ర‌మ‌ణీయం తిరుమల రామ‌కృష్ణ తీర్థం (తిరుప‌తి జ్ఞాప‌కాలు- 21)

తిరుమల గుడికి ఆరేడు కిమీ దూరాన అడవుల్లో రామకృష్ణ తీర్థం ఉంటుంది.  జనవరి 28 న అక్కడ ఘనంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగుతుంది.పుష్యమీ నక్షత్ర పౌర్ణమినాడు రామకృష్ణ తీర్థ పర్వదినం ఉంటుంది.వేలాది మంది వచ్చి ఇక్కడ స్నానమాచరిస్తారు. అయితే, ఈ ఏడాది కోవిడ్ కారణంగా టిటిడి ముక్కోటి కార్యక్రమాన్ని రద్దు చేసింది.  తీర్థ ఉత్సవాలను  టీటీడీ రద్దు చేయడం ఇదే ప్రథమం. తిరుమ‌ల‌లోని పాప‌నాశ‌నం డ్యాం వరకే వాహనాలు వెళతాయి.అక్కడ నుంచి అడవిలో నడక తప్పదు. పాపనాశనం డ్యాం దాటగానే ఎదురుగుగా కనిపించే ఎత్తైన‌ మిట్ట ఎక్కుతూ అడ‌విలో న‌డుచుకుంటూ ముందుకు సాగాలి.( పూర్తి స్టోరీ ఇక్కడ కనిపించకపోతే హోం పేజీ సందర్శించండి)

(రాఘ‌వ శ‌ర్మ‌)

తిరుమల కొండల్లో ఒక లోతైన లోయ‌లో ఎదురెదురుగా రెండు ఎత్తైన కొండ‌లు.ఆ రెండు కొండ‌ల న‌డుమ ఉన్న గుండంలోకి ప‌శ్చిమ దిశ‌గా తాంత్రిక లోయ నుంచి వ‌చ్చి ప‌డుతున్న నీటి ప్ర‌వాహం.

ఎంత చూసుకున్నా త‌నివి తీర‌న‌ట్టు, ఆ రెండు కొండ‌లు నిత్యం ఒక‌దాన్నొక‌టి చూసుకుంటూనే ఉంటాయి.ఆ నీటిలో త‌మ ప్ర‌తిబింబాల‌ను చూసుకుని మురిసిపోతూనే ఉంటాయి.

ఆ రెండు కొండ‌ల న‌డుమ విశాలంగా ప‌రుచుకున్న రాతి నేల‌. ఇదే రామతీర్థం. తిరుమ‌ల‌ గిరుల్లో ప్ర‌కృతి ప్రియుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్న‌ ఒక ప్రదేశం రామ‌కృష్ణ‌తీర్థం. రామ కృష్ణ తీర్థంలో జరిగే ముక్కోటి రోజున (జనవరి 28) వేలాది మంది ఈ తీర్థాన్ని దర్శించి, తీర్థ స్నానం చేస్తారు. ఈ సారి ఇది కరోనా వల్ల రద్దయింది.

కొంద‌రు ఆ అడ‌విలోనే, ఆ కొండ‌ల మ‌ధ్య వెన్నెల‌లో నిద్రించి, మ‌ర్నాటి ఉద‌యం తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు. అనేక ద‌శాబ్దాలుగా ప్ర‌కృతి ప్రియులు ఈ తీర్థాన్ని సంద‌ర్శించి, ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తున్నారు.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ వల్ల కొన్నేళ్ళుగా తీర్థ ఉత్స‌వం రోజున‌ త‌ప్ప మిగ‌తా రోజుల్లో టీటీడీ అనుమ‌తించ‌డం లేదు. ఈ ఏడాది క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల తీర్థ ఉత్స‌వం రోజున కూడా అనుమ‌తించ‌డం లేదు.

అభివృద్ది చెందిన దేశాల్లో ట్రెక్కింగ్(ప‌ర్వ‌తారోహ‌ణ‌) కు చాలా ప్రాధాన్య‌త ఉంది. మ‌న దేశంలో కూడా ట్రెక్కింగ్ ఉంది కానీ, అంత‌గా అభివృద్ధి చెంద‌లేదు.

కాస్తో కూస్తో ఉన్నా, అది తీర్థాల వంటి ఉత్స‌వ సమయంలో , మత విశ్వాసాలతో ముడిప‌డి ఉంది. ప‌చ్చ‌ని శేషాచ‌లం కొండ‌ల్లో ట్రెక్కింగ్ తో ఒక గొప్ప ఆనందాన్ని, మానసిక అనుభూతిని పొందుతాం.

క‌చ్చితంగా పాతికేళ్ళ క్రితం (1996) తొలిసారిగా మిత్రుల‌తో క‌లిసి ఈ తీర్థాన్ని చూసి మ‌హ‌దానంద‌ప‌డిపోయాను. తీర్థ ఉత్స‌వంతో ప‌నిలేకుండా భూమ‌న్‌, తిరుపాల్ వంటి మిత్రులు, మా మేన‌ళ్ళులతో క‌లిసి త‌రుచూ ఈ తీర్థాలకు వెళ్ళి వ‌స్తూనే ఉన్నాం.

రామ‌కృష్ణ తీర్థం వెళ్ళాలంటే, పాపనాశనం నుంచి సూర్యోద యాన నడక మొదలెడితే, సూర్యాస్తమ యాని కి తిరిగి రాగలుగుతాం. తిరుమ‌ల‌లోని పాప‌నాశ‌నం డ్యాం వరకే వాహనాలు వెళతాయి. అక్కడ నుంచి అడవిలో నడక తప్పదు.

పాపనాశనం డ్యాం దాటగానే ఎదురుగుగా కనిపించే ఎత్తైన‌ మిట్ట ఎక్కుతూ అడ‌విలో న‌డుచుకుంటూ సాగాలి.

అడవిలో ఇలా కొండ ఎక్కడం గొప్ప అనుభూతి

ఒత్తుగా పెరిగిన ఈత చెట్లు, అక్క‌డ‌క్క‌డా నెల్లి (ఉసిరి) చెట్లు, ఎర్ర‌చంద‌నం చెట్లు, మ‌ధ్య‌లో స‌న్న‌ని న‌డ‌క‌దారి.

దారికి ఇరువైపులా రెల్లు పొద‌లు.అలా న‌డుస్తూ పోతే కొంత సేప‌టికి మూడు న‌డ‌క‌దారుల కూడ‌లి వ‌స్తుంది.ఎడ‌మ వైపున‌కు వెళితే కుమారధార తీర్థానికి వెళ్లే దారి వస్తుంది.కుడివైపున‌కు వెళితే స‌న‌క‌స‌నంద‌న తీర్థం దారి వ‌స్తుంది. స‌న‌క స‌నంద‌న తీర్థం ఒక‌ చిన్న నీటి గుండం.

ప‌డ‌మ‌టి వైపునుంచి ఆ గుండంలోకి వ‌చ్చి ప‌డుతున్న నీటి ధార‌.మండు వేస‌విలో కూడా స‌న‌క‌స‌నంద‌న తీర్థంలో నీళ్ళుంటాయి.స‌న‌క‌స‌నంద‌న తీర్థం దాటితే, రామ‌కృష్ణ‌ తీర్థం, తాంత్రిక‌లోయ‌, తుంబురు తీర్ధాల‌లో త‌ప్ప దారిలో ఎక్క‌డా నీటి జాడ క‌నిపించ‌దు.

స‌న‌క‌స‌నంద‌న తీర్థం లోనే నీటిని నింపుకుని వెళుతుంటారు.ఈ తీర్థంలో కొంద‌రు సాధువులు నివ‌సిస్తున్నారు. స‌న‌క‌స‌నంద‌న తీర్థం దాటి ముందుకు సాగితే చిన్న లోయ‌. ఈ లోయ‌నే కాయ‌ర‌స‌నాయ‌న తీర్థం అంటారు.

ఈ తీర్థం స‌చ్చీలుర‌కు త‌ప్ప సామాన్యుల‌కు క‌నిపించ‌ద‌ని కొంద‌రు భ‌క్తుల‌ విశ్వాసం.ఈ కాయ‌ర‌సాయ‌న‌ తీర్థం రాజు గారి దివ్య దుస్తుల వంటివే ! ఎవరికీ కనిపించదు. చెట్ల మ‌ధ్య నుంచి అలా ముందుకు సాగితే చ‌లువ బండ‌లు వ‌స్తాయి.

నేలంతా ప‌రుచుకున్న ఆ చ‌లువ బండ‌ల వ‌ద్ద‌ సేద‌దీర‌వ‌చ్చు. ఈ చ‌లువ బండ‌ల వ‌ద్దే రాళ్ళ‌ను పేర్చి పెద్ద పెద్ద స్తంభాలుగా ఏర్పాటు చేశారు.

తీర్థ స‌మ‌యంలో ఇక్క‌డ షామియానాలువేసి వ‌చ్చిపోయే వారికి మంచి నీళ్ళు, మ‌జ్జిగ‌తో పాటు ఆహారం వండి వ‌డ్డించే వారు.చ‌లువ బండ‌లు దాటితే ద‌ట్ట‌మైన అడ‌వి కాస్తా ప‌లుచ‌బ‌డుతుంది.

ఏట‌వాలుగా నేలంతా ప‌రుచుకున్న రాతి బండ‌లు.వ‌ర్ష‌పు నీటి ప్ర‌వాహానికి ఆ బండ‌లు కొన్ని చోట్ల నునుపు దేలాయి. రాళ్ళ‌పై నుంచి ఎక్కుతూ దిగూతూ సాగాలి.

కొంత దూరం వెళ్ళాక కుడివైపున లోతైన లోయ‌. పాప‌నాశ‌నం డ్యాం నుంచి వ‌దిలిన నీళ్ళు ఈ లోయ‌లో తుంబురు వైపు సాగుతుంటాయి. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా ఎత్తైన కొండ‌.

ఆ కొండ అంచుల నుంచి, కుడివైపు లోయ ప‌క్క‌గా వెళితే తుంబ‌రురు తీర్థం దారి వ‌స్తుంది. ఎదురుగా కొండ ఎక్కితే రామ‌కృష్ణ తీర్థానికి వెళ్ళే దారి క‌నిపిస్తుంది.

కొంత దూరం వెళ్ళాక దారి చీలి ప‌డ‌మ‌ర దిశ‌గా తాంత్రిక‌లోయ‌కు దారి తీస్తుంది. కొండ ఎక్కిన కొద్దీ ఇక‌ అయిపోయింది క‌దా అన‌డానికి వీల్లేదు.

అదిగో అదే కొండ అంచు అనుకుని గ‌బ‌గ‌బా వెళ‌తాం. ఇంకా ఎక్కాల్సిన కొండ ఎదురుగా వెక్కిరించిన‌ట్టు క‌నిపిస్తుంది. అలా ఎక్కు‌తూ, ఎక్కుతూ వెళితే కానీ కొండ అంచుకు చేరుకోలేం.

కొండ పైన కొంత దూరం న‌డిచాక మ‌ళ్ళీ లోయ మొద‌ల‌వుతుంది. లోయ‌లోకి దిగ‌డానికి స‌న్నని దారిలో కొండ అంచునుంచి జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాలి.

ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మ‌ల‌ను రెయిలింగ్‌లా భావించి, వాటిని ప‌ట్టుకుని దిగాలి. దారిపొడ‌వునా ఎండిన ఆకులు. జాగ్ర‌త్త‌గా అడుగులు వేయ‌క‌పోతే జర్రున జారిపోతాం. దెబ్బలు తగలనం త మటుకు జారడం కూడా భలే తమాషాగా ఉంటుంది. లోయ చివ‌రికి దిగేవ‌ర‌కు దారంతా చెట్ల‌తో క‌మ్మేసి ఆకాశం క‌నిపించ‌దు.

Like this story? Share it with friends!

వ‌ర్షాకాలంలో నీటి ప్ర‌వాహానికి లోయ‌లోకి కొట్టుకు వ‌చ్చిన బండ‌రాళ్ళ‌పై నుంచి ఎక్కుతూ, దిగుతూ సాగాలి. ఏడు కొయ్య నిచ్చెన‌ల ద్వారా ఎట్ట‌కేల‌కు లోయ‌లోకి దిగుతాం.

రెండు కొండల నడుమ ఇలా విశాలంగా పరుచుకున్న రాతి నేల పై వెల్లకిలా పడుకుని సేద దీరరడం ఎంత బాగుంటుందో !

ఎదురుగా ఒక సుంద‌ర దృశ్యం… రామ‌కృష్ణ తీర్థం.

రెండు కొండ‌ల న‌డుమ విశాలంగా ప‌రుచుకున్న రాతినేల‌. అక్క‌డ‌క్క‌డా పెద్ద పెద్ద వృక్షాలు. చుట్టూ ఎత్తైన ప‌చ్చ‌ని కొండ‌లు. తూర్పున‌కు వీస్తున్న గాలి చెమ‌ట ప‌ట్టిన శ‌రీరాన్ని స్పృశిస్తూ అలుపు తీరుస్తుంది.

ఉత్త‌ర‌, ద‌క్షిణ అభిముఖాలైన రెండు కొండ‌ల‌కు ఇరువైపులా లోనికి చొచ్చుకు పోయిన‌ట్టున్న చిన్న చిన్న గుహ‌ల వంటి రూపాలు.ప‌శ్చిమ దిశ‌గా లోతైన ఒక నీటి త‌టాకం.రెండు కొండ‌ల అంచుల నుంచి వ‌స్తున్న నీటి ప్ర‌వాహం. నీటి తటాకంలోకి వేలాడుతున్న చెట్ల ఊడ‌లు.

రామ కృష్ణ తీర్థం లో మెట్లు మెట్లుగా ఉన్న రాతి అంచుల నుంచి తూర్పునకు జాలువారుతున్న నీటి ధార

తూర్పున‌కు ప్ర‌వ‌హించే నీళ్ళు. మెట్లు మెట్లుగా ఉన్న రాతి అంచుల నుంచి కిందికి జాలువారుతున్న నీటి ధార‌. ఈ తీర్థంలో ఈదులాడ‌డం ఒక గొప్ప అనుభూతి. రెండు కొండ‌ల‌న‌డుమ ప‌రుచుకున్న రాతి నేల‌పై వెల్ల‌కిలా ప‌డుకుని సేద‌దీర‌డం మరొక మ‌ధురానుభూతి.చ‌ల్ల‌ని కొండ గాలి అల‌సిన ప్రాణానికి ఎంత ఊర‌ట నిస్తుందో!

ఎన్ని సార్లు చూసినా త‌నివి తీర‌ని ప్ర‌కృతి సోయ‌గం.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/zilla-parishat-high-school-sricilla-telangana/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *