Home Features వేమన చెప్పింది బోధించాలి, ఆచరించాలి : డా. అప్పిరెడ్డి

వేమన చెప్పింది బోధించాలి, ఆచరించాలి : డా. అప్పిరెడ్డి

266
0
(Dr Appireddy Harinathareddy)
నేడు ప్రజాకవి వేమన జయంతి.
తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది.
వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది. వేయికి మించి ఉండని వేమని పద్యాలు దాదాపు ఆరువేల పద్యాలుగా కనిపిస్తున్నాయి. వేమన పద్యాలు ఎవో శాస్త్రీయంగా తేల్చవలసిన పని గత వందేళ్ళుగా అలోచనలలోనే మిగిలిపోయింది. ఇకనైన ఆ పనికి పూనుకోందాం.
వేమన పద్యాలను పరిశీలిస్తూ పోతే.. వేమన జీవితంలో తొలిదశనుండి చివరిదాకా ఒక క్రమానుగత పరిణితి కనిపిస్తుంది. ఒక తాత్వికత ఎలా రూపం తీసుకొంటుందో కనిపిస్తుంది. సమాజానని పరిశీలించడం, గుణ,దోషాలను సత్య దృష్టితో వివేచన చేయడం, సమాజం ఎలా ఉండాలో ఒక మార్గాన్ని చూపడం కనిపిస్తుంది. తాను ఎందుకు రాయాలో, ఎవరికోసం రాయాలో స్పష్టమైన దృక్పథం కనిపిస్తుంది. వేమన పద్యాలు జీవిత సత్యాలను బోధిస్తాయి.  సామాజిక వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. ఆయన పద్యాలు  ఏమి బోధిస్తున్నాయో చూడండి…
 అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు కాడు
కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!
మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వదాభిరామ వినురవేమ.
పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
విశ్వదాభిరామ వినురవేమ.
వేమన గారు కేవలం రాయడంతోనే తన పని అయిపోయిందని కాకుండా వరకే, సమాజంలో మార్పు కోసం ప్రత్యక్షంగా కార్యాచరణకు కూడా పూనకొన్నాడని నా బలమైన నమ్మకం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కోసం మరింత సమయం పట్టవచ్చు. వేమన జీవితం పై జానపదుల ఐతిహ్యాలు,వేమన అనచరులు గుర్రాలపై పసుపు బట్టలతో తిరుగాడే సంప్రదాయం కార్యచరణనే సూచిస్తాయి.
వేమన పద్యాలను నాలుగు నేర్చుకోవడంతోనే మన పని అయిపోదు. ఆయన భావాలను ఆచరించడమే మన ముందున్న కర్తవ్యం.
వేమన పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలి. వేమన చివరిదశ ప్రాంతమైన కటారుపల్లిని అభివృద్ధి చేయాలి. వేమన భావాల విస్తరణకు మనవంతు ప్రయత్నం చేద్దాం.

(*Dr Appireddy Harinathareddy, Vemana Adhyayan &Abhivruddhi Kendrama, Anantapuramu, Ph 99639 17187)