అమేథిలో రాహుల్‌ను భయపెడుతున్న స్మృతీ ఇరానీ

అమేథి… ఈ నియోజకవర్గం పేరు దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ కుటుంబమంతా ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించింది. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం క‌నిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ బిజెపి నుంచి పాపులర్ స్టార్ స్మృతి ఇరానీ బరిలోకి దిగుతున్నారు.

2014 ఎన్నికల్లో కూడా స్మృతి ఇరానీ అమేథి నుంచి పోటీకి దిగారు. కానీ అప్పుడు రాహుల్ స్మృతి పై 1 లక్షా 7 వేల ఓట్ల తేడాతో గెలిచారు. రాహుల్ గెలిచినా ఇది కాంగ్రెస్‌కు దెబ్బ‌గానే చెప్పవచ్చు. ఎందుకంటే 2009లో రాహుల్‌కు అమేథిలో 3,70,000 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. అంటే 2014 ఎన్నికల్లో బిజెపి 2 లక్షల ఓట్లను తన ఖాతాలో వేసుకుందన్నమాట.

అమేథిలో రాహుల్‌ను ఓడించి దేశ ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఒక్క గట్టి సందేశం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. అందుకోసం కమలనాథులు 5 సంవత్సరాల క్రితం నుంచే అమేథిలో తిష్ట వేశారు. స్మృతీ ఇరానీ ఓడినా నిత్యం అమేథిలో పర్యటించేవారు. రాహుల్‌పై ఏదో రకంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గంలో పరిస్థితిని అంచనా వేసి రాహుల్‌ని మరోచోట నుంచి కూడా బరిలో దింపారు.

ఈ నేప‌థ్యంలోనే రాహుల్ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా నామినేషన్ వేశారు. దీంతో రాహుల్ తన ఓటమిని అంగీకరించినట్టేనని బిజెపి నేతలు వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఒక పార్టీ అధినేత తన నియోజకవర్గానికి వెళ్లకుండా కూడా గెలిచేస్థితిలో ఉండాలి. ఎందుకంటే తాను దేశమంతా పార్టీ కోసం తిరుగుతూ తన నియోజకవర్గంలో కూడా గెలవాల్సి ఉంటుంది.

2014 లో అమేథిలో తిష్టవేసి రాహుల్ ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్త ప్రచారానికి తక్కువ సమయం కేటాయించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఏకంగా మరో స్థానం నుంచి పోటి చేస్తున్నారు. నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఇతరులు గెలిచారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పడింది.

ఈ నియోజకవర్గం నుంచి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ఉద్దండులు గెలిచిన నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం సంక‌ట‌ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ అమేథి నుంచి గెలవకముందు ఆ ప్రాంతమంతా ఎడారిలా ఉండేది. రాజీవ్ ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వేలైను, రైల్వే స్టేషన్లు, యూనివర్సిటీల‌ ఏర్పాటు, హాస్పిటల్స్, ఉద్యోగ కల్పన జరిగాయి. దీంతో అమేథి ప్రజలంతా గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

2003 లో బిజెపిలో చేరిన స్మృతి 2014 లో ఎంపీగా గెలవకపోయినా రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యి కేంద్ర మంత్రి వ‌ర్గంలో చోటు సంపాదించారు. ప్రజల్లో ఇరానీకి క్రేజ్ పెరగడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. అందుకే రాహుల్‌ను వయనాడ్ నుంచి పోటీ చేయించారని అంతా భావిస్తున్నారు. రాహుల్‌ని వయనాడ్‌లోనూ ఓడించాలని ప్రచారం చేస్తానని స్మృతి ఇరానీ ప్రకటించారు.

దీంతో బిజెపి-కాంగ్రెస్ మధ్య రాజకీయం వేడెక్కింది. స్థానికంగా ఉన్నారని స్మృతికి అనుకూలత ఉండగా, ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శ రాహుల్ మూటగట్టుకున్నారు. దీంతో అమేథిలో రాహుల్, స్మృతిల మధ్య పోరు కీలకంగా మారింది. ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తమ అంతిమ తీర్పులో ఎవరికి పట్టం కడుతారోనని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *