హైకోర్టు ఒక్కటి చాలదు, వర్షాకాల అసెంబ్లీ , మినీ సెక్రటేరియట్ కావాలి: డా.అప్పిరెడ్డి

(*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 జూన్ 2014 లో మనుగడ లోకి వచ్చింది. పదిసంవత్సరాల పాటు హైదరాబాద్ నగరంలో ఉమ్మడి రాజధానిగా కొనసాగేందుకు విభజన చట్టం అవకాశం కల్పించింది. 16 మే 2014 న శాసనసభ ఎన్నకలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 8 జూన్ 2014 న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేసారు. 4 సెప్టెంబరు 2014 న తొలి అసెంబ్లీ సమావేశాలలో అమరావతి ని రాజధానిగా తీర్మానం చేసారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యంతరం చెప్పలేకపోయాయి. చెప్పాలని ఉన్నా సాధ్యం కాదని భావించి ఉంటాయి. అటువంటి క్లిష్టమైన సందర్భంలో రాయలసీమ‌ ప్రజా సంఘాలు రాయలసీమలో రాజధాని కావాలని విస్తృతంగా పోరాడాయి. అభివృద్ధి కేంద్రీకరణతో హైదారాబాద్ ను పోగొట్టుకున్న అనుభవాల దృష్ట్యా నవ్యాంధ్ర లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వెనుకబడిన ప్రాంతాలు భావించాయి.
ఎన్నికల ప్రక్రియకు ముందే అంటే 1 మార్చి 2014 కేంద్రం గెజిట్ లో ప్రకటించిన విభజన చట్టం సెక్షన్-6 మేరకు కొత్త ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటుకై విభిన్న ప్రత్యామ్నాయాల అధ్యయనానికి శ్రీ శివరామన్ అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. ఆరునెలల కాలపరిమితిని కూడా ఈ కమిటీకి నిర్దేశించారు. కొత్త రాష్ట్రంలో రాజధాని ఎంపిక విషయంలో కేంద్రం జోక్యం ఎందుకు అని అనుమానం రావచ్చు. ఇందుకొక చారిత్రక నేపథ్యం ఉంది. 1937 శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం మద్రాసు నుండి తెలుగు వారు ఆంధ్రరాష్ట్రంగా ఎర్పడితే రాయలసీమ వాసుల ఆకాంక్షల మేరకు రాజధాని లేదా హైకోర్టు పొందే అవకాశం ఉంది. ఆ ఒప్పందంలో ఇంకా నీళ్లు, విద్యాసంస్థలు, శాసనసభ స్థానాల సమాన నిష్పత్తి ఇలా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ రాజధాని , హైకోర్టు వరకే పరిమితమవుదాం. పై నాలుగు అంశాల ఒప్పందం అనంతరమే రాయలసీమ వాసులు మద్రాసు వదులుకొని ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. 1953 న ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో సీమ ప్రాంతంలో కర్నూలు రాజధానిగా, కోస్తా ప్రాంతంలో గుంటూరులో హైకోర్టు నెలకొల్పారు. 1956 లో విశాలాంధ్ర గా తెలుగు ప్రజలు ఏకం కావడంతో రాజధాని, హైకోర్టు హైదరాబాదు చేరాయి. తెలంగాణ విడిపోవటంతో 1953 నాటి ఆంధ్రరాష్ట్రం 2014 లో మిగిలింది.
ఈ మొత్తం చరిత్రను పరిగణలోకి తీసుకొని, అల్పసంఖ్యాక ప్రజలైన రాయలసీమ వాసులకు నష్టం జరగకుండా విభజన చట్టంలో రాజధాని విషయంగా నిపుణుల కమిటీని ప్రస్తావించారు. విభజన ఉద్యమ సమయంలో సీమ ప్రజల ఆకాంక్షలు, శ్రీ కృష్ణకమిటీ నివేదికలోని సీమ విషయంగా చేసిన కొన్ని ప్రతిపాదనలు కూడా రాజధాని కమిటీ ఏర్పడడానికి కారణమయ్యారు.
శివరామన్ కమిటీని 28 మార్చి 2014 న కేంద్రం నియమించింది. 27 ఆగష్టు 2014 న కేంద్ర హోంశాఖకు కమిటి నివేదిక ఇచ్చింది. అత్యంత శాస్త్రీయమైన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిగణలోకి తీసుకోకుండా ప్రధానమంత్రి సమక్షంలో 22 అక్టోబర్ 2015 న అమరావతి రాజధానిగా శంఖుస్థాపన చేసారు. రాష్ట్ర ప్రభుత్వంతో సయోధ్య, అసెంబ్లీలో తీర్మానం తదితర కారణాలతో కేంద్రం మారుమాటలేకుండా రాజధాని నిర్మాణం కోసం సహకరిస్తామని ప్రకటించింది. అభివృద్ధి కేంద్రీకరణ ద్వారా ఒక కొత్త రాజధానిని నిర్మించి వచ్చే సంపదతో రాష్ట్రం అంతా అభివృద్ధి చేయవచ్చనే హైదరాబాదు నమూనాలో చంద్రబాబు గారు ఆలోచించారు. అందుకొసం విభజన పేర్కొన్నవి, మరికొన్ని కీలక సంస్థలను అమరావతి వైపు తీసుకెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలను రాయలసీమ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. శివరామన్ కమిటీ ప్రతిపాదనలను వెనుకబడిన ప్రాంతాలు అవగాహన చేసుకొనే లోపే అంతా కలసి రాజధాని అంశం ముగించేసారు. రాజధాని అంశం ముగిసిన విషయం కాదని సీమ సంఘాలు ప్రకటిస్తూవచ్చాయి.
రాజధాని కోసం సీమ వాసుల ఉద్యమం బలోపేతం అయిన ప్రతి సందర్భంలో ప్రత్యేక హోదా ఉద్యమం ముందుకు తీసుకొనిరావడం అలోచించవలసిన అంశం.
శివరామన్ కమిటీ 4,528 వినతులను స్వీకరించింది. 187 పుటల నివేదికలో అమరావతి ప్రాంతం రాజధానిగా వద్దని సూచించింది. దొనకొండ పరిసర ప్రాంతాలలో భూముల లభ్యత ఉందని చెప్పింది. రాష్ట్రాన్ని పాలన సౌలభ్యం కోసం నాలుగు భాగాలుగా విభజించింది. విశాఖలో హైకోర్టు ను, బెంచ్ ను రాయలసీమలో నెలకొల్పాలని తెలిపింది.అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం రాజధాని కేంద్రంలో ఉండాలని సూచించింది. గతంలో రాజధానిగా కొనసాగిన కర్నూలుకు అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. సంస్థలు, కార్యాలయాలు ఇతర అన్ని జిల్లాలకు వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి కోసం వివిధ కారడార్లను , మౌళికవసతులను సూచించింది. ఈ అంశాలేవి నాటి రాష్ట్ర ప్రభుత్వం చెవికెక్కలేదు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడంతో కనీసం హైకోర్టు అయినా రాయలసీమలో నెలకొల్పాలని సీమ వాసులు కోరుతూ వచ్చారు. కనీసం పరిగణలోకి తీసుకోకుండా పోయారు.
2019 ఏప్రిల్ నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు రాయలసీమ సమస్యల గురించి మ్యానిఫెస్టోలలో తెలియచేయాలని సీమ సంఘాలు కోరాయి. ప్రధానంగా రాజధాని , హైకోర్టుల పై తమ అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచాలని వివిధ కార్యక్రమాలు కొనసాగించాయి. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగానే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు అడుగు వేసింది. రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ పై జి.ఎన్ రావు కమిటీని నియమించింది. పదివేల ఆరువందల కిలో మీటర్లు తిరిగింది. 38,000 వినతులను స్వీకరించి 120 పుటల నివేదికను రూపొందించింది. 20 డిసెంబరు 2019 న ముఖ్యమంత్రి గారికి నివేదిక అందించింది. శివరామన్ కమిటీ నివేదికలోని వికేంద్రీకరణ పద్దతికే ఈ కమిటీ కూడా మద్దతు తెలిపింది. 17 డిసెంబర్ 2019న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ రాజధానులు నెలకొల్పడం మేలని పేర్కొన్నారు. అమరావతిలో లక్షల కోట్లతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ప్రకటించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, సాగు త్రాగు నీటికి ప్రాధాన్యతనీయబోతున్నట్లు తన ఆలోచనలను తెలియచేసారు.
జి. ఎన్ రావు కమిటీ నివేదిక అమరావతిలో చట్టసభ అయిన అసెంబ్లీ , హైకోర్టు బెంచ్, మంగళగిరి , నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతాలలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, రాజ్ భవన్, మంత్రుల నివాసాలు ఉంటాయి.
ఉత్తరాంధ్ర లోని విశాఖపట్నం మెట్రో రీజిన్ లో ప్రధాన సచివాలయం, వేసవికాల సమావేశాలకై అసెంబ్లీ, విజయనగరం లో హైకోర్టు బెంచిలు ఉంటాయి.
రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు మాత్రమే ఉంటుంది. ట్రిభ్యునల్ కోర్టులను కూడా మూడు ప్రాంతాలకు విడిగా కేటాయించారు.
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నాలుగు కమిషనరేట్లను ఉండాలని అవి ఉత్తరకోస్తా, మధ్యకోస్తా,దక్షిణకోస్తా, రాయలసీమగా పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వలన సచివాలయంపై భారం లేకుండ ఆయా ప్రాంతాలలో ప్రజల సమస్యలు పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వివిధ జిల్లాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను సూచించారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ద్వారా మరో నివేదిక అందుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కమిటి మధ్యంతర నివేదికలో అమరావతి లో సేకరించిన భూముల విలువ కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలను తెలిపింది. ఇప్పటికే సమగ్రంగా వసతులు ఉన్న ప్రాంతంలో రాజధానిగా ఉండడం మేలని పేర్కొన్నట్లు తెలుస్తుంది.
జి.ఎన్ రావు , బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికల ఆధారంగా ఈ నెల 27 న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకొంటారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి గారు కింది అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
ఉత్తరాంధ్రలో ప్రధాన సచివాలయం, హైకోర్టు బెంచ్, వేసవికాల అసెంబ్లీ, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్నవిధంగానే,
ఆంధ్రలో ప్రధాన అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కీలక పాలన కార్యాలయాలు ఉన్నవిధంగానే,
రాయలసీమలోను ప్రధాన హైకోర్టు తోపాటు,… వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మినీ సెక్రటేరియట్ నెలకొల్పాలి. విశాఖపట్నం, విజయవాడలకు దీటుగా ఒక ముఖ్యపట్టణం రాయలసీమలో అభివృద్ధి అయ్యేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.
రెండు వేరు వేరు హైకోర్టు బెంచిలను, వేరు వేరు ట్రిబ్యునల్ లను ఇతర ప్రాంతాలలో నెలకొల్పి కేవలం నాలుగు జిల్లాలకు పరిమితమైన హైకోర్టుతో సీమ ప్రాంతానికి న్యాయం జరగదు. రాజధాని , హైకోర్టు విషయంగా శ్రీ భాగ్ ఒప్పందం స్ఫూర్తి పూర్తిగా సీమకు నెరవేరదు. ఇన్నాళ్ళు నష్టపోయిన సీమకు మరో సారి నష్టం కలగరాదని తెలియచేస్తున్నాం.
మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవం కోసం మూడు ప్రాంతాలలో సమాన అభివృద్ధి ప్రాతిపాదికగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. వచ్చే రోజులలో ఆయా ప్రాంతాల అవకాశాలు, సహజవనరులు, సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలు, సాగునీటి వసతి తదితర అంశాలలో వికేంద్రీకరణకు అడుగులు వేయాలని కోరుతున్నాం.

(*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,అనంతపురము)