2014 లో కూడా రాయలసీమను విస్మరించారు, అందుకే ఈ తగాదాలన్నీ…

(Chandamuri Narasimhareddy)
ఒకనాడు రాయలసీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు నేడు ఆ సీమ రాళ్ళ సీమగా మారింది.
నిత్యం కరువు కరాళ నృత్యం చేస్తున్న రాయలసీమలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ఎన్ని ప్రభుత్వాలు మారిన చేపట్టడం లేదు .
రాయలకాలం లో రాయలసీమ లో పంటలు సమృద్ధిగా పండేవి. వ్యవసాయ అభివృద్ధికి ఆనాడు రాజులు విశేషంగా కృషి చేశారు .విజయ నగర రాజులు తమ అ ఆభరణాలు అమ్మి చెరువులు నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేశారు.
రాయలసీమలో లో అన్ని రాజకీయ పక్షాలు తమ తమ స్వార్థ ప్రయోజనాలకే పరిమితమైనాయితప్ప సమగ్రంగా రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేయడం లేదు .మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది 1957లో తెలంగాణ ప్రాంతాన్ని రాయలసీమలో విలీనం చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఫలితంగా కర్నూలు నుండి హైదరాబాద్ కు రాజధాని తరలించారు ఆనాటినుండి ఈనాటి వరకు రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది.
రాయలసీమ వాసులు తరతరాలుగా త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఇలాఇంకా ఎంత కాలం త్యాగాలు చేయాలి.
గతంలో చేసిన త్యాగాలు పరిశీలించండి.రాయలసీమ కన్నా ముందు ఈ ప్రాంతాన్ని దత్తమండలం అనేవారు.
ప్రస్తుత అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు
1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి, కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. “రాయలసీమ” అని పేరుపెట్టాడు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. ఫలితంగా రాయలసీమ లోని బళ్లారి జిల్లా ను త్యాగం చేశారు.
1972 లో కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలు మార్కాపురం, గిద్దలూరు ను ప్రకాశం జిల్లా లో కలిపారు. ఫలితంగా రాయలసీమ మరో రెండు పెద్ద తాలూకాల భూభాగం కోల్పోయింది.
1953కి ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా కుదించుకుపోయింది.రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాలు
రాయలసీమవాసుల త్యాగ ఫలితంగా కోల్పోయారు.
రాయలసీమకు నికర జలాలు కేటాయించడంలో ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోవడం లేదు .విద్యా సంస్థ ల విషయంలో సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు .
రైల్వే లైన్ల నిర్మాణం లో రాయలసీమకు అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర విభజన సమయంలో లో అనంతపురం జిల్లాకు కేటాయించిన ఎయిమ్స్ గుంటూరు జిల్లాకు తరలించారు .
కడప జిల్లాకు కేటాయించిన ఉక్కు ఫ్యాక్టరీ ఇంతవరకు నిర్మాణంచేపట్టలేదు .కర్నూలు జిల్లాకు కేటాయించిన విమానాశ్రయం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అందులో భాగంగా కర్నూలు కు హైకోర్టు కెటాయించింది. అయితే దీనికి ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎందుకు ఇంత వివక్ష.
రాజధాని మరియు హైకోర్టు ఒకే చోట ఉండాలని తన స్వలాబాల మాటలు మాట్లాడుతున్నారుతప్ప అలా రాజ్యాంగం లో ఎక్కడా పొందుపర్చలేదు.
కర్నూలు ను న్యాయరాజధాని గా ప్రకటిస్తే ఎందుకు ఇంత రాద్దాంతం. రాజధాని పేరుతో ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కాలేదు.
దేశంలో చాలా రాష్టాల్లో రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో హైకోర్టులున్నాయి.
ఈ విషయం అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు అయినా రాద్దాంతం చేస్తూ తప్పు దారి పట్టించడం ఎంత వరకు సమంజసం.
రాజస్థాన్ లో రాజధాని జైపూర్ లో అయితే హైకోర్టు జోద్ పూర్ లో పెట్టారు జైపూర్ నుంచి జోధ్ పూర్ కు 335 కిమి దూరం. జైపూర్ లో సర్కాట్ బెంచ్ మాత్రమేఉంది.
కేరళ రాజధాని తిరువనంతపురం అయితే హైకోర్టు కొచ్చిలో పెట్టారు.ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే హైకోర్టు కటక్ లో పెట్టారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అయితే హైకోర్టు జబల్ పూర్ లో పెట్టారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయితే హైకోర్టు అలహాబాద్ పెట్టారు. లక్నోలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేశారు. 2000లో ఏర్పడిన 27 వ రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్ తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్ కాగా హైకోర్టు నైనితాల్ లో ఉంది.
మన ప్రక్కరాష్ట్రమైన బెంగుళూరులోరాజధాని మరియు హైకోర్టు పెట్టి ప్రజా సౌకర్యం కోసం దర్వాడా మరియు గుల్బర్గా హైకోర్టు బెంచిలు ఏర్పాటు చేసినారు.
మరి కర్నూలు లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయకూడదు?
హైకోర్టు తోపాటు పరిపాలన విభాలను కూడా ఒకే చోటు కాకుండా వికేంద్రీకరణ చేయాలి.ప్రతి జిల్లా లో ఒకొక్క విభాగం ఏర్పాటు చేసి అభివృద్ధి కి శ్రీకారం చుట్టాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమ కు హైకోర్టు కెటాయించింది. ఇది రాయలసీమ వాసులందరూ హర్షించాలి. అయితే కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం, మరికొన్ని రాజకీయ పక్షాలు సమర్థించడం జరుగుతోంది.
ఇలా చేయడం సమర్థనీయం కాదు. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా హైకోర్టు కావాలని తీర్మానం చేయడమే కాదు మరిన్ని పథకాలు , కార్యాలయాలు కావాలని డిమాండ్ చేసి సాధించుకోవాలి.
రాష్ట్ర విభజన ప్రక్రియ సరిగా జరగలేదు. విభజన జరిగిన అనంతరమైనారాయలసీమ ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి అన్ని రాజకీయ పక్షాలు నుంచి సభ్యులును ఎంపిక చేసుకొని సమగ్రంగా చర్చించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి వాటిని ఆమోదించి అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

2014 లో ఆంధ్రప్రదేశ్ ను విడగొడుతున్నపుడు నాటి శ్రీబాగ్ ఒప్పందం లాగ ఒక ఒప్పందం కుదిర్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినా , రాజధాని నిర్ణయం జరిగినా ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు.

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం ఆరంభంలో నే ఏన్నో అవరోధాలు ఎదురౌతున్నాయి.
కృష్ణ తుంగభద్ర పెన్నా నదుల సంగమం తో సర్ మెకంజీ రూపొందించిన పథకంతో రాయలసీమ జిల్లాలలో మొత్తం 36 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఏర్పడుతుంది. ఈ పథకానికి రూపకల్పన జరిగి ఉంటే రాయలసీమ జిల్లాలు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా ప్రకాశించి ఉండేది .
ఈ పథకానికి బ్రిటిష్ కాలం లోనే నిర్మాణం జరగాల్సి ఉంది. ఆనాడు మన నేతలు సక్రమంగా వత్తిడి చేయలేక పొయారు.బ్రిటీష్ ప్రభుత్వం శ్రద్ధ చూపలేక పోయింది. స్వాంత్య్రం అనంతరం మన ప్రభుత్వాలు మెకంజీ పథకానికి సమాధి కట్టారు.
రాయలసీమ కు నికర జలాలు కెటాయించాలి. నూతన ప్రాజెక్టులు ,కాలువలు నిర్మించాలి. హంద్రీనీవా కు నికరజలాలు అందించి రాయలసీమ లో చిన్ప ,పెద్ద చెరువులు నీటితో నింపాలి.
మనకు నీళ్లు, నిధులు మరియు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాల్సిందే. ఆ విషయంలో సీమ ప్రజానీకం రాజీ పడకూడదు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు మరియు విద్యావంతులు, మేధావులు వాణి వినిపించాలి.
రాయలసీమ కు మన రాష్ట్రమే కాకుండా పక్కనే ఉన్న కర్ణాటక కూడా అన్యాయం చేసింది. చిత్రావతి , కృష్ణా, తుంగభద్ర నదులపై అక్రమంగా అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, ఉన్న ప్రాజెక్టులు ఎత్తు పెంచడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకు నదీజలాల రావడం తగ్గిపోయింది.
రాయలసీమ లో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించాల్సి ఉంది. రాయలసీమ జిల్లాల్లో యన్ఐటి , ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థలు ఏర్పాటు చేసి విద్య వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లాలో పాల సముద్రం వద్ద శంకుస్థాపన చేసిన కేంద్ర సంస్థ బిఇయల్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది . ఈ సంస్థ నిర్మాణం పూర్తి చేసిఉత్పత్తి ప్రారంభిస్తే నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది.
వీర్‌వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ సుమారు రూ.1000కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రకటనలకే పరిమితము కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే ఫలితం ఉంటుంది.
2014 లో ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు కనీసం శ్రీబాగ్ ఒప్పందం లాగ మరో ఒప్పందం కుదిర్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినా , రాజధాని నిర్ణయం జరిగినా ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలను కలిపి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి నిర్దేశించిన గడువు లో పూర్తి చేసేలా ఒప్పందం కుదిర్చి అమలు చేయాల్సి ఉంది.
Chandamuri Narasimhareddy
(Chandamuri Narasimhareddy, senior journalist, Khasa Subbarao rural journalism award winner. Mobile:9440683219)