Home Features ప‌డిలేస్తున్న కెర‌టం పాడిపేట‌ (తిరుప‌తి జ్ఞాప‌కాలు-20)

ప‌డిలేస్తున్న కెర‌టం పాడిపేట‌ (తిరుప‌తి జ్ఞాప‌కాలు-20)

426
0
స్వర్ణముఖి దాటి పాడిపేటకు వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్టున్న మర్రి చెట్టు.

(రాఘ‌వ శ‌ర్మ‌)

తిరుపతి సమీపాన ఒక‌నాటి పాడిపేట పాడి పంట‌ల, చేనేత మగ్గాల‌తో తుల‌తూగేది. పంట‌లు దెబ్బ‌తిన్నాయి. చేనేత చితికి పోయింది. ద‌శాబ్దాల‌పాటు పాడుప‌డిన పేట‌లా ద‌ర్శ‌న మిచ్చింది.

ప‌చ్చ‌ని పొలాలు ప్లాట్లుగా మారాయి.వెంటిలేట‌ర్ పై శ్వాసించిన‌ట్టు, ఐటీ ఉద్యోగాలతో ఇప్పుడిపుడే కాస్త‌ ఊపిరి పోసుకుంటోంది.

ప‌డిలేస్తున్న‌ కెర‌టంలా పాడిపేట నిదానంగా త‌లెత్తుతోంది. నాలుగు ద‌శాబ్దాల క్రితం నాకు పాడిపేట ప‌రిచ‌య‌మైంది. ఇది తిరుప‌తికి ద‌క్షిణాన‌, తిరుచానూరుకు స‌మీపాన, స్వ‌ర్ణ‌ముఖి న‌దీ తీరాన ఉంది.

ఆ గ్రామంలో రామిరెడ్డి ఒక చేనేత కార్మికుడు. నిజాయితీ, నిబద్ద‌త గ‌ల పాత కాలం క‌మ్యూనిస్టు. చామ‌న‌ ఛాయ‌తో, ఎముక‌ల‌గూడులా, స‌న్న‌గా పొట్టిగా ఉండేవాడు.

బోద‌క‌ప్పిన పూరింట్లో గోచీతో మొల‌లోతు గుంత‌లో నిల‌బ‌డి, మ‌గ్గం నేస్తుండేవాడు.మ‌గ్గం నేస్తూనే విప్ల‌వ గీతాలు ఆల‌పించేవాడు.ఆ ప‌ల్లె గురించి రామిరెడ్డిని ఒక సారి ప‌ల‌క‌రించాను.

నాలుగు ద‌శాబ్దాల క్రితం నాటి ఆ ప‌ల్లె వైభ‌వాన్ని క‌ళ్ళకు క‌ట్టిన‌ట్టు చెప్పాడు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధానికి(1939-45) ముందునాటి కాలం అది. ప‌చ్చ‌ని పైర్ల‌పై నుంచి వీస్తున్న చ‌ల్ల‌ని గాలి ఆ ప‌ల్లెను ప‌ల‌క‌రించేది.

స్వ‌ర్ణ‌ముఖి న‌దీ తీరాన ఆ అల‌ల‌తో ఆ ప్రాంత‌మంతా ఓల‌లాడేది.చేనేత మ‌గ్గాల శ‌బ్దాల‌లో అక్క‌డ జీవ‌న సంగీతం వినిపించేది. ఆ ప‌ల్లె జ‌నం క‌ళ్ళ‌లో జీవ‌న సౌంద‌ర్యం క‌నిపించేది.

స్వ‌ర్ణ‌ముఖి న‌ది నుంచి రైతులే కాలువ‌లు త‌వ్వుకుని పంట‌లు పండించేవారు.ఆ కాలువ‌లు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కు సాగేవి.పాడిపంట‌ల‌తో గ్రామం ప‌చ్చ‌గా క‌ళ‌క‌ళ‌లాడేది.

మ‌రోప‌క్క‌ నాణ్య‌మైన చేనేత వ‌స్త్రాల‌ను నేసేవారు.తిండికి, బ‌ట్ట‌కి కొదువ లేదు. స్వ‌యం స‌మృద్ధి సాధించిన గ్రామం అది. చుట్టుప‌క్క‌ల గ్రామాల‌లో కూడా చేనేత ఉండేది. ఆ గ్రామాల నుంచి చేనేత వ‌స్త్రాలు విదేశాల‌కు ఎగుమ‌తికోసం ఇక్క‌డికే వ‌చ్చేవి.

పాడిపేట గ్రామ‌స్తులే వాటిని విదేశాల‌కు ఎగుమ‌తి చేసేవారు. చేనేత ఎగుమ‌తి లాభాల‌తో గుభాళించేది. చేనేత కార్మికుల జీవ‌నం ఒడిదుడుకులు లేకుండా సాగిపోయేది.

ఈ గ్రామ‌స్తుల్లో కొంద‌రు శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో చేనేత వ‌స్త్ర దుకాణాలు పెట్టారు. ఆరోజుల్లోనే వారు పాడిపేట‌లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల‌ను నిర్మించారు.

రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం (1939) మొద‌లైంది. యుద్ధం జ‌రిగిన ఆ ఆరేళ్ళూ కొలంబోతో రాక‌పోక‌లు ఆగిపోయాయి. అక్క‌డ‌ చేనేత వ‌స్త్ర వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. చేనేత ఎగుమ‌తి ఆగిపోయింది.

పాడిపేట చేనేత వ్యాపారులు బాగా దెబ్బ‌తిన్నారు. వారితోపాటు దెబ్బ‌తిన్న‌ నేత‌న్న‌లు కూడా మ‌ళ్ళీ కోలుకోలేదు. త‌ర‌త‌రాలుగా వ‌స్తున్న చేనేత‌ను ఒదులుకోలేక పోయారు. వేరే వృత్తిలోకి వెళ్ళ‌లేక సతమతమై పోయారు. ఆ మ‌గ్గం గుంత‌లోనే ఆరేడు ద‌శాబ్దాల‌పాటు బ‌తుకును వెతుక్కున్నారు.

గత వైభవ అవశేషాలుగా మిగిలిన శిథిల భవనాలు

కొలంబోతో చేనేత వ‌స్త్ర వ్యాపారం చేసిన వారి భ‌వ‌నాలు (1980) బావురు మంటున్నాయి. క‌నీసం బాగు చేయించే స్థోమ‌త లేక‌ పాడుప‌డిపోయాయి.

శిథిలావ‌స్థ‌కు చేరుకుని, మొండి గోడ‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. నూలుకు రంగులు అద్దే పెద్ద పెద్ద తొట్టెలు కూడా వృథాగా ప‌డిఉన్నాయి. గ‌త వైభ‌వానికి చిహ్నాలుగా అవి మిగిలిపోయాయి.

రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం ముగిసింది. మ‌న‌కు స్వాతంత్రం వ‌చ్చింది. క్ర‌మంగా నూలు మిల్లులు పెరిగాయి. మ‌ర‌మ‌గ్గాలు పెరిగాయి.తొలి రోజుల్లో ప్ర‌భుత్వం చేనేత కార్మికుల‌కు కంట్రోల్ ధ‌ర‌కు నూలు స‌ర‌ఫ‌రా చేసింది.

కుప్ప కూలుతున్న చేనేత ప‌రిశ్ర‌మ దాంతో కాస్త ఊపిరి పోసుకుంది. త‌మ‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని నూలు మిల్లుల య‌జ‌మానులు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

టంగుటూరి ప్ర‌కాశం పంతులు ముఖ్య‌మంత్రిగా ఉన్న రోజుల్లో కంట్రోల్‌కిచ్చే నూలును ఆపివేశారు.ఎక్కువ ధ‌ర‌కు నూలు కొని, మ‌గ్గాల‌పై వ‌స్త్రాలు నేసినా, మిల్లు వ‌స్త్రాల‌తో పోటీ ప‌డ‌లేక‌పోయారు.

చేనేత‌ కార్మికుల‌కు కూలి కూడా గిట్టుబాటు కావ‌డం లేదు. చేనేత‌లో ఎంత నైపుణ్యం ఉన్నా, దానిపై ఎంత ప్రేమ ఉన్నా ఆ వృత్తిలో కొన‌సాగ‌లేక‌పోతున్నారు. దాని నుంచి బైట‌ప‌డి వేరే వృత్తి చేప‌ట్ట‌లేక‌ పోతున్నారు.

నేత‌న్న‌ల ప‌రిస్థ‌ితి త్రిశంకు స్వ‌ర్గంలా త‌యారైంది.నాకు తెలిసినప్ప‌డు కూడా వెయ్యి గ‌డ‌ప‌గ‌ల పాడిపేట‌లో 300 వ‌ర‌కు మ‌గ్గాలు ఉండేవి.

తిరుచానూరు నుంచి పాడిపేట రావాలంటే, స్వ‌ర్ణ‌ముఖిలో కాజ్‌వేలా ప‌రిచిన రాతి బండ‌ల పైనుంచి రావాలి.న‌ది కాస్తా ఎండి పోయింది. క‌నీసం వ‌ర్షాకాలం కూడా పార‌డం మానుకుంది.

స్వ‌ర్ణ‌ముఖి దాటి పాడిపేట‌లోకి ప్రవేశించేస‌రికి ఎదురుగా ఊడ‌లు దిగిన పెద్ద మ‌ర్రి చెట్టు.ఆ మ‌ర్రి చెట్టు నీడ‌లో చీర‌ల‌కు దారాలు స‌రిచేసుకుంటూ, ఎండిన డొక్క‌లతో బ‌క్క‌ప‌లుచ‌ని రామిరెడ్డి లాంటి నేత‌న్న‌లు క‌నిపించేవారు.

నాణ్యమైన వస్త్రాలు నేసే నేత‌న్న‌ల‌ ఒంటిపై సరైన బట్టలు ఉండేవి కావు. ఊళ్ళోకి వెళితే చాలా పూరిళ్ళ‌లో, కొన్ని మిద్దె ఇళ్ళ‌లో నిరంత‌రం మ‌గ్గాలపై నేస్తున్న‌ శ‌బ్దాలు మాత్రం వినిపించేవి. సొంతంగా నూలు కొనుక్కుని వ‌స్త్రాలు నేయ‌లేక‌పోయేవారు.

మాస్ట‌ర్ వీవ‌ర్స్ ఇచ్చిన నూలుతో కూలికి నేసే వారు.మొల‌లోతు గుంత‌లో నిల‌బ‌డి, కాళ్లూ చేతులూ ఆడిస్తూ రోజుకు ప‌దిప‌న్నెండు గంట‌లు ప‌నిచేసే వారు.అయినా కూలి గిట్టుబాటు అయ్యేది కాదు.

ప‌నంతా ఎండాకాల‌మే. వ‌ర్షం వస్తే నూలు చెమ్మెక్కిపోయేది.బోద కప్పిన ఇళ్ళ‌లోకి నీళ్ళొచ్చేవి. ఒక్కొక్క సారి వ‌ర్షపు నీళ్ళు మ‌గ్గం గుంత‌లోకీ కూడా వ‌చ్చేసేవి. నిలువ నీడ ఉండేది కాదు.

నూలు ధ‌ర పెరిగిన‌ప్పుడ‌ల్లా మాస్టర్ వీవ‌ర్లు ఇచ్చే కూలి త‌గ్గించేవారు. నూలు ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్ల ఉత్ప‌త్తి ఖ‌ర్చు పెరిగి మార్కెట్లో అమ్మ‌కాలు త‌గ్గిపోయాయి.

పాడిపేట‌లో కులంతో సంబంధ లేదు. కైకాలోళ్ళ (ప‌ద్మ‌సాలీల‌లో ఒక వ‌ర్గం) తోపాటు రెడ్లు కూడా నేత నేసేవారు.వీళ్ళు నేసిన చీర‌లు, రుమాల‌లు వివిధ కంపెనీల ముద్ర‌ల‌తో మార్కెట్లో అమ్మ‌కానికి వ‌చ్చేవి.

బావుల కింద కొద్దిపాటి వ్య‌వ‌సాయం త‌ప్ప‌, పెద్ద‌గా పంట‌పొలాలు లేవు. స్వ‌ర్ణ‌ముఖి నుంచి త‌వ్విన కాలువ‌లు ఏనాడో పూడిపోయాయి. వ‌ర్షాభావంతో స్వ‌ర్ణ‌ముఖి ఇదివ‌ర‌లా ప్ర‌వ‌హించ‌డం మానుకుంది. క్ర‌మంగా పంట‌లు దెబ్బ‌తిన్నాయి.

తిరుప‌తి నుంచి పుత్తూరు వెళ్ళ‌డానికి పాడిపేట మీదుగా వెళ్ళే వాడిని, రామిరెడ్డి ని చూడవచ్చని. ఒక‌ప్పుడు ఈ దారిలో ఎవ్వ‌రూ పెద్ద‌గా వెళ్లేవారు కాదు.

కాస్త దూర‌మైనా రేణిగుంట నుంచే వెళ్ళేవారు.ఇప్పుడు ఆ దారిలో కూడా వాహ‌నాలు పెరిగిపోయాయి.

చిట్ట చివరి చేనేత కార్మికుడు కమ్యూనిస్టు రామిరెడ్డి

ప‌దేళ్ళ క్రితం వ‌ర‌కు ఆ దారిలో ఎప్పుడు వెళ్ళినా రామిరెడ్డిని ప‌ల‌క‌రించేవాడిని. అలాగే ఒక సారి వెళితే రామిరెడ్డి పోయాడ‌ని కొడుకు పెరుమాళ్ చెప్పాడు.

రామిరెడ్డి ఈ లోకాన్ని వీడి పోతూ పోతూ 2001లో చేనేత‌ను కూడా తీసుకెళ్ళిపోయాడు. రామిరెడ్డి పూరిల్లు, మ‌గ్గం బోసిపోయాయి.

ఇప్పుడా గ్రామంలో ఒక్క మ‌గ్గం కూడా క‌నిపించ‌డం లేదు. మగ్గం నేసే గుంతలను కూడా పూడ్చేశారు. ఒక్క పూరిల్లూ లేదు.

ఇప్పుడక్క‌డ‌ చేనేత ఆన‌వాళ్ళు కూడా క‌నిపించ‌డం లేదు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌రువాత చేనేత వ్యాపారం దెబ్బ‌తింది. దెబ్బ‌తిన్న ఆనాటి భ‌వ‌నాలు కూడా ఒక‌టో రెండో త‌ప్ప పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. వాటి స్థానంలో పెద్ద పెద్ద భ‌వ‌నాలు వెలిశాయి.

పాడిపేట‌లో రామిరెడ్డిది చేనేత‌కు చివ‌రి త‌రం. కొడుకు పెరుమాళ్ తండ్రి కష్టాలు చూసి మగ్గం జోలికి పోలేదు. చౌక‌దుకాణం పెట్టుకున్నాడు.చాలా మంది యువ‌కులు మ‌ళ్ళీ మ‌గ్గం కేసి చూడ‌లేదు.

మ‌రో చేనేత కుటుంబానికి చెందిన‌ గ‌ణేష్ సీఆర్ ఎస్‌లో చేరాడు.ఇంటిని తీసేసి అంద‌మైన పెద్ద ఇల్లు క‌ట్టుకున్నాడు. ప‌ట్ట‌ణాల‌కు తిండిపెట్టిన గ్రామం అది.

అంద‌మైన చేనేత వ‌స్త్రాలు నేసి నాగ‌రిక‌త‌ను నిల‌బెట్టిన గ్రామం అది. నిజానికి మ‌న చేనేత ఎంత ఘ‌నం!

నేత పంచె క‌ట్టుకుంటే ఘ‌నంగానే ఉంటుంది. గంజిపెట్టిన నేత చొక్కా వేసుకుంటే ఆ ఠీవీనే వేరు. చేనేత చీర ముందు ప‌ట్టు చేర కూడా దిగ‌దుడుపే.

కానీ, నేత‌న్న‌ల బ‌తుకులు మాత్రం ఇలా వెల‌వెల‌పోయాయి.గ‌తంలో చేనేత వ‌స్త్రాలు నేసిన వారు ఇప్ప‌డు ఆ గ్రామంలో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేరు.కొంద‌రు వ‌ల‌స‌ వెళ్ళిపోయారు. కొంద‌రు ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు.

కొత్త కొత్త భ‌వ‌నాలు వెలిశాయి. ప్రతి ఇంట్లో కొత్త కొత్త మోటారు సైకిళ్ళు, కొందరి ఇళ్ళ ముందు కార్లు కనిపించాయి.

ఆ ఊళ్ళో చాలా మంది బీటెక్ చ‌దివి న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్ళిపోయారు.

బ‌తికినంత కాలం దారిద్య్రాన్ని అనుభ‌వించిన రామిరెడ్డి మ‌న‌వ‌ళ్ళు కూడా ఇప్పుడు ఐటీ రంగంలో స్థిర‌ప‌డ్డారు.ఎక్క‌డో తప్ప ప‌చ్చ‌ని పొలం క‌నిపించ‌డం లేదు.

అంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల ప‌ర‌మైపోయాయి. చివ‌రికి స్వ‌ర్ణ‌ముఖి న‌దిలో కూడా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు వెలిశాయి.

ఆ న‌దిలో ప‌క్కా రోడ్డు వేశారు.అక్క‌డ న‌ది ప్ర‌ప‌హించిన ఆన‌వాళ్ళు కూడా క‌నిపించ‌డం లేదు.

కొత్త త‌రం వ‌చ్చింది. కొత్త కొలువులు వచ్చాయి. కొత్త జీవితాలు వ‌చ్చాయి.మాన‌వాళికి తిండి పెట్టి, బ‌ట్ట‌ను అందించిన పాడిపేట ప‌ల్లె చిరునామా కోల్పోయింది. దాని ఆత్మ అదృశ్య‌మైంది.

(ఆలూరు రాఘవ శర్మ,సీనియర్ జర్నలిస్టు, తిరుపతి))

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here