Home Features దక్షిణ సబర్మతి ఆశ్రమం ఎక్కడుందో తెలుసా, ఇది మొదలై నేటికి వందేళ్లు…

దక్షిణ సబర్మతి ఆశ్రమం ఎక్కడుందో తెలుసా, ఇది మొదలై నేటికి వందేళ్లు…

283
0
Pinakini Ashram (Pic credits (Wikimedia Commons)
దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పేరున్న ఈ ఆశ్రమాన్ని గాంధీజీ 1921 ఏప్రిల్ ఏడున ప్రారంభించారు. ఈ ఆశ్రమం ఏర్పాటుచేయడానికి కారణమయిన వ్యక్తి ఆశ్రమం ఏర్పాటు చేసిన కొద్దిసంవత్సరాల్లోనే జబ్బుపడ్డారు. గాంధీయన్ భావాలతో ప్రేరణ పొందిన ఆయన ఈ జబ్బుకు ఆల్లోపతి వైద్యం చేయించుకోలేదు. నేచురోపతినే నమ్ముకున్నారు. ఈ వైద్యంతో ఆయన జబ్బు నయం కాలేదు. చివరకు ఆశ్రమాన్ని అన్నీ తానే నడిపిన ఆ వ్యక్తి 1926 మార్చిన కన్నుమూశారు. ఎవరాయన? ఇక చదవండి.

(గూడూరు లక్ష్మి)

దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పేరు మోసిన ఆశ్రమం మీద ప్రత్యేకం

భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాలలో ముఖ్యమైనవి మొదటిది ఉత్తర భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం “సబర్మతి ఆశ్రమం” అయితే దక్షిణ భారతదేశంలో స్థాపించిన ఆశ్రమం” పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం”.దీన్నే “దక్షిణ సబర్మతి” అని పిలుస్తారు. ఈ ఆశ్రమం 1921 ఏప్రిల్ 7 వ తేదీ మహాత్మా గాంధీ స్వయంగా,స్వహస్తాలతో ప్రారంభించారు.
ఈ మహిమాన్విత క్షేత్రం 7-4-2020 నాటికి 100 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నది. సత్యం అహింస మీద ఆధారపడి గాంధీ గారు సాగించిన స్వాతంత్ర పోరాటంకి సత్యాగ్రహ సైనికులను తయారు చేయడానికి దక్షిణ భారతదేశంలో శిక్షణాలయం ప్రారంభించాలని ఆలోచిస్తుండగా,1890 సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలోని,గంజాంజిల్లాలో జన్మించిన దిగుమర్తి హనుమంతరావుగారు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు.

Think your friends would be interested? Share this story!

 1915 సంవత్సరంలో గాంధీగారిని హనుమంతరావు పూనా నగరంలో కలిశారు. గాంధీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులై 1920లో  సబర్మతి ఆశ్రమంలో చేరి సేవ చేయడం ఆరంభించారు. హనుమంతరావు గారి క్రమశిక్షణ,అంకితభావం గమనించి, గాంధీ గారు ఆశ్రమం నడుపుటకు కావలసిన అన్ని లక్షణాలు హనుమంతరావులో ఉన్నాయని గుర్తించి ఆశ్రమం ఏర్పాటు చేసే బాధ్యత హనుమంతరావు భుజస్కందాలపై ఉంచారు.
పల్లిపాడులో 1894 వ సంవత్సరం లో పుట్ట  సబర్మతి ఆశ్రమంలో ఉంటూచతుర్వేదుల వెంకటకృష్ణయ్య  హనుమంత రావు తో గాఢమైన స్నేహం ఏర్పడింది. పల్లెపాడు లో పినాకినీ నది ఒడ్డున ఆశ్రమ ఏర్పాట్లు అన్నివిధాలా తగినదని చెప్పటంతో ఇద్దరు గాంధీ గారి అనుమతితో పల్లెపాడు చేరుకున్నారు.
కొండపర్తి పున్నయ్య గారు వీరికి తోడయ్యారు. ఒక చేత స్వాతంత్య్ర సమరాన్ని,ఇంకొక చేత జమిందారు రైతు ఉద్యమాన్ని నడిపిన వీరనారీ,సవ్యసాచి శ్రీమతి పొణకా కనకమ్మ గారు ఆశ్రమానికి కావాల్సిన స్థలాన్నిఇచ్చారు.
చిదంబరం పెళ్లై మున్నగు వారితో కలసి తుపాకీ కేంద్రంగా ఉన్న ఆ స్థలాన్ని గాంధీ గారి పరిచయంతో అహింసా కేంద్రంగా మార్చే ఆలోచన చేసి 9 ఎకరాల మామిడి తోపును కొని ఆశ్రమ స్థాపనకై ఇచ్చారు. చతుర్వేదుల వెంకట కృష్ణయ్య దాదాపు 22 ఏకరాల స్థలాన్ని సేకరించి సమకూర్చారు.
1921 ఏప్రిల్ 7న మహాత్మా గాంధీ నెల్లూరుకు రైలులో వచ్చారు. శ్రీమతి పొణకా కనకమ్మ భర్త సుబ్బరామిరెడ్డి ఇరువురు రైల్వే స్టేషన్ దగ్గరకు ఎద్దుల బండిలో వచ్చారు. బండిలో పెద్ద పరుపు వేసి గాంధీగారిని కూర్చుండబెట్టి పల్లెపాడు కి తీసుకుని వెళ్లారు. నిర్మాణానికి గాను తన ఒంటి మీద నగలను మహాత్మునికి విరాళంగా ఇచ్చింది. జీవితంలో తిరిగి నగల ధరించని వద్దని మహాత్ముడు ఆమె వద్ద ప్రమాణం తీసుకున్నాడు.
1921వ సంవత్సరం నవంబర్ 25 తేదీన ట్రస్ట్ డీడ్ ద్వారా ఆశ్రమాన్ని రిజిస్టర్ చేయించి, ప్రథమ ట్రస్టీలైన శ్రీ దిగుమర్తి హనుమంతరావు, వారి సతీమణి శ్రీమతి దిగుమర్తి బుచ్చి కృష్ణమ్మ, శ్రీ చతుర్వేదుల వెంకట కృష్ణయ్య,శ్రీ కొండపర్తి పున్నయ్య యావజ్జీవ ట్రస్టీలుగా,ఆశ్రమ సభ్యులనుండి ఎన్నుకోబడి మరి ఇద్దరు కలిసి బోర్డు గా వ్యవహరించుటకు ఏర్పాటు చేశారు. ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య ఆరుగురికి మించ రాదని ఏర్పాటు చేశారు.
గాంధీగారి గుజరాతీ స్నేహితులైన రుస్తుంజీ ,గాంధీగారి నిరాడంబరత ,ప్రేమ ఆదర్శ జీవితం,వారిపట్ల ఆకర్షితులై ఆశ్రమ నిర్మాణానికై 5వేల రూపాయల విరాళం ఇచ్చారు. జాతీయ కాంగ్రెస్ వారు 10.000 రూపాయలు, మునగాల రాజా 2 వేల రూపాయలు మరియు కొంత ధనాన్ని చందాల రూపంలో వసూలు చేసి ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. తొలుత పూరిపాకలతో ప్రారంభమైన ఆశ్రమం 1925 నాటికి ఆశ్రమంలో భవనాలు ఏర్పడ్డాయి. ఆ భవనానికి”రుస్తుంజీ భవన్” అని నామకరణం చేసారు.
చతుర్వేదుల కృష్ణయ్య జనాన్ని సమీకరించడంలోనూ, సభలను చేయడంలో సమర్థులు,వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవారు. అస్పృశ్యత నిర్మూలన హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జిల్లాలో తొలి హరిజన హాస్టల్ ను ప్రారంభించిన ఘనత వీరికి దక్కింది. కొంత కాలం గడిచిన తర్వాత ఈ బృందంలో ఇస్కాచెంచయ్య దంపతులు ,కాళ్ళకూరి వెంకటరావు దంపతులు, హనుమంతరావు గారి సోదరులు వెంకటరామస్వామి, ఆయన భార్య జానకి దేవి చేరారు. పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావు ,భార్య, వారి తల్లి, వాడ్రేవు జగ్గరాజు, శ్రీ గుణదల సుబ్బారావు గారు, తిరుపతి నాయుడు గారు, మణికొండ సత్యనారాయణ గారు, కొంతకాలం ఆశ్రమంలో ఉండి ఆశ్రమ కార్యక్రమాలలో సేవ చేస్తూ గడిపారు. పాటూరు సుబ్బరామయ్య,సరస్వతమ్మ దంపతులు,శ్రీమతి పొణకా కనకమ్మ,వెన్నెలకంటి రాఘవయ్య,తిక్కవరపు రామిరెడ్డి వంటి గాంధేయవాదులు ఆశ్రమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. అహింసా, సర్వ మత సామరస్యం, హిందీ ప్రచారం, న్యాచురోపతి, అస్పృశ్యత నివారణ, వయోజన విద్య కు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టేవారు.
1923 లో ఆశ్రమం లో బందిపోటు దొంగలు జోరపడి ఆశ్రమవాసులను కొల్లగొట్టి స్త్రీల వద్ద ఉన్న నగలను కూడా దొంగిలించడంమే కాకుండా, గాయాలపాలు చేసి పారిపోయారు. అయినప్పటికీ ఆశ్రమవాసులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా తిండికి లేని వారు ఈ పని చేసి ఉంటారని సమాధానపడి ఊరుకుండినారు. ఈ ఉదంతము ఇతరుల అందరిలో సంచలనం కలిగించింది రిపోర్టు లేనప్పటికీ పోలీసులు ఈ దొంగలముఠాను పట్టుకుని ఆశ్రమవాసులను నిందితులపై సాక్ష్యాన్నిఇస్తే బందీలుగా చేస్తామని చెప్పినా, ఆశ్రమవాసులు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వకుండా వదిలివేశారు.దొంగతనం చేసిన కొన్ని బంగారు ఆభరణాలను పోల్చుకొనుటకు దిగుమర్తి వచ్చి కృష్ణమ్మ గారిని కోరగా నగలు తమవి వలె ఉన్నవి కాని తమవే అని నిర్ధారణగా చెప్పలేమని,అంగీకరించని కారణంగా ఆమె ప్రవర్తన చూసినంతనే దొంగలు విస్మయం చెంది, నేరగాళ్లను తామే ఒప్పుకొని,ఆ వృత్తాంతమును చేసింది వారేనని చెప్పి వేసినారు. కేసు రుజువై దొంగలకు శిక్ష పడింది. ఈ విషయం గాంధీ గారికి తెలిసి ఆశ్రమవాసులు యొక్క, ముఖ్యముగా శ్రీమతి కృష్ణమ్మ గారి యొక్క ధైర్యం ముందు ప్రవర్తనను మెచ్చుకున్నారు.ఆశ్రమవాసులు ఒక గుణపాఠం అని, అస్తేయము ఆదర్శముగా గల ఆశ్రమ సభ్యులు ఆకర్షించు ఆభరణములను ధరించుటకానీ, బంగారం ఉంచుకొనుటగాని కూడదని విషయమును గ్రహించి అప్పటినుంచి ఆశ్రమంలో విలువైన ఆభరణములు ధనమును కలిగి ఉండటం మానివేశారు.
చక్కగా నడుస్తూ ఉండగా 1925లో దిగుమర్తి హనుమంతరావు ప్రకృతి చికిత్సని పొందుతూ,మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ 1926 నాటికి భౌతిక దేహాన్నివిడిచి పరమపదించడం జరిగింది.
ఆయన భార్య అక్కడ ఉండకపోవడం, పిమ్మట చతుర్వేదుల వెంకట కృష్ణయ్య హనుమంతరావు మరణంతో మనస్థాపం చెంది తుదకు ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టి, పాండిచ్చేరి,అరవింద ఆశ్రమం వెళ్లిపోవడం జరిగింది.హనుమంతరావుగారు మరణించిన తర్వాత కొంతకాలం కృష్ణమ్మగారు ఆశ్రమాన్ని నిర్వహించి సీతానగరం వెళ్ళిపోవడం జరిగింది.
1929లో రెండవ సారి మే11వతేదీన గాంధీగారు ఆశ్రమం కి విచ్చేయడం జరిగింది. అదే రోజు రాత్రి పల్లెపాడులో ఆశ్రమానికి విచ్చేసి ఆ రోజు రాత్రి అక్కడే బస చేయడం జరిగింది.ఆ సందర్భంలో ఆ ఊరి బ్రాహ్మణలు, బ్రాహ్మణ అగ్రహారంకి గాంధీజీని రావలసినదిగా కోరగా ,దళితులను కూడా ఆ వీధిలో అనుమతిస్తేనే వస్తానని చెప్పి ఆతర్వాత వారికి కూడా అనుమతి ఇస్తామని చెప్పినట్లు,అప్పుడే గాంధీ గారు బ్రాహ్మణ వీధికి వెళ్లారని, దారి పొడుగూతా వారు పోసుకుంటూ గాంధీ గారిని ఆహ్వానించారని గ్రామ ప్రజలు చెప్తుండేవారు.
తర్వాతి కాలంలో కొండపర్తి పున్నయ్య గారు ఖాదీ సంస్థ లో పనిచేయుటకు వెళ్లిపోవడం, శ్రీ ఖాసా సుబ్బారావు గారు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి “స్వరాజ్య పత్రిక “సంపాదకులుగా, దిగుమర్తి వెంకటస్వామిగారు కాంగ్రెస్ సేవకులుగా వెళ్లి పోవడం,ఇస్కా చెంచయ్య గారు ఆయన భార్య బ్రహ్మసమాజం ఆడపిల్లల హాస్టల్ నడుపుటకు వెళ్లిపోవడం, శ్రీ కాళ్లకూరి వెంకట్రావు, వారి కుటుంబం కూడా ఆశ్రమం విడిచి పోవడం, శాశ్వత ధర్మకర్తల అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని వదిలి వేయడం జరిగింది. ఆశ్రమం స్థాపించిన తొలి రోజుల్లో రెంటాల కృష్ణమ్మ(య్య), ఆయన భార్య సుబ్బమ్మ ఆశ్రమంలోనే స్థిరపడి,
సేవచేస్తూ ఉండిపోయారు.
1930లో ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియాఉద్యమాలు ఆశ్రమం తరపున కార్యకర్తలు నిర్వహించారు.గాంధీగారు బాధ్యతలను1942లో శ్రీ దేశభక్త కొండా వెంకటప్పయ్యకి అప్పగించడం జరిగింది. వెంకటప్పయ్య గారు ఆశ్రమంలో ఖాదీ ఉత్పత్తి ,హిందీ భాష ప్రచారం ,వయోజన విద్య, అంటరానితనం నిర్మూలనా కార్యక్రమాలను చేపట్టారు. వెంకటప్పయ్య గారి కోరిక మీద ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారు ఆశ్రమ బాధ్యతలు స్వీకరించారు. ఓరుగంటి వెంకటసుబ్బయ్య వారి భార్య మహాలక్ష్మమ్మ ,వెంకటసుబ్బయ్య కుటుంబంతో పాటు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉపేంద్ర దంపతులు ఆయన తండ్రి ఆశ్రమంలోని కాపురం ఉంటూ ఆయుర్వేద ప్రకృతి చికిత్సలు నిర్వహిస్తూ, శిక్షణ ఇవ్వడం జరిగింది.
1952లో ఈ కృష్ణమ్మగారు తర్వాత సీతానగరం నుండి తిరిగి వచ్చి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి గ్రామస్థాయి సహాయకులకు ఆరోగ్యసంక్షేమానికి,బాలవాడి, తేనె ఉత్పత్తి ,స్త్రీలకు వృత్తి విద్యలు నేర్పటం వంటి శిక్షణా కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. కొన్నాళ్లు కస్తూరిబా స్మారక నిధి నుండి కొంత ధన సహాయముతో శ్రీమతి ప్రభవ గారు మరియు మరుపూరు రుక్మిణమ్మ గారు కొంతకాలం కాపాడారు.
తర్వాత ఆ ఆశ్రమాన్ని స్వరాజ్ సంస్థకు కౌలుకు నిర్వహణ నిమిత్తమై ఇవ్వడం జరిగింది. 1983-89 వరకు సుప్రసిద్ధ విద్యావేత్త శివరాం ఆంగ్లేయ వనిత ఎలిన వాట్స్ పల్లెపాడు గ్రామంలో “సృజన “పాఠశాలను,1990లో పినాకిని విద్యా సొసైటీ వారికి, పల్లిపాడువాసి హైదరాబాదు గొల్లపల్లి చక్రవర్తి, నెల్లూరు వాసి అల్లాడి వాసుదేవన్ చివర నిర్వాహక ట్రస్టీలుగా, 1991 లో బుచ్చి కృష్ణమ్మగారు మరణించటంతో ఆశ్రమం ట్రస్ట్ స్థాపన,1997 లో స్థానికులు వేదాచలం గారు, తిక్కవరపు వెంకటరెడ్డి,తిక్కవరపు సుకుమార్ రెడ్డి, 2002 సంవత్సరంలోగ్రామ సర్పంచ్ శ్రీ వేదాచలం హయాంలో ఆశ్రమం బాగా దెబ్బతిని ఉంటే దాన్ని మరమ్మతులు చేయించి, ఇంక నడిపించచాలమని భావించి, ట్రస్ట్ ని రద్దు చేసి,తర్వాత 2003లోఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ 2005లో నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ వారిని కోరడం జరిగింది.వారంగీకరించిన మీదట ఆశ్రమాన్ని అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శ్రీ ఏ. వి. సుబ్రహ్మణ్యం గారికి బాధ్యత అప్పగించారు.ఉపసంఘానికి సమన్వయకర్తగా శ్రీ గణేశం కృష్ణా రెడ్డి గారు, కొంత మంది సభ్యులను ఆహ్వానించి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
భవనాన్ని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి,జిల్లా పరిషత్ శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన విరాళంతో పూర్తిస్థాయిలో జీర్ణోద్ధరణ కావించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు, గాంధీజీ పై డాక్యుమెంట్లు, జీవిత చరిత్ర విశేషాలు అందుబాటులో ఉంచారు.అప్పటి నుండి అక్టోబర్ 2 గాంధీజయంతి అప్పటి జిల్లా కలెక్టర్ రవిచంద్ర గారి చేతుల మీద ప్రారంభించబడి,జనవరి 30 గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిపేవారు.
2009లో అప్పటి తమిళనాడు గవర్నర్ శ్రీ రోశయ్యగారు అధికారికంగా ప్రారంభిస్తూ గాంధీజీ సిద్ధాంతాల కోసమై సమాజ సేవకై కృషి చేసే వారి కోసమై ఆశ్రమాన్ని జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు.గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం హిందీ తరగతులు ,మహిళలకు కుట్టు తరగతులు, 2009 నుండి భావి భారత పౌరులకు ఆశ్రమ చరిత్రను, గాంధీజీ బాల్యము,గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేసే కార్యక్రమం, గోశాలను,2013లో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ వారు డిజిటల్ హాలు, లైబ్రరీ ఫుడ్, కోర్టులను నిర్మించడం జరిగింది.
2017లో 2 గాంధీ జయంతి నాడు ఆశ్రమ స్థలదాత శ్రీమతి పొణకా కనకమ్మగారి కాంస్య విగ్రహం జెకె కొన్ని పదాలు అందుకోవటం డైరీ రెడ్డి గారు దాతృత్వంతో నెలకొల్పబడింది.2017 నుండి సత్యాగ్రహ ఆశ్రమం మరియు ఆంధ్ర యూనివర్సిటీ వై.ఎన్ .కాలేజ్ , పశ్చిమ గోదావరి వారిచే సంయుక్త ఆధ్వర్యంలో అధ్యయన తరగతులు ప్రారంభించి రెండు సంవత్సరముల పాటు నిర్వహించిన పిదప, 2019 నుండి విక్రమ సింహపురి యూనివర్సిటీ నిర్వహిస్తూ ఉన్నది. గాంధీ గారి మునిమనవడు తుషార్ గాంధీ, గాంధీ గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ వెంకట్ కళ్యాణ్ గారు అనేకమంది ప్రముఖులు అధికారులు ఈ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది.
2018 లో M P శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లెపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రపంచ స్థాయి లోనే కీర్తి కిరీటాలు కలిగిన మహిళ “ఆంధ్ర మహిళా లలామ” బిరుదాంకితులు, బెజవాడ గోపాలరెడ్డి గారు “శ్రమ శ్రీ” అని, కట్టమంచి రామలింగారెడ్డి గారు” ఆర్య రాణి “అని సంబోధించిన శ్రీమతి పొణకా కనకమ్మ గారు చరిత్రలో నిలిచిపోయారు. ఆమెను భారత ప్రభుత్వం గుర్తించి “భారతరత్న”అవార్డును ఇచ్చి గౌరవించవలసినదిగా కనకమ్మ అభిమానులు కోరుకుంటున్నారు. పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో దశాబ్దకాలం పాటు ఉచితంగా సేవచేసే భాగ్యం దొరికినందుకు అదృష్టవంతురాలుగా భావిస్తూన్నాను.

( *గూడూరు లక్ష్మి, MA(Gandhian Thoughts),(LLB) గాంధేయవాది, సమాజ సేవకురాలు అధ్యక్షులు: శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్, పొగతోట,నెల్లూరు.9441438900, Email: kalalayalakshmi@gmail.com)