రాయలసీమ గురించి ఏ కమిటీ ఏమి చెప్పింది

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి*)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో నియమించిన వివిధ కమిటీలు రాయలసీమ ప్రాంత విషయంగా వివిధ అభిప్రాయాలు, సూచనలు పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలు వెనుకబడిన సీమ విషయంగా ఈ అంశాలు కీలకమైనవి.
శ్రీ కృష్ణ కమిటీ- రాయలసీమ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన ఉద్యమాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డిసెంబరు 2010 న నివేదికను అందించింది. రాయలసీమ విషయంగా ఈ కమిటీ అభిప్రాయాలను పరిశీలిద్దాం
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య ఏర్పడిన శ్రీ భాగ్ ఒప్పందాన్ని నివేదకలో ప్రస్తావించి అనుబంధంగా ఒప్పంద పత్రాలను సమకూర్చింది.
అన్ని అధ్యాయాలలో వివిధ రంగాలలో సీమ స్థితిగతులు, ఏ స్థాయిలో వెనుకబడిందో గణాంకాలు సూచించారు.
1951లో సీమవాసులు కృష్ణా- పెన్నార్ ప్రాజక్టును కోల్పోయిన అంశం ప్రస్తావన చేసి పోతిరెడ్డిపాడు వద్ద వరదనీటి కొసం సామర్థ్యం పెంచుకోవలసిన విషయాన్ని గుర్తుచేసింది. సీమలో ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని అభిప్రాయ పడింది.
రాయలసీమ పట్టణీకరణ విషయంలో చాలా వెనుకబడిందని పేర్కొన్నారు.వలసలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ, రవాణ రంగాలనుండే ఇక్కడ కొంత ఆదాయం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమవాసులు నష్టపోతామని భావించిన అంశాలను కమిటి తెలిపింది. హైదరాబాద్ రాజధానిగా అభివృద్ధి చెందగా, 1956 తర్వాత కోస్తాంధ్ర నీళ్ళు పోందాయని, తెలుగు వారి ఐక్యతకు త్యాగం చేసినా సీమకు దక్కింది ఏమి లేదని సీమవాసుల అభిప్రాయమని కమిటీ తెలిపింది. సాగునీటి కోసం తెలంగాణ మీద ఆధారపడటం కష్టంగా ఉంటుందని , విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతంతో చేరేందుకు సీమవాసులు పరోక్షంగా ఇష్టపడటం లేదని నివేదికలో సీమవాసుల అంతర్మథనాన్ని తెలిపారు.
రాయలసీమ ప్రాంతం మూడు ప్రాంతాలలో బాగా వెనుకబడింది. నీటికోసం,విద్యకోసం,ఉపాధికోసం తెలంగాణలో చేరడానికి సుముఖత కనబరచవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడితే రాయలసీమలోను ప్రత్యేకరాష్ట్రం కోసం ఉద్యమం వచ్చే వీలుందని తెలిపారు. రాయలసీమ రాష్ట్రం కూడా ఇచ్చి హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా చేయవచ్చని అన్నారు.
కొత్త రాజధానితో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా రాయలసీమ వేరు చేయాలనే ఉద్యమం రూపొందే అవకాశం ఉంది. సాగునీటి కోసమే ఇది జరుగుతుంది.
రాష్ట్రం సమైక్యంగా కొనసాగిస్తూ రాజ్యాంగ చట్టబద్దతతో తెలంగాణ ప్రాంతీయ మండలి ద్వారా అభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ కూడా ప్రాంతీయ మండలిని అడిగే అవకాశం ఉందని కమిటీ భావించింది. సాగునీటి అంశాల పట్ల సరైన చర్యలు,యాజమాన్య బోర్డులను ఎర్పాటు అవసరమని సూచించింది. కమిటీ నివేదిక చివరన “వాస్తవాలను,నిజాలను సరిగా ఎదుర్కొనని పక్షంలో వాటిని నిర్లక్ష్యం చేసిన పక్షంలో అవి తమ‌ ప్రతీకారం తీర్చుకోగలవు” అనే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాక్యంతో ముగించారు.
శ్రీ కృష్ణ కమిటీ‌ నివేదికలో రాయలసీమ విషయంగా పేర్కొన్న అంశాలను బట్టి సీమకు సాగునీటి వసతి, విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు, పట్టణీకరణ, రాజ్యంగ చట్టబద్ధమైన ప్రాంతీయ మండలి తదితర చర్యలు తీసుకోవాలని తెలియచేస్తుంది. న్యాయం జరగనపుడు సీమప్రాంతం చూస్తూ ఉండదని కమిటి అంచనాల ద్వారా అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం- రాయలసీమ:
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం -2014 పార్లమెంటులో రూపొందుతున్న నాడు రాయలసీమ వాసులు అత్యధికులు సమైక్యాంధ్ర ఉద్యమంలో నిమగ్నమై పోయారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాయలసీమ భవిష్యత్తు ఏమనే విషయం ఆలోచించలేకపోయారు. సమైఖ్యాంధ్రలోనే సీమ అభివృద్ధి చెందుతుందని, ప్రత్యామ్నాయ అలోచనే వద్దనే రీతిలో ఉద్యమించారు. ఆనాటి పరిస్థితులలో సీమవాసుల భావోద్వేగాలు అలా నడిపించబడినాయి. సీమ భవిష్యత్తు విషయంగ వైయుక్తికంగా, సంఘాల ద్వారా తమ శక్తికి మించి కోంత ప్రయత్నం జరిగింది. వాటి ప్రభావం పరిమితంగానే కొనసాగింది.
ఇలాంటి పరిస్థితులలోను కేంద్రం విభజన చట్టంలో వెనుకబడిన రాయలసీమ ప్రాంతం బాగోగులకోసం కొన్ని అంశాలను పేర్కొన్నారు.
విభజన చట్టం సెక్షన్-6 లో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో “విభిన్న ప్రత్యామ్నాయల అధ్యయనం కోసం నిపుణుల సంఘం” నియమించాలని పేర్కొన్నారు. రాజధాని ఎంపిక కొత్త రాష్ట్రం యొక్క అసెంబ్లీ నిర్ణయానికే పూర్తిగా ఏకపక్ష అధికారం కల్పించకుండా, శ్రీ భాగ్ ఒప్పందం , వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిపుణులు కమిటీని చట్టంలో చేర్చారు. ఇందుకోసం నియమించిన శివరామన్ కమిటీ నిర్దేశించిన అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ అంశాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండానే అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం అక్కడే ఉండాలని నిర్ణయించారు.
కనీసం విభజన చట్టం ప్రకారం శివరామన్ కమిటీ సూచనలను రాజధాని విషయంగా అమలు చేసి వెనుకబడిన రాయలసీమ తదితర ప్రాంతాలకు న్యాయం చేయాలి.
సెక్షన్-84 నుండి 91 వరకు జలవనరుల అంశాలు, గోదావరి కృష్ణా నదీజల యాజమాన్య మండలి విధుల గురించి పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలకు కేటాయించిన నీళ్ళను వినియోగించుకోనే అంశాలు ఉన్నాయి. 85- 7 (ఇ) లోని 11వ షెడ్యూల్ ప్రకారం నీళ్ళ విషయంగా కేంద్రప్రభుత్వం అప్పగించిన విధులను బోర్డు నిర్వర్తించాలని ఉంది. 11 వ షెడ్యూల్ 10 వ అంశంలో వెనుకబడిన ప్రాంతాలలో ఉండే హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టుల విషయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన పథకం ప్రకారం పూర్తి చేసి, నీటికేటాయింపు ఏర్పాట్లు అందే విధంగా చేయాలని ఉంది.
విభజన చట్టంలోని పై అంశాల ఆధారంగా ప్రస్తుతం కృష్ణా నదీ జలాల పంపిణీపై విచారణ చేస్తున్న బ్రిజేష్ ట్రిబ్యునల్ వారిని, పై నాలుగు రాయలసీమ పరిసర కరువుపీడిత ప్రాంత ప్రాజక్టులకు దాదాపు140 టి.యం.సీల నీటిని కేటాయింపులు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వులు ఇవ్వాలి. బచావత్ ట్రిబ్యునల్ కాలం నుండి రాయలసీమకు కేటాయించిన 122 టి.యం.సీలను పూర్తిగా పొందేలాగా చర్యలు తీసుకోవాలి.
విభజన చట్టంలో నిర్దేశించిన స్ఫూర్తితో రాయలసీమకు కరువుపీడిత ప్రాంతాల ప్రాజక్టుల నీటి హక్కులు పరిరక్షించాలి.
సెక్షన్ 4 ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, భౌతిక సామాజిక, మౌళిక వనరుల విస్తరణకు కేంద్రం తోడ్పడాలి అని ఉంది. కోరాపుట్- బుందేల్కండ్ తరహా సమగ్ర ప్రత్యేక ప్యాకేజి అమలు చేస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలో వివరించారు. కనీసం ముఫ్పైవేల కొట్లరుపాయలు ఇందుకోసం కేటాయించాలి. ఈ ఐదేళ్ళలో వేయికోట్ల కే ఇది పరిమితమైంది.

రాయలసీమలో వెనుకబడిన ప్రాంత ప్యాకేజిని సమగ్రంగా అమలు చేయాలి.

సెక్షన్ – 93 ప్రకారం 13 వ షెడ్యూల్ లో కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతికి, సుస్థిర అభివృద్ధి కోసం కేంద్రం పదేళ్ళలో తీసుకోవలసిన చర్యలను తెలిపారు.
పదకొండు జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. వీటిని ఎక్కడ నిర్మించాలనే విషయం రాష్ట్రానికే వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం కింది విధంగా వాటిని నిర్ణయించింది.
ఐ.ఐ.టి- తిరుపతి,
ఐ.ఐ.యస్.ఇ.ఆర్- తిరుపతి
సెంట్రల్ యూనివర్శిటీ- అనంతపురము,
ఐ.ఐ.ఐ.టి – కర్నూలు,
ఐ.ఐ.యం- విశాఖపట్నం,
ఐ.ఐ.పి.ఇ -విశాఖపట్నం,
గిరిజన విశ్వవిద్యాలయం- విజయనగరం,
ఎన్. ఐ.టి – తాడేపల్లి గూడెం,
అగ్రికల్చరల్ యూనివర్శిటీ – గుంటూరు,
ఎ.ఐ.ఐ.యం.యస్ – మంగళగిరి,
ఎన్.ఐ.డి.యం- విజయవాడ లలో స్థాపించారు. కొన్నింటిలో మాత్రమే పురోగతి కనిపిస్తుంది.
రాయలసీమలోని అనంతపురం లో ఎయిమ్స్ ను స్థాపిస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత మంగళగిరికి తరలించారు. కీలక సంస్థలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనాయి. ఇందులో ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర సంస్థలను సీమలో నెలకొల్పవలసిన అవశ్యకత ఉంది.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో సమగ్ర ఉక్కుకర్మాగారం స్థాపించాలి. ఈ విషయంగా సెయిల్ ఇంతవరకు ముందడుగు వేయలేదు. సీమలో సమగ్ర ఉక్కుకర్మాగారం కేంద్రం నెలకొల్పాలి.
తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదించారు. ఆ వైపుగా అడుగులు పడలేదు.
కొత్త రైల్వేజోన్ గా వెనుకబడిన సీమలో అత్యంత అనుకూలతలు ఉన్న గుంతకల్లు లో కాకుండా విశాఖపట్నంకు కేటాయించారు.
విభజన ఉద్యమం సందర్భంలో ఇతర ప్రాంతాల వారిలాగే రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ముందుచూపుతో వ్యవహరించి ఉంటే, చట్టబద్ధంగా చాల ప్రయోజనాలు సీమకు కలిగి ఉండేవి. సీమ ప్రజలు కేవలం సమైక్యాంధ్ర అనే మూసలోనే ఉండి పోయినప్పటికీ, ఆ నేపథ్యంలో కొద్దో గొప్పో బాధ్యతతో కేంద్రం సీమపట్ల వ్యవహరించింది. కనీసం విభజన చట్టంలో పేర్కొన్న వాటిని కూడా అమలు చేయించు కోలేకపోవడం సీమ ప్రజల చైతన్య రాహిత్యాన్ని సూచిస్తుంది.
విభజన చట్టంలో స్పష్టంగా రాయలసీమ విషయంగా పేర్కొన్న అంశాలను ఇప్పుడైనా అమలు చేయాలి.
శివరామన్ కమిటి- రాయలసీమ:
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం పరిశీలించేందుకు శివరామన్ కమిటి ఏర్పాటు చేసింది. 30 ఆగష్టు 2014 న కమిటీ నివేదిక ఇచ్చింది. రాయలసీమ విషయంగా ఈ కమిటీ ప్రతిపాదనలు పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయం కొత్తరాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా నిపుణుల కమిటీ ఎంపిక చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అధిక సంఖ్యాక ప్రాంత ప్రజల చేతిలో, అల్ప సంఖ్యాక ప్రజలు నష్టపోకుండా ముందు జాగ్రత్తగా కేంద్రం రాజధాని కమిటీ నిబంధనను విభజన చట్టంలో చేర్చింది. శ్రీభాగ్ ఒప్పందం, సీమ వెనుకబాటుతనాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవడం తదితర అంశాలు ఇందుకు కారణం.
ఈ కమిటి రాజధాని వ్యవసాయ భూములలో కాకుండా ప్రభుత్వ భూములలో ఉండాలని పేర్కొంది. కొన్ని శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు, డైరెక్టరేట్లు, కార్పొరేషన్లు, సంస్థలు అయా జిల్లాల వారిగా నెలకొల్పాలని తెలిపింది . హైకోర్టు సచివాలయం ఒకే చోట అవసరం లేదని తెలిపింది. హైకోర్టు వైజాగ్ లో, బెంచ్ ను కర్నూలు లో సూచించింది. గతంలో రాజధానిగా ఉన్న కర్నూలుకు అభివృద్ధిలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాయలసీమ వర్షాభావప్రాంతం కరువులకు నిలయమైమనది. కృష్ణానదినీటిని పున:సమీక్ష చేసి సీమకు ప్రయోజనం కలిగించాలని పేర్కొంది.
శ్రీ కాళహస్తి అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతంగా పేర్కొని – నడికుడి దాకా రైల్వేలైన్ తో పాటు, బళ్ళారి- కృష్ణపట్నం రైల్వేలైన్ నిర్మించాలని తెలిపింది.
హైదరాబాదు-అనంతపురము- బెంగుళూరు, అనంతపురము- చెన్నై- బెంగుళూరు రహదారుల మధ్య రాయలసీమ ఆర్క్ గా పేర్కొంది. ప్రత్యేక శ్రద్ధతో దక్షిణాదిలో కీలకంగా అభివృద్ధి అవకాశం ఉన్న ప్రాంతంగా రాయలసీమ ఆర్క్ ను పేర్కొన్నారు.
శివరామన్ కమిటి సూచనల బట్టి రాయలసీమకు కృష్ణా జలాలలో ప్రధాన ప్రాతినిథ్యం, రవాణ సౌకర్యాలను, మౌళిక వసతుల కల్పన ద్వారా సీమను అభివృద్ధిని సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు, పరిపాలన వికేంద్రీకరణను ప్రధానంగా పేర్కొన్నారు. సీమలో హైకోర్టు కోర్టు బెంచ్, కీలక శాఖలు, కార్యాలయాలు కూడా వికేంద్రీకరణలో నెలకొల్పాలనే సూచనలు చేసారు.
ఈ కమిటీ రాయలసీమ విషయంగా చేసిన ప్రతిపాదనలు అమలు చేయాలి.
జి.యన్ రావు కమిటి- రాయలసీమ:
రాజధాని , అభివృద్ధి వికేంద్రీకరణ పై సూచనల కోసం కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 20 డిసెంబరు2019 న నివేదికను అందచేసింది.
ఈ కమిటీ నివేదికలో విశాఖపట్నం లో సచివాలయం,వేసవికాల అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, సి.యం క్యాంప్ కార్యాలయాలను సూచించింది.
అమరావతి లో చట్టసభ అంటే అసెంబ్లీ, హైకోర్టు బెంచ్,గవర్నర్,ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మంత్రుల భవనాలు సూచించింది. మంగళగిరి, నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతాలలో శాశ్వత భవనాలు ఉండాలని తెలిపింది.
కర్నూలులో శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు, అనుబంధ కోర్టులను సూచించింది. కర్నూలు అనంతపురములలో ప్రధాన హెచ్.ఓ.డి కార్యాలయాలను నెలకొల్పి అసమానతలు తగ్గించాలని సూచించారు.
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో ప్రాంతీయ కమిషనరేట్లు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా రాయలసీమకు ఒక కమిషనరేట్ ఉంటాది.
జిల్లాల వారిగా అభివృద్ధి చేయవలసిన రంగాలను గుర్తించింది.
అనంతపురము జిల్లాలో ఉద్యాన పంటలు, ఐటీ , ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు సూచించారు.
కర్నూలు జిల్లాలో నీటిపారుదల,సిమెంట్, స్టీల్ పరిశ్రమలు, ఉద్యాన పంటలు, వక్ఫ్ కమిషనర్ కార్యాలయం లను సూచించారు.
కడప జిల్లాలో నీటిపారుదల, గనులు, ఆరోగ్య రంగం, స్టీల్, సిమెంటు ప్లాంట్ లు,సోలార్ పార్క్, పరిశ్రమలను సూచించారు.
చిత్తూరు జిల్లాలో నీటిపారుదల, పర్యాటకం,స్మార్ట్ సిటీ, యాత్రాస్థలంగా సూచించారు.
ఈ కమిటీ సీమలో సాగునీటి ఆవశ్యకతను ప్రత్యేకంగా గుర్తుచేసింది. సీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజక్టు లను పూర్తి చేయాలని, గొలుసుకట్టు చెరువులు, చిన్ననీటి వనరులు కాపాడాలని పేర్కొన్నారు. సహజవనరుల వినియోగం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధిని సూచిస్తున్నాయి. సీమలో ఒక కమిషనరేట్, ప్రధాన హె.చ్.ఓ డిల కార్యాలయాలు సూచించడం కీలమైన విషయం. సచివాలయ, అసెంబ్లీ కేంద్రాలను సీమలో ఉండేలా ప్రతిపాదించి ఉంటే సమగ్రంగా ఉండేది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ – రాయలసీమ:
జి.యన్ రావు కమిటీకి సమాంతరంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై మరింత అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించారు.3 జనవరి 2020 న నివేదిక అందించింది.
ఈ కమిటీ మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అత్యవసర అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, 15 విభాగాధిపతుల కార్యాలయాలు సూచించారు.
అమరావతిలో శాసనసభ, హైకోర్టు బెంచ్, 15 విభాగాధిపతుల‌ కార్యాలయాలు సూచించారు.
రాయలసీమలో హైకోర్టు, రాష్ట్ర కమీషన్లు, అప్పిలేట్ అథారిటీలు పేర్కొన్నారు.
రెండవ ఆప్షన్ లో విశాఖపట్నానికి మొదటి ఆప్షన్ లోని అన్ని అంశాలతో పాటు, మొదటి ఆప్షన్ లో అమరావతికి కేటాయించిన 15 విభాగాధిపతుల కార్యాలయాలను కూడా విశాఖపట్నంకే ఇందులో సూచించారు. అమరావతి,రాయలసీమలలో మొదటి ఆప్షన్లో పేర్కొన్నవే ఉన్నాయి.
రాష్ట్రంలో ఆరు శాటిలైట్ కమిషనరేట్లను సూచించారు. ఇందులో చిత్తూరు, కడప ఒకటి తూర్పు రాయలసీమగా, కర్నూలు, అనంతపురం పశ్చిమ రాయలసీమగా ఉంటాయి. సీమలో మొత్తంగా రెండు శాటిలైట్ కమిషనరేట్ లు ఉంటాయి.
అనంతపురం, చెన్నై, కడప, నెల్లూరు లతో అమరావతి అనుసంధానానికి ఐదు ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించడం, చెన్నై-కలకత్తా జాతీయ రహదారితో ఇతర జాతీయరహదారుల అనుసంధానం చేయడం, హైదరాబాదు కు ప్రత్యామ్నాయంగా కర్నూలు ను, బెంగుళూరు కు ప్రత్యామ్నాయంగా అనంతపురం ను అభివృద్ధి చేయాలని సూచించారు.
వెనుకబడిన ఏడు జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టాలని సూచించారు.
కృష్ణా గోదావరి డెల్టా లో 60 నుండి 80శాతం సాగునీటి సదుపాయం ఉండగా, రాయలసీమలో 20 శాతానికి మాత్రమే సాగునీటి సదుపాయం ఉందని తెలిపారు. గోదావరి – పెన్న అనుసంధానం, కాలువల సామర్థ్యం పెంచడం ద్వారా సీమలో సాగునీటి సౌకర్యాలను కల్పించాలను సూచించారు. వాటర్ గ్రిడ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
తూర్పు రాయలసీమ లోని కడప, చిత్తూరులలో ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం, ఉక్కుకర్మాగారం, అనుబంధ పరిశ్రమలు, ఆధునిక పద్ధతిలో టమోటా సాగు, బెలూం గండికోటలను కలిపి సాహస పర్యాటక సర్క్యూట్, ఎకో అడ్వెంచర్ అభివృద్ధిని సూచించారు.
పశ్చిమ రాయలసీమ లోని అనంతపురము, కర్నూలులో వస్త్ర,లాజిస్టిక్స్ పరిశ్రమలు, వాహన విడిభాగాలు, జాతీయ రహదారుల అనుసంధానం, పెనుకొండ- రాయదుర్గం చారిత్రక టూరిజం సర్క్యూట్, సేంద్రీయ ఉద్యాన సాగు, బిందు సేద్యం తదితర అంశాలను సూచించారు.
సీమ ప్రాంతంలో సాగునీటి విషయంగా ఈ కమిటీ సూచనలు విలువైనవి.రహదారుల అభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక అంశాలపై కమిటి చేసిన సూచనలు శాస్త్రీయంగా ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టుతో పాటు అదనంగా కమిషన్ల కార్యాలయాలు, అప్పిలేట్ సంస్థలను కూడా కేటాయించాలని సూచించారు. సీమలో అసెంబ్లీ సమావేశాలు, సచివాలయ విభాగాల శాఖల ఏర్పాటు విషయం కూడా ప్రతిపాదించి ఉంటే సమగ్రంగా ఉండేది.

27 డిసెంబరు 2019న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రిమండలి సమావేశంలో రాజధాని, పాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణల విషయమై కమిటీల అభిప్రాయాలు పరిశీలనకు, మరిన్ని సూచనల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన తొమ్మిది మంది మంత్రులు, నలుగురు అధికారులతో హైపవర్ కమిటీని గౌరవ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసారు. 19 జనవరి న హైపవర్ కమిటీ తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. 20 జనవరి న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలో పై అన్ని కమిటీలు రాయలసీమ విషయంగా చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలి.

(*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,కేంద్రం సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత,వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం (రి),అనంతపురము.
99639 17187, a.harireddy@gmail.com)