పవన్ కల్యాణ్ సంకట పరిస్థితి…

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం బిజెపి హైకమాండ్ బాగా స్పష్టత ఇచ్చింది.

వచ్చే ఎన్నికల నాటికి బిజెపి ఆంధ్రలో ఒక కూటమి తయారు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. అయితే, కూటమి లో ఎవరుంటారనే విషయంలో ఇంకా ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత నీయడం లేదు.

కూటమిలో జనసేనకి  మాత్రం మెంబర్ షిప్ ఇచ్చారు.

అయితే, జనసేన ఒక్కటి చాలదు. రాష్ట్రంలో బలమయిన ఒక ప్రాంతీయ పార్టీతో చేతులు కలపాలి.  అదేది?

అధికారంలో ఉన్న  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేక, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీయా? ఇది ఇంత తొందరగా తేల్చి చెప్పడం బిజెపి అధిష్టానికి  చాలా ఇష్టం లేదు.

లేకపోతే, మిత్రుడెవరో ప్రకటించేందుకు సమస్య ఎందుకు? తమిళనాడు ఎప్పటినుంచో అధికారంలో ఉన్న ఎఐఎడిఎంకె తో సఖ్యంగా ఉన్నపుడు, ఆంధ్రలో జగన్ తో ఉంటాం అని చెప్పవచ్చు.  జగన్ మనుషులన్ని  ఎన్డీయే గవర్నమెంటులో చేర్చుకోవచ్చు. బీహార్ నితిష్ కుమార్ కాంగ్రెస్,ఆర్ జెడి తో కలిపినపుడు కూడా నితిష్ తిరిగొస్తాడని ఎదురు చూల్లేదూ?.   కాని, ఆంధ్రలో స్నేహితుడువరో బిజెపి చెప్పడం లేదు. జగన్ కి ఆ హోదా ఇవ్వకుండా సస్పెన్స్ నడిపిస్తున్నారు.

మిత్రుడెవరో తెల్చుకోలేనంత అమాయకురాలు కాదు బిజెపి.  ఇపుడే తెల్చేస్తే ఇబ్బందులొస్తాయి. 2024 నాటి మిత్రుడెవరో, ప్రత్యర్థి ఎవరో ఇపుడే చెప్పి ఇరుకున పటడం  బిజెపి కేంద్ర నాయకత్వానికి ఇష్టం లేదు.

పైకి అందుతున్న సంకేతాల ప్రకారం వైసిపి అంటే బిజెపి అధిష్టానానికి పెద్ద గా ఇష్టమున్నట్లు కనిపించదు. అయితే,  బిజెపి అధిష్టానికి  వైసిపి అవసరం పార్లమెంటులో చాలా ఉంది. పార్లమెంటులో వైసిపి పెద్ద పార్టీ. దీనితో విరోధం పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. అందుకే జగన్ ను ప్రేమిస్తున్నట్లు  అమిత్ షా బాగా సంకేతాలు పంపిస్తున్నారు.

వైసిపి, తెలుగుదేశం పార్టీ లలో  ‘ఎవరంటే మీకిష్టం’ అని బిజెపి క్యాడర్ లో సర్వే చేస్తే అంతా తెలుగుదేశం అని చెబుతారు. నిజానికి తెలుగుదేశం అంటే బిజెపిలో తొలి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది.  ఇలాంటి ఇలా  సంకేతం పంపిస్తే  వైసిపితో సమస్య వస్తుంది.

అందుకని, బిజెపి డిప్లమాటిక్ గా, వైసిపితో స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని వైసిపి అభిమానులంతా బిజెపిని బాగా ద్వేషిష్తారు. ఎందుకంటే, బిజెపి అనుకూల హిందూత్వ సంస్థలు  జగన్ కు క్రైస్తవ ముద్రవేసి, రాష్ట్రంలో  మత విభజన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

చీటికి మాటికి ఎక్కడో శిలువ కనిపించిందని ఫోటోలు తీసి గొడవ చేయడం, వైసిపి నేతలకు ఇష్టం లేదు. అయితే, జగన్ మీద ఉన్న కేసులు,సిబిఐ విచారణలు, ఐడి విచారణలు దృష్ట్యా వైసిపి నేతలు పైకి  హిందూత్వ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఏమ్మాట్లాడం లేదు. ఆ పనిని సోషల్  మిడియా సైన్యానికి అప్పగించారు. వైసిపి సోషల్  మీడియా సర్కిల్స్ లో బిజెపి మీద నిప్పులు కురిపించడం చూడవచ్చు.

బిజెపి జనసేనను  మాత్రం మిత్రపక్షంగా గుర్తించింది. ప్రకటించింది. ఈ గుర్తింపు సర్టిఫికేట్ రాగానే, జనసేనాని సౌత్ ఇండియా ఫెడరేషన్, సౌత్ ఇండియా మీద వివక్ష,  తరిమెల నాగిరెడ్డి, షేగవేరా లను గాలికొదిలేసి, ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉన్న ‘ఇజం’ను  గోకేసి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని హిందూత్వ వాది అవతారమెత్తారు.

అయితే, రాష్ట్ర బిజెపితో ఆయనకు పొసగడం లేదు. దీనికి రెండు కారణాలు: 1. రాష్ట్రంలో బిజెపికి పునాది లేదు. ఇలాంటి పార్టీతో ముందుకు పోయి ఏంచేయాలి అనే చన్న చూపు. అందుకే ఆయన మొన్న బిజెపితో కలసి రామతీర్థానికి వెళ్లలేదు అని చెబుతారు. 2) ఇపుడున్న బిజెపి నాయకత్వానికి పవన్ అంటే పెద్ద అభిమానం లేదు. సినిమా గ్లామర్ తప్ప ప్రజల్లో పవన్ కు పునాది లేదు అని బిజెపి అభిప్రాయం. అందువల్ల పొత్తు పెట్టుకుంటే పెద్ద పార్టీతో పెట్టుకోవాలి అని భావిస్తున్నారు.

బిజెపి, జనసేనల  మధ్య స్నేహం ఉన్నట్లు కనిపించినా, వైసిపికి వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ లేదు? వైసిపి కి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కనీసం రెండు పార్టీలు కలసి మాట్లాడుకోవడం కూడా లేదు.

రేపు వైసిసి బిజెపి కలుస్తాయేమోననే అనుమానం పవన్ లో ఉంది. పవన్ జగన్ మీద వార్ డిక్లేర్ చేసేందుకు రెడీగా ఉన్నారు.  వపన్ కు చంద్రబాబు అంటే సాఫ్ట్ కార్నర్. బిజెపి చివరి దశలో, వైసిపితో నే కలవాలనుకుంటే ఎట్లా? పవన్ లో కూడా అనుమానం ఉంది?  అందుకే బిజెపితో మనస్ఫూర్తిగా కలవలేరు. అలాగని ఇపుడే తెలుగుదేశంకు దగ్గరవలేరు. కేంద్ర బిజెపి క్లియరెన్స్ లేకుండా జగన్ ప్రభుత్వం మీద యుద్ధ భేరీ మోగించలేరు. ఇదీ పవన్ సంకట పరిస్థితి

ఏమాట కామాటే చెప్పుకోవాలి, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్నికల్లో ఓడిపోయినా, పవన్ అంటే జనంలో క్రేజ్ తగ్గినట్లు కనిపించదు. ఆయనెక్కడికి పోయినా జనం పిచ్చి పిచ్చిగా వస్తున్నారు. నిజానికి వారిని పైలిచ్చి, బిర్యానీ-క్వార్టర్ అందించి తోలినట్లు అనిపించదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *