రేసులో ముందున్నఆక్స్ ఫోర్డ్ కరోనా వ్యాక్సిన్, దాని వెనక శక్తి, యుక్తి ఈమెదే

ప్రపంచంలో కోవిడ్ పాండెమిక్  మనుషుల్నిఉచకోత కోస్తున్నపుడే సొమ్ము చేసుకోవాలని పెద్ద పెద్ద ఫార్మష్యూటికల్ కంపెనీలు కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరుగుతీస్తున్నాయి.
 అపుడే కొంతమంది మా దగ్గిర మందుంది, పరీక్షలు చేశాం, వారంలోనే కోవిడ్ ‘ఫసక్’ ప్రకటించేస్తున్నారు.
కొన్ని కంపెనీలు తప్పుడు సమాచారమిచ్చి ఏదోవిధంగా కరోనాకు మందో మాకో ప్రపంచం మీదకు వదలి డబ్బు గుంజాలనుకుంటున్నాయి.
ఇప్పటికే కరోనా మందును, ఆక్సిజన్ ను, చివరకు ఆసుపత్రి మంచాలను కూడా బ్లాక్ లో అమ్ముకుంటూ  శవాల మీద పైసలేరుకుంటున్నారు ఇంకొంతమంది.
అయితే, ఒకే ఒక్క చోట మాత్రం లాభాపేక్షతో కాకుండా ‘నాట్ ఫర్ ప్రాఫిట్’ తో కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ  ప్రజలందరికి అందించే ఆశయంతో  పరిశోధన జరుగుతూ ఉంది. పరిశోధనలో అందరికంటే ముందున్నారు అక్కడి శాస్త్రవేత్తలు.  వాళ్ల వ్యాక్సిన్   ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. అన్నీ సవ్యంగా నడిస్తే సప్టెంబర్ లో మానవ జాతికి  శుభవార్త వెలువడుతంది. బహుశా ఒక మహిళ  ఈ వార్త ప్రకటించవచ్చు. ఆమె పేరు ఫ్రొఫెసర్ సరాగిల్బర్ట్ (58) (Sarah Gilbert). ఆక్స్ ఫోర్డ్ జెన్నెర్ ఇన్ స్టిట్యూట్ లో వ్యా క్సినాలజిస్టు. ప్రపంచంలోని మేటి వ్యాక్సిన్ శాస్త్రవేత్తల్లో ఒకరు.
జనవరి 10న చైనా నావెల్ కరోనా వైరస్ జీన్ సీక్వెన్స్ ను ప్రకటించిన మరుక్షణమే గుట్టుచప్పుడు కాకుండా వ్యాక్సిన్ తయారీలోకి దూకారామె. రేయింబగలు ఆమె టీమ్ తో ల్యాబ్ లోనే గడిపి వ్యాక్సిన్ క్యాండిడేట్ ను డెవెలప్ చేశారు.ఆమె ముగ్గురు కవలలు (ట్రిప్లెట్ ) వ్యాక్సిన్ ట్రయల్స్ పాల్గొంటున్నారు.
తెల్లవారుజాామున నాలుగ్గంటలకు నిద్రలేస్తారు. మెదుడు నిండా ప్రశ్నలే. వాటికి సమాధాానాలు వెతికే పని ఇంటిదగ్గరి మొదలవుతుంది. తర్వాత సైకిల్ మీద ఇన్ స్టిట్యూట్ కు. ఆపైన అక్కడ  రాత్రిపొద్దు పోయే దాకాపరిశోధనలతో కుస్తీ అని బ్లూమ్ బర్గ్ ఆమె గురించి రాసింది.
సరా గిల్బర్ట్ ప్రమోగం గురించి ప్రత్యేక కథనం
కోవిడ్ -19కి వ్యాక్సిన్ తయారు చేసే పరుగులో ఆక్స్ ఫోర్డ్ యూనివర్శిటీ ప్రపంచంలో అందరికంటే ముందుంది. యూనివర్శిటీ ఒప్పుకుంటే పార్ట్ నర్లుగా  చేరేందుకు బిల్ గేట్స్ వంటి మహానుభావులు కూడా క్యూ కట్టారు. వీలుకాలేదు.చివరకు, పాండెమిక్ సమయంలో  not-for-profit ప్రకారం అంటే లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్ ప్రపంచానికంతా అందిస్తామని ఎస్ట్రా జెనెకా (AstraZeneca) అనే కంపెనీ  ఆక్సోఫోర్డ్ తో ఒప్పందం చేసుకుంది.
ఈ ఆశయంతో సాగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధన సాధ్యమయినంతతొందరగా ఒక కొలిక్కి తెచ్చేందుకు సరా గిల్బర్ట్ శ్రమిస్తున్నారు.
వ్యాక్సిన్ల పరిశోధనలో ఆమె ఇరవై యేళ్లుగా  పనిచేస్తున్నారు. సాధారణంగా ఆమె పరిశోధనల గురించి ఎక్కడా బయటపెద్దగా వినిపించదు. బజారునబడి ప్రకటించుకోవడం ఆమెకు ఇష్టముండదు.ఇంతవరకు ఆమె ఎన్నో వ్యాక్సిన్లను తయారు చేశారు.పరీక్షించారు. అయితే, ఈ సారి  ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 వ్యాక్సిన్  ఆమెను వార్తల్లోకి లాగింది. కోట్ల మంది కోవిడ్  బాధితుల మధ్య  ఆమెని  హాట్ టాపిక్ ని చేసింది.
 ఆమె బృందం డెవెలప్ చేసిన  వ్యాక్సిన్ (ChAdOx1) మూడో దశ అంటే చివరి దశ  ట్రయల్స్ కువచ్చింది.  కీలకమయిన ఈ దశలో  బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, యుకెలోని వేలాది మంది వలంటీర్లు ఈ ట్రయల్స్ పాల్గొంటున్నారు. తొందర్లో అమెరికా కూడా ఈ క్యూలో చేరుతున్నది.  గిల్బర్ట్ పరిశోధనకు నిధుల సమస్య కూడా లేదు. ఆక్స్ ఫోర్డ్ జెన్నెర్ ఇన్ స్టిట్యూట్ చెందిన గిల్బర్ట్ టీమ్ ఏప్రిల్ లో 1,100 మంది మీద తొలి పరీక్షలు నిర్వహించింది.
తన వ్యాక్సిన్ గురించి గిల్బర్ట్ బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయి వివరించారు. ఆమె పరిశోధన ఏమిటో కనుక్కోవాలన్న ఆసక్తి  పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ కమిటీకి కలిగింది.  ఆమె ఇతర వ్యాక్సిన్ తయారీ దారుల కంటే చాలా ముందున్నారని బ్రిటిష్ పార్లమెంటు కూడా గుర్తించింది.
<
తన వ్యాక్సిన్ గురించి గిల్బర్ట్ చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.   ఈ వ్యాక్సిన్ కరోనా ప్రబలుతున్న వాతావరణంలో నివసించే ప్రజలలో ఇన్ ఫెక్షన్ ను అడ్డుకోవడంలో 80 శాతం  విజయవంతమవుతుందని ఆమె ధీమా గా చెబుతున్నారు.
సెప్టెంబర్ కల్లా  ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుందని కూడా చెబుతున్నారు. వచ్చే శీతాకాలంనాటికి కూడా వ్యాక్సి న్ వస్తుందా లేకా శీతాకాంలో కూడా వ్యాక్సిన్ లేకుండా బిక్కు బిక్కుమంటూ ప్రజలుండాలా అని ఒక ఎంపి అడిగినపుడు ఆమె తమ టైమ్ లైన్ ను కొద్దిగా మార్చి శీతాకాలం నాటికి వ్యాక్సిన్ అండ లభిస్తుందని కూడా ఆమె హామీ ఇచ్చారు.
జనవరిలో  కొద్ది మందితోనే మొదలయిన ఆమె టీమ్ ఇపుడు 250  పరిశోధకుల స్థాయికి పెరిగింది. రేయింబగలు ఆమె ఆలోచలన్నీ వ్యాక్సిన్ చుట్టూ తిరుగుతుంటాయి.
ఆమె తయారు చేస్తున్న వ్యాక్సిన్ రకం పేరు వైరల్ వెక్టార్డ్ వ్యాక్సిన్స్ (viral vectored vaccines). సాధారణ వ్యాక్సిన్ లన్నీ బలహీనపర్చిన లేదా నిర్వీర్యం చేసిన వైరసే. వాటిని అంత తొందరగా డెవెలప్ చేసి తయారుచేయడం చాలా కష్టం.
అందువల్ల వ్యాక్సిన్ల తయారీలో ఆక్స్ ఫోర్డ్ టీమ్ కొత్త మార్గం ఎంచుకుంది. వ్యాక్సిన్ ని స్పీడ్ గా తయారుచేసే విధానానికి మెరుగులు పెట్టింది.  ఇందులో నిర్వీర్యం చేసిన వైరస్ కు బదులు వైరస్ లోని జెనెటిక్ మెటీరియల్ ని వాడుతారు.  హాని చేయని ఒక  వైరస్ నే ఒక కీలుగుర్రం (Trojan horse) లాగా వైరల్ వెక్టార్డ్ వ్యాక్సిన్స్ లో సాధనంగా ప్రయోగిస్తారు. ఇది కీలుగుర్రం  కడుపులో కరోనా  వైరస్ జెనెటిక్ మెటీరియల్ నింపి, మనిషిలోకి ప్రవేశపెడతారు. అపుడు మనిషికణాలు ఈ జెనిటిక్ మెటిరియల్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీలను తయారు చేస్తాయి.
ఆక్స్ ఫోర్డ్ వ్యాక్సిన్ లో  గిల్బర్ట్ బృందం చింపాంజిలలో  సాధారణ జలుబు ను కలిగించే ఎడినో వైరస్ ను కీలుగుర్రం లాగా ఎంచుకున్నారు. ఇది మనిషికి అంతగా హాని చేసే బాపతుకాదు. ఈ కీలుగుర్రం కడుపులో SARS-CoV-2  వైరస్ స్పైక్ ప్రొటీన్  లోని జెనెటిక్ మెటీరియల్ నింపారు.  ఈ కీలుగుర్రం మనిషిలోకి ప్రవేశించగానే మనిషిలో రోగనిరోధక శక్తి అలర్ట్ అవుతుంది. ఈ వైరస్ మోసుకువచ్చిన నావెల్ కరోనా జెనెటిక్ మెటిరియల్ కు వ్యతిరేకంగా యాంటీ  బాడీలను భారీగా ఉత్పత్తి చేయడమే కాదు,  టి-సెల్స్ కూడావిపరీతంగా తయారయ్యాయి. టి-సెల్స్ అంటే ఒక రకం తెల్లరక్త కణాలే,బయటి నుంచి వచ్చే రోగక్రిముల మీద  దాడి చేసే కమెండోల్లాగా ఇవి పనిచేస్తుంటాయి.యాంటి బాడీలు,టి- సెల్స్ రెండు కలసి ఇన్ ఫెక్షన్ అంతం చేస్తాయి.
చైనాకు చెందిన క్యాన్ సైనో బయాలొజిక్స్ కంపెనీ, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు  కూడా ఇదే పద్ధతిలో వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నాయి.  కాకపోతే, ఈరెండు కంపెనీలు మనిషి లోని ఎడినో వైరస్ ను తీసుకుని వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఇంకా మనుషుల మీద వ్యాక్సిన్ ప్రయోగించినే లేదు.
ఆక్స్ ఫోర్డ్ టీమ్ ముందుండేందుకు కారణం
ఆక్స్ ఫోర్డ్  గిల్బర్ట్ టీమ్ వ్యాక్సిన్ పరిశోధనలో ఇంతవేగంగా దూసుకుపోయేందుకు కారణం ఈ బృందం 2014లో ఎబోలా వైరస్ మీద పరిశోధనలు చేసి ఉండటేమే. ఆఫ్రికాలోని గినీ, లైబీరియా, సియెర్రా లియాన్ లలో ఎబోలా  విజృంభించినపుడు వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించింది జెన్నెర్ ఇన్ స్టిట్యూటే . అయితే, వ్యాక్సిన్ తయారయ్యేలో పు ఎబోలా మాయమయింది. దీనితో ముందు ముందు  వ్యాక్సిన్ సామర్థ్యం పరీక్షించాలంటే వైరస్ వెనక్కు తగ్గే లోపు  వేగంగా తయారు చేయాల్సిన అవసరాన్ని ఆక్స్ ఫోర్డ్ గుర్తించింది.  తర్వాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ను తీసుకువచ్చే మరొక రకం కరోనా వైరస్ మీద పరిశోధనలు మొదలుపెట్టారు. కోవిడ్ కంటే ఇది ఇంకా  ప్రాణాంతకమయినది. సోకిన వారిలో అందుకే ప్రపంచంలోని అందరికంటే ముందే కరోనా వైరస్ మీద గిల్బర్ట్ టీమ్ రీసెర్స్ మొదలుపెట్టింది. మెర్స్ వ్యాక్సిన్ తయారీ కి కూడా గిల్బర్ట్ చింపాంజీ నుంచి సేకరించిన వైరస్ నే వాడారు. మెర్స్ వ్యాక్సిన ప్రయోగం 2019 డిసెంబర్ దాకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, మెర్స్ కేసులు కేవలం మధ్యప్రాచ్యంలో మాత్రమే కనిపిస్తూ ఉండటంతో ఈ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువుచేయడం ఆలస్యమవుతూ ఉంది.
ఇలాంటపుడు కోవిడ్ -19 ప్రపంచానికి సవాల్ విసిరింది. మెర్స్ మీద చేసిన పరిశోధనలు గిల్బర్ట్ కు బాగా ఉపయోగపడ్డాయి. ఎలాగంటే  SARS-CoV-2  స్పైక్ ప్రొటీన్, మెర్స్ స్పైక్ ప్రొటీన్  40 నుంచి 50 శాతం ఒకలాగే ఉంటాయి.  అందుకే ఆమె దగ్గిర మొత్తం పరిశోధన సిద్ధంగా ఉంది కాబట్టి, చైనా శాస్త్రవేత్తలు నావెల్ కరోనా వైరస్ జెనెటిక్ సీక్వెన్స్ ను 2020 జనవరి 10 తేదీన ప్రకటించగానే, మరుక్షణమే ఈ వ్యాక్సిన్ డెవెలప్ మెంటు  పరిశోధనలోకి దూకేశారు.  దానికి తోడుఆక్స్ ఫోర్డ్ కు సొంత వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఉంది. అందుకే తొలిషాట్స్ ని ధనాధన్ తయారు చేసి గిల్బర్ట్  ట్రయల్స్ మొదలుపెట్టారు.
Source: Oxford Biomedica
ఇపుడు ఆఖరు దశ ట్రయల్స్ లో  కూడా చాలా దూరం వెళ్లిపోయారు. మార్చి 23న ప్రధాని బొరిస్ జాన్సన్  2.2 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల గ్రాంటు మంజూరుచేశారు. ఈ వ్యాక్సిన్ ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఏస్ట్రా జెనెకా అంగీకరించింది. ఏప్రిల్ లో ఈ డీల్ కుదిరింది.  తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మరొక 65 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు సాయం అందించి యుకెప్రజలకు 30 మిలియన్ డోసులువ్యాక్సిన్ ను అందివ్వాలని అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. మొత్తం బ్రిటన్ కు 100 మిలియన్ డోసులివ్వాలి. మిగతాది అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందివ్వాలని వారు నిర్ణయించారు.
అంతా బాగుంది, చివరి దశ ట్రయల్స్ కూడా విజయవంతమయితే కోట్లకుకోట్ల డోసుల వ్యాక్సిన్ తయారు చేయడం ఎట్లాఅనేది ఇపుడు మా ముందున్న సమస్య అని గిల్బర్ట్ అంటున్నారు.

Like this story? share it with a friend!