్పాల్సిందే.  అసలే పూజలో ఉంటారేమో ముక్కంటిని తలపించే వారు.

ఇక్కడ ఇంకో కథ గుర్తొస్తోంది.  ఓసారి ఇంటికి ఓ దగ్గరి బంధువు వచ్చినపుడు అనుకోకుండా ఓ దుర్వార్త కొద్దిగా దూరంలో ఉండే  మరో దగ్గర బంధువులకి చెప్పాల్సివచ్చి వీళ్ళను పంపించారు. అయితే వాళ్ళు బయలుదేరినప్పటికే చాలా రాత్రవటం చేత బంధువుల ఇంటి నుంచి నేరుగా వారింటికి వెళ్ళిపోయారు. ఇప్పటిలా మొబైల్స్ ఉంటే పరిస్తితి వేరుగా ఉండేది.మామగారు వాళ్ళిద్దరూ వెనక్కి వస్తారని అనుకుని నిద్ర ఆపుకుని  రాత్రి పదకొండు దాటేవరకూ చూసారు.  వెళ్ళిన వాళ్ళు చిన్న పిల్లలు కారు, పైగా  వారిల్లు ఊళ్ళోనే కనుక అక్కడికి వెళ్ళుండచ్చని ఊహించవచ్చు.  కానీ మామగారికి ప్రేమవల్ల కలిగే ఆందోళన చేతనో, అందరి బాగోగుల బాధ్యత తన భుజాలపై వేసుకునే అలవాటు చేతనో, ఆ రాత్రి నిద్ర పోలేక, ఆ అర్థరాత్రి వాళ్ళు వెళ్ళిన బంధువుల ఇంటికి వెళ్ళాలని తీరా వెళ్ళాకా ఆ చీకట్లో వాళ్ళిల్లు కనుక్కోలేక, పోనీ ఫలానా ఇల్లు అని అడగడానికీ రోడ్ల మీద జనసంచారం లేక, ఆ వీధుల్లో తిరిగీ తిరిగీ అర్థరాత్రి దాటిపోతుంటే, ఇక ఇంటికి వెళ్ళిపోదామంటే కనీసం ఆటో దొరికే మైన్ రోడ్ కూడా తెలియటంలేదు.  అలా ఏ వీధి ఏ వీధిలోకెళ్తున్నదీ తెలియక తిరుగుతూ ఉంటే, అదృష్టం కొద్దీ ఓ ఇంటి మేడపైకి పైపులమీదుగా పాకుతూన్న ఓ వ్యక్తి, వ్యక్తి ఏంట్లెండి దొంగ, కనిపించాడట. మామగారు వాడిని చూడు బాబూ అని పిలవగానే, దొరికిపోయాన్రోయ్, అనుకుని భయపడి పైప్ మీంచి సగం జారిన ఆ దొంగ మామగారిని చూసాకా, ఆయన పిల్చిన తీరు ఒకసారి గుర్తు చేసుకుని, ఏంటి పెద్దాయినా అని అడిగి మామగారికి ఆ పైప్ మీంచే మైన్ రోడ్ కి వెళ్ళే దోవ చెప్పి, మళ్ళీ తన పన్లో తాను పడిపోయాడట. ఇక ఏ ఆటో అబ్బాయో ఆరాత్రి ఇల్లు చేర్చి పుణ్యం కట్టుకున్నాడు.  అలా ఆయన ఎటువంటి ఎడ్వెంచర్లకీ భయపడే వారు కాదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు చెప్పుకోవచ్చు. మామగారి క్రమశిక్షణ, మొక్కల పెంపకం, శరీరానికి అవసరమైన ఆహారం తీసుకోవడం, ఇవ్వాల్సిన వ్యాయామం పట్ల శ్రధ్ధ తీసుకోవడం లాంటివి, మరీ ముఖ్యంగా సమయపాలన లాంటి విషయాలు అందరూ నేర్చుకున్నారు. అయితే జీవితాన్ని మరీ అంత సీరియస్గా సరదా అన్ని మాటే లేకుండా ఎందుకు గడపాలి అనుకునేవారో మరి అర్థం అయ్యేది కాదు. బహుశా చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆయనకి జీవితంలో తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో బాగా అర్థమైయుటుంది. అందుకని తన తండ్రి వంతు తన వంతు రెండూకలిపి మమ్మల్నందరినీ జడిపించారనిపిస్తుంది.  జీవితాన్ని వీలయినంత సింపుల్ గా పెట్టుకుని, విలాసాలని దూరంపెట్టి, వ్రృత్తి తో సహా కుటుంబ సభ్యులు, కుటుంబ సంబంధాలన్నిటి పట్ల తన బాధ్యతని తను చేసే పూజ అంత నిష్ఠగా నెరపిన మామగారు మాకు సదా మార్గదర్శకులు.

(శారదా శివపురపు,రచయిత్రి, బ్లాగర్, బెంగళూరు)

4 thoughts on “మా మామగారి పిన్నీసుల కలెక్షన్ గురించి చెప్పాల్సిందే…

  1. You have explained very nicely the attitude and care taking of your father in law which speaks about their dedication towards the well being of their family .From your write up one can assume what a great personality he was and as u said his dedication towards his profession is laudable.

  2. Sharada, it was amazing to read ABT the discipline and huminatarian attitude of your father in law. It reminded me ABT mine in more than one ways. The gliding of subjects you make is interesting too. True. Whether one documents it or not, the elders in the family who hv left behind such vast n rich experiences need to be commemorated fondly. A very good n humourous write-up.

    1. Thanks Geeta Sudarshan for liking n commenting. I totally agree with you that we have to document our experiences with our elders at least for the sake of future generations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *