భారత్ కన్నా ముందు పాకిస్తాన్ జట్టులో ఆడిన సచిన్ టెండూల్కర్!!

(సిఎస్ సలీమ్ బాషా)
అవును ఇది నిజం! సచిన్ ఇండియాకు ఆడక మునుపు పాకిస్తాన్ ఆడాడు. ఈ సంఘటన 1987 లో ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో లో భారత్, పాక్ మధ్య జరిగిన ఫెస్టివల్ మ్యాచ్ లో సచిన్ పాకిస్తాన్ జట్టు కి ఆడాడు. భారత పాకిస్తాన్ జరిగిన మ్యాచ్ లో భోజన విరామ సమయంలో పాకిస్తాన్ జట్టులోని జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ మైదానం నుంచి బయటికి వెళ్లారు. అప్పుడు సచిన్ టెండూల్కర్ సబ్స్టిట్యూట్ (substitute) ఫీల్డర్ గా పాకిస్థాన్ జట్టులో ఆడాడు. రెండు సంవత్సరాల తర్వాత 1989 లో సచిన్ టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అది కూడా పాకిస్తాన్తో కరాచీ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కావడం విశేషం! అలాగే మొదటి వన్డే మ్యాచ్ కూడా పాకిస్తాన్ తోనే ఆడడం జరిగింది.
భారతీయ క్రికెట్ గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు చూద్దాం
* సొగసైన బ్యాట్స్ మన్ గా పేరు పొంది, 134 టెస్ట్ మ్యాచ్ లు, 86 వన్డే మ్యాచ్ లు ఆడిన వివిఎస్ లక్ష్మణ్ ఒక్క ప్రపంచ కప్ మ్యాచ్ కూడా ఆడలేదు. 1996 లో అరంగేట్రం చేసిన లక్ష్మణ్ 2012 లో తన చివరి టెస్టు ఆడాడు. లక్ష్మణ్ కెరీర్లో 4 వరల్డ్ కప్ లు జరిగాయి,(1999, 2003, 2007, 2011). లక్ష్మణ్ ఒక్క వరల్డ్ కప్ లో కూడా ఆడలేదు!!
* తన జీవిత కాలంలో ఒకే ఒక్క T 20 మ్యాచ్ ఆడిన భారత ప్రముఖ క్రికెటర్లలో రాహుల్ ద్రావిడ్ తో పాటు సచిన్ కూడా ఉన్నాడు. వివిఎస్ లక్ష్మణ్ కనీసం ఒక్కటి కూడా ఆడలేదు!
* 60, 50 మరియు 20 ఓవర్ల ప్రపంచ కప్లను గెలుచుకున్న ఏకైక దేశం భారతదేశం. 1983 ప్రపంచ కప్ (60 ఓవర్ల టోర్నమెంట్), 2011 ప్రపంచ కప్ (50 ఓవర్ల టోర్నమెంట్), 2007 టి20 ప్రపంచ కప్(20 ఓవర్ల టోర్నమెంట్).
* ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్ ది నవాబ్ ఆఫ్ పటౌడీ (సీనియర్), నటుడు సైఫ్ అలీ ఖాన్ తాత అయిన ఇఫ్తీఖర్ అలీ ఖాన్ పటౌడీ.
* భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తన మొదటి మూడు టెస్ట్ మ్యాచ్ ల లో వరుసగా మూడు (బ్యాక్-టు-బ్యాక్) సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మాన్. 1984-85 లో ఇంగ్లాండ్ తో జరిగిన 3 టెస్ట్ ల సిరీస్ లో అజరుద్దీన్ ఈడెన్ గార్డెన్, కోల్కతా(110), చిదంబరం స్టేడియం, మద్రాస్(105), గ్రీన్ పార్క్, కాన్పూర్ (122) లలో శతకాలు సాధించాడు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు
* బెంగాల్కు చెందిన ప్రబీర్ సేన్, క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్ మాన్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ను స్టంప్ చేసిన ఏకైక వికెట్ కీపర్.
* క్రికెట్ చరిత్రలో వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) ఫార్మాట్లో వరుసగా నాలుగు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన ఏకైక క్రికెటర్, టీం ఇండియా యొక్క అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.
* 2011 లో, ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చి ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.2019 లో ఇంగ్లాండ్ ఆ ఘనతను సాధించింది.
* టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజులో రెండుసార్లు ఆల్ అవుట్ అయిన ఏకైక జట్టు భారత క్రికెట్ జట్టు. 1952 లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో ఇది జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 144 ఓవర్లలో 374 పరుగులు చేయగా, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్లో 21.4 ఓవర్లలో 58 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఫాలోఆన్ ఆడుతూ రెండవ ఇన్నింగ్స్ లో 36.3 ఓవర్ లలో 82 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ కి ఇన్నింగ్స్ తేడాతో విజయం దక్కింది.

సిఎస్ సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, కమ్యూనికేషన్ స్కిల్స్ కోచ్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *