సచిన్ మొదటి సెంచురీ కొట్టి… నేటికి ముప్పై యేళ్లు

(CS Saleem Basha)
సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు(14.08.1990) మూతి మీద మీసం కూడా సరిగా లేని 17 సంవత్సరాల కుర్రోడు వోల్డ్ ట్రఫార్డ్ (Old Trafford) లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తన మొదటి సెంచరీ చేశాడు.
భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు ఒకరోజు ముందుగానే, భారతీయులకు సంబరాలు జరుపుకునే అవకాశం ఇచ్చిన సచిన్, ఇంగ్లాండ్ పై సెంచరీ చేయడం మరింత ఆనందాన్ని కలిగించింది.
అంతకుముందు (నవంబర్ 15, 1989) పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఆ కుర్రాడు 15 పరుగులు మాత్రమే చేసినప్పటికీ అందరినీ ఆకట్టుకున్నాడు.
పాకిస్తాన్ బౌలర్లను ఆ కుర్రవాడు హ్యాండిల్ చేసిన పద్ధతి అందరి ప్రశంసలను ఇది పొందింది. అలా మొదటి సెంచరీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ కుర్రవాడే తర్వాతి కాలంలో ” క్రికెట్ మతం అయితే సచిన్ దేవుడు” అనే నానుడిని (భారతదేశంలో) సృష్టించిన సచిన్ రమేష్ టెండూల్కర్!
క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ లు, వన్డేలు కలిపి నూరు శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా ఎదగడం వెనుక ప్రతిభ తో పాటు ఎంతో శ్రమ, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం, ఉన్నాయి.
టెండూల్కర్ క్రికెట్ ఆడేటప్పుడు స్టేడియంలో కిటకిటలాడాయి. లైవ్ చూడలేని వాళ్ళు టీవీలకు అతుక్కుపోయే వాళ్లు. యువతరాన్ని, యువ క్రికెటర్లను ప్రభావితం చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. 40 ఏళ్ల వయసులో ఎంతో ఉద్వేగంతో ఆటకు దూరమైన సచిన్ భారతరత్న అవార్డు అందుకోవడం విశేషం. ఆటతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతో కూడా ప్రజలను మనసులో స్థానం సంపాదించిన వ్యక్తికి లభించిన గౌరవం అది.
క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అయితే, సచిన్ దానికి సరిగ్గా సరిపోతాడు. మైదానం లోపల, బయట కూడా వివాదరహితుడిగా, మృద భాషి గా పేరు పొందిన సచిన్ మాటల కన్నా పరుగులతో ప్రత్యర్థులకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడేవాడు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లల మాటల యుద్ధానికి (sledging) సచిన్ బ్యాట్ తోనే సమాధానం ఇచ్చేవాడు. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఒక గొప్ప ఆటగాడు సచిన్. సచిన్ వికెట్ తీయడమంటే గొప్ప గౌరవంగా భావించే బౌలర్లు అన్ని దేశాల్లో ఉన్నారు.
బౌలర్లకు సింహస్వప్నం సచిన్. టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాల పై శతకం బాదిన ఒకే ఒక్కడు సచిన్ రమేష్ టెండూల్కర్!
సచిన్ ఆడని ఫార్మాట్ లేదు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్రను వేసినవాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ మహామహుడు బ్రాడ్మన్ తో పోల్చదగ్గ ఏకైక ఆటగాడు సచిన్. తన క్రికెట్ కెరీర్లో భారత్ కు ఎన్నో విజయాలు అందించిన టెండూల్కర్, యువ ఆటగాళ్లకు ఆరాధ్యదైవం. సచిన్ పొందిన అవార్డులు రివార్డులు, సత్కారాల గురించి రాయాలంటే ఒక పుస్తకం రాయాల్సి ఉంటుంది. అవార్డుల కే గౌరవం కలిగించిన ఆటగాడు సచిన్
200 టెస్ట్ మ్యాచ్ లలో 51 సెంచరీలతో, 15,921 పరుగులు, 463 వన్డేలలో 49 సెంచరీలతో 18,426 పరుగులు చేసిన టెండూల్కర్ భారతదేశంలో క్రికెట్ కు పర్యాయపదంగా నిలిచిపోవడం, సచిన్ ఎంత గొప్ప క్రికెటరో తెలియజేస్తుంది.

 

(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)

Like this story? Share it with a friend!