తొలినాళ్ళ ‘రాయలసీమ స్పృహ’ రగిలించిన నేత కెవి రామకృష్ణారెడ్డి

(చందమూరి నరసింహారెడ్డి)

అంతంత మాత్రమే రవాణ సౌకర్యమున్న మారుమూల కుగ్రామంలో జన్మించి ఆ కాలంలోనే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకొని సౌమ్యుడు గా పేదల పక్షపాతి గా పేరుగడించారు. రైతుల సమస్యలపై , రాయలసీమ సమస్యలపై తనదైన శైలిలో పోరాటం సాగించారు.

యువకుల్లో నవచైతన్యం నింపారు. ప్రజాచైతన్యం కోసం తన కలాన్ని కదిలించారు. పాత్రికేయులు గా పనిచేశారు. హిందూపురం పార్లమెంట్ మొట్ట మొదటి పార్లమెంట్ సభ్యులు గా ఎన్నికయ్యారు. కదిరి గళాన్ని డిల్లీలో వినిపించిన మొదటి వ్యక్తి కడపల వెంకట రామకృష్ణారెడ్డి.

కె.వి.రామకృష్ణారెడ్డి రెండవ లోక్ సభ (1957)సభ్యుడు. హిందూపురం లోకసభ నియోజకవర్గం మొదటి పార్లమెంట్ సభ్యులు. రెండు సార్లు లోకసభ సభ్యులు గా ఎన్నికయ్యారు.

కె.వి.రామకృష్ణారెడ్డి 1907 ఆగస్టు 7 న అనంతపురం జిల్లా తనకల్లు మండలం కడపలవారి పల్లెలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వన్నూరు రెడ్డి తల్లి పేరు చౌడమ్మ.

1914 నుంచి 1921వరకు ప్రాథమిక విద్య తనకల్లు, తబంళ్లపల్లె లోను 8వ తరగతి నుంచి మూడేళ్ళ ఏ.వి ఫ్రీ ఎలమెంటరీ స్కూల్ మదన పల్లె లో చదివారు.

ఇంటర్ మీడియట్ విద్య ను థియోసాఫికల్ హైస్కూల్&కాలేజ్ మదనపల్లె లో చదివారు.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోబి.ఎ , కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., బి.ఎల్., పట్టాలు పొందాడు.1936 నుంచి1937 వరకు మద్రాసులో లా అప్రెంటీస్ చేశారు.

1937, జులై 2న కె.వి.రామకృష్ణారెడ్డి రమారత్నంను వాహంచేసుకొన్నారు.మాజీ రాష్ట్రపతి నీలం సజీవరెడ్డి కి ఈమె స్వయాన చెల్లెలు.

విద్యార్థి దశనుంచే రాజకీయ కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొన్నారు. హైస్కూల్ స్థాయిలో1927 లో నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ విభాగంలో వాలెంటీర్ .

బెనారస్‌ విశ్వవిద్యాలయంలో తరచుగా జరిగిన సమావేశాలకు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌, ఎం.ఎన్‌.రారు, పండిట్‌ మదన్‌మోహన్‌ మాలవ్య, ఆర్‌.పి.భట్టాచార్య, భాట్లివాలా వంటి ప్రముఖులు హజరయ్యేవారు. వీరి ఉపన్యాసాల ప్రభా వంతో మార్క్సిస్టు మూల సిద్ధాంతాలను నీలం రాజశేఖరరెడ్డి తో పాటు లోతుగా అధ్యయనం చేశారు.

కె.వి.రామకృష్ణారెడ్డి సెలవుల సమయంలో అనంతపురం వచ్చి
యువజన సంఘం ఏర్పాటు కు ప్రయత్నించారు. ఇదే యూనివర్శిటీలో చదువుతున్న తరిమెల నాగిరెడ్డితో కలిసి పార్టీలకు అతీతంగా 1937 సెప్టెంబరు ఒకటిన జిల్లాలోని కేశవ విద్యా నికేతన్‌లో ఒక సమావేశం జరి పారు. 130 మందితో జరిగిన ఈ సమావేశానికి కె.వి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ యువజన సంఘంకు నీలం సంజీవరెడ్డి అధ్యక్షుడుగా, ఐ.సదాశివన్‌ ప్రధాన కార్యదర్శిగా, తరిమెల నాగిరెడ్డి, విద్వాన్‌ విశ్వం కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

యువజన సంఘం ఆధ్వర్యంలో యువ చైతన్య కార్యక్రమాలు ,రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు.

కె.వి.రామకృష్ణారెడ్డి రైతు సమస్యలు పై స్వయంగా పాటలు రాసుకొని పాడేవారు. శ్రీసాధన పత్రిక లో వార్తలు రాశారు.

కె.వి.రామకృష్ణారెడ్డి కుటుంబం. రాయలసీమ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కలిగించే ఆశయంతో శ్రీసాధన పత్రిక అనే రాజకీయ వారపత్రిక ప్రారంభించబడింది. ప్రతి శనివారం వెలువడేది ఈ పత్రిక. పప్పూరు రామాచార్యులు దీని వ్యవస్థాపకుడు, సంపాదకుడు.

ఆకాశవాణి పత్రిక కు వార్తలు రాశారు. అప్పట్లో ఐదుకల్లు సదాశివన్, విద్వాన్ విశ్వం, నీలం సంజీవరెడ్డిల ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా ఆకాశవాణి అనే సైక్లోస్టయిల్ పత్రిక రహస్యంగా వెలువడేది. ఆ పత్రిక విద్యార్థులకు ఎంతో చైత్యన్యాన్ని పెంచింది.

కమ్యూనిస్టు నాయకులతో మంచి సంబంధాలున్నప్పటికీ కె.వి.రామకృష్ణారెడ్డి
కాంగ్రెస్ లో కొనసాగేవారు. మద్రాసు , అనంతపురం లో కొంత కాలం న్యాయవాది గా పని చేశారు.

1939 లో పంచాయతీ బోర్డు స్పెషల్ ఆఫీసర్‌ గా నియమితులయ్యారు. వీరు చెంగల్పట్టు జిల్లా విల్లివాకం పంచాయతీ బోర్డుకు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచాయతీ బోర్డుకు స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశాడు.

1937లో జరిగిన మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాయలసీమ మహాసభ పని చేసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది సి రాజగోపాలచారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మంత్రి వర్గంలో ఒక్క రాయలసీమ సభ్యునికి కూడా స్థానం కల్పిం చలేదు. దీనితో రాయలసీమ లోని కాంగ్రెస్ నాయకులలో అసంతృప్తి రగిలింది.

అప్పటి కోస్తాంధ్రలోని కాంగ్రెస్ నాయకులు, రాయలసీమ లోని నాయకులను కలుపుకొని కడప కోటిరెడ్డి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటుచేశారు.

రాయలసీమ ప్రయోజనాలకు అన్యాయం జరిగే విధంగా కోస్తాంధ్రులతో కలిస్తే కాంగ్రెస్ నాయకులను సీమ నుంచి ప్రజలు తరిమివేస్తారని ఆ నాడు కె.వి.రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఆ కమిటీ తీర్మానాల మేరకు ఇరు ప్రాం తాల నాయకుల పరస్పర అంగీకారంతో 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం కుదిరింది.1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్టయి కె.వి.రామకృష్ణారెడ్డి అల్లీపురం సెంట్రల్ జైలులో ఆరునెలలు కారాగార శిక్ష అనుభవించాడు. 1942లో జాతీయనాయకుల అరెస్టులనువ్యతిరేకించడంతో ఇతని న్యాయవాద వృత్తిని రద్దు చేశారు.

కె.వి.రామకృష్ణారెడ్డి 1943 నుంచి 1957 వరకు ఆంధ్ర కిసాన్ కాంగ్రెస్సు లో పనిచేశారు . యన్.జి.రంగా అద్యక్షులు కాగాఈయన కార్యదర్శిగా పనిచేశాడు.

ఇతడు గిద్దలూరు, మదనపల్లి, హిందూపురం మొదలైన చోట్ల వయోజనులైన గ్రామీణుల కోసం రాజకీయ వేసవి పాఠశాలలను నిర్వహించాడు.

రాయలసీమలో రైతు సంఘాలను, యువజన సంఘాలను నెలకొల్పాడు. ఇతడు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, ఆల్ ఇండియా రూరల్ పీపుల్స్ ఫెడరేషన్‌కు జాయింటు సెక్రెటరీగా పనిచేశారు.

ఆంధ్ర ప్రొవెన్షియల్ కాంగ్రెస్ క్షామ నివారణ సంఘానికి జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పలాసలో నడిపిన సేవాదళ్ క్యాంపు నిర్వాహకునిగా,రాయలసీమ యువజన సంఘానికి అధ్యక్షుడిగా పలు పదవులు చేపట్టాడు.

కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ ఇతనికి ఆంధ్ర కిసాన్ కాంగ్రెస్, కృషిలోక్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్ష సంస్థలతో మంచి సంబంధాలున్నాయి.

1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ఈ ఎన్నికలలో ప్రజాపార్టీతరపున పోటీచేసిన కె.ఎస్.రాఘవాచారి ఎన్నికయ్యాడు. తరువాత హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది.

1957లో ఏర్పడిన రెండవ లోకసభకు హిందూపురం నియోజకవర్గం నుంచి   కె.వి.రామకృష్ణారెడ్డి పార్లమెంట్ సభ్యుడు గా ఎన్నికైయ్యారు.

1959-62లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రాంతపు విప్‌గా పని చేశాడు. సదరన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే , కస్టమ్స్, పంచాయతీ రాజ్, విద్యశాఖ
ఇలాఅనేక పార్లమెంట్ కమిటీ ల్లో సభ్యులు గా పనిచేశారు.

1962లో మూడవ లోకసభకు హిందూపురం లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన ఎన్నికై పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు.

1967 ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇచ్చినప్పటికీ తిరస్కరించారు. వరుసగా 10 సంవత్సరాల పాటు పదవి లో ఉన్నవారు తిరిగి పదవిలో కొనసాగరాదనేది కాంగ్రెస్ నిబంధన. నిబంధనలు ఎవ్వరూ పట్టించుకోనప్పటికీ ఈయన మాత్రం పాటించారు. 1967 తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. 1980లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయమని కోరగా సున్నితంగా తిరస్కరించారు. కె.వి.రామకృష్ణారెడ్డి1995 మార్చి 27 న మరణించారు.

వీరికి కి 4గరు కుమారులు కడపల సుధాకరరెడ్డి, కడపల మెహనరెడ్డి,
కడపల శ్రీనాధరెడ్డి ,కడపల శ్రీకాంత్ రెడ్డి 4గురుకుమార్తెలు సమన ,సుప్రియ ,అఖిల, అభయ.వీరిలో కడపల మెహన రెడ్డి నల్లమాడ ఏమ్మెల్యే గా పనిచేశారు. కడపల మోహనరెడ్డికి దివంగత వై.యస్. రాజశేఖర్ రెడ్డి తో మంచి అనుబంధం ఉండేది. ఒకే కళాశాలలో యం.బి.బి.యస్ చదువుకోవడం జరిగింది. మోహన రెడ్డి ప్రస్తుతం వైసీపీ లో ఉన్నారు.

Chandamuri Narasimhareddy

(రచయిత చందమూరి నరసింహారెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *