Home Features రాళ్ళసీమ – రాతిచేప  (కథ)

రాళ్ళసీమ – రాతిచేప  (కథ)

355
0
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
“ఈ మానవజాతి చాల కనికరం లేనిది. ఒక్క భూమినే కాకుండా ఇతరా గ్రహాలు కూడా వీరి ఆక్రమణకు గురవుతున్నాయి. వీరొక్కరే ఎల్లకాలం బతకాలనుకొంటారు. మిగతా జీవరాశులు ఏమైపోయినా వీళ్ళకు పట్టదు. మనుషులతో పాటు జీవరాశులూ సమానమనే మాట వీరి చెవికెక్కదు. ఊరకే వొట్టి చదువులు చదవుకొంటారే గానీ జీవావరణ సమతుల్యతా సిద్ధాంతం వీరి తలకెక్కదు. వీళ్ళు అత్యంత స్వార్థపరులు. మానవత్వం అనేమాటే తప్ప వీరు నిజంగా అమానవీయులు. వందేళ్ళ క్రితం మన జంతుజాతి గురించి కథలు కథలుగా అంతటా చెప్పుకొనేవారు. కృత్రిమ నాగరికత పెరిగేకొద్ది మనం తరుగుతూ వచ్చాం. ఏ స్థాయికి వచ్చామంటే మనవాళ్ళు స్వేచ్చ లేకుండా జంతుప్రదర్శనశాలలలో బందీలైపోతున్నారు. చివరకు మనజీవరాశులలో కొన్ని పూర్తిగా అంతరించిపోతున్నాయి. పశ్చిమదేశాలలో ఇది మరీ మితిమీరి పోయింది.
సరిగ్గా ఇన్నాళ్ళకు మానవ జాతికి తగిన శాస్తి జరుగుతోంది.
ప్రపంచంమతా లాక్ డౌన్లు కొనసాగుతుండటంతో తరతరాలుగా మన జీవరాసులు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలతో ఊపిరి పీల్చుకొంటున్నాయి. సహజ జీవితంలో ఉన్న ఆనందాన్ని చవి చూస్తున్నాయి.
ఆకాశంలో విమానాలు, డ్రోన్ లు లేవు. పక్షులు ప్రశాంతంగ ఎగురతున్నాయి. భూమిపై వాహనాలు, రైళ్ళు లేవు. నిరభ్యంతరంగా మనం రోడ్లపై కూడా పడుకొంటున్నాం. పరిశ్రమలు మూతపడ్డాయి. వాతవరణ కాలుష్యం లేకుండా పోయింది. నదులు స్వచ్చమవుతున్నాయి. ఓడరేవుల మూతతో సముద్ర జీవులు కూడా సంతోషంగా ఉన్నాయి. సకల జీవరాశులు విముక్తులైనాయి.
మానవజాతిని వణికించి జూ..లాంటి ఇళ్ళలో వాళ్ళను బందీలుగా చేసిన మన కరోనా జీవిని ఈ శతాబ్దపు వీరుడిగా ప్రకటించాల్సిందే”.. అని చాల ఆవేశంగా, గుక్కతిప్పుకోకుండా ప్రపంచ జీవరాశుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆస్ట్రేలియా ఖండ ప్రతినిధి కంగారో వాపోతోంది.
యూరప్ ఖండం, జెనీవాకు సమీపంగా ఆల్ప్స్ పర్వతసానువులలోని సంఘం ప్రధాన కార్యాలయంలో సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు ఆఫ్రికన్ ఏనుగు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.
“ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ కంగారో ఇంత ఆవేశానికి గురవుతుందేమి, కొంత శాంతించమని”.. అధ్యక్షుడు సమూదాయించాడు‌.
జాతులమధ్య వైరుధ్యాలు మాని చర్చలద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఆవేశాలు మంచిది కాదు. మన కరోనా కూడా మరీ అంత విశ్వరూపం చూపడం బాగోదు. చీనావాళ్ళు ప్రపంచ ఆధిపత్యస్థానం కోసం లెక్కకుమించిన ఉత్పత్తుల తయారీలో కొనసాగిన ఒత్తిడిలో అక్కడి జీవరాసులు అనేక ఇబ్బందులకు గురైనమాట నిజమే. జీవరాసుల రక్షణకోసం కరోనా కొత్తరూపంతో అక్కడ ప్రారంభమైనా, అక్కడితో ఆగకుండా ప్రపంచమంతా చుట్టుకొంది. ఇది ఒకింత మేలే అయినా మానవజాతికి, మనకు దీర్ఘకాల వైరానికి దారి తీస్తుందని తనదైన పద్దతిలో నెమ్మదిగా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
“అసలు.. మానవ జాతి కరోనా సహజంగా పుట్టిన జీవరాశిగా ఒప్పుకోవడం లేదు. రసాయన ప్రయోగశాలలో తామే కృత్రిమంగా రూపొందించుకొన్న జీవిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ జాతికి అహం ఎక్కువ. వాస్తవాలను కూడా అంత తేలిగ్గా ఆమోదించరు. తమ ఆధిపత్యం ఎక్కడ పోతుందోనని వారి భయం” అని మరోసారి వాదనకు దిగింది కంగారో.
వాదనలకు ఇది అనువైన సమయం కాదు. కరోనా చేసినా మేలు మన జీవరాసులు ఎప్పటికీ మరచిపోవు. ఇది ఒక నూతన అధ్యాయం. తలపొగరు పట్టిన మానవ జాతికి పెద్ద ఎదురుదెబ్బే. స్వేచ్చా, సమానత్వం కోసం సాగే మన పోరాటానికి ఇది మరింత స్ఫూర్తి ఇస్తుంది. మానవాధిపత్యం తగ్గితే మనం ఎంత హుందాగ, ఆత్మగౌరవంతో బతకచ్చో ఈ నెలలో చూశాం. మనం వాళ్లు ఐక్యంగా ఉద్యమించడానికి ఇది ఉపయోగపడుతుంది. మన ప్రపంచ జీవరాసుల సదస్సులో అన్ని అంశాలు సావధానంగా మాట్లాడుకొందాం. ఈ మానవజాతి బిక్క మొగాలేసుకొని భయంతో వణికిపోతోంది. ఇన్నాళ్ళు మనల్ని పీడించిన వారు ఒక్కసారిగా మన కరోనా పీడనకు గురైతే ఎలా ఉంటుందో చూస్తున్నారు. ఈ అనువైన సమయంలో ప్రపంచంలోని జీవరాసుల ప్రతినిధులు స్వేచ్ఛగా వచ్చి సదస్సులో తమ సాదకబాధకాలు పంచుకోవచ్చు. ఆఫ్రికా ఖండంలోని కైరో నగరం సమీపాన నైలునది ఒడ్డున ప్రపంచ జీవరాశుల అంతర్జాతీయ సభలు నిర్వహిద్దామని అధ్యక్షుడు ప్రకటించాడు. ఈ శతాబ్దపు వీరుడిగా కరోనాను ప్రకటించే విషయమై విషయనిపుణులకు బాధ్యత అప్పగిద్దాం.
ప్రపంచ జీవరాశుల సదస్సు వర్తమానాన్ని ఒక్క మానవజాతికి తప్ప, భూఖండమంతటా అన్నీ జీవరాసులకు చేరవేయండని వలస పక్షుల ప్రతినిధి సైబీరియన్ కొంగకు అధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.
రేపటి రోజునే సైబీరియన్ కొంగల బృందం దక్షిణాసియా పోతున్నాయని, ఆయాప్రాంతాలకు వర్తమానం పంపుతామని, మిగతా ఖండాలకు ఇతర పక్షుల ద్వారా చేరవేస్తామని వలసపక్షుల ప్రతినిధి తెలిపింది.
దక్షిణాసియా వైపు ఇపుడెందుకు కొంగలు బయలుదేరాయని అధ్యక్షుడికి సందేహం వచ్చి మళ్ళీ అడిగాడు.
దక్షణాసియాలోని భారతదేశంలో రాళ్ళసీమ ప్రాంతం మా వాళ్ళకు ప్రధాన కేంద్రం. అరేబియా సముద్రం దాటాక దక్షిణాదిలో కీలక ప్రాంతమది. మా జాతి సంతానోత్పత్తికి అనువైన వాతావరణ పరిస్థితులు అక్కడున్నాయి. సంతాన వృద్ధి చేసుకోని, తిరిగి సంతతితో అక్కడ నుండి వెనుతిరుగుతాయి. అక్కడి జీవరాసులు కూడా చాల విశాలమైన హృదయం కలవి. నమ్మితే ప్రాణాలైనా ఇస్తాయి. వాళ్లకు ఎన్ని కష్టాలున్నా మాట మాత్రం తప్పవు. కొంత చైతన్యం లేదు గానీ మిగతా వాళ్ళతో పోలిస్తే మంచిగా ఉంటాయి. వాళ్ళ సమస్యలు ఎన్నున్నా మాకు మాత్రం ఏ లోటు రానీయరు.
“ఆడామగా తేడాలేకుండా మేంమతా బతకలేక బెంగళూరు, బాంబే, డిల్లీ, సౌదీలకు దేశాలెంబడి వలసలు పోతాంటే.. ఈ ఎర్రకాళ్ల కొంగలకేమి తిక్క మనల్ని కాసుకొని ఉంటాయని” చెట్లకింద అక్కడ కుర్రాళ్ళు మమ్మల్ని అంటుంటారు.
“పరాయి దేశంనుండి నమ్ముకొని వచ్చాయి. ఎన్ని కష్టాలుంటే వచ్చాయో. సొంత బిడ్డాల్లా చూసుకోండ్రా నాయన” అని ముసిలోళ్ళు అంటుంటారు.

 

“అవి అకాశంలో పోతాయి. మీరు భూమ్మీద పోతారు. ఇద్దరూ కడుపుల కోసమే. పుట్టే సంతతి కోసం అవి. పుట్టిన సంతతికోసం మీరు. దేశాలు, జాతులు వేరైనా కష్టాలొకటే”..అని ఏకతార మీటుతూ వేదాంత ధోరణిలో పాడుకొనే వాళ్లుకూడ అక్కడక్కడ కనిపిస్తారు.
ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ప్రపంచంలో ఎక్కడున్నా మాజాతి పక్షులు రాళ్లసీమ దిక్కు తిరిగి దండం పెట్టుకొన్న తర్వాతే పనులు మొదలు పెడతారు. ఇది ఒక ఆచారంగా మాకు కొనసాగుతోందని వలసపక్షి ప్రతినిధి సైబీరియన్ కొంగ చెప్పుకొచ్చింది.
“అక్కడి జీవరాసులకు ఏమైనా సమస్యలున్నాయా” అని అడిగాడు అధ్యక్షుడు.
అక్కడ అందరిదీ ఒకటే సమస్య…అది నీళ్ళ సమస్య. కరువు పీల్చిపిప్పి చేస్తుంటాది. కాసిన్ని నీళ్లుంటే నిజంగా అది భూతల స్వర్గమే అవుతుంది. ప్రపంచమంతటా మనవజాతితో జీవరాసులు ఇబ్బందులు పడుతుంటే, అక్కడ మాత్రం జీవరాశుల, మనుషులు నీళ్ళులేక నిరంతరం కరువులతో నలిగిపోతున్నారని కొంగ పేర్కొంది.
అయ్యో! ఇది చాలా బాధాకరంగా ఉందే. ఆ కరువు ప్రాంతం నుండి జీవరాసుల ప్రతినిధిని మన సదస్సుకు తప్పకుండా ఆహ్వానించండి. ఇన్నాళ్ళు ఇండియా లోని దక్షిణాదిన తెలుగు నేల నుండి కోస్తాతీర జీవరాశుల ప్రతినిధి మాత్రమే వచ్చేవారు. ఈ మధ్య తీరప్రాంత పై భాగాన కృష్ణా, గోదావరి నదుల మధ్యభాగం నుండి కూడా ప్రతినిధి వస్తున్నట్టున్నారు.
ఈ కరువుసీమ నుండి కూడా ప్రతినిధి రావడానికి వీలుగా ఆమోదిస్తూ తీర్మానం చేస్తాం. వారి సమస్యలు చర్చకురావాలి. వారిని సభకు రమ్మని చెప్పండని వలసపక్షుల ప్రతినిధిని అధ్యక్షుడు ఆదేశించాడు.
****
ప్రపంచ జీవరాశులు సంఘం ఆహ్వానాన్ని వలసకొంగలు రాళ్ళసీమ జీవరాశులకు తెలియచేశాయి. రాళ్ళసీమ నలుమూలలా జీవరాశులకు ఈ విషయం తెలిసి సంతోషించాయి. ఈ ఎర్రకాళ్ళ కొంగల మూలాన మనకు ఎదో మంచి కాలమొచ్చేలా ఉందని సంతోషపడ్డాయి. ప్రపంచ సభలలో మన కన్నీటివ్యధను గురించి మాట్లాడే ప్రతినిధిని పంపేవిషయం, అక్కడ మాట్లాడాల్సిన విషయాలపై రాళ్ళసీమ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొందామని సీమ జీవరాశులు అనుకొన్నాయి. నల్లమల,ఎర్రమల,పాలకొండ,వెలిగొండ,ఏనుగుకొండ, మల్లమ్మకొండ,పెనుగొండ శేషాచలంకొండ, కలేకుర్తి ఎడారి, పెన్నా పరివాహకం ఇలా అన్ని భాగాల నుండి జీవరాశులు పాల్గొనడానికి అనువుగా పెన్నేటి ఒడ్డున, గండికొట కొండలో సమావేశం కావాలని నిర్ణయించాయి. అందరికీ ఆహ్వానాలు పంపాయి.
గండికోట కొండలలో సమావేశానికి రాళ్లసీమలోని జంతువులు, పక్షులు, కీటకాలు, జలచరాలు సర్వ జీవరాశులు హాజరయినాయి. నల్లమల పెద్దపులి సభకు అధ్యక్షత వహించింది.
పేరుకే పెద్దపులిని కానీ తాగడానికి నల్లమలలో ఎక్కడా చుక్కనీళ్ళులేక ఎలా డస్సిపోయానో మీరంతా చూస్తున్నారు. సభలో మీ అభిప్రాయాలను కూడ తెలియచేయాలని పెద్దపులి కోరింది.
కుప్పం,పలమనేరు అడవుల నుండి వచ్చిన ఏనుగులు ముందుగా మాట్లాడాయి. అడవిలో నీళ్ళు,తిండిలేక లేక పొలాలపై పడుతున్నాం.మా కష్టాలు వర్ణణాతీతం అంటూ బాధపడ్డాయి.
కళ్యాణదుర్గం నుండి చిరుతలు వచ్చాయి. అడవిలో కరువు దెబ్బకు చిన్న జంతువులన్నీ మాయమైపోవడంతో పశులమందలపై పడుతున్నాము. పశులకాపరుల చేతుల్లో ఒకోసారి మా ప్రాణాలకే ప్రమాదం ఎదురవుతోందని పేర్కొన్నాయి. ఎలుగుబంట్లు కూడా తమ బాధను పంచుకొన్నాయి.
అడవిపందులు మాట్లాడుతూ రాళ్ళసీమలో మా వైభవం మీకందరికీ తెలుసు. అకలికి తట్టుకోలేక పొలాలపైకి పోతే కరెంట్ తీగలుపెట్టి చంపేస్తున్నారని ఏడుస్తూ చెప్పాయి.
అక్కడక్కడ కొన్ని పంటలుంటే వాటిని కూడా రసాయనిక మందులు కోట్టి పండిస్తున్నారు. ఆ మందుల పంటలు తిని మా పక్షిజాతులు సంతానోత్పత్తి శక్తిని కోల్పోతున్నామని పక్షులు పేర్కొన్నాయి. రాళ్ళసీమలో ఎక్కడచూసినా గాలి‌మరలు, సెల్ టవర్ల తాకిడికి మా బతుకులు బుగ్గవుతున్నాయని గద్గద స్వరంతో అవి పేర్కొన్నాయి.
నీళ్ళులేక బయటకి వస్తుండడంతో, మమ్మల్ని దొంగలు వేరే దేశాలకు రవాణా చేసి మందులకోసం చంపేస్తున్నారని పూడుబాములు,నక్షత్ర తాబేళ్ళు తెలిపాయి.

ఎర్రచందనం కోసం అడవుల కొచ్చే వారి చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నామని జింకలు,దుప్పులు తెలిపాయి.
తినడానికి గడ్డిలేక మమ్మల్ని కళేబరాలకు తోలేస్తున్నారని పశువులు వాపోయాయి.

సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామికి శుక్రవారం అభిషేకం అనంతరం విగ్రహానికి మా శరీరం నుండి వెలువడే సుగంధ ద్రవ్యాన్ని పులుమడం కోసం మమ్మల్ని నిర్బంధిస్తున్నారని శేషాచలం నుండి వచ్చిన పునుగుపిల్లులు తమ ఆవేదనను వెళ్ళగక్కాయి.
లంకమల అడవుల నుండి వచ్చిన కలివికోడి తన దీనావస్థను చెప్పడంతో అందరిని కంటతడి పెట్టించింది. ప్రపంచంలో ఎక్కడకానరాని మేము ఎవరి కంటా కనబడకుండా అతికొద్దిగా లంకమలలో ఉంటున్నాం. ఉన్న ఆ కొద్దిమందిమి గుటుక్కుమంటే ఇంకా మా జాతి ఉండదు. లంకమల తప్ప బయట ఇంకెక్కడా జీవించలేము. కలిమిచెట్ల పొదలు మాకు ఉండడానికి అనువుగా ఉంటాయి. కలిమిచెట్లకు పట్టిన చెదలు తిని బతుకుతుంటాము. కనీసం తాగేకి చుక్క నీళ్ళులేకపోవడంతో ఎండిన గొంతుకలతో నలిగిపోతున్నామని కలివికోడి తెలిపింది.
రోళ్ళపాడు నుండి వచ్చిన బట్టమేక దుస్థితి కూడా మరో కలివికోడిని తలపిస్తుంది.
ఇలా రాళ్ళసీమలోని వివిధ జీవరాసులు ఒక్కొక్కటి తమ ఆవేదనలను, ఆక్రోశాలను వినిపిస్తున్నాయి.
కృష్ణానదిలోని సంగమేశ్వరం వద్దగల, సిద్దేశ్వరం నుండి
రాతిచేప పోతిరెడ్డిపాడు, శ్రీ శైలం కుడికాలువ మీదుగా అడుగునీళ్ళలో అవుకు జలాశయం చేరి, అక్కడ నుండి కాలువగుండా గండికోటకు వచ్చింది. అరుదుగా కనిపించే ఆ రాతిచేపను మాట్లాడమని అధ్యక్షుడు కోరాడు.
రాతిచేప సభకు నమస్కరించి…
“మీ అందరిదీ.. నీళ్ళే లేని సమస్య. నాది అంచునే నీళ్లుండి అందుకోలేని సమస్య. చేపజాతులలో చాలా పురాతనమైన జాతి మాది. ఆయుర్వేదంలో మాకు విశిష్టస్థానం ఉంది. అత్యంత రుచికరంగాను, సర్వరోగాలు నయమవుతాయనే నమ్మకంతో మమ్మల్ని దూరదేశాలవాళ్లు సైతం తినడం మొదలెట్టారు. మమ్మల్ని ఇంటి దేవతగా పూజించే ఆచారం సిద్దేశ్వరం సమీపంగా నల్లమల లోని ఒక చెంచు తెగకుంది. మా రక్షణ కోసం ఆ చెంచులు ప్రాణాలకైనా తెగిస్తారు. ఆరోజుల్లో తెల్లదొరలు మా రుచి మరిగి ప్రత్యేకంగా వేటగాళ్ళను చెన్నపట్నం నుండి పంపేవారు. వారి బారి నుండి మమ్మల్ని కాపాడేందుకు చెంచుజాతి వీరోచితంగా పోరాడింది. ఎందరో చెంచువీరులు అమరులయ్యారు. ఇప్పటికీ ఆ వీరుల వీరగల్లులు సంగమేశ్వరం గుడి గట్టున కనిపిస్తాయి. శ్రీ శైలమల్లికార్జున స్వామి వారికి కూడ మా జాతితో అనుబంధం ఉంది.ఆ కథ ఇంకోసారి చెబుతాను. ఇప్పటీకీ స్వామివారి గుడి గోడలకు‌ మా బొమ్మలుంటాయి.
సంగమేశ్వరం వద్ద కృష్ణా, తుంగభద్ర నదులు కలిసిపోతాయి. అప్పటిదాకా మైదానాల గుండా ప్రవహిస్తూ వచ్చిన ఆ నదులు ఏకమై సంగమేశ్వరం సమీపాన సిద్దేశ్వరం వద్ద రెండుకొండల మధ్య నల్లమలలోకి ప్రవేశిస్తాయి. అంత పెద్దనది నల్లమల కొండల మధ్య సన్నని పాయలా ఒరుసుకొని శ్రీశైలం దాకా ప్రవహిస్తుంది.
సరిగ్గా సిద్దేశ్వరం ప్రవేశ ద్వారం వద్ద పర్వతాల వంటి కొండ గట్టులలో నీళ్ళతో నిండిన రాతిపలకల మధ్య జీవిస్తుంటాము. ఇక్కడ మాత్రమే మేము జీవించగలం. శ్రీశైలం ప్రాజెక్టు నిండి నీళ్ళు వెనక్కు తన్నుకొనే కొద్దీ మా జీవనానికి, సంతానోత్పత్తికి అనువుగా ఉంటాది. నీళ్ళు తగ్గే కొద్దీ మా ప్రాణాలు పైపైనే పోతుంటాయి. నీళ్ళు అడుగులోకి పోయేకొద్ది రాతిపలకలు అసలుండవు. పూడులో పడ్డామంటే మాకు నూకలు చెల్లినట్లే అవుతుంది. ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభమై కొంత కాలం గడిచాక శ్రీశైలం నిండుకొంటాది. సంగమేశ్వరం నుండి ఎగవన పోతిరెడ్డిపాడు దాకా నీళ్ళతో చిన్న సముద్రం లాగా ఉంటాది. ఎన్ని సీమ పల్లెలు అందులో మునిగాయో లెక్కలేదు. పోనీ ఆ నీళ్లు సీమ పల్లెలకు అందుతాయా అంటే అదీలేదు. ఎదో వరదలొస్తే పోతిరెడ్డిపాడు వద్ద తన్నుకొచ్చే నీళ్ళను వదులుతారు. ఆ నీళ్ళు కుందూ మీదుగా పెన్నను చేరి దిగువకు పరుగులెత్తుతాయి.
పోతిరెడ్డిపాడు వద్ద అన్ని వేళల నీళ్ళుంటే రాళ్ళసీమ వాళ్ళు వాడుకొనే వీలుంటాది. కానీ ఆ భాగ్యానికి నొచుకోవడం లేదు.
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే ఎన్నోఏళ్ళుగా ఎదురుచూసిన సిద్దేశ్వరం ప్రాజెక్టును సంగమేశ్వరం వద్ద రెండుకొండల మధ్య కట్టాలని నిర్ణయమైంది. రేపోమాపో పనులు మొదలవుతాయనుకొంటున్న సమయంలో ఈ ప్రాజెక్టును ఇప్పుడు కడితే ఉమ్మడి రాష్ట్రంలోని చెన్నపట్నానికి నీళ్ళుపోతాయి. తెలుగుజాతి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంగా అతి త్వరలో ఏర్పాటయ్యాక సొంత రాష్ట్రంలో ప్రాజక్టు కడితే మొత్తం నీళ్ళన్నీ రాళ్ళసీమ వారే వాడుకోవచ్చు. లక్షల ఎకరాలకు మూడుపంటలు పండించుకోవచ్చని సముద్రతీరం వాళ్ళు అనేసరికి సీమవాళ్లు సరే అన్నారు. తీరా రాష్ట్రం ఏర్పడినాక ముందనుకొన్న ప్రకారం కాకుండా సిద్దేశ్వరం దిగువ వందల మైళ్ళదూరంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుగా కట్టారు. దీంతో నిరంతరం నీళ్ళ వసతితో సుభిక్షంగా ఉండాల్సిన సీమ ఇప్పుడీ తీరుగా ఎండి పోతిరెడ్డిపాడు వద్ద కాసిన్ని నీళ్ళకోసం కాసుకొని కూర్చోరావల్సి వస్తాంది.
పోని నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన శ్రీశైలంప్రాజెక్టును సిద్దేశ్వరం వద్ద కడతారని ఎదురు చూసినారు. కానీ అదీ జరగలేదు. ఎదో ఆ శ్రీశైలం పూర్తిగా నిండితే నాలుగు సుక్కల నీళ్ళు పోతిరెడ్డిపాడు వద్ద సీమకు అందుతాయని ఎన్నోఏళ్ళుగా ఎదురు చూస్తునే ఉన్నారు.
వానాకాలం ముగియగానే కింద పంటలకోసం శ్రీశైలం వద్ద తూములు ఎత్తడంతో నీళ్ళన్ని నేరుగా కిందికెళ్ళిపోవడం జరుగుతోంది. వేసవికాలం ఆరంభానికి సిద్దేశ్వరం వద్ద నీళ్ళు అడుగుకు చేరిపోతాయి.
సీమ సంగతి అటుంచితే… సిద్దేశ్వరం వద్ద నీళ్ళు తగ్గేకొద్ది మాకు ప్రాణగండం మొదలవుతుంది. అడుగులో పడి అల్లాడి చచ్చి పోతాము. దిక్కు తెలియక బిక్కు బిక్కు మంటూ ఆ కొండల గట్టున రాతిపలకల మధ్యనే ఉండిపోతాము. జీవచ్చవాలుగా బతుకీడుస్తాము. చెరువులు ఎండిపోతే కప్పలు పర్రెలుచీలిన మట్టిగర్భంలోకి పోయి నిద్రావస్థలో ఉంటాయి. మళ్ళీ కొత్త నీళ్లొచ్చాక బయటకు వస్తాయి. మా పరిస్థితి అంతకంటే దారుణం. కప్పలకైనా మట్టిలో కొంత తడి ఉంటాది. మేము రాతిపలకల మధ్య తడారిపోయి చిక్కి శల్యమైపోతాము. మా రాత బాగుంటే మళ్ళీ నీళ్ళు వచ్చినపుడు బయటకు వస్తాము. లేదంటే ఆ రాతిపలకలే మాకు సమాధి రాళ్లవుతాయి. ఇన్ని కష్టాలనుభవిస్తూ మా జాతి నరకం అనుభవిస్తుంది. గట్టిగా ఈ రోజుకు మేము మొత్తం పాతిక మంది కంటే ఎక్కువ లేమంటే మీరు నమ్మరు‌. మా జాతి నిలబడాలంటే శ్రీశైలం ప్రాజెక్టు తూములు పూర్తిగా మూసేయాలి. నిరంతరం మా రాతిపలకలకు నీళ్ళు తాకుతూ ఉండాలి. అంతకంటే ఇంకా సులువైన మార్గం ఒకటుంది. మేముండే సిద్దేశ్వరం వద్దే ఒక అలుగు నిర్మిస్తే ఇక మాకు ఏ ఢోకా ఉండదు. మాకు కావలసిన నీళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
మూడు దశాబ్దాల కిందట పోతిరెడ్డిపాడు దాకా నీళ్లు ఎప్పుడూ ఉండాలని పాతతరం వాళ్ళు పోరాడారు. కొద్దోగొప్పో చలనం వచ్చింది. తర్వాత కొన్నాళ్ళకు మౌనమయినారు. ఈ మధ్య నాలుగేళ్ళ కిందట సీమ పల్లెలనుండి దాదాపు ముప్పైవేల మంది ప్రజలు తరలివచ్చి సిద్దేశ్వరం అలుగుకోసం పునాది రాయి వేయడం చూసాను. పిల్లోళ్ల నుండి ముసిలోళ్ళ దాకా అందరితో సంగమేశ్వరం నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం. జనం గుంపు కాకుడదని ఎక్కడికక్కడ పోలీసుల గుంతలు తీశారు. అడ్డు కొన్నారు. లాఠీలకు పని చెప్పారు. తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా మొక్కవోని దైర్యంతో తాడో పేడో తేల్చుకొందామని తెగించి సీమ జనాలు పునాదిరాయి వేశారు. వాళ్ళను చూసే సరికి, వారి ఉపన్యాసాలు వినేసరికి నా కళ్లనిండా సంతోషంగా నీళ్ళుకారాయి. జీవితంపై మళ్లీ ఆశలు చిగురించాయి. మూడేళ్ళ కిందట నంద్యాలలో పదివేలమందితో సభ చేసారని తెలిసింది. రెండేళ్ళకిందట వాహన యాత్రగా వేలాది మంది వాహనాలలో మళ్లీ సిద్దేశ్వరం వచ్చారు. విజయవాడలోను కృష్ణ ఒడ్డున సిద్దేశ్వరం అలుగుకోసం దీక్షలు చేసారని విన్నాను. అంతెందుకు కిందటి ఏడాది ఎర్రటి ఎండలలో నంద్యాల నుండి ఇక్కడికి నాలుగు రోజులు పాదయాత్ర చేసారు. వాళ్ళ పాదాలన్నీ బొబ్బలెక్కడం చూసే సరికి నాకు ఏడుపాగలేదు. వీళ్ళు వదిలేరకం కాదని నమ్మకం కుదురుతోంది. సిద్దేశ్వరం అలుగు సాధిస్తే వాళ్ళ జీవితాలతో పాటు, నా జీవితం నిలబడతాది. లేదంటే నేను రేపు, వాళ్ళు మర్నాడు, మీరు ఆ తర్వాత, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఈ రాళ్ళసీమ నుండి అదృశ్యం కాక తప్పదు. రాళ్ళసీమ జీవరాశులు ప్రాణాలతో బయటపడాలంటే సిద్దేశ్వరం నిర్మించి, మన అవసరాలకు తగ్గట్టు నీళ్ళను పొందడమే మన ముందున్న ఏకైక మార్గం”.. అంటూ సుదీర్ఘంగా రాళ్ళసీమ బతుకు చిత్రాన్ని రాతిచేప సభలో వివరించింది.
జీవరాశులన్నీ కంటతిడి పెట్టాయి. ఉద్వేగానికి గురైనాయి. జై సిద్దేశ్వరం, జై రాళ్ళసీమ అంటూ గండికొండలు ప్రతిధ్వనించేలా అరిచాయి.
“మనదంతా ఒకటే మాట ఒకటే బాట. మనకు నీళ్ళు కావాలి. మన మధ్య ఎన్ని సమస్యలున్నా, గొడవలున్నా అన్నీ పక్కన పెడదాం. మన భావితరాలు నిలబడాలంటే మొదట నీళ్ళుండాలి. నీళ్ళుంటే నాగరికత ఉంటాది. నాగరిత దేవుడెరుగు మొదట మనముండాలంటే నీళ్లుండాలి. ఇందుకోసం దేనికైనా సిద్దమవుదాం. మనకు ఏ పదవులు, తాయిలాలు, జాతి వైరాలు వద్దు. మనదంతా కరువు జాతి. ఏ ఒక్కరినో నమ్ముకోలేం. పెద్దపెద్దోళ్ళను చూశాం. ఏమిజరిగిందో చూశాం. మనమంతా చిన్నా పెద్దా తేడా లేకుండా ఐక్యమవుదాం. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకొందాం. ఎవరికీ తాకట్టు పెట్టుకోకుండా మన చరిత్రను మనమే తిరగరాసుకొందాం. రోజూ చస్తూ బతికేకన్నా, పోరాడుతూ వీరులుగా నిలబడదాం. మన రాళ్ళసీమ వీరత్వానికి ప్రతీక. చరిత్రలో ప్రతి దశలోను మనవాళ్ళు వీరత్వం చూపారు. ఎక్కడ చూసినా మన ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు, కుక్కలు తదితర జీవరాశుల వీరగల్లులు దర్శనమిస్తాయి. వచ్చే రోజులలో మన సంఘం పిలుపు మేరకు దేనికైనా సిద్దంగా ఉండండి.
ప్రపంచ జీవరాశుల సభకు రాతిచేపను మనందరి ప్రతినిధిగా వెళ్లాలని నిర్ణయిస్తున్నాను. మన కరువు, కన్నీళ్ళ కష్టాలను రాతిచేప ప్రపంచ జీవరాశుల సభలో చాటాలి. ‘జై రాళ్ళసీమ.., జై జై రాళ్ళసీమ.. అంటూ సభాధ్యక్షుడు పెద్దపులి ప్రకటించాడు. సభంతా హర్షధ్వానాలు రేగాయి. వచ్చిన దారుల్లోనే తమ నివాసాలకు జీవరాశులు వెనుతిరిగాయి.
**
రాళ్ళసీమ రాతిచేప సిద్దేశ్వరస్వామి దర్శనం చేసుకొంది. పోతిరెడ్డిపాడు నుండి కుందూ మీదుగా పెన్నానది చేరి, సోమశిల, కండలేరు మీదుగా చెన్నపట్నం ఓడరేవుకు చేరి అక్కడ కొంత విశ్రాంతి తీసుకోని, పాక్ జలసంధి దాటి, అరేబియా సముద్రం పై ఎర్రసముద్రం చేరి, సూయజ్ కాలువగుండా మధ్యధరా సముద్రం చేరి నైలునదిలోకి ప్రవేశించి కైరో సమీపాన ఒడ్డుకు చేరాలని ప్రణాళిక వేసుకొంది.
కానీ అప్పటికే పోతిరెడ్డిపాడు వద్దనీటిమట్టం తగ్గిపోయింది. అష్టకష్టాలు పడి ఎగిరి బయట కాలవలోకి పడినా ప్రయాణం సాగదు. ఈ ఎండలకు కాలవల్లో కన్నీళ్ళు తప్ప ఒక సుక్క నీళ్లుండవు. చేయబోయేది గొప్ప కార్యం. నాపై రాళ్ళసీమ జీవులు చాలా ఆశలు పెట్టుకొన్నాయి.
ఎలాగో శ్రీశైలం తూములు ఎత్తేసినారు. ఇటువైపు నుండే వెళ్ళడం ఉత్తమమని నిర్ణయించుకొని రాతిచేప ప్రయాణానికి సిద్ధమైంది. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజిని దాటి బంగాళాఖాతం చేరింది. దారిపొడుగునా వరికోసిన పొలాలు, పచ్చని తోటలున్నాయి. చేపల చెరువులున్నాయి. మా సీమలోను ఇలా పంటలు పండే రోజులు రావాలని మనసులో రాతిచేప అనుకొంది. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజిలోకి గోదావరి నది నుండి పట్టిసీమ ద్వారా నీళ్ళురావడం చూసింది. పట్టిసీమ నుండి రాళ్ళసీమకు గోదావరి నీళ్ళని ప్రచారం జరిగింది. అయితే ఇవి ఇక్కడే ఆగిపోతున్నాయి. పట్టిసీమ, రాళ్ళసీమలలో ఎదో ప్రాసకు సీమలు కలిసాయే కానీ నీళ్ళు మాత్రం కలవడం లేదనిపించింది. ఎండలకాలం కూడా సముద్రంలోకి నీళ్ళు పోతుండడం చూసి బాధ పడింది. హిందూమహా సముద్రం గుండా తీరం వెంబడి ప్రయాణించింది. పెన్నానది సముద్రంలో కలిసేచోట ఆగింది. సిద్దేశ్వరం రుచి, వాసన నీళ్ళను చూసి మా నీళ్ళు ఇక్కడేళ వచ్చాయని విచారించింది. వానకాలంలో పోతిరెడ్డిపాడు నుండి వచ్చేనీళ్ళు పెన్నాలో కలిసి సోమశిలవద్ద నిల్వచేసుకొని, వేసవిలో అవసరాలకు కోసం వాడుకొంటారని తెలుసుకొంది. అలా సిద్దేశ్వరం నీళ్ళు పెన్నద్వారా నెల్లూరును దాటి సముద్రం చేరుతున్నాయని కద అని ఆశ్చర్యపోయింది. అలాగే ముందుకు సాగి చెన్నపట్నం తీరం చేరింది. అక్కడా పట్టణమంతా సిద్దేశ్వరం రుచి, వాసన నీళ్లే కనపడ్డాయి. సోమశిల నుండి కండలేరు మీదుగా వేసవిలోను నీళ్ళు వస్తున్నాయని తెలుసుకొంది. విజయవాడ, నెల్లూరు, చెన్నపట్నాలు దాటి సముద్రంలో కలిసే నా సిద్దేశ్వరం నీళ్ళు… పక్కనే ఉన్న మా రాళ్ళసీమకు మాత్రం ఎందుకు రావని మదన పడింది. దీని వెనుక ఎదో మతలబు ఉంటాదనుకొంది. పసిబిడ్డకు దక్కని అమ్మపాల లాగా ఈ వ్యవహారం ఉందని గుండెలోతుల్లో నుండి దుఃఖం ఎగదన్నుకొచ్చింది రాతిచేపకు. అయినా ఇది సమయంకాదని పాక్ జలసంధి దాటి ముందనుకొన్న విధంగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి నైలునది ఒడ్డున సభవద్దకు చేరింది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలనుండి నైలునది ఒడ్డునకు ప్రపంచ జీవరాశుల చేరుకొంటున్నాయి.
అక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసారు. అథిది మర్యాదలకు కొదువలేదు. వెనుకబడిన ఖండమంటారు గానీ నిజంగా వీళ్ళకే ప్రేమాభిమానాలు, తోటిజీవుల కష్టాలను అర్థం చేసుకోగల హృదయం ఉంటాయనుకొంది రాతిచేప. సైబీరియన్ కొంగ రాతిచేపను మరీ గుర్తుపట్టి సంఘాధ్యక్షులు ఆఫ్రికన్ ఏనుగు వద్దకు తీసుకెళ్ళ పరిచయం చేసింది. మీ కష్టాలన్నీ కొంగ ఇదివరకే చెప్పింది. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. ప్రపంచంలో బాధితుల వైపే మేము నిలుస్తాం అని అధ్యక్షుడు భరోసా ఇచ్చాడు.
మొదటిరోజు సభ ప్రారంభమయింది. కీలక జీవరాసులు ప్రధాన వేదికపై ఆశీసునులయ్యాయి. కరోనా ప్రత్యేక స్థానంలో హుందాగా కూర్చుంది.
ఒక చారిత్రక సందర్భంలో మనమంతా కలిశాం. మన అస్తిత్వరక్షణకై ఐక్యంగా సాగుదామని సభాధ్యక్షుడు పిలుపునిచ్చాడు. కార్యదర్శి గత సంవత్సర కార్యక్రమాల నివేదికను సభకు సమర్పించాడు. విషయ నిపుణుల తుది ఎంపిక మేరకు ఈ శతాబ్దపు వీరునిగా కరోనాను అధ్యక్షుడు ప్రకటించాడు. సభ అంతటా హర్షధ్వానాలు మిన్నంటాయి. కరోనా మహారాజ్ కీ జై.. అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి. వివిధ ఖండాల జీవరాశులు కరోనాను ఘనంగా సత్కరించాయి. అభినందన వాక్యాలు పలికాయి. చివరగా అధ్యక్షుడు తన చేతుల మీదుగా బంగారు పతకాన్ని కరోనాకు బహుకరించారు.
ఈ సందర్భంగా కరోనా సభనుద్దేశించి.. “సంఘం అనుమతి లేకుండా మానవజాతిని ముప్పుతిప్పలు పెట్టినందుకు క్షమించాలి. ఇది నాకోసం కాదు మన జీవరాశులందరి కోసం చేసాను. జాలి దయలేకుండా తరతరాలుగా మానవజాతి చేతిలో నలిగిపోయిన మన వారికోసం, మన మాన ప్రాణాల రక్షణ కోసం ప్రాణత్యాగానికి సిద్దపడే నేను సిద్దమయ్యాను. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసుకొన్న నన్ను సమూలంగా నివారించలేరు. అప్పటికే వారికి జరగాల్సిన నష్టం జరగిపోయి ఉంటాది. మన జీవరాశులకు ఏ మాత్రం హాని లేకుండా కేవలం మానవ జాతిని నాశనం చేయడానికి చాల శ్రమకోర్చాను. నాది తొందరపాటే కావచ్చు. అందులో న్యాయం ఉంది. మానవజాతి పేరుకే న్యాయం, చట్టాలు, మతధర్మాలు అంటుంటాయి. కానీ అక్కడ జరిగేదంతా అమానవీయమే. ఆటవికన్యాయం అని మనల్ని ఆడిపోసుకొంటారు కానీ మానవన్యాయం కన్నా ఆటవిక న్యాయం ఎప్పటికీ ఉన్నతంగానే ఉంటాది. నన్ను ఇంతగా గౌరవించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మన సంఘం తీసుకొనే ఏ నిర్ణయానికైనా నేను కట్టుబడి ఉంటానని” కరోనా పేర్కొంది.
రెండోరోజు ఖండాల వారిగా ఆయా ప్రాంత జీవరాశులు తమ‌ సమస్యలను, మానవ జాతి అరాచకాలను సభ దృష్టికి తీసుకొచ్చాయి. కీలక అంశాలపై బృందాలుగా చర్చలు కొనసాగాయి. తీర్మానాల నిర్ణాయక బృందం అన్ని అంశాలను క్రోడీకరిస్తుంది.
ఈ క్రమంలోనే దక్షిణాసియాలోని, పడమటి కనుమల దిగువన ఉండే రాళ్ళసీమ ప్రాంత జీవరాశుల ప్రతినిధిగా తొలిసారి సభకొచ్చిన రాతిచేపను ప్రసంగించాలని అధ్యక్షుడు ఆహ్వానించాడు.
రాతిచేప సభావేదిక వద్దకు చేరి… “మిమ్మల్నందరినీ చూసే అవకాశం మళ్ళీ నాకు ఉంటుందో? ఉండదో? అనిపిస్తుంది. నా జాతి మొత్తం అంతరిస్తోంది. ఒకటీ అరా మిగిలాము. నాదొకటే కాదు మా సీమలోని చాలా జీవరాశులు ఇలాంటి పరిస్థితుల లోనే జీవనం సాగిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మా వైపు అందరి జీవన్మరణ సమస్య నీళ్ళలేమి. తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఎతైన పీఠభూమిగా మా ప్రాంతముంది. ఎదో సంవత్సరానికి అరకొర వర్షాలు. కనీస జీవనం సాగడానికి కూడా ఆ నీళ్ళు చాలవు. చూద్దామంటే ఒక్కచుక్క నీళ్ళు నేలపై కనబడవు. వందల అడుగుల్లోనూ తడిలేదు. నిలువెత్తు చెట్లు మోడులైపోయినాయి. మాకు కాలాల తేడా పెద్దగా కనబడదు. అన్ని కాలలు కరువు కాలాలే. ఇప్పటికే ఒకవైపున ఎడారిగా మారుతోంది. కొండల్లో అదోరకం మొక్క ఈ మధ్య పుడుతోంది. ఎడారి కాబోయే ప్రాంతాలలో ముందుగా ఆ మొక్కల పెరుగుదల కనిపిస్తాయని అంటున్నారు. ఊర్లకు ఊర్లే లేచిపోయాయి. ఎక్కడికక్కడ రైతులు కూడా ప్రాణాలొదిలారు. నిజానికి ప్రపంచమంతా కరోనాకు బయపడుతుంటే కరువుకన్నా కరోనా పెద్దదేమి కాదని రాళ్ళసీమలో అనుకొంటున్నారు.
దిక్కులకొకరు వలసలు పోయారు. ముసలిముతకా, పిల్లాజల్లా పల్లెల్లో ఉంటారు. మనుషుల కష్టాలే అలా ఉన్నాయి.
వందేళ్ళలో ముప్పాతిక భాగం కరువులతో రాళ్ళసీమ ఉండిపోయింది. ఈ రోజుకూ ఉంటోంది. జీవరాశులు ఎక్కడికీ పోలేక, నమ్ముకొన్న నేలను వదలలేక మొండి బతుకులతో బిక్కు బిక్కుమంటూ కాలమెల్లదీస్తున్నాయి. మాకంటూ ఒక జీవితం ఉంటాదనే ఆశ కూడా సచ్చిపోతాంది. జీవరాశులే లేని ప్రాంతంగా రాళ్ళసీమ అయిపోతాదనిపిస్తుంది. మా బతుకు మేము పదికాలాలు బతకాలంటే మా నేలపై వానలు పడాలి. వానలు పడాలంటే చెట్లుండాలి. విస్తృతంగా అడవులుండాలి. ఇదంతా జరగాలంటే కొంత కాలం పడుతుంది. ఆ లోపు కొంత ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం కనిపిస్తుంది. మా నేలలోనే పై భాగాన పశ్చిమ కనుమల నుండి పుట్టి నమ్మకంగా ప్రవహిస్తూ వచ్చే తుంగభద్ర, కృష్ణానదులున్నాయి. ఆ నీళ్ళు కిందికి పోయి సముద్రం పాలయిన సందర్భాలనేకంగా ఉన్నాయి. ఆ నదుల నీళ్ళు మేము వాడుకొనే వెసులుబాటు కావాలి”..అని రాతిచేప చెప్పి చెప్పకనే అప్పటిదాకా మౌనంగా వింటున్న మిగతా రెండు తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన జీవరాశుల ప్రతినిధులు సభ దద్దరిల్లేలా గట్టిగా అరవసాగాయి. అధ్యక్షుడు గట్టిగా వారించినా అవి వినలేదు. ఆ అరుపుల మధ్య రాతిచేప స్వరం చిన్నదైపోయింది. త్వరగా ముగించమని రాతిచేపను అధ్యక్షుడు ఆదేశించాడు.
“ఆ నదులనుండే సీమలోని భూభాగానికి అడుగడుగుకు నీళ్ళు అందుకొనే వీలుంది. చెరువులన్నీ నీళ్ళతో నింపుకోవచ్చు. వంకలకూ వదలొచ్చు. ఎండి మలమలమాడి ఇసుకతిన్నెలై పోయినా పెన్నేటికి తిరిగి జీవం పోయచ్చు. ఇలా కొన్నాళ్ళు మమ్మల్ని మేము కాపాడుకొంటూ, మేమంతా చెట్లు సాకి అడవులు పెంపొందిస్తాం. మా కాళ్ళపై మేము నిలబడటానికి పాటుపడతామని”.. రాతిచేప రాళ్ళసీమ ఎదుర్కొంటున్న బాధలను సభకు విన్నవించుకొంది.
రాతిచేప చెప్పిన దాంట్లో న్యాయంగానే తోస్తోంది. మరీ అంతలా ఆ రెండు అడ్డుపడడంలో వాటి బాధేమని సభలో జీవరాశులన్నీ ఆశ్చర్యకరంగా చూశాయి.
కొత్తగా వచ్చిన మన తోటి ప్రతినిధి మాట్లాడుతుండగా సభలో అలా అడ్డుతగలడం పద్దతి కాదని వారించాయి. ఆ నీళ్ల విషయమై మీ అభిప్రాయాలు సూటిగా చెప్పమని అధ్యక్షుడు వాటిని కోరాడు. ఇలాంటి వ్యవహరాలలో కొంత ముందుచూపుతో పాటు, నైపుణ్యం ఉన్న సముద్రతీర ప్రాంత జీవరాశికి మొదట అవకాశం కల్పించాడు అధ్యక్షుడు.
“అసలు ఈ సభకు రాతిచేప రావడానికి ఏమి అర్హతుందో నాకైతే అర్థమే కావడంలేదు. నల్లమల ఆవల, ఈవల మొత్తానికి నేనే ప్రతినిధిని. వాళ్ల మంచి చెడ్డలేమైనా నానుండే ఇక్కడకు చేరాలి. అధ్యక్షుల వారు రాతిచేపకు అవకాశం ఇవ్వడం మంచిది కాదు” అని గట్టిగా స్వరం పెంచింది తీరప్రాంత జీవరాశి.
“ఇంతలా స్వరం పెంచుతున్నావు. ఇన్నేళ్ళుగా ఈ సభలలో ఏనాడైనా రాతిచేప ప్రాంత సమస్యలు చెప్పినావా” అని అధ్యక్షుడు ప్రశ్నించాడు.
“రాతిచేప ప్రాంతమంతా మాలోనిదే. అక్కడి జీవరాశులు మా కిందకే వస్తాయి. మాకు మా తోటి సోదర జీవరాశుల పట్ల బాధ్యత ఉంది. కానీ వారు కరువుకాడులో ఉన్నారు. అక్కడ ఎంత చేసినా బాగుపడేది కష్టం. కొన్నాళ్ళకు ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతాది. అక్కడి జీవరాసులు మొత్తం ఎవరిదారి వాళ్ళు చూసుకోక తప్పదు. మా వైపున నీళ్ళున్నాయి. పంటలున్నాయి. రొయ్యల,చేపల చెరువులున్నాయి. ఇప్పటికే దిక్కులకొక వైపు పోయి ఏ కొద్దిగా మిగిలిన అక్కడి కరువు జీవరాశులకు మేము ఆశ్రయం ఇస్తాం. ఎదో ఒక పని చేసుకొంటుంటే కావలసిన గడ్డి, ధాన్యాలకు కొదవలేదు. మాంసాహారుల జీవరాశులు రొయ్యలు, చేపలు తిని బతకచ్చు. ఇంత కంటే మెరుగైన మార్గం వారికి లేదు. తరతరాలుగా నీళ్లు మా అనుభవంలో ఉన్నాయి. మాకు తుఫానులోచ్చినా, నీళ్ళలో మునిగిపోతున్నా, సముద్రం పక్కనే ఉన్నా నదీజలాలలో మాత్రం ఒక చుక్క ఎవ్వరికీ ఇవ్వడానికి వీలుకాదు. ఈ విషయంగా మా నుండి మరో మారుమాట లేదు.” అని కోస్తా జీవరాశి సభను కోరింది.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర జీవరాశులు ప్రతినిధులు కోస్తా జీవరాశి మాటలను విని కొంత కోపానికి గురైనాయి.
సముద్రతీరానికి ఎగువన గోదావరి కృష్ణా నదుల మధ్య ఎతైన ప్రాంత మరో తెలుగు జీవరాశిని మాట్లాడమని అధ్యక్షుడు అవకాశం ఇచ్చాడు.
“మాట్లాడేదేముంది. అంతా చేసుకొంటూ పోవడమే. పడే ప్రతినీటి చుక్కను కూడా పక్కకు పోనీయం. ఎక్కడికక్కడ నీళ్లు నిలబెట్టాస్తాం. నదులన్నీ మా నుండే పోవాలి. మాకై మిగిలితేనే ఎవరికైనా.ఈ విషయంలో మాకు చాల స్పష్టత ఉంది. వాళ్ల గోడవలేవో వాళ్ళు చూసుకోవాలి. మాకైతే సంభందం లేదు. మా పని మాదే. మరీ దిక్కులేదంటే మా వద్ద ఎక్కడో ఒక చోట ఎవరైనా బతకచ్చు. అక్కడి వరకు అభ్యంతరం లేదు. నీళ్ళు మాకు అతిముఖ్యం. ఇప్పడిపుడే నీళ్ళరుచి చూస్తున్నాం. అసలు మేము ఇన్నాళ్ళు పోరాడిందే వాటికోసం. ఒక సుక్క మేమివ్వం” అని మొహమాటం లేకుండా మొగమ్మీద మాట్లాడేసింది ఆ నోరుగల ప్రతినిధి.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలు అవలీలగా పరిష్కరించగలిన ప్రపంచ జీవరాశుల సభ అధ్యక్షుడికే ఈ సమస్య పెద్దగానే ఉందనిపించింది.
ఈ విషయమై ఆయా ఖండాల జీవరాశుల ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. చివరగా ఆఫ్రికా ఖండ ప్రతినిధులు మాట్లాడుతూ.. “ప్రకృతి అందరిదీ. వనరులపై, జాతులపై జరిగే ఏ రకమయిన ఆధిపత్యాల్ని మేము సహించం. ప్రపంచంలో ఎక్కడ కొనసాగినా మేము ఒప్పుకోము. ఆయా ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు కారణంగా అనేక ఇబ్బందులుండవచ్చు. అంతమాత్రాన వాటిని వదిలేసుకొంటాపోతే భూగోళంలో ఎక్కడా, ఎవరూ ఉండలేము. సమస్యలను పరిష్కారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాతిచేప ప్రాంతానికి అవసరమైన నీళ్ళు నదులనుండి పొందడం సమంజసమని మేము భావిస్తున్నాం” అని తెలియచేసాయి.
సభలో ప్రతినిధుల అభిప్రాయాలను అనుసరించి చివరకు కార్యదర్శి ఈవిధంగా సభముందు ప్రతిపాదించాడు. రాతిచేప ప్రాంతానికి తుంగభద్ర, కృష్ణానదుల నుండి ఇపుడు పొందుతున్న అరకొర నీటికి అదనంగా మరో పాతిక సంవత్సరాల పాటు అరభాగం నీటిని వినియోగించుకొవాలి. ఈ లోగా రాళ్ళసీమ భూభాగంలో సగభాగం పచ్చదనం విస్తరించే విధంగా అక్కడి జీవరాశులు బాధ్యత చేపట్టాలని తెలిపాడు. ఈ ప్రతిపాదనలను సభ అమోదించింది. నదీజలాల నీటి వినియోగానికి రాళ్ళసీమకు కల్పించిన వెసులుబాటు విషయమై మిగతా రెండు తెలుగు జీవరాశులు తీవ్ర అసంతృప్తికి గురైనాయి. తీర్మానంపై సవరణకోసం పట్టుబడదామని భావించినా, తప్పక ఆమోదించాల్సిన పరిస్థితులలో అవి నిలిచిపోయాయి.
“ఈ వర్షాకాలం నుండే పై తీర్మానం అమలు కావాలి. ఎవరు ఉల్లంఘించినా ఏ స్థాయి చర్యలకైనా సంఘం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పరిశీలనకు ఒక స్థాయి సంఘం నియమిస్తున్నాం” అని అధ్యక్షుడు ప్రకటించాడు.
ప్రపంచ జీవరాసుల సంఘం రెండురోజుల సభయొక్క తీర్మాణాలను ప్రవేశపెట్టాలని అధ్యక్షుడు కార్యదర్శికి సూచించాడు.
కార్యదర్శి ఈ విధంగా తీర్మానాలు ప్రతిపాదించాడు.
“మానవ జాతి భూగోళాన్ని తన కబంధ హస్తాలలోకి తీసుకొన్న నేపథ్యంలో ప్రపంచ జీవరాశుల పక్షాన ఈ తీర్మాణాలు చేస్తున్నాం.
ప్రపంచంలో మానవ జనాభా ఐదువందలకోట్లకు మించి ఉండకూడదు. క్రమేణా జనాభాను తగ్గించుకోవాలి.
ప్రతి ఆరునెలల కొకసారి ఒకనెలపాటు పకడ్బందీగా లాక్ డౌన్ అమలుచేయాలి.
రసాయనిక ఎరువులు, మందులు పంటలకు వాడకం వలన అనేక జీవజాతులకు నష్టం కలుగుతోంది.తక్షణం వాటి స్థానంలో సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలి. ఇష్టారాజ్యంగ పరిశ్రమలు నెలకొల్పి కాలుష్య పూరితం చేయకూడదు. పర్యావరణం పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాలి. యుద్ధాలకు ముగింపు పలకాలి. జీవరసాయనాలతో కృత్రిమ జీవులను తయారు చేయకూడదు.
తమ పూర్వీకులు అనుసరించిన పకృతి విధానాలు, సంప్రదాయ పద్దతులను మానవజాతి అనుసరించాలి. మొత్తం భూగోళంలో అరభాగం అడవులుండాలి. గనుల తవ్వకం, రోడ్డు,రైల్వేలైన్లను తగ్గించి వేయాలి. జీవరాశులను ప్రదర్శనశాల లలో బందీలుగా చేయరాదు. అంతరిస్తున్న జీవరాశుల రక్షణకు తగుచర్యలు తీసుకోవాలి. జీవరాశుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నివారణకు వైద్యశాలలు,
పరిశోధనాలయాలు నిర్మించాలి. కరువుపీడిత రాళ్ళసీమ తదితర ప్రాంతాలకు నీటి వసతి కల్పించాలి. మొత్తం బడ్జెట్ లో జీవరాశుల సంక్షేమానికి ముఫైశాతం ఖర్చు చేయాలి”.. అని సభ ముందు కార్యదర్శి ప్రతిపాదించాడు. సభంతా ఏకగ్రీవంగా ఆమోదించింది.
“మానవజాతి ఈ తీర్మాణాలపై వెంటనే తగుచర్యలు తీసుకోవాలి. ఐక్యంగా ముందుకురావాలి. వారితో సంప్రదింపులకోసం ఒక ఉన్నత స్థాయిబృందం ఎర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటిదాక కరోనా మరీ వేగవంతంగా కాకుండా, కొంత ఆచితూచిగా వ్యవహరించాలి. మానవ జాతి పై తీర్మాణాలు అమలు విషయంలో మొండిగా వ్యవహరిస్తే తదుపరి సంఘం ఉత్తర్వుల మేరకు దేనికైనా కరోనా సిద్దంగా ఉండాలని”.. అధ్యక్షుడు ప్రకటించాడు. అంతటితో సభ ముగిసింది.
మొదటి రోజున భోజనాల సమయంలో రాతిచేప కరోనాతో సన్నిహితంగా మెలుగుతూ, సుదీర్ఘంగా చర్చించుకొన్న విషయాన్ని రెండవరోజున ముగింపు భోజనాల సమయంలో రెండు తెలుగు జీవరాశుల చెవిలో ఎవరో వేశారు. పోయి పోయి రాతిచేప దాని సహవాసం ఎందుకు చేసింటాదని రెండు తెలుగు జీవరాశులు ఒకరికొకరు అనుకోన్నాయి. ఏకకాలంలో ఒకదానికి ఎడమ కన్ను అదరగా , మరోదానికి విపరీతంగా తుమ్ములొచ్చాయి.
భోజనాలనంతరం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలిపి నూతనోత్తేజం, ప్రగాఢ ఆత్మవిశ్వాసంతో రాతిచేప తిరుగు ప్రయాణానికి సిద్దమయింది. ఉదయాన్నే మా కొంగలబృందం రాళ్ళసీమకు పయనమవుతోంది. మీరు అనేక ఇబ్బందుల కోర్చి సముద్రం వెంట పోవడం వద్దు. మా బృందం నిన్ను జాగ్రత్తగా రాళ్ళసీమ ఆత్మ స్థానమైన సిద్దేశ్వరంకు చేరుస్తాయని ఎర్రకాళ్ళకొంగ రాతిచేపను కోరింది. ఆ ప్రేమాభిమానాలు చూసి కాదనలేక రాతిచేప సరే అన్నది.

(*డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,అనంతపురము, a.harireddy@gmail.com)