పటపట రాలిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు, పుదుచ్చేరి ఆరవది

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఒక చారిత్రక ఘట్టమే. పుదుచ్చేరి చిన్న ప్రాంతం, కేంద్రపాలిత  ప్రాంతమే అయినా ఎపుడూ కాంగ్రెస్ పట్టులోనే ఉంటూ వచ్చింది. అలాంటి చోట కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. ప్రభుత్వం  కోల్పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వాలను కోల్పోవడం ఇది ఆరోసారి.  2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటినుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్యెల్యేలు బిజెపిలోకి ఉడాయించడం, కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడం అపుడుపుడు జరుగుతుంది. ఇలా ఇంతవరకు అయిదు ప్రభుత్వాలు కూలిపోయాయి. పుదుచ్చేరి ఆరవది.

ఇటీవల ఎమ్మెల్యేల ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన రాష్ట్రాలు:  ఆరుణాచల్ ప్రదేశ్. మధ్య ప్రదేశ్, కర్నాటక. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల రెన్నెళ్నున్నపుడు అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఒక డిఎంకె ఎమ్మెల్యే ఉన్నట్లుండి రాజీనామా చేశారు. దీనితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఇదంతా బిజెపి ప్రోత్సహించిన ఫిరాయింపులేనని సర్వత్రా వినబడుతూ ఉంది.

గతంలో గోవా మణిపూర్ లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెల్చుకుని అత్యధిక సభ్యులున్న పార్టీగా వచ్చింది.  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టాగానే కొంతమంది పార్టీ ఎమ్మెల్యే ఫిరాయించారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీలిపోయింది.

ఇక సిక్కిం కేసు  ఇంకా ఆసక్తి కరమయింది. 2019ఎన్నికల్లో  బిజెపికి ఒక్క సీటు రాలేదు. అంతేకాదు,  ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు.అయితే ఇపుడు అసెంబ్లీలో బిజెపి 12 మంది సభ్యులున్నారు.ఎలా వచ్చారు? ఇదెలా సాధ్యం? సింపుల్, అధిక్యత సంపాదించుకున్న సిక్కిం డెమోక్రటిక్ పార్టీ కి  చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. ఇక ఆ పార్టీలో మిగిలింది  మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ మాత్రమే. అదీ కథ.

ఇక రాజస్థాన్ విషయమొకసారి చూద్దాం. అక్కడ బిజెపి  కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తో డీల్ కుదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ముందుకొచ్చి సచిన్ పైలట్ తొ చేతులు కలిపాడు. దీనితో బిజెపి పాచిక పారకుండా పోయింది. గెహ్లాట్ ప్రభుత్వం గండం తప్పించుకుంది.

అయితే, మధ్యప్రదేశ్ లో  కమల్ నాథ్  ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇలా కాపాడుకోలేక పోయింది. భారతీయ జనతాపార్టీ అక్కడ జ్యోతిరాధిత్య సింధియాను తన వైపునకు తిప్పు కోవడంలో విజయ వంతమయింది. కమల్ నాథ్ , సింధియాలను రాజీ చేసే ప్రయత్నాలు సఫలం కాలేదు.

ఇలా, ఎన్నికల్లో గెలవకుండానే రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చని మొదట 2016లో అరుణాచల్ ప్రదేశ్ అనుభవంతో బిజెపి గ్రహించింది. ఈ ఆటలో బిజెపి ఎపుడూ విజేతాగానే నిలుస్తున్నది.

అరుణాచల్ అసెంబ్లీలో ఉన్న 60 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలు గెల్చుకుంది. బిజెపికి వచ్చినవి కేవలం 11 సీట్లే. అయితే, బిజెపి ఫిరాయింపులు పావులు కదిపింది. మొదట కాంగ్రెస్ నేత నాబమ్ తుకి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పేమా ఖండు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఏం జరిగిందో ఏమో బిజెపి పాచిక పారింది ఖండూ మొత్తం   40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అని కొత్త పార్టీ పెట్టారు.

తర్వాత ఈ పార్టీని బిజెపిలో విలీనం చేశారు.  ముఖ్యమంత్రి గా కొనసాగారు.  తర్వాత 2019లో కూడా గెల్చి ముఖ్యమంత్రి అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభత్వాన్ని వశపర్చుకునేందుకు  2016లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి బిజెపి ప్రయత్నిస్తూ నే ఉంది.

తుకి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు  ఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్ర పతి పాలన విధించింది. అపుడు సుప్రీంకోర్టు ఇది తప్పని కేంద్రం మీద మొట్టిక్కాయ వేసింది. అయితే, ఏమి? తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఖండూ ఏకంగా కాంగ్రెస్ వాళ్లందరిని తీసుకు వచ్చి బిజెపిలోకి చేర్పించాడు.

2018లో కర్నాటకలో ఏం జరిగింది?  జెడిఎస్కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నప్పటినుంచి బిజెపి ఏదో చేస్తుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమయింది. కాంగ్రెస్ పార్టీకి 87 మంది శాసన సభ్యులున్నారు. జనతా దళ్ ఎస్ కు 37 మంది సభ్యలున్నారు.  అయితే, ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకున్నా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీనితో కాంగ్రెస్-జనతా దళ్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయినా, బిజెపి తన ప్రయత్నాలు మానలేదు. చివరకు  16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోగలిగింది. దీనితో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోయింది.

మధ్యప్రదేశ్ జరిగిందేమిటి? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 121 ఎమ్మెల్యేలతో కాంగ్రె స్ నేత కమల్ నాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, బిజెపి విజయ రాధిత్య సింధియా వర్గానికి చెందిన  26 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగింది.  26 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 మందిని గెలిపించు కోగలిగింది. దీనితో పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ లభించింది.

2017లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండింది. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో  కాంగ్రెస్  17 స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపికి కేవలం 13 స్థానాలే వచ్చాయి. అయితే, కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిరాయించేలా మొదట బిజెపి ప్రయత్నించి విజయవంతమయింది. ఈ లోపు  మరొక పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సంపాదించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లు గెల్చుకుని బిజెపి పెద్ద పార్టీ అయింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఈబలగం చాలదు. అయితే, ముఖ్యమంత్రి పదవి విషయంలో  56 స్ధానాలున్న శివసేన తో అవగాహన కుదరలేదు. చివరకు శివసేన, ఎన్ సిపిలు, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించాయి. అయితే, శరద్ పవార్ అన్నకొడుకు, ఎన్ సిపి నేత అయిన అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఎరవేసి కొంతమంది ఎన్ సిపి ఎమ్మెల్యేలను బిజెపి వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఈ వ్యూహం పారకముందే పార్టీ నేత శరద్ పవార్ వాసన పసిగట్టి అజిత్ పవార్ ను వెనక్కు లాక్కొచ్చారు. దీనితో శివసేన, ఎన్ సిపి ప్రభుత్వం ఏర్పడింది.

2014 నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెల్చినా ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్నది,గెలవపోయినా ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం ఏర్పాటుచేసే వ్యూహంతో ముందుకు పోతున్నది. ఈ వరసలో పుదుచ్చేరి తాజా ఉదాహరణ మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *